(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]షా[/dropcap]జహాన్‌ను చాలా గొప్ప ప్రేమికుడు అని.. గొప్ప చక్రవర్తి అని తెగ నెత్తికెత్తుకొన్నాం. కానీ అతనికి ప్రేమించడానికి టైమెక్కడ దొరికిందో అతని టైమ్ లైన్‌ను ఎంత పరిశీలించినా అర్థం కాలేదు. ముందుగానే చెప్పుకున్నట్టు పిల్లల్ని కనడం, యుద్ధాలు చేయడం తప్ప అతడు ప్రేమికుడిగా ఎప్పుడు.. ఎవరితో గడిపాడో తెలియదు. మరి మన చరిత్రకారులకు ఏ పార్శ్వంలో షాజహాన్ ప్రేమికుడిగా కనిపించాడో తెలియదు. షాజహాన్ యుద్ధాలు చేయడంలో.. దురాక్రమణలు, దోపిడీలు చేయడంలో అంతకు ముందున్న ముస్లిం రాజులందరినీ మించిపోయాడు. మొఘలులో ఇతడిని మించిన దోపిడీదారు, యుద్ద కాంక్ష ఉన్నవారు మరొకరు లేరేమో. ఇప్పటికైనా చరిత్రకారులు వాస్తవాలు ఈ తరానికైనా బోధిస్తే మంచిది. షాజహాన్ చరిత్ర చెప్పినంత మాత్రాన తాజ్‌మహల్‌కు రాబోయే నష్టం ఏమీ ఉండదు. దానిపై ఎలాంటి మచ్చా పడదు.
షాజహాన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా శత్రువులను ఎలిమినేట్ చేస్తూనే వచ్చాడు. గుడ్డివాడైన తన సొంత అన్నను తన రక్షణలో ఉంచాలని తండ్రిని కోరి.. తన రక్షణలో ఉంచుకొని రాత్రికి రాత్రి అంతమొందించిన మహానుభావుడు. తాను అధికారంలోకి వచ్చేనాటికే బంధు శేషం ఉండవద్దని అనుకొన్నాడు. సోదరులు, దాయాదులు అంటూ ఎవరూ లేకుండా సమూలంగా అంతమొందించాడు. ఇక్కడ షాజహాన్‌ను అని తప్పేమీ లేదు. వెయ్యేళ్ల ముస్లిం రాజుల పాలన అంతా ఇదే విధంగా కొనసాగింది. రాజులంతా కూడా నిరంతరం ఇన్‌సెక్యూర్ గానే ఉండిపోయారు. ఇప్పటికీ.. మన ప్రజాస్వామ్యంలో కూడా.. హెచ్‌ఓడీలు ఎప్పుడూ అభద్రతా భావంతోనే అల్లాడిపోయి.. తోడి ఉద్యోగుల మీద నిఘా పెట్టడం.. సీసీ కెమెరాలు పెట్టి వారి కదలికలను అనుక్షణం గమనిస్తూ ఉండటం.. అటెండర్ దగ్గరి నుంచి అందరినీ అనుమానించి.. అందులోనే కెరీర్ అంతా గడిపేవాళ్లను చాలామందిని చూస్తున్నాం. ఇస్లామిక్ రాజరిక ప్రపంచంలో ఇదంతా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే.. తమ సొంత కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. తమ మాట వినాలంటే.. తమ మతంలోకి బలవంతంగా తీసుకొచ్చుకోవాలి.. వాళ్లను అడుక్కు తినేలా చేయాలనే దుర్మార్గపు ఆలోచన.. ముస్లిం రాజుల కాలంలో బతుకే హేయంగా మార్చింది. వేటగాళ్ల పేర్లు మారి ఉండవచ్చు.. వేటాడే తీరు మారి ఉండవచ్చు కానీ.. వేట మాత్రం కొనసాగుతూనే వచ్చింది. కోట్లాది భారతీయ జనాభా అయితే మతం మారింది. లేకా మారణ హోమానికి గురవుతూ వచ్చింది. హిందువులను ‘ఇస్లాం కూలీ’ అని షాజహాన్ కాలంలో పిలిచేవారు. గాయపడ్డ హిందూ మహిళలు వారి ‘కోటే’ల్లో పనికిరాని చెత్తలా ఓ మూలకు పడివేయబడ్డారు. అత్యంత దారుణమైన లైంగిక వేధింపులకు లోనయ్యారు. వేశ్యలుగా మార్చివేయబడ్డారు. సౌదీకి, పర్షియాకు రవాణా చేయబడ్డారు. ఇస్లాంలోకి మార్చివేయబడ్డ హిందువులకు సమూలంగా బ్రెయిన్ వాష్ చేశారు. వారి మాతృభూమి పట్ల వారికి విపరీతంగా ద్వేషం పుట్టించారు. వాళ్ల మత గ్రంథంలో చెప్పింది చేయకపోతే.. చిత్రహింసలు తప్పవన్నారు. భారతదేశంలో తమ దారి దోపిడీలకు వారినే ముందు పెట్టి.. తమ సొంత సోదరులపైనే దాడులకు పురికొల్పారు. వారి ద్వారానే తమ జాతి వారి రక్తం ఏరులుగా పారించారు.
మొదట్నుంచీ ముస్లిం రాజుల ఆధిపత్యాన్ని ఎందరో ప్రతిఘటిస్తూ వచ్చారు. అందువల్లే దేశం మొత్తం ఎన్నడూ ముస్లిం రాజుల పరం కాలేదు. మనం ఢిల్లీని రాజధాని అనుకుంటున్నాం కాబట్టి.. ఢిల్లీలో సింహాసనం మీద కూర్చొన్నారు కాబట్టి మొత్తం దేశాన్ని ఏలారని మన సోకాల్ట్ చరిత్ర కారులు గొప్పలు తెప్పలుగా రాశారు కానీ, అనేక రాజ్యాలు స్వతంత్రంగా వ్యవహరించాయి. ముస్లిం రాజుల ఆక్రమణ యత్నాలను విజయవంతంగా తిప్పికొట్టాయి. షాజహాన్‌పై బుందేల్‌లు తిరగబడ్డారు. (నేటి బుందేల్‌ఖండ్ ప్రాంతం) బుందేల్‌ల నాయకుడు మహోబా రాజు చంపక్ రాయ్ బుండేలా పెద్ద ఎత్తున ముస్లింలను ఎదుర్కొన్నాడు. అతని తరువాత అతని కుమారుడు ఛత్రసాల్ బుందేలా కూడా ముస్లింల ఆక్రమణలను దీటుగా ఎదుర్కొన్నాడు. భారతీయులది తమ జాతిని రక్షించుకోవడం కోసం పోరాటమైతే.. ముస్లింలోది ఆధిపత్యం కోసం జరిపే ఆక్రమణగా మారిపోయింది. అందుకే వెయ్యేండ్ల పాటు దేశం అస్థిరంగా, అనిశ్చితిలోనే ఉండిపోయింది.
మొఘలులు కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. షాజహాన్ అధికారంలోకి రావడానికి ముందు నుంచే మారణ హోమానికి మొదలుపెట్టాడు. తాను అధికారంలో ఉన్నంత వరకూ అందులో సమిధలు ఆహుతి అవుతూనే ఉన్నాయి. అతను చేసిన దాడుల్లో కొన్నింటిని ప్రస్తావిస్తాను.
- అధికారంలోకి వచ్చిన మూడో సంవత్సరంలో నాసిక్ పైన దాడికి తెగబడ్డాడు. భారతీయులకు అత్యంత పవిత్రమైన త్రయంబకేశ్వరంపైన పైనా ఆక్రమణకు దిగాడు.
- జాదూరాయ్, అతడి ఇద్దరు కొడుకులు ఉజ్లా, రఘుతో పాటు.. అతడి మనవడు బస్వంత్ లను వెంటాడి వెంటాడి వేటాడాడు. అత్యంత క్రూరంగా చంపించాడు.
- తరువాత నిజాంషా పైకి దండెత్తాడు. దేవల్ గావ్, బాగ్లాన్, సంగమ్నేర్, చాగ్డోర్ కోట, భీర్, షెగావ్, ధారంగావ్, చాలిస్ గావ్, మంజీరా కోటలపై వరుసగా దాడులు చేశాడు.
- ఈ దాడులు పెద్ద ఎత్తున చాలా ఏండ్ల పాటు కొనసాగుతూ వచ్చాయి. ఈ దాడుల్లో ఎన్నో కోటలు ధ్వంసమయ్యాయి. రాజులు హతమయ్యారు. లక్షల మంది హననం జరిగింది. ఈ దాడులు ఇలాగే కొనసాగుతూ దక్కన్ ప్రాంతంలోకి చొరబడ్దాడు. దక్కన్ ప్రాంతంలోని ధరూర్ కోట, పరెండా, సితుండా, నాందేడ్ కోటలపైన కూడా దాడులు కొనసాగాయి. ఈ పరంపర ఏండ్లు గడిచినా ఆగుతూ వచ్చాయి.
- షాజహాన్ అధికారంలోకి వచ్చి మూడో ఏడున ప్రారంభమైన ఈ దాడులు.. ఐదో సంవత్సరంలో బీజాపూర్ రాజు మహమ్మద్ ఆదిల్ షా ను ఓడించి బీజాపూర్‌ను స్వాధీన పరుచుకున్నాడు.
- బీజాపూర్ స్వాధీనం తరువాత ఇక దక్కన్ ప్రాంతంలో ముందుకు వెళ్లలేకపోయాడు. మొఘల్ శత్రువులు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో దిక్కులేక తిరుగు ప్రయాణమయ్యాడు. బుర్హాన్ పూర్ మీదుగా తన రాజధాని ఆగ్రాకు ప్రయాణమయ్యాడు.
- మార్గమధ్యంలో హుగ్లీ కోటపై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
- తరువాత గాల్నా కోటపై దాడి చేసి ఆక్రమించుకొన్నాడు.
- అధికారంలోకి వచ్చిన ఆరో సంవత్సరంలో మాల్వా ప్రాంతంలో.. భిల్ తెగకు చెందిన అధిపతి భగీరథి అనే వీరుడు షాజహాన్‌ను ఎదుర్కొన్నాడు.
- అదే సంవత్సరంలో షాజహాన్ దారిలో కనిపించిన హిందూ దేవాలయాలను సమూలంగా నాశనం చేస్తూ ముందుకుపోయాడు. గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా నాశనం చేశాడు. అనేక మందిరాలను శ్మశాన వాటికలుగా మార్చాడు. సమాధులు కట్టాడు. కొన్నింటిపైన గుమ్మటాలు నిర్మించి మసీదులుగా మార్చాడు. మధ్య యుగాలకు ముందున్న అసామాన్య భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అత్యంత కిరాతకంగా సర్వనాశనం చేశాడు.
- ఆగ్రాకు వెళ్తూ వెళ్తూ దౌల్తాబాద్ కోటను ఆక్రమించుకొన్నాడు. అక్కడి రాజులను తరిమి తరిమి చంపాడు.
- అదే ప్రాంతంలో ఖాసింఖాన్, కంబు అనే ఇద్దరు ముస్లిం జనరళ్లు దాదాపు 500 మంది క్రిస్టియన్లను.. (అప్పుడప్పుడే భారత్ లోకి క్రిస్టియానిటీ అడుగుపెట్టిందని.. షాజహాన్ క్రానికల్‌లో రికార్డు అయింది.) మహిళలతో సహా చిత్రహింసలు పెట్టి ఇస్లాంలోకి మతమార్పిడి చేశారు. చక్రవర్తి పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నట్టు వారితో బలవంతంగా ప్రతిజ్ఞ చేయించారు. మారని వారిని బంధించి, జైల్లో పెట్టించి నరకం చూపించారు. వాళ్లు పూజించే దేవీ దేవతా విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి యమునా నదిలో విసిరేశారు. షాజహాన్ దురాగతాల వల్ల కొన్ని ప్రాంతాల్లో భారతీయులు అనే వాళ్లు కొన్ని తరాల వరకూ లేకుండా పోయారు. అంతటా ఇస్లామీకరణ జరిగిపోయింది. మొఘలుల అరాచకాలకు సాక్షీభూతంగా నిలిచిన యమునా నదీ గర్భంలో ఇవాళ్టికీ ఎన్నో ఆనవాళ్లు భద్రంగా ఉన్నాయని భారతీయ చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఇవాళ్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యమునానదీ గర్బాన్వేషణ చేస్తే భారతీయులకు సంబంధించిన ఎంతో అమూల్యమైన సంపద బయటపడుతుంది.
- షాజహాన్ ఈ దాడుల పరంపరలో పదేళ్లు గడిచిపోయాయి. షాజహాన్ తన అధికారంలోకి వచ్చిన పదో ఏడు.. ఛత్రపతి శివాజీ తండ్రి షాజీ భోంస్లే రాజ్యంపై దాడిచేశాడు. ఈ దాడిలో మహూలీ, మురంజన్‌తో పాటు అనేక కోటలు షాజహాన్ ఆక్రమించాడు.
- షాజహాన్ ఇటువైపు దాడులు కొనసాగిస్తూనే.. కాశ్మీర్ గవర్నర్ జఫర్ ఖాన్‌ను టిబెట్ పైన దాడి చేయాలని ఆదేశించాడు. ఇక అటువైపు దాడులు కొనసాగాయి.
- అధికారంలోకి వచ్చిన 11వ సంవత్సరంలో సింధూనదీ తీరం వెంబడి ప్రాంతాలతో పాటు కాందహార్‌ను ఆక్రమించాడు.
- గుజరాత్ లోని కచ్, హజు ప్రాంతాలను పాలిస్తున్న పరీక్షిత్తు, కూచ్ బిహార్‌ను పాలిస్తున్న లక్ష్మీనారాయణ్‌లు షాజహాన్‌పై తిరగబడ్డారు.
- బాగ్లాన్ ప్రాంతంపై దాడి చేసి మొత్తం 9 కోటలను, 34 పరగణాలను, 1001 గ్రామాలను షాజహాన్ ఆక్రమించాడు.
- అధికారంలోకి వచ్చిన 12వ సంవత్సరంలో చెట్గావ్‌ను పాలిస్తున్న మాణిక్ రాయ్‌ని ఓడించి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు.
- గ్రేట్ టిబెట్ రూలర్ సంగి బేంఖాల్‌ను ఓడించడానికి షాజహాన్ పెద్ద సైన్యాన్నే పంపించాడు. కానీ టిబెట్‌లో బురాగ్ అనే చిన్న ప్రాంతాన్ని మాత్రాన్నే గెలువగలిగాడు.
- అధికారంలోకి వచ్చిన 13వ సంవత్సరంలో పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించిన షాజహాన్.. సిస్టాన్ నుంచి కాందహార్ పైకి యుద్ధానికి పంపించాడు. అక్కడ బస్త్ ప్రాంతంలో ఖాన్సీ కోటను ముందుగా ఆక్రమించాడు కానీ.. ఆ తరువాత విడిచిపెట్టాల్సి వచ్చింది.
- 14వ సంవత్సరంలో గుజరాత్ పైన తెగబడ్డాడు. సిస్టాన్ నుంచి ఛస్టీస్ మీదకు సైన్యాన్ని పంపించాడు. గుజరాత్‌కు చెందిన కోలీస్, కాథీస్‌లు తిరగబడ్డారు. తరువాత ఖటియావార్‌కు చెందిన జామ్ పైకి దండెత్తాడు.
- కాంగ్రాకు చెందిన జగత్ సింగ్ కొడుకు రాజా బసు షాజహాన్ పైన తిరుగుబాటు చేశాడు.
- అధికారంలోకి వచ్చిన 17వ సంవత్సరంలో పలమావ్ రాజా మీదకు షాజహాన్ సైన్యాలు తెగబడ్డాయి.
- 19వ సంవత్సరంలో మరో పెద్ద యుద్ధానికి షాజహాన్ వెళ్లాడు. సమర్ ఖండ్‌ను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బదక్ షాన్, బల్ఖ్ పైకి చక్రవర్తి సైన్యాలు దాడి చేశాయి. షాజహాన్ స్వయంగా ఇందుకోసం కాబూల్ వెళ్లాడు. ఖామర్ద్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. కుందజ్, బల్ఖ్ లను హతమార్చాడు.
- షాజహాన్ ఆక్రమించుకున్న అనేక ప్రాంతాల్లో తలెత్తిన తిరుగుబాట్లను సాదుల్లాఖాన్ (షాజహాన్ కమాండర్) నిరంకుశంగా అణచివేశాడు.
- షాజహాన్ అధికారంలోకి వచ్చిన 22వ సంవత్సరంలో కాందహార్ పైకి పర్షియన్లు దాడి చేశారు. దీంతో షాజహాన్ తన సైన్యాన్ని కాందహార్‌కు పంపించాడు. కానీ.. అక్కడ అతడికి ఎదురుదెబ్బ తగిలింది. చాలా దారుణంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. చాలా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాందహార్, బస్ట్ లను వదులుకోవాల్సి వచ్చింది.
- షాజహాన్ అధికారంలోకి వచ్చిన 27వ సంవత్సరంలో ఘజ్‌నీపై షాజహాన్ సైన్యం దండెత్తింది. అతడి సైనికులు రెచ్చిపోయి ఘజ్‌నీ ప్రాంతాన్ని సమూలంగా విధ్వంసం చేశారు. అంతకుముందు నాలుగేండ్ల క్రితం ఘజ్‌నీలో తన చక్రవర్తిత్వంపై జరిగిన తిరుగుబాటుకు షాజహాన్ ప్రతీకారం తీర్చుకున్నాడు. అక్కడ సామాన్య పౌరుల ఇళ్లను కూడా నామరూపాలు లేకుండా చేశారు. సంపదనంతా దోచుకున్నారు. ఒక శ్మశానంలా మార్చివేశారు.
- 28వ సంవత్సరంలో చిత్తోడ్, రాణా లను నాశనం చేయాల్సిందిగా షాజహాన్ తన అనుచరుడు అల్లామీని ఆదేశించాడు.
- ఇక 29వ సంవత్సరంలో గోల్కొండ, హైదరాబాద్ లను ఆక్రమించుకోవడానికి భారీ సైనిక సంపత్తితో దాడి చేశాడు. కుతుబ్ షా షాజహాన్‌తో ఒప్పందానికి వచ్చాడు. గోల్కొండ నాణాలపై కుతుబ్ తో పాటు షాజహాన్ బొమ్మను కూడా ముద్రించారు. గోల్కొండ గవర్నర్ తన కూతురుని షాజహాన్ కొడుకు ఔరంగజేబ్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు.
- షాజహాన్ తాను అధికారంలోకి వచ్చిన 30వ సంవత్సరంలో బీజాపూర్‌పై దాడి చేసి ఆక్రమించాలని తన కొడుకు ఔరంగజేబ్‌ను ఆదేశించాడు.
- ఇదే సంవత్సరం షాజహాన్ రాజ్యాధికారానికి చివరి రోజులు దగ్గరపడిన సంవత్సరంలో కూడా అతడి సైన్యం రాజా జస్వంత్ సింగ్ పై దాడి చేశాయి.
ఇన్ని దాడులు, యుద్ధాలు.. మధ్య మధ్యలో పిల్లలను కనడాలు మాత్రమే చేసిన షాజహాన్ ఎప్పుడు ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమమూర్తి అయ్యాడు? ఈ ప్రేమ మందిరాన్ని కట్టించడానికి ఆయనకు టైమ్ ఎక్కడ దొరికింది. వీటన్నింటికీ చరిత్రకారులు ఎందుకు జవాబు చెప్పరు?
ఇవన్నీ కూడా పాద్షానామా లేక బాద్షా నామా పేరుతో షాజహాన్ పరిపాలించిన 30 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో రికార్డు చేసిన గ్రంథం లోనివే. ఈ గ్రంథం పర్షిషన్ నుంచి ఇంగ్లిష్ లోకి తర్జుమా చేయబడినవి. అంతేకాక ప్రఖ్యాత చరిత్రకారుడు, భారత దేశ చరిత్ర పునర్నిర్మాణ సంస్థ మాజీ అధ్యక్షుడు పీ ఎన్ ఓక్.. పరిశోధించి కంఠశోష వచ్చేలా 1960 దశకంలోనే మొత్తుకొన్న సత్యాలు. కానీ మన పాలకులు కానీ, చరిత్రకారులు కానీ వీటిలో ఒక్క అక్షరమైనా స్వీకరించలేదు. షాజహాన్ పరిపాలనా కాలం అంతా శాంతి సామరస్యాలతో సాగిపోయిందని, మతసామరస్యం వెల్లి విరిసిందని.. భారతదేశం సంపూర్ణంగా ప్రేమమయమైపోయిందని రాసుకుంటూ వచ్చారు. అదే మన పాఠాల్లోకి చొప్పించారు. వాటి ద్వారా బుర్రల్లోకి ఎక్కించారు. హేతువాదులు, కమ్యూనిస్టులు, మేధావులు అనబడే హిందూ వ్యతిరేకులంతా సాహిత్య అకాడమీల్లో, యూనివర్సిటీల్లోకి చొచ్చుకుపోయి.. ఈ సోకాల్డ్ వంటకాలను ఎప్పటికీ ఆకలి అన్నదికలగనంత తినిపించారు. అందుకే ఇప్పటికీ ఎవరికి కూడా సత్యాన్వేషణ ఆకలి కలగటంలేదు. పాఠాలు రాసేవారు.. పరీక్ష పేపర్లు తయారుచేసేవారు.. విద్యార్థులతో అనర్గళంగా జవాబులు చెప్పించేవారంతా కూడా షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా మార్చేశారు. అదే నిజమని నమ్మించారు. పాపం రెండో ప్రపంచ యుద్దంలో హిట్లర్ అనుచరుడు గోబెల్స్‌కు అపవాదు వచ్చింది కానీ.. మన చరిత్రకారులను కదా.. ఆ పేరుతో పిలవాల్సింది..
ఇప్పటికీ అర్థం కానిది ఏమిటంటే..
హేతువాదం అంటే భారతీయతను నిందించడం
కమ్యూనిజం అంటే భారతీయతను తిరస్కరించడం
మేధావితనం అంటే భారతీయతపై దుమ్మెత్తిపోయడం
చరిత్ర అంటే భారతీయత అన్నది ఏమీ లేదనడం.. ఇస్లాం, క్రిస్టియానిటీ వచ్చాకే మనం ఆవకాయ తినడం నేర్చుకున్నామని చెప్పడం
ఇంతకీ సో కాల్డ్ భారతీయత అంటే బీజేపీ.. ఆర్ఎస్ఎస్ అనడం
జాతీయవాదం అంటే బీజీపీ ఆర్ఎస్ఎస్ అనడం..
చివరకు దేశభక్తి అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనడం..
ఇవాళ ఈ దేశంలో భారతీయుడు అని అనడం, చెప్పుకోవడమే ద్రోహం. అది మత తత్వం. నేను ముస్లింని, నేను క్రిస్టియన్ ని.. నేను హేతువాదిని, నేను ఆస్తికుడిని.. నేను నాస్తికుడిని.. నేను కమ్యూనిస్టుని.. అని చెప్పుకుంటేనే మనుగడ.
ఇంతకీ ఇది ఎవరి దేశం?
(సశేషం)