దేశ విభజన విషవృక్షం-26

0
2

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]‘నా[/dropcap] మరణ శయ్య పక్క నుంచి అలా వెళ్తూ, ఓ పుష్పగుచ్ఛాన్ని ఉంచినప్పుడు.. నీ చేతి స్పర్శ నాలో మళ్లీ ఊపిరులూదింది. ఆ స్పర్శతో నాకు అమరత్వం లభించింది. నీ కన్నీటి చుక్క నా భౌతిక దేహంలో మళ్లీ చైతన్యం నింపుతోంది.. నా సమాధి చుట్టూ నడుస్తున్నప్పుడు నీ హృదయం నుంచి వస్తున్న స్పందన మృత్యువును నా నుంచి దూరం చేసి మళ్లీ పునరుజ్జీవితురాలనవుతానన్న ఆశ కలుగుతోంది. నీ స్పర్శ అమరం.. నీ ప్రేమ అమరం.. మరణంలోనూ మధురం..’

అవును.. వెన్నెలతో జాబిల్లి దోబూచులాడింది. పువ్వుపై హక్కు తనదే నంటూ తుమ్మెద మెల్లగా వాలింది. తావి తన నెచ్చెలి అంటూ గాలి మెల్లగా సాగిపోయింది. వసంతకాలం తన కోసమే వచ్చిందంటూ కోయిల నెమ్మదిగా కూసింది. చినుకు స్పర్శ తాకినంతనే చిగురుటాకు పులకరించిపోయింది.. భానుడి లే లేత కిరణాలకు తామర పరవశించిపోయింది.

జాబిల్లి- జాజిమల్లి, పిల్లగాలి- వసంత కోకిల, చల్లని చినుకు- వెచ్చని కిరణం అన్నింటి పరవశం ఒక్కటే. రెండక్షరాలు.. రెండు మనసులు…. కలిస్తే ఆ అందానికి పేరు ప్రేమ.

ఎప్పుడు మొదలైనా, ఎలా మొదలైనా చివరికంటూ తోడుగా ఉంటుంది. చిరకాలం నిలిచిపోతుంది. ప్రేమకు పుట్టుక తెలియదు. అందుకే దానికి మరణం లేదు. మరణంలోనూ జీవించే ఉంటుంది. అందుకే అది ప్రేమ అయింది.

రూపమే లేని ప్రేమకు.. అందరి హృదయాల్లో కొలువై ఉండే ప్రేమకు.. యూనివర్సల్‌ లవ్‌కు.. తనకూ ఓ రూపం కావాలని కోరుకుందిట. ప్రేమికుల మనసుల్లో ఉన్న తాను బాహ్య ప్రపంచంలోకి రావాలనుకుందిట. ప్రకృతిలోని ప్రేమనంతా కుప్పగా పోసి విశ్వజనీన రూపాన్ని సంతరించుకుందిట. తనను తాను ప్రేమికులకు కానుకగా అర్పించుకుందిట. ఆ కానుకకు ప్రపంచ ప్రేమికులు పెట్టుకున్న పేరు తాజ్‌ మహల్‌.

తాజ్ మహల్ గురించి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు.. దాన్ని చూడటానికి వచ్చినప్పుడు ఒక ప్రేమికుడి మనసులో కలిగే అందమైన భావన ఇది. ఈ మాటలు చదువుతుంటేనే ఎంత అద్భుతమైన అనుభూతికి లోనవుతాం? పగలు కూడా వెన్నెలలు కురిపించే సిల్వర్‌ ప్యాలెస్‌. అపురూప శిల్ప నిర్మాణం.. అందాల రంగురాళ్లు అద్దిన పాలరాళ్లు, వాటిపై అందంగా చెక్కిన ఖురాన్‌ వాక్యాలు.. అడుగడుగునా.. అణువణువునా నిండుగా ప్రేమ కురుస్తుంటే, ఉల్లాసపడని మనసు మనసు కాదు.. కానీ ప్రపంచ ప్రేమికుల కోసమే ఈ ప్రేమమందిరం ఆవిర్భవించిందా? అంటే ఇవాళ యావత్ ప్రేమికులలో ఏ ఒక్కరూ కాదని చెప్పరు.. చెప్పలేరు. షాజహాన్, ముంతాజ్ ల ప్రేమ అంత అమరమైందా? నిజంగా వారి అపూర్వమైన ప్రేమకు గుర్తుగానే ప్రపంచంలో ఏడోదో, ఏనిమిదవదో వింతగా చెప్పుకునే ఈ మందిరం పుట్టుకొచ్చిందా?

భూమికి 50 అడుగుల పైన పునాది..

180 అడుగుల ఎత్తు..

80 అడుగుల ఎత్తైన గుమ్మటం..

60 అడుగుల చుట్టుకొలత

ఇంత గొప్ప నిర్మాణాన్ని తన భార్య కోసం షాజహాన్‌ నిర్మించాడట. ఇది చరిత్ర చెప్తోంది. భారతదేశ ప్రభుత్వం చెప్తున్నది. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా చెప్తున్నది.. ఇది చరిత్ర అని. షాజహాన్‌ తన భార్యల్లో అమితంగా ప్రేమించిన ముంతాజ్‌ కోసం దీన్ని నిర్మించాడని. తన ద్వారా 14 మంది సంతానాన్ని మొఘల్ బాద్షాకు అందించి మరణించిన చెలియ కోసం ఈ గొప్ప సమాధి మందిరాన్ని నిర్మించాడని చెప్తున్నది.. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం తాజ్ మహల్ నిర్మాణం 22 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగింది. భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి వేల కార్మికులు రేయింబవళ్లు శ్రమించి చేసిన నిర్మాణం ఇది. ఈ రికార్డుల ప్రకారం 1632 సంవత్సరంలో (అంటే ముంతాజ్ మరణించిన ఏడాది తరువాత) మొదలైన నిర్మాణం 1653 దాకా కట్టారు. లక్షలాది పాలరాళ్లను వివిధ ప్రాంతాలనుంచి తెప్పించారు. వీటిని తరలించేందుకు ఆగ్రానుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేర ఎర్త్ ర్యాంప్‌ను కూడా నిర్మించారు.

మొదట బేస్ మెంట్ నిర్మాణానికే రెండేళ్ల కాలం పట్టింది. భూమి నుంచి 50 అడుగుల ఎత్తుకు బేస్‌మెంట్‌ను పెంచారు. ఆ తరువాత ప్రధానమైన గుమ్మటం నిర్మాణం జరిగింది. మూడో దశలో చుట్టూ ఉన్న నాలుగు పిల్లర్లు, నాలుగో దశలో మాస్క్‌, చివరగా గేట్‌వేను నిర్మించారు. బేస్‌మెంట్‌, గుమ్మటాన్ని నిర్మించటానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది (ఈ గుమ్మటం ఉన్న ప్రాంతంలోనే ముంతాజ్‌, షాజహాన్‌ల సమాధులు ఉన్నాయి). మిగతా నిర్మాణం ఇంకో పదేళ్లలో పూర్తయింది. ప్రధానమైన గుమ్మటాన్ని ఒట్టోమన్‌ ఎంపైర్‌కు చెందిన ఇస్మాయిల్‌ ఖాన్‌ డిజైన్‌ చేశాడు.

 

ఇదీ భారత పురాతత్వ శాఖ ద్వారా సూపర్ హిస్టారియన్లు చెప్పుతున్న తాజ్ మహల్ చరిత్ర. కానీ చరిత్రను ఇంతలా మసిపూసి మారేడుకాయ చేయవచ్చా? అని తాజ్ మహల్ చరిత్రను వింటుంటే ఆశ్చర్యమేస్తుంది. ముందే చెప్పుకున్నట్టు తాజ్ మహల్ గుట్టుమట్లను ప్రఖ్యాత చరిత్రకారుడు పీఎన్ ఓక్ నగ్నంగా, ససాక్షికంగా విప్పి చెప్తే.. ఈ దేశంలో పట్టించుకొన్నవాడే లేడు. కనీసం భారతీయత, హిందుత్వం.. భారతీయ నిజమైన చరిత్ర.. ఇలా ఏవేవో చెప్పే సంస్థలకు కూడా దీని గురించిన వాస్తవ చరిత్ర ఏమిటన్నది వెలికి తీయాలి.. ప్రజలకు తెలియజెప్పాలి.. కనీసం ఈ తరానికి చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. తాజ్ మహల్ చరిత్రను చరిత్రగానే చెప్తే వచ్చే నష్టం ఏమిటో, మత సామరస్యానికి వచ్చే ఆఘాతం ఏమిటో అర్థం కాదు.

మొఘలుల సామ్రాజ్యంలోనే స్వర్ణయుగం అని చరిత్రకారులు బాకాలు ఊదిన షాజహాన్ కాలంలో.. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో రాయబడిన షాజహాన్ అధికారిక క్రానికల్.. ‘బాద్షానామా’ వాల్యూమ్ 1 లోని 403 వ పేజీలోని 28 నుంచి 35 లైన్ల వరకు ఉన్న అంశాన్ని ముందుగా పీఎన్ ఓక్ ఆంగ్లానువాదం చేశారు.

“Covered with a majestic magnificent lush garden, to the south of the great city and amidst which (garden) the building known as the palace of raja Mansingh at present owned by raja Jaisingh, grandson of Mansingh was selected for the burial of the queen whose abode is in heaven. A thought raja Jaisingh valued it greatly as his ancestral heritage and property, yet he would have been agreeable to part with gratis for the emperor Shahjahan. Out of sheer scrupulousness so essential in matters of bereavement of religious sanctity Jaisingh was granted Sharifabad in exchange.’

రాజా మాన్‌సింగ్‌కు చెందిన ప్యాలెస్‌ను ముంతాజ్ సమాధి కోసం ఆయన మనవడు జయ్‌సింగ్ నుంచి సేకరించామని, ఇందుకు ప్రతిఫలంగా షరీఫాబాద్‌ను జయ్‌సింగ్‌కు ఇచ్చామని బాద్షానామాలోనే ఉన్నది. ఇంత స్పష్టంగా ఉన్న తరువాత కూడా ఇక షాజహాన్ కట్టించాడన్న కట్టుకథ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది.. దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెందరో అని కవిత్వాలు ఎలా పుట్టుకొచ్చాయి?

తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించాడని చెప్పడానికి ఎన్నెన్ని కథలు పుట్టుకొచ్చాయో చెప్పలేము. తాజ్ మహల్‌ను ఎలాగైతే కట్టారో.. దాని చరిత్రను సైతం అలాగే పడుగు పేక భవనంలా కట్టుకుంటూ వచ్చారు. దాన్నే మనం పాఠాల్లో చదువుకున్నాం. తాజ్ మహల్ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ బల్లపై కూర్చొని ఫొటోలు దిగుతున్నాం. ఈ చరిత్రను ఒక్కొక్కరు ఒక్కోరకంగా రాసుకుంటూ వచ్చారు. ఒకరు రూ.40 లక్షలు ఖర్చయిందన్నారు. మరొకరు రూ.4 కోట్లు అయిందన్నారు. ఇంకొకరు కచ్చితంగా లెక్కలు కట్టి రూ.9 కోట్ల 17 లక్షలయిందని కుండబద్దలు కొట్టారు. ఇక తాజ్ మహల్‌ను కట్టడానికి పదేళ్లు పట్టిందని ఒకరంటే.. 22 ఏళ్లు పట్టిందని మరొకరు ఉవాచ. తాజ్ మహల్ డిజైనర్ విషయంలోనూ అంతే.. సర్వే ఆఫ్ ఇండియా.. ప్రధాన గుమ్మటం డిజైన్‌పై ఇస్మాయిల్ ఖాన్‌కు క్రెడిట్ ఇచ్చేసింది. కానీ దీని ఆర్కిటెక్ట్ విషయంలోనూ చాలా పేర్లు బయటకు వచ్చాయి. ఒకరు ఎస్సా ఎఫిండీ అన్నారు. మరొకరు అహ్మద్ మెహెందీస్ అన్నారు. ఇంకొకరు ఫ్రెంచి కి చెందిన ఆస్టిన్ డేస్బార్డియాక్స్ అన్నారు. ఇంకొకరు ఇటాలియన్ అయిన జెరోనిమో వెరోనియో అన్నారు. అన్నింటికీ మించి షాజహానే తానే ఇంజినీరై డిజైన్ చేశాడనీ చెప్పారు.

తన చెలియ చనిపోయిన వెంటనే తీవ్రమైన శోకానికి గురైన షాజహాన్.. వెంటనే అసాధారణమైన సమాధి మందిర నిర్మాణానికి పూనుకున్నాడని చరిత్రకారులు చెప్తారు. మందిర నిర్మాణానికి డిజైన్ల కోసం ప్రపంచ స్థాయి టెండర్లను పిలవటం, వేల కొద్దీ చిత్రాలను గీయించడం, వుడెన్ మోడల్‌ను సైతం పరిశీలించడం, నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు, భారీ మొత్తంలో ఇటుకలు, పాల రాళ్ల కోసం ఆర్డర్లు ఇవ్వటం, వెంట వెంటనే 1631 లో నిర్మాణాన్ని మొదలు పెట్టడం వంటి వన్నీ.. మనం ఏ అరేబియన్ నైట్ కథల్లోనో.. హారీ పోటర్ కథల్లోనో వింటామేమో.. కానీ మామూలుగా సాధ్యపడదు.

ప్రొఫెసర్ బీపీ సక్సేనా పరిశోధన ప్రకారం తాజ్ మహల్ అని మనం చెప్పుకొంటున్న నిర్మాణం సరిగ్గా ఎప్పుడు నిర్మాణమైందని స్పష్టమైన ఆధారాలు లభించలేదు కానీ.. ఇది షాజహాన్ నిర్మించింది మాత్రం కాదనేది స్పష్టం. షాజహాన్ అధికారంలోకి వచ్చింది 1628వ సంవత్సరంలో. ప్రపంచం అంతా ప్రామాణికంగా భావించే ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికా ప్రకారం ముంతాజ్‌ 1631 జూన్‌లో మరణించింది. షాజహాన్‌తో ఆమె వివాహం 1612 మే 10 వ తేదీన జరిగింది. అంటే వారి దాంపత్యం 19 సంవత్సరాలు సాగింది. ఈ 19 ఏళ్లలో ఆమె 14 సార్లు గర్భవతి అయింది. 14వ సంతానాన్ని కన్న తరువాత ఆమె కన్నుమూసింది. అప్పటికి ఆమె వయసు 39 సంవత్సరాలు మాత్రమే. ముంతాజ్ చనిపోయేనాటికి షాజహాన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు మాత్రమే అయింది. అప్పటికి అతను రెండు పెద్ద యుద్ధాలలో తలమునకలై ఉన్నాడు. ఒకటి బుందేలా చీఫ్ ఛత్తర్ సాల్ తో, మరొకటి పొరుగున ఉన్న ఖాన్ జహాన్ లోఢీలతో యుద్ధం చేస్తున్న కాలమది. ఒకవైపు తిరుగుబాట్లు, మరోవైపు యుద్ధాలు.. మధ్యన తాజ్ మహల్ గురించిన ఆలోచన ఎప్పుడు చేశాడన్నది చరిత్రకారులు ఇంకొంచెం వివరంగా చెప్పి ఉంటే బాగుండేది.

షాజహాన్ ఆస్థానంలో చాలా సంవత్సరాలు ఉన్న ఫ్రెంచి ట్రావెలర్ ఈవెన్ టావెర్నియర్ తన ‘ట్రావెల్స్ ఇన్ ఇండియా’ గ్రంథంలోని 111వ పేజీలో ‘షాజహాన్.. ముంతాజ్‌ను తాస్ ఏ మకాన్ (తాజ్ మహల్) సమీపంలో సమాధి చేశాడు. ఇక్కడికి విదేశీయులు మందలా వస్తుంటారు. కాబట్టి వారు సమాధిని ఆరాధిస్తారు’ అని రాశాడు. టావెర్నియర్ తాజ్ మహల్ సమీపంలో అన్నాడే తప్ప తాజ్ మహల్లో అని రాయలేదు.

ముందుగానే చెప్పుకున్నట్టు పీఎన్ ఓక్ తాజ్ మహల్ రహస్యాన్ని బట్టబయలు చేశారు. షాజహాన్ రాసుకున్న బాద్షానామా, ఆయన సమకాలికులు రాసిన గ్రంథాల్లోనే ఈ రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. కానీ, ఎవరూ చెప్పరు. అంగీకరించరు. వాటిని ముట్టుకోవడానికి కూడా సాహసించరు. షాజహాన్ బాద్షానామాను.. షాజహాన్ నామాగా సంక్షిప్తీకరిస్తూ ఒక గ్రంథం వచ్చింది. ఈ గ్రంథాన్ని షాజహాన్ కొలువులో లైబ్రేరియన్‌గా ఉన్న ఇనాయత్ ఖాన్ రాశాడు. దాన్ని బ్రిటిష్ రచయిత ఏఆర్ పుల్లర్ ఇంగ్లిష్ లోకి అనువదించాడు. దీని ప్రతి బ్రిటిష్ లైబ్రరీలోని 19వ శతాబ్దపు వ్రాత ప్రతుల సెక్షన్‌లో అందుబాటులో ఉన్నది. ఈ గ్రంథాన్ని 1990లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ తిరిగి ప్రచురించింది. అందులో ముంతాజ్ గురించి ఉన్న మాటలు కొన్ని.. ‘ముంతాజ్ 1631 జూన్ 17న చనిపోయింది. ఆమె పార్థివ దేహాన్ని బుర్హాన్‌పూర్ లోని జైనాబాద్ కోటలోని తోటలో తాత్కాలికంగా ఖననం చేశారు. 1631 డిసెంబర్ 11న రాణి వారి పవిత్ర ఆనవాళ్లను బుర్హాన్‌పూర్ నుంచి అక్బరాబాద్ (ఆగ్రా)కు తరలించారు. అక్బరాబాద్‌కు దక్షిణాన ఎత్తైన ప్రదేశాన్ని ఆమె సమాధి కోసం ఎంపిక చేశారు. అది గతంలో రాజా మాన్‌సింగ్ కు చెందినది. ఇప్పుడు ఆయన మనవడు జయ్‌సింగ్ స్వాధీనంలో ఉన్నది. 1632 జనవరి 15న రాణి వారి పవిత్ర ఆనవాళ్లను అక్కడ భూస్థాపితం చేశారు.’

అంటే సమాధి నిర్మాణానికి జయ్‌సింగ్ ప్యాలెస్‌ను ఎంచుకొని.. దాని చుట్టూ అందమైన పాలరాతి మందిరాన్ని నిర్మించారని అనుకోవాలా? చరిత్రకారులే చెప్పాలి. ఎన్‌సైక్లోపీడియాల ప్రకారం 1632లో భవన నిర్మాణం మొదలైంది. దీన్ని బట్టి చూస్తే.. ఆమె ఆనవాళ్లను సమాధి చేసిన తరువాత సదరు ప్యాలెస్‌ను ధ్వంసం చేసి కొత్తగా పాలరాతి మందిరాన్ని నిర్మించారని అనుకోవాలా? ఆ ప్యాలెస్‌ను ధ్వంసం చేసినట్టయితే.. దాని శిథిలాలను తొలగించడానికి ఎన్నేండ్లు పట్టి ఉంటుందో చరిత్రకారులు చెప్పాలి. 1632 నుంచి 1653 వరకు తాజ్ నిర్మాణం సాగిందని చరిత్రకారులు చెప్తున్నదే నిజమని అనుకొన్నట్టయితే.. ఈ కాలంలోనే పాత మందిరం కూల్చివేత.. శిథిలాల తొలగింపు, కొత్త భవన నిర్మాణం పూర్తయిందని భావించాలి. అదే జరిగితే అది ఎనిమిదో వింతే. అటువంటప్పుడు ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెందరో’ అన్న కవిత్వం రాయడంలో అత్యుక్తి ఏమీ లేదు.

విచిత్రమేమిటంటే తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించి బాద్షానామాలో కానీ, షాజహాన్ నామాలో కానీ ఎలాంటి రికార్డులు ఏవీ కూడా లేవు. కేవలం బుర్హాన్‌పూర్ నుంచి తెచ్చి జయ్‌సింగ్ నుంచి సేకరించిన ‘ఆస్తి’లో ఖననం చేశారని మాత్రమే ఉన్నది. షాజహాన్‌కు పబ్లిసిటీ పిచ్చి ఏ మేరకు ఉన్నదో గత వ్యాసంలోనే చర్చించుకున్నాం. అలాంటప్పుడు ఇంత భారీ నిర్మాణం గురించి.. అది కూడా దాదాపు అతని పరిపాలనా కాలం సాగినంత కాలం జరిగిందని చెప్పుతున్న నిర్మాణం గురించి రికార్డు చేయకుండా ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నకు జవాబిచ్చేదెవరు?

పైగా జయ్‌సింగ్ నుంచి తీసుకున్న మందిరం నుంచి షాజహాన్‌కు భారీ సంపద సంక్రమించిందిట. వెండి తలుపులు, బంగారు రెయిలింగ్‌లు, వజ్రాలు పొదిగిన పాలరాళ్లు, అత్యద్భుతమైన నెమలి సింహాసనం షాజహాన్ ఈ ప్యాలెస్ నుంచి తీసుకెళ్లాడని టావెర్నియర్ రాశాడు.

మరో విచిత్రమేమిటంటే, 1652లో (అధికారిక లెక్కల ప్రకారం అప్పటికి తాజ్ మహల్ నిర్మాణం పూర్తి కాలేదు). షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ తన తండ్రికి ఒక లేఖ రాశాడు. (ఈ లేఖ గురించి ఆదాబ్ ఏ ఆలంగిరి, యాద్గార్ నామా, మురుఖా ఎ అక్బరాబాదీ అనే పర్షియన్ గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది) అందులో తన తల్లిని సమాధి చేసిన ఏడంతస్థుల భవనం చాలా పాతబడిపోయిందని, వాన పడితే ఎక్కడికక్కడ కురుస్తోందని, ఉత్తరం వైపు గుమ్మటం పగులు బారిందని కూడా ఔరంగజేబు పేర్కొన్నాడు.. ఇందుకోసం తాత్కాలిక మరమ్మతులను తాను చేయిస్తున్నట్లు, శాశ్వత మరమ్మతులను చక్రవర్తి చేయించాలని కూడా అందులో మెన్షన్‌ చేశాడు. సాక్షాత్తూ ఔరంగజేబు తన తండ్రికి రాసిన లేఖలోని అంశాలివి. మరి 1653లో తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిందని ప్రభుత్వం కానీ, ఇతర విజ్ఞాన సర్వస్వాలు కానీ ఎలా చెప్పగలుగుతున్నాయి..? ఇంతగా మాయ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

తాజ్‌మహల్‌ తలుపుల నుంచి 20 రకాల శాంపిల్స్‌ను అమెరికా ప్రొఫెసర్‌ మార్విన్‌ హెచ్‌ మిల్స్‌ తీసుకువెళ్లి కార్బన్‌ డేటింగ్‌ చేయించారు.. ఇందులో కూడా ఇవి షాజహాన్‌కు ముందు దాదాపు 300 ఏండ్ల క్రితంవి అని తేలింది. దీనిపై ఆయన సర్వే ఆఫ్‌ ఇండియాకు 1984 అక్టోబర్‌ 3న లేఖ రాశారు. కానీ ఇక దీనిపై ఎలాంటి పరిశోధన చేసేది లేదని సర్కారు తేల్చి చెప్పింది..

రాజా మాన్‌సింగ్ ప్యాలెస్ గురించి.. అది జయ్‌సింగ్ కు వంశ పారంపర్యంగా సంక్రమించిందని చెప్పడానికి రాజస్థాన్ లోని బికనీర్ స్టేట్ ఆర్కైవ్స్‌లో పలు లేఖలు ఉన్నాయి. ఇందులోని ఒక లేఖలోనే షాజహాన్.. రాజా జయ్‌సింగ్ కు పంపించిన ఆదేశాల్లో తాజ్ బిల్డింగ్‌ను కోరినట్టు తెలుస్తున్నది.

తాజ్ మహల్ లోని విశేషాలను గురించి మౌల్వీ మొయినుద్దీన్ వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. దేశంలోని ముస్లిం సమాధి మందిరాలకు.. ముంతాజ్ సమాధి అని చెప్తున్న తాజ్ మహల్‌కు చాలా వ్యత్యాసం ఉన్నది. ముస్లిం సమాధులున్న ప్రాంతాలన్నీ కూడా కేవలం సమాధి.. దాని చుట్టూ ప్రార్థనలు చేసుకునే వీలు మాత్రమే ఉంటుంది. తాజ్ మహల్‌లో మాత్రం వందలాది గదులు కనిపిస్తాయి. సమాధి ఉన్న చోటు నుంచి గ్రౌండ్ వరకు దాని చుట్టు పక్కల 128 గదులు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 76 మాత్రం మిగిలాయని మౌల్వీ రాశాడు. తోట గోడ సమీపంలో 32 గదుల చొప్పున రెండు ఖవాస్ పురాలు ఉన్నాయి. తాజ్‌మహల్‌ లోపల ఒక పెద్ద బావి ఉంది.. దీనిలోకి యమునా నది నుంచి నీళ్లు వస్తాయి. భవనంలోని ఏడంతస్తులకు దీనితో సంబంధం ఉంది.. ఇది రాజా మాన్‌సింగ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌గా చెప్తారు. ప్రధానమైన మధ్య గుమ్మటం పైన కలశం కనిపిస్తుంది.. ప్రధాన ద్వారం పైన మధ్యలో కమలం బొమ్మ ఉంటుంది.. తాజ్‌ వెనుక వైపున 22 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి వీటన్నింటినీ ఎందుకు సీల్‌ చేశారో తెలియదు.. తాజ్‌ కారిడార్‌ల నిర్మాణాలన్నీ వేదిక్‌ పీరియడ్‌ నాటి స్టైల్‌లో కనిపిస్తాయి. తాజ్‌ పై అంతస్తులో ఒక గదిని ఎందుకు మూసేశారో తెలియదు. గోడల పైన పూలలో ఓంకారం స్పష్టంగా కనిపిస్తుంది.

భవంతికి కింద 22 గదులు సీక్రెట్‌గా ఉన్నాయి. వీటిలో ఏమున్నదో ప్రభుత్వం వెల్లడి చేయలేదు. సీల్‌ చేసిన ఓ గదికి వేదిక్‌ డిజైన్‌ ఉంది. కొన్ని గదులకు తాత్కాలికంగా గోడ నిర్మించి ఉంచారు. మూడో అంతస్తులో నాలుగు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఒక్కో మూలన అష్ట భుజాకార గదులు ఉన్నాయి. ఒక్కో దానికి నాలుగు ద్వారాలు, నాలుగు మెట్ల మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి 34 మెట్లు ఎక్కి పైకి వెళ్తే నాలుగు టవర్లు కనిపిస్తాయి. వీటి పైన ఇత్తడి కలశాలు ఉంటాయి. ముందుగానే చెప్పుకున్నట్టు భూగృహంలో రహస్య గదులు ఉన్నాయి. ప్రధాన మందిరానికి దక్షిణం వైపు గుర్రాలను కట్టి ఉంచేందుకు ఏర్పాట్లు, అటెండర్లు ఉండటానికి క్వార్టర్లు ఉన్నాయి. కేవలం ఒక సమాధి కోసం నిర్మించిన కట్టడానికి ఇన్ని గదులు, ఇంత శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు, భూగృహాలు, సైనిక స్థావరాలు.. ఇవన్నీ ఎందుకు కట్టారో ఏ చరిత్రకారుడూ నోరు విప్పలేదు. దీన్ని ఇంకా వివాదం చేయడం ఇష్టం లేదని స్వయంగా భారత ప్రభుత్వమే తేల్చి చెప్పింది.

పీఎన్ ఓక్ చేసిన ప్రయత్నమంతా వృథా ప్రయాసగా మారింది. షాజహాన్‌ను ముంతాజ్ ను అమర ప్రేమ మూర్తులుగా కొలిచే దుస్థితి ఈ దేశానికి ఏర్పడటం నిజంగా దురదృష్టకరం

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here