దేశ విభజన విషవృక్షం-27

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన, భయంకరమైన, కాలమేదైనా ఉన్నదంటే.. అది ఈ దేశంపై డేగల్లా విరుచుకుపడ్డ ముస్లింల పరిపాలన కాలంలోనే.. క్రీస్తు శకం 624 నుంచి నౌకా దాడులతో మొదలైన పైశాచిక హింస బహదూర్ షా జఫర్ బ్రిటీష్ వాళ్లకు 1857లో పూర్తిగా దేశాన్ని అప్పగించేదాకా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత బ్రిటిష్ వాడు కూడా తక్కువేం తినలేదు. ముస్లిం రాజులు ఆక్రమించుకున్న ఈ వెయ్యేండ్ల కాలంలో భారతదేశం విషాద భారతంగా మారిపోయింది. ఈ కాలం అంతా.. ప్రపంచంలో దేనితోనూ సరిపోల్చలేని చిత్రహింస.. భారతీయులపై, భారతీయ రాజులపై, భారత ప్రజలపై, పేదలపై, మగవాళ్లు, ఆడవాళ్లు, యువతులు, చిన్నారులు.. ప్రతి ఒక్కరిపైనా పాశవికమైన అత్యాచారాలు.. భయానకమైన వాతావరణం సృష్టించి.. ప్రాణభయం కల్పించి.. నిరంకుశంగా.. నియంతృత్వంగా.. నిర్దయగా, నీచాతి నీచంగా భారత ఉపఖండంపై విశృంఖల స్వైరవిహారమే జరిగింది. భారతదేశం అప్పటివరకు పకడ్బందీగా నిర్మించుకుంటూ వచ్చిన జీవన విధానం విధ్వంసమైంది. సాంస్కృతిక వినాశనం జరిగింది. విలువలు మంట కలిశాయి. దేశంలో కన్యత్వానికి విలువే లేకుండా పోయింది. వెయ్యేండ్ల పాటు క్షణక్షణం మానవ హననం అన్న రీతిలో భారతదేశంలో ముస్లింల అరాచకత్వం కొనసాగింది. చట్టం లేదు. శాసనం లేదు. ధర్మం లేదు. రాక్షసత్వాన్ని మించిన హింసాకాండ.. ప్రపంచంలోనే మరెక్కడా చోటుచేసుకోని.. మరే చరిత్ర కూడా కనని, వినని భయంకరమైన జీవితాన్ని వెయ్యేండ్ల పాటు భారతదేశం అనుభవించింది. ఊచకోతలు, రేప్‌లు, దోపిడీలు.. కొత్త కొత్త పద్ధతుల్లో మనుషులను చంపడం వంటి చర్యలతో దేశం విలవిల్లాడి పోయింది. కజక్‌లు, ఉజ్బెక్‌లు, తుర్క్‌లు, ఇరానియన్లు, అరబ్బులు, అఫ్ఘన్‌లు, మంగోలులు.. ఒకరా ఇద్దరా.. ఒకడి తరువాత ఒకడు.. ఒకడి వెంట ఇంకొకడు.. చొరబడుతూ వచ్చారు. చివరకు బానిసలుగా వచ్చిన వాళ్లు సైతం పైశాచికంగా రెచ్చిపోయారు. భారతీయులనబడే వారి సంఖ్యను తగ్గించే పనిని మహమ్మద్ బిన్ ఖాసిం మొదలుపెడితే.. ఔరంగజేబ్ దాకా ముస్లిం రాజులు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే మతం మారాలి.. లేదా చావాలి.. ఈ రెండు సూత్రాల ప్రాతిపదికన భారతీయుల జనాభా దారుణంగా తగ్గిపోయింది. ముఖ్యంగా మహమ్మద్ ఘజ్‌నీ పైశాచిక నియంతృత్వ ధోరణిని ఆ తరువాత రాజులంతా ఒకరి తరువాత ఒకరు పాటిస్తూ వచ్చారు. అది ఔరంగజేబ్ కాలంలో పరాకాష్టకు చేరింది.

మన చరిత్రకారులు ఔరంగజేబు గురించి చాలా గొప్పగా రాసుకొచ్చారు. అతను మహానుభావుడు, మార్తాండ తేజుడు.. దేవుడు, ధర్మము, దయ తప్ప మరేమీ ఎరుగని వాడు. సూఫీ సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా పాటించేవాడు. హిందూ దేవాలయాలను నిర్మించాడు. హిందువులకు తన కొలువులో పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చాడు. వాళ్లను చక్కగా చూసుకున్నాడు.. అని ఏవేవో.. రాశారు. ఇవన్నీ చూస్తుంటే.. 1980లో దాసరి నారాయణరావు ఎన్టీ రామారావుతో ‘సర్దార్ పాపారాయుడు’ అని ఒక తెలుగు సినిమా తీశాడు. అందులో బ్రిటిష్ అధికారి పాత్ర అచ్చం ఇలాగే అంటుంది. ‘మా వంట వాడు భారతీయుడు.. మా తోట పనివాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు’ ఇలా మాట్లాడుతుంటాడు. అచ్చం అలాగే ఔరంగజేబ్‌ను ఎలివేట్ చేయడానికి మన సూపర్ హిస్టారియన్లు చాలానే కష్టపడ్డారు. ఇంకో విషయం ఏమిటంటే మన విజువల్ మీడియా.. ముఖ్యంగా బాలీవుడ్.. దీని ప్రభావం మనవారిపై చాలానే ఉంటుంది. సూఫీ అనగానే పొడువాటి తెల్ల గడ్డం.. తెల్లని దుస్తులు… చేతిలో మాల.. ఈ తరహా శాంతియుత డ్రస్ కోడ్ కనిపిస్తాయి. కానీ మంగోలుల నాటి భారత చరిత్రను తరచి చూస్తే.. మా అసిర్ ఏ ఆలంగిర్ కానీ, మీర్ ఎట్ ఆలమ్, అక్బర్ నామా, జహంగీర్ నామా, బాద్షా నామా, బాబర్ నామా.. షాజహాన్ నామా.. ఇవన్నీ గమనిస్తే.. ఆ కాలంలోని సూఫీలు సైతం సుల్తాన్‌ల పంచన చేరి.. అత్యాచారులుగా, హత్యాచారులుగా ఉన్నారన్నది స్పష్టంగానే తెలుస్తుంది. ప్రఖ్యాత పరిశోధకుడు నీరజ్ అత్రి ఉపన్యాసాల ద్వారా దీని గురించి మరింత వివరంగా తెలుసుకునే వీలున్నది. ఆయన ఉపన్యాసాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇక ఔరంగజేబ్ విషయానికి వద్దాం. ఇతడు షాజహాన్‌కు మూడో కొడుకు. అతని పెద్ద కొడుకు దారా షికో, రెండో కొడుకు షా షుజా, నాలుగో కొడుకు మురాద్ బక్ష్. వీళ్లందరిలోనూ దారా అంటే షాజహాన్ మమకారం ఎక్కువ చూపించేవాడు. వాస్తవానికి అతడే షాజహాన్ తరువాత మొఘల్ చక్రవర్తి కావాల్సి ఉండె. కానీ ఔరంగజేబ్ సైనికుడిగా, సైనిక వ్యవస్థ నిర్వాహకుడిగా చిన్ననాటి నుంచే చాలా బలవంతుడయ్యాడు. బుందేలులు, ఇతర హిందూ రాజులతో తన తండ్రి షాజహాన్ చేసిన యుద్ధాలలో అతిరథుడైన సైనికుడిగా ఆరితేరాడు. సైనిక విద్యలన్నింటిలోనూ నైపుణ్యం సాధించాడు. కానీ.. ఔరంగజేబ్ దొంగబుద్ధిని ముందే గ్రహించిన షాజహాన్ అతడిని వీలైనంత వరకూ ఢిల్లీకి దూరంగానే ఉంచాడు.

రాజకుమారులకు కొన్ని ప్రావిన్సుల బాధ్యత అప్పగించడం మొఘల్ రాజులు మొదట్నుంచీ పాటిస్తూ వచ్చారు. అందులో దారా షికోకు గంగా తీరం వెంబడి ఉన్న ప్రావిన్సులు, పంజాబ్‌ను అప్పగించాడు. షాహా షుజాను బెంగాల్, బీహార్ కు పంపించాడు. ఇతడు భయంకరమైన వుమనైజర్. చిన్నవాడైన మురాద్ బక్ష్‌ను గుజరాత్‌కు పంపించాడు. ఇతడు బీభత్సమైన తాగుబోతు. ఇక ఔరంగజేబ్‌ను తనకు చాలా దూరంగా కాబూల్‌కు, దక్కన్‌కు పంపించాడు. ఔరంగజేబ్ తనకు అత్యంత ప్రమాదకారిగా పరిణమిస్తున్నాడని షాజహాన్ ముందే గ్రహించాడు కాబట్టే దూరంగా పంపించాడు. ఆయా ప్రావిన్సులకు వెళ్లిన వాళ్లు చక్రవర్తికి అక్కడి నుంచి వసూలు చేసిన పన్నులను పూర్తిగా ఆగ్రాకు పంపించాల్సి ఉంటుంది. డబ్బులు చేరిన తరువాత చక్రవర్తి.. తిరిగి తమ కొడుకులకు వారికి కావలసిన సొమ్మును పంపించేవారు. ఔరంగజేబ్ సక్రమంగా డబ్బులు పంపించడం లేదని షాజహాన్‌కు అనుమానం ప్రబలింది. ఒకసారి నేరుగా నిలదీసే సరికి ఖాతా పుస్తకాలన్నీ తెచ్చి చక్రవర్తి ముందు పడేశాడు ఔరంగజేబ్. కానీ.. చక్రవర్తి అనుమానం ఎంతకూ పోలేదు.

ముస్లిం రాజుల చరిత్రలోనే అత్యంత క్రూరమైన పరిస్థితులు షాజహాన్ అంతిమ కాలంలోనే మొదలయ్యాయి.

ముస్లిం రాజులందరి చరిత్రలను గమనిస్తే మొత్తంగా మనకు ఒకే తరహాలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం కనిపిస్తుంది. అధికారం సాధించుకోవడం కోసం, చక్రవర్తిగా సింహాసనంపై కూర్చోవడం కోసం సొంత కుటుంబాలను, సోదరులను క్రూరంగా హతమార్చడం ముస్లిం రాజులకు ఒక సంప్రదాయంగానే కొనసాగుతూ వచ్చింది. అంతకు ముందు షాజహాన్ ముప్ఫై మందికి పైగా తన సకుటుంబీకులను చంపి చక్రవర్తి అయ్యాడు. అతడి తరువాత ఔరంగజేబ్ అదే సంప్రదాయాన్ని మరింత బలంగా, క్రూరంగా కొనసాగించాడు. రాజ్యాధికారం కోసం ఒకరినొకరు చంపుకోవడం మిగిలినవాడు చక్రవర్తి కావడం ముస్లిం రాజులందరిలో ఒక సాధారణ విషయంగా మారింది. కాబట్టి మనం ఒక్క ఔరంగజేబ్‌ను మాత్రం ఎందుకు తప్పు పట్టగలం? ముస్లిం రాజుల చరిత్రలో వారసత్వ యుద్ధాలనేవి సహజంగా సాగేవి. వీటిలో ఎవరికైనా ఒక్కటే సూత్రం.. అయితే సమాధిలోకి.. లేకపోతే సింహాసనం పైకి.. చక్రవర్తి చనిపోతే.. ఆ కుటుంబంలో మిగిలేది ఒకే ఒక్కడు మాత్రమే. చక్రవర్తితో పాటే.. మిగతా కుటుంబ సభ్యులంతా సమాధుల్లోకి ఏదో రకంగా చేరుకోవాల్సిందే. ఔరంగజేబ్ కూడా అదే కోవలో రాజయ్యాడు. షాజహాన్‌తో పాటే అతని మిగతా సంతానం అంతా సమాధుల్లోకి వెళ్లిపోయారు. ఇట్లాంటి వాడిని పట్టుకొని మన వాళ్లంతా మతసామరస్యవాది. శాంతి కాముకుడు.. గొప్ప ఉదారవాది అని అత్యంత అద్భుతంగా కీర్తించారు.

ఔరంగజేబ్ తాను చక్రవర్తి కావడం కోసం మొదట్నుంచే పకడ్బందీగా ఎత్తుగడలు వేస్తూ వచ్చాడు. సైనిక వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అవసరమైన నిధిని కొల్లగొట్టాడు. తనకంటూ ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకోగలిగాడు. ఔరంగజేబ్ ఒక్కడే కాదు.. షాజహాన్ కొడుకులు నలుగురు కూడా సింహాసనం కోసం తమ వంతు ప్రయత్నాలు తాము చేశారే తప్ప ఎవరూ కూడా సుద్దపూసలేం కాదు. చరిత్రకారులంతా గొప్పగా కీర్తించే దారా షికో.. చాలా అందంగా ఉండేవాడంట. అతడు కవిత్వాలు కూడా రాశాడు. షాజహాన్ కూతురు జహనారా కూడా కవయిత్రే. కవిత్వం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. దాన్ని బట్ట్ మనం క్యారెక్టర్లను అంచనా వేయలేం కదా.. ఇవాళ కూడా మన కవులు వేరు.. వారి కవిత్వాలు వేరే కదా.. సోషల్ మీడియాల్లో చేసే ఉద్యమాలు వేరు.. ఇండ్లల్లో చాటుమాటున పాటించే సంప్రదాయాలు వేరే కదా.. ఈ సోకాల్డ్ దారా షికో రాసిన ఒక కవిత్వం పంక్తులు ఇవి. ‘నేనొక వాన చుక్కను. నేను సముద్రంలో పడిపోయి.. ఒక ముత్యంలా మాత్రమే మారాలని కోరుకోవడం లేదు. నేనే సముద్రంలా మారాలని కోరుకుంటున్నా.’ ఇదీ ఆతని కవిత్వం. దీంతోనే అతని ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఔరంగజేబు చాలా తెలివైనవాడు, కూటనీతి మహబాగా వంటబట్టించుకున్నవాడు కాబట్టే.. అందరినీ సమాధుల్లోకి తోసేసి తాను సింహాసనాన్ని అధిష్ఠించగలిగాడు.

యుద్ధభూమిలో ఔరంగజేబ్ చాలా క్రూరుడైన సైనికుడు. తండ్రితో అనేక యుద్ధాల్లో పాల్గొనడం.. కాబూల్, దక్కన్ ప్రాంతాలపై దాడులు చేయడం వల్ల యుద్ధ రీతుల్లో చాలా చాలా నైపుణ్యం సంపాదించాడు. ఒకవైపు 1657లో తండ్రి షాజహాన్ అనారోగ్యం పాలయ్యారు. తొందర్లోనే చనిపోబోతున్నాడు. చక్రవర్తి మొదట్నుంచీ కూడా పెద్ద కొడుకు దారా షీకూ పైనే అనురాగం చూపుతున్నాడు. దీంతో సహజంగానే చక్రవర్తి సైన్యం దారా వైపు వెళ్లుతుంది. కాబట్టి దారాను దెబ్బతీయడానికి ముందుగా పటిష్ఠమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు కావాల్సిన ధనం సంపాదించాలి అని ఔరంగజేబ్ చాలా తెలివిగా పావులు కదిపాడు. ముందుగా దక్కన్‌లో ఏలుతున్న కుతుబ్ షాహీ, ఆదిల్ షాహీలపై దాడి చేసి ఆక్రమించుకోగలిగితే భారీ ఎత్తున సొమ్ము కూడుతుందని ఎత్తుగడ వేశాడు. ఎందుకంటే అప్పటికే హైదరాబాద్ చాలా సంపన్నమైన నగరం. చాలా సంపద పోగుపడిన నగరం. ఎందుకంటే హైదరాబాద్ ప్రపంచమంతా వజ్రాల వ్యాపారం, ఏనుగుల వ్యాపారం పెద్ద ఎత్తున చేసేది. అతి పెద్ద వజ్రాల వ్యాపార సామ్రాజ్యం హైదరాబాద్ లో అప్పటికే వ్యవస్థీకృతమై ఉండేది. హైదరాబాద్ వజ్రాలకు ప్రపంచమంతా గొప్ప డిమాండ్ ఉండింది. దాంతో పాటు సుగంధ ద్రవ్యాల వ్యాపారానికీ హైదరాబాద్ ఫేమస్. అందుకనే హైదరాబాద్‌ను ఔరంగజేబ్ టార్గెట్ చేశాడు. అప్పటికి రెండుసార్లు దక్కన్ ప్రాంతంలో గవర్నర్‌గా పనిచేశాడు కాబట్టి ఔరంగజేబ్‌కు ఆ ప్రాంతంపై పూర్తి పట్టు ఉన్నది. అందుకే ఆదిల్, కుతుబ్ షాహీలపై దాడికి పూనుకున్నాడు. బీదర్, గోల్కొండ రాజ్యాలను జయించి మొఘల్ ప్రావిన్సులుగా మార్చగలిగితే.. దక్కన్ గవర్నర్‌గా ఆ ప్రాంతాలు అటోమేటిక్‌గా తన చేతిలోకి వస్తాయి. తద్వారా అక్కడి సంపద మొత్తం తన వశమవుతుంది. తద్వారా తన సైన్యం మరింత బలోపేతం కావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ ఆలోచనతోనే ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీలపై దాడులకు దిగాడు. హైదరాబాద్ దాదాపు ఔరంగజేబ్ వశమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ లోపుగానే షాజహాన్ ఔరంగజేబ్‌ను అడ్డుకున్నాడు. వెనక్కి రావాల్సిందిగా ఫర్మానా పంపించాడు. కుతుబ్ షాహీని ముట్టుకోవద్దని హుకుం వేశాడు. కానీ అప్పటికే ఔరంగజేబ్ హైదరాబాద్‌లో కొంత భూమి, కొంత సొమ్మును చేజిక్కించుకొన్నాడు. హైదరాబాద్ నుంచి 8 వేల అశ్విక దళాన్ని, కర్ణాటక నుంచి 20 వేల మస్కటీర్లను తన సైన్యంలో కలిపేసుకొన్నాడు. తండ్రికి వ్యతిరేకంగా పడ్డ ఈ అడుగులు రాను రాను మరింత పెద్ద పెద్ద అంగలుగా మారిపోయాయి. ముందుగా సైన్యాన్ని పెంచుకున్నాడు. తన అనుచర గణాన్ని పెంచుకుంటూ వచ్చాడు. కొంత బలోపేతమైన తరువాత తన తాగుబోతు తమ్ముడు మురాద్ బక్ష్‌కు ఒక లేఖ రాశాడు. ‘దారా షికూ నమ్మ దగిన వాడు కాదు. అతడు మన మతానికి పూర్తి వ్యతిరేకంగా వెళ్లుతున్నాడు. అతడిని నిరోధించాలంటే మనిద్దరం కలవాలి. గెలిచిన తరువాత కావాలంటే నువ్వే చక్రవర్తి పీఠం పై కూర్చో.. నేను మన మతం చూపించిన మార్గంలో వెళ్లిపోవాలనుకుంటున్నా’ అని ఒక లేఖ రాశాడు. మురాద్ సైన్యం కూడా వచ్చి చేరడంతో ఔరంగజేబ్ మరింత బలవంతుడయ్యాడు. అటు మరో కొడుకు షా షుజా బెంగాల్‌లో తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు. తన సైన్యాన్ని వెంటేసుకొని ఆగ్రా వైపు కదిలి వచ్చాడు. అటు మురాద్ గుజరాత్‌లో, ఔరంగజేబ్ దక్కన్లోనూ తమకు తాము చక్రవర్తులుగా ప్రకటించుకొన్నారు. వారణాసి దగ్గర దారా షికు కొడుకు షా షుజాను అడ్డుకున్నాడు. 1658 లో షా షుజా బనారస్‌లో ఓడిపోయాడు. అక్కడి నుంచి బర్మాకు పారిపోయాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఔరంగజేబ్ బర్మాలోనే అతడిని పట్టుకొని.. స్థానిక రాజులతో చంపించాడు.

మరోవైపు ఔరంగజేబ్, మురాద్‌ల సైన్యం ఉజ్జయినిలో రాజ్‌పుత్ అయిన జస్వంత్ సింగ్ రాథోడ్‌ను ఎదుర్కొన్నది. ఆ యుద్ధంలో దాదాపు 10 వేల మంది రాజ్‌పుత్‌ల ఊచకోత జరిగింది. రాథోడ్‌ను గెలిచిన తరువాత ఔరంగజేబ్, మురాద్ సైన్యం ఆగ్రా వైపు కదిలింది. దారా వారిని ఎదుర్కోవడానికి మూడు రోజుల పాటు మీనమేషాలు లెక్కించడం వారికి కలిసి వచ్చింది. అప్పటికే యుద్ధంలో అలసిపోయి చాలా దూరం నుంచి వచ్చిన వారికి మూడు రోజుల విశ్రాంతి దొరకడంతో మరింత రెచ్చిపోయారు. దారా సైన్యానికి, ఔరంగజేబ్, మురాద్ సైన్యానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో ఊచకోత సాగుతున్న కొద్దీ.. దారా సైన్యం పూర్తిగా ఔరంగజేబ్ చెంతకు చేరిపోయింది. చాలామంది మున్సబ్‌దారులు ఔరంగజేబ్ పక్షానికి వచ్చేశారు. చివరకు దారా ఆగ్రా కోటలోకి పారిపోయాడు. అక్కడి నుంచి ఢిల్లీకి.. అటు నుంచి బెలూచిస్తాన్ ప్రాంతానికి పారిపోయాడు. అదే సమయంలో ఔరంగజేబ్ షాజహాన్‌ను జైల్లో పడేశాడు. అప్పటిదాకా షాజహాన్‌కు కుడిభుజంగా వ్యవహరించిన మీర్జా రాజా జయ్‌సింగ్ ఔరంగజేబ్ వైపు మారిపోయాడు. దారాను పట్టుకొని.. ఔరంగజేబ్‌కు అప్పగించాడు. ఔరంగజేబ్ అతడి తలను నరికించి చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేయించి జైల్లో ఉన్న తన తండ్రికి బహుమానంగా పంపించాడు. ఆ తరువాత మిగిలింది ఇక మురాద్. మురాద్‌పై హత్యానేరం మోపి.. అతడిని జైల్లో పడేసి.. విచారణ జరిపించి అతడిని ఉరి తీయించాడు. అతడి మేనల్లుడు సులేమాన్ షీకూపై విష ప్రయోగం చేసి చంపించాడు. దాయాదుల శేషం లేకుండా చేసుకున్నాడు. అంతిమంగా ఎవరూ పోటీ లేకపోవడంతో చక్రవర్తి పీఠం అధిష్ఠించడానికి అతడికి అడ్డే లేకుండా పోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here