Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-28

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]వి[/dropcap]భజన విషవృక్షంలో ఔరంగజేబు నాటిన ‘జాతి’ బీజాల గురించి చర్చించుకొంటున్నాం. ఈ పరంపరలో ప్రధాన అంశంలోకి వెళ్లడానికి ముందు గత వారం నాకు ఒక పాఠకుడి నుంచి వచ్చిన ప్రశ్న గురించి కొంత చెప్పాలనిపించింది. ఆ ప్రశ్న ఏమిటంటే.. ‘మీకు ఇంత పరమత ద్వేషం దేనికి? గత చరిత్రను తవ్వి వర్తమానానికి చెప్పడం వల్ల ఉపయోగం దేనికి.. భవిష్యత్తు తరాలకు చెప్పడానికి మరేమీ లేవా? మనుషుల మధ్యన ప్రేమను పంచాలి తప్ప ద్వేషం పెంచడం ఏమిటి?’ అని ఒక పాఠకుడు నన్ను అడిగిన ప్రశ్న. గత యాభై ఏండ్లుగా ఈ విధమైన రచనలు చేస్తున్న వారికి ఎదురవుతున్న ప్రశ్నే ఇది. నిజమే. ఈ ప్రశ్న ఎవరినైనా అడుగాల్సిందే. దీనికి ఏ రచయిత అయినా జవాబు చెప్పాల్సిందే. భారతదేశంలో హిందూ ధర్మాన్ని భయంకరంగా, నీచంగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, వికృతంగా ద్వేషిస్తున్న వారిని కూడా మీకు పరమత ద్వేషం దేనికి అని కచ్చితంగా ప్రశ్నించాలి. ‘పరులు’ నమ్మే మతాన్ని, ‘పరులు’ నమ్మే దేవుడిని, ‘పరులు’ ఆచరించే ధర్మాన్ని నిస్సిగ్గుగా నిందిస్తూ రచనలు చేస్తున్న వారిని కూడా కచ్చితంగా మీకీ పరమత ద్వేషం దేనికి అని అడగాలి. ‘పరులు’ నమ్మే దేవుడి అస్తిత్వాన్ని అత్యంత నీచంగా ప్రశ్నిస్తున్న వారిని కూడా అడగాలి.. మీకు ఈ పరమత ద్వేషం దేనికి అని. ఎప్పుడో శతాబ్దాల క్రితం మమ్మల్ని అణచివేశారు. కాబట్టి ఇప్పుడు మేం మిమ్మల్ని రోజూ తిడతాం అంటున్న వాళ్లను కూడా ‘మీరు గత చరిత్రను ఎందుకు తవ్వుతున్నారు.. మీకు వేరే పనేం లేదా?’ అని ప్రశ్నించాలి. భవిష్యత్తు తరాలకు చెప్పడానికి మీకు వేరే విశేషాలు ఏమీ లేవా అని కూడా అడగాలి. పక్కింటి వాడు ఎవరో.. ఏమిటో ముఖం కూడా తెలియకుండా బతుకుతున్న ఇవాల్టి ప్రపంచంలో.. అపార్టుమెంటులో నిమ్నవర్గాల వారిపట్ల అగ్రవర్ణాల దాష్టీకం గురించి ఓ పెద్ద మనిషి కథ రాస్తే.. ఏమిట్రా బాబూ.. హైదరాబాద్‌ లాంటి ఊళ్లో.. కూకట్‌‌పల్లి లాంటి ప్రాంతాల్లో.. హైటెక్‌ సిటీ, నాలెడ్జి సిటీ, ఫైనాన్స్‌ సిటీల్లో తప్ప మరొక చోట పనిచేసేవారు దాదాపుగా ఉండని ప్రాంతాల్లో ఇలాంటి ఘటన అన్నది ఒకటి జరుగుతుందని ఎలా అనుకొన్నావు.. అలా జరిగిందని ఎలా రాశావు.. సమాజంలో అంతరాలను మరింత పెంచడం కాకపోతే నీ కథలోని ఉద్దేశం ఇంకేమున్నదని ప్రశ్నించాలి. భవిష్యత్తు తరాలకు  ఏం చెప్పదలచుకొన్నావు? ఇలాంటి సమాజ విచ్ఛిన్న, అసాంఘిక రచనలకు అవార్డులు ఎట్లా ఇస్తార్రా బాబూ అని అవార్డులు ఇచ్చిన పెద్ద మనుషులను నిలదీయాలి. కానీ.. వీళ్లను మాత్రం ఎవరూ ప్రశ్నించరు. ఈ ప్రశ్న వేసేవారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందిట. కానీ.. ఆ ప్రశ్నను ఎదుర్కొంటున్న వాళ్లకు కూడా ప్రశ్నించే హక్కు ఉండకూడదు. ఉండరాదు. ఎవరైనా ప్రశ్నిస్తే.. మీకు పరమత ద్వేషం.. గత చరిత్ర చెప్పటం దేనికి? అని ఎదురుదాడి..

వాస్తవానికి ఈ ప్రశ్నిస్తున్న వాళ్లు జీవిస్తున్నదే.. గత చరిత్ర అనబడే.. ఒక దారుణమైన తప్పుడు చరిత్ర మీద. వాళ్లు చెప్పేది.. చేసేది.. ప్రశ్నించేది కూడా ఈ సోకాల్డ్‌ చరిత్రను పట్టుకొనే ఈకలు పీకుతుంటారు.

ఇక పై పాఠకుడు అడిగిన విషయాల్లో ప్రధానమైన అంశాలు మూడు..

  1. పరమత ద్వేషం
  2. గత చరిత్ర
  3. భవిష్యత్తు తరాలకు ఇచ్చే సందేశం ఏమిటన్నది.

పర్టిక్యులర్‌‌గా మన దేశంలో పరమత ద్వేషం అన్నది లేనే లేదు. ఒక్కటే మతం పట్ల ద్వేషం ఉంటుంది. అది కొనసాగుతూ ఉంటుంది. విచిత్రమేమిటంటే.. మతం కానిదానికి మతం అన్న పేరు పెట్టి దాన్ని తీవ్రంగా.. అతి తీవ్రంగా ద్వేషిస్తుంటారు. ఎందుకంటే.. ఈ ద్వేషం అన్నది రాజకీయ అస్తిత్వాన్ని ఇస్తుంది. ఈ ద్వేషం అన్నది సామాజిక అస్తిత్వాన్ని ఇస్తుంది. ఈ ద్వేషం అన్నది సొసైటీలో స్టేటస్‌ను తెచ్చి పెడుతుంది. ఈ ద్వేషం అన్నది.. జాతీయ, అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్ఠలను మోసుకొచ్చి నెత్తిన పెడుతుంది. ఈ ద్వేషం అన్నది అవార్డు వాపసీ నినాదాలు చేయడానికి వీలుగా అవార్డులను తెచ్చిపెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో పరమత ద్వేషం కాదు.. భారతీయ  మత ద్వేషం అనేది మూడు పూవులు, ఆరు కాయలుగా వెల్లి విరుస్తున్నది. ఆ పర్టిక్యులర్‌ మతం పట్ల ద్వేషం కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని అడ్డగోలుగా తిడుతూనే ఉంటారు. ఇక ఈ ద్వేషింపబడుతున్న మతావలంబులు ఏం మాట్లాడితే మాత్రం ఏమి ప్రయోజనం? వాళ్లు నోరు తెరవక ముందే.. వంద నోళ్లు విరుచుకుపడతాయి.. జుట్టు పట్టుకొని బజార్లోకి ఈడుస్తాయి. నోరు తెరవాలంటేనే భయం కల్పించినప్పుడు ఎవరైనా ఎందుకు మాట్లాడతారు?

ఇక రెండో అంశం ఏమిటంటే.. గత చరిత్ర. గత చరిత్రలో బతుకుతూ వర్తమానాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు? ఎందుకు పనికి రానివి చెప్తున్నారు అని ఆవేదన చెందారు కొందరు. చరిత్ర అంటేనే గతం అని. చరిత్ర అంటేనే మన జ్ఞాపకం. మన మూలాలు. మూలం ఛేదించి చెట్టును పెంచుదామంటే పెరుగుతుందా? చరిత్ర అనేది వర్తమానానికి ఆలంబన. భవిష్యత్తు తరాలకు పునాది. విభజనకు సంబంధించి ఇప్పుడు గత చరిత్రను తవ్వి ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇవాళ సోకాల్డ్‌ రేషనలిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, హేతువాదులు, లిబరల్స్‌ చేస్తున్న పనేమిటి? మొన్నటికి మొన్న ఎప్పుడో జరిగిన చరిత్రను వాడెవడో తవ్వి తీస్తే.. దానికి దేశమంతటా ప్రచారం కల్పించింది ఎవరు.. అది గత చరిత్రే కదా.. వీళ్లు ఇప్పటికీ, ఎప్పటికీ అదే చరిత్రలోనే బతుకుతున్నారు కదా.. ఎన్నో ఏండ్ల క్రితం ఒక దారుణమైన తప్పు జరిగితే.. దానికి ప్రతీకారంగా భయంకరమైన తప్పు జరిగింది. మరి వీళ్లు అదే చరిత్ర చర్విత చర్వణంగా చెప్తున్నారు కదా.. మరి వీళ్లనూ అడగాలి కదా.. అరే.. బాబూ.. మీరెందుకు గత చరిత్రలో బతుకుతున్నారు అని? మీకు ఇంత ద్వేషం దేనికని?

విభజన విషవృక్షం అన్నది గత చరిత్ర ఎంతమాత్రం కానే కాదు. ఇది వాస్తవ చరిత్ర. వర్తమాన చరిత్రను ప్రభావితం చేస్తున్న సజీవమైన ,  నిజమైన చరిత్ర. యురోపియన్‌ చరిత్రకారులు, గ్రీకు చరిత్రకారులు.. వాళ్లను పట్టుకొని వేళాడిన.. వేళ్లాడుతున్న మన సూపర్‌ హిస్టారియన్లు చరిత్రను చరిత్రగా రాసి ఉంటే.. వాస్తవ చరిత్రను వాస్తవంగా చెప్పి ఉంటే.. చరిత్రను మసిపూసి మారేడు కాయ చేసి ఉండకపోతే.. నాలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ ఇదీ మన చరిత్ర.. అని నెత్తీ నోరూ బాదుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు కదా.. చరిత్రను చరిత్రగా మాత్రమే చూడాలి. చరిత్రను చరిత్రగా మాత్రమే రాయకుండా.. మార్క్సిస్టు దృక్పథం అనో.. మావో దృక్పథమనో.. మైనార్టీ దృక్పథమనో.. హేతువాద దృక్పథమనో.. కమ్యూనిజం దృక్పథమో.. బౌద్ధ దృక్పథం, జైన దృక్పథం, సిక్కు దృక్పథం, యూరోపు దృక్పథం, గ్రీకు దృక్పథం అంటూ ఒక దృక్పథాన్ని చరిత్రకు చుట్టూ మొత్తంగా పూసి.. మసాలాలు దట్టించి.. దాన్నొక దమ్‌ బిర్యానీలాగా వండి వార్చడం అన్నది కేవలం ఒకే ఒక్క దేశంలో.. భారతదేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. లక్షల మందిని చంపిన వాడిని గొప్పగా కీర్తిస్తారు. ఆ రాక్షసుడి ఆనవాళ్లను నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. ఈ దేశంలో జనజీవనాన్ని విధ్వంసం చేసి.. సంస్కృతిని విచ్ఛిన్నం చేసి భయమే బతుకుగా మారిన కాలాన్ని స్వర్ణయుగమని చెప్తారు. ఆడవాళ్లను (భార్య, కూతురు అన్న వావి వరుసలు కూడా లేకుండా) కేవలం సెక్స్‌ సింబల్స్‌గా మాత్రమే చూసిన వాళ్లను రొమాంటిక్‌ హీరోలుగా చిత్రిస్తారు. మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని సర్వనాశనం చేసిన వాణ్ణి పట్టుకొని శాంతి కాముకుడు అంటారు. నేను ఇంత దుర్మార్గుడిని.. నేను ఇన్నిన్ని ఘోరాలు చేశాను అని తనకు తాను ఆత్మకథలు రాసుకొన్నా సరే.. లేదు లేదు.. నువ్వు చాలా గొప్పవాడివి.. శాంతి కాముకుడివి. నువ్వు అనుసరిస్తున్న మతం చాలా గొప్పది. మేమే వెర్రివాళ్లం.. మా బుర్రల్లో ఏమీ లేదు.. నువ్వొచ్చి మమ్మల్ని ప్రేమగా అక్కున చేర్చుకొని ఒళ్లో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించావు. నీకేం తెలియదు.. నోరుమూసుకో.. మేం చెప్పిందే నీ చరిత్ర.. నువ్వు రాసుకొన్నది కాదని దబాయిస్తారు. ఇలాంటి మసాలా చరిత్రతో ఇప్పటికి అనేక తరాలు తమ వాస్తవిక చరిత్రను తెలుసుకోలేక.. తప్పుడు చరిత్రను చదువుకొని.. వీళ్లందరూ మన ఉద్ధారకులు.. మనకంటూ ఒక నాగరికత, సంస్కృతే లేదనుకొంటున్నారు. అందుకోసం వాస్తవ చరిత్ర ఏమిటో తెలియాలి. చరిత్ర అన్నది ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది. నిజం నిప్పులాంటిది. అబద్ధమనే నివురు కప్పి ఉన్నంతవరకూ అది కనిపించదు. నివురు తొలిగిపోతే.. ఆ అబద్ధాన్ని భస్మీపటలం చేస్తుంది. ఏది పడితే అది రాసి దాన్ని చరిత్ర అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇవాళ కూడా తప్పుడు చరిత్రతో సంకలనాలు వస్తుంటే.. వాటిని తెగనాడుతూ వాస్తవాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. గత సంవత్సరమే కాలచక్రం పేరుతో వచ్చిన చరిత్ర కథల సంకలనాలపై  రచయిత కస్తూరి మురళీ కృష్ణ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. అర్ధ శతాబ్ది ముందు విశ్వనాథ వారు.. కాశ్మీర రాజవంశ కథలు, నేపాల రాజవంశ కథలు, పురాణ వైర గ్రంథమాల రాయాల్సి వచ్చింది. ఇప్పుడు కాశ్మీర రాజతరంగిణి, జోనరాజరాజతరంగిణి, ఉజ్వల భారత మహోజ్వల గాథలు వంటివన్నీ కొత్తగా రాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ రచయిత రామం భజే శ్యామలం రాసినా.. విభజన విషవృక్షం రాసినా కూడా ఈ పరిస్థితుల వల్లనే. చరిత్రను చరిత్రగా మాత్రమే చెప్పాలి. అలా చెప్పి ఉంటే.. ఇవాళ ఇవన్నీ రాయాల్సిన అవసరమే వచ్చేది కాదు. చరిత్రకు సెక్యులరిజంతోనో, మతంతోనో, కుటుంబంతోనో సంబంధం లేదు. గతంలో జరిగిన సంఘటనల సమాహారం మాత్రమే. అందులో మంచి ఉండవచ్చు.. చెడు ఉండవచ్చు.. కానీ.. దాన్ని దానిమాదిరిగానే ఉంచాలి. ప్రఖ్యాత గిరిజన జాతర మేడారంలో బంగారం (బెల్లం) బదులు సంప్రదాయ ప్రసాదాలైన పులిహోర, లడ్డూలను ప్రసాదంగా ఇస్తే దాని అస్తిత్వం ఎలా దెబ్బ తింటుందో.. చరిత్రకు రంగు, రుచి, వాసనలు కల్పిస్తే కూడా అలాగే దాని అస్తిత్వం చచ్చిపోతుంది.

ఈ దేశంలో భారతీయులు   .. కొన్ని తరాల క్రితం ముస్లింల  మతాన్ని అనేకానేక పరిస్థితుల మూలంగా స్వీకరించాల్సి వచ్చింది. ఇది నిజం. ఆ పరిస్థితులను వాస్తవంగా చెప్పడం మతద్వేషం కాదు. బౌద్ధం, జైనం, సిక్కిజం వంటి మతాలు ఈ దేశంలో పుట్టినవి.. ఇస్లాం, క్రెస్తవం ఈ దేశంలోకి చొచ్చుకువచ్చినవి. ఇందులో వివాదం లేదు. సందేహం లేదు. మతం వ్యక్తిగతం. భారతీయ మతాలు కూడా ప్రపంచంలోని అనేక దేశాల్లోకి విస్తరించాయి. వివిధ దేశాల్లో దేవాలయాలు ఉన్నాయి. అక్కడి ప్రజల్లో కొందరు మతాన్ని స్వీకరించి అనుసరిస్తున్నవారూ ఉన్నారు. మతం అన్నది కేవలం వ్యక్తిగతంగా ఉన్నంత వరకు సమస్య ఉండదు. కానీ, దేశంలో రాజకీయ అస్తిత్వం కోసం మతాన్ని వాడుకొంటూ.. విభజన బీజాలు నాటి.. విద్వేష వృక్షాలు నాటడం వల్ల దేశంలో ప్రజల మధ్య సామరస్యత లేకుండా పోయింది. విదేశీ మతాలకు చెందిన ప్రజలు తమది భారతదేశం కాదనుకొనే పరిస్థితులు సృష్టించారు. ప్రపంచంలో తమ దేశ చరిత్రను ఇంతగా మానిప్యులేట్‌ చేసుకొని రాసుకొని.. అదే మన వాస్తవం అని ఒక చిత్త భ్రమలో బతుకుతున్న దేశం కేవలం భారతదేశం మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి యుద్ధమే చేయాల్సి వస్తున్నది. తరానికి ఒకరు ముందుకు వచ్చి ఇదీ మన చరిత్ర అని గొంతెత్తి అరవాల్సి వస్తున్నది.

ఈ దేశంలోకి చొచ్చుకు వచ్చిన ముస్లిం రాజులు ఎన్నెన్ని ఘోరాలు చేశారో.. ఆ కఠిన సత్యాలను ఎంతకాలం దాచగలం.?? ఎందుకు దాచాలి? అవి చెప్తే ఎవరి మనోభావాలు కానీ ఎందుకు దెబ్బతినాలి? దేవాలయాలు మసీదులుగా రూపాంతరం చెందటం ఆబద్ధమా? ఊళ్ళకు ఊళ్ళు పీనుగుపెంటలయి, పిల్లలు. మహిళలు బానిసలుగా విదేశీవీధుల్లో అమ్ముడవటం అనృతమా? నాజీల దురాగతాలను చర్చించేందుకు, గతంలో జరిగిన అకృత్యాలను అర్ధంచేసుకుని మళ్ళీ అలాంటి పరిస్తితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో జర్మనీ ప్రజలు  ఎన్నడూ వెనుకాడలేదు. ఫాసిజం మూలాలను విశ్లేషించేందుకు, ముస్సోలినీ చర్యలను విమర్శించేందుకు ఇటాలియన్లు జంకరు. యూరపు దేశాల ప్రజలు ఎన్నడూ, యూదులపై నాజీలు జరిపిన దురాగతాలలో తమ పాత్రను దాచే ప్రయత్నాలు చేయలేదు. నాజీలతో సహకరించినందుకు పశ్చత్తాపాన్ని వ్యక్తంచేసేందుకు జంకలేదు. ఇలా గతంలోని పొరపాట్లను స్పష్టంగా చర్చించి అర్ధం చేసుకోవటంవల్ల ఆయా పొరపాట్లు  మళ్ళీ  జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ, మన దేశంలోనే చారిత్రిక సత్యాలు మనోభావాలను దెబ్బ తీస్తాయని చరిత్రలో అసలు నిజాలను మరుగు పరచి మసిపూసి మారేడు కాయ చేసిన ఆబధ్ధపు సత్యాలను ప్రచారంచేయటం, సత్యాన్ని ప్రస్తావించకూడదనటం ఏ రకంగానూ శ్రేయస్కరంకాదు.   నిజాన్ని నిజంగా స్వీకరించలేనివారు, ఆబద్ధపు ఊబిలో కూరుకుపోతారు. వారిని ఎవరూ వెలికితీయలేరు. మన మూలాలను మనం తెలుసుకోవడానికి, మన తరువాతి తరాలకు అందించడానికి భయమెందుకు? మన మూలాలు తెలిస్తేనే.. మనం ఏమిటో తెలుస్తుంది. మనం ఎలా బతుకాలో.. ఎలా బతుక కూడదో అర్థమవుతుంది. అందుకోసమే ఈ వెలికితీత.

మనం ఇప్పుడు చర్చించుకొంటున్న ఔరంగజేబును ఎంత గొప్పగా, మానవతావాదిగా, మతసామరస్య వాదిగా పొగిడిన వాళ్లు.. తన తండ్రిని జైల్లో వేయడానికి, అన్నదమ్ములను పైశాచికంగా చంపిన ఘటనలకు కూడా వెన్న పూశారు. శివాజీ కొడుకు షంభాజీని భయంకరంగా చంపి.. ముక్కలు చేసి ఆ మాంసాన్ని కుక్కలకు ఆహారంగా వేసిన వాడిని నిస్సిగ్గుగా తలకెత్తుకోవడమే కాకుండా గొప్పవాడిని చేశారు. షంభాజీని చంపాలని సలహా ఇచ్చిన వాడి సమాధి దగ్గర ఇవాల్టి రాజకీయ నాయకులు పోయి.. టోపీలు పెట్టుకొని.. చాదర్‌ లను కప్పి పూజలు చేసి వస్తున్నారు. వీరు భవిష్యత్తు తరాలకు ఇస్తున్న సంకేతాలేమిటి..? మన దేశంపైకి చొచ్చుకు వచ్చిన ముష్కరులను ఎదుర్కొని దేశమంతా భారతీయ సామ్రాజ్యాన్ని పునః ప్రతిష్ఠించిన ఛత్రపతి చరిత్రను మహారాష్ట్రను దాటి దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరకుండా అడ్డుకొంటున్న వీరు భవిష్యత్తు తరాలకు ఇస్తున్న సంకేతాలేమిటి?

(సశేషం)

Exit mobile version