దేశ విభజన విషవృక్షం-29

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మొ[/dropcap]ఘలుల వంశంలో అత్యధిక కాలం అంటే దాదాపు 50 ఏండ్లపాటు రాజ్యాన్ని ఏలిన ఔరంగజేబ్‌ను పక్కన పెట్టి, ఈ దేశంలో ఇస్లామిక్ ఐడెంటిటీని విడిగా చూడలేము. ఇవాళ్టికి దాదాపు 350 ఏండ్ల క్రితం ఇలాంటి ఒక దారుణమైన రాజు ఉన్నాడని ఇవాళ్టి పిల్లలకు తెలియజెప్పటం అవసరం. 50 ఏండ్ల చరిత్రను ఒకటి రెండు వాక్యాల్లో చెప్పేసి అవతల పారేయలేం. అతని నిజమైన చరిత్ర ఏమిటో తెలియజెప్పటం అవసరం. అత్యంత ఆవశ్యకం. దురదృష్టవశాత్తూ గత వెయ్యేండ్ల చరిత్రలో సెంట్రల్ ఫిగర్‌గా ఉన్న ఔరంగజేబ్ చరిత్ర మనకు పూర్తిగా తెలియకుండా పోయింది. తెలియకుండా చేశారు. ఎవరి ప్రయోజనాలను కాపాడటానికో.. ఎవరి ప్రాపకం కోసమో.. 50 ఏండ్ల చరిత్ర కాలాన్ని పూర్తిగా మరుగున పడేశారు. ఇలా.. చరిత్రలో ఒక ముఖ్యమైన కాలాన్ని కాలగర్భంలో కలిపేయగలిగిన దేశం ప్రపంచంలోనే భారత్ మాత్రమే కావచ్చు. భారతదేశంలో చరిత్ర రచన అనేది ‘పొలిటికల్ నెరేషన్’ (రాజకీయ పరమైన విశ్లేషణ) గా సాగింది తప్ప వాస్తవిక దృక్పథంతో సాగలేదు.

ఇంతకుముందు చెప్పినట్టుగానే ఔరంగజేబ్‌ను సూఫీ అని కొందరు, అత్యాచారి అని మరి కొందరు ప్రచారం చేస్తారు. బాలీవుడ్ ప్రచారం కావచ్చు, ప్రభుత్వాల అండతో చరిత్రను చిత్తం వచ్చినట్టు రచించిన మహానుభావులు కావచ్చు.. ఔరంగజేబ్‌ను సూఫీగా చిత్రించారు. నిజానికి ఔరంగజేబ్ రెండు లక్షణాలనూ బహు భేషుగ్గా పుణికిపుచ్చుకొన్నవాడు. సూఫీ ముసుగు కప్పుకున్న అత్యాచారి ఔరంగజేబ్. నక్షబందీ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మినవాడు. అహ్మద్ సర్ హండీ ప్రతిపాదించిన షరియాను పూర్తిగా అమలుచేసిన వాడు. మొఘల్ రాజులందరిలోనూ అసాధారణమైన అధికారాన్ని అనుభవించినవాడు. ఈ విశృంఖల అధికారం అతని రాజ్యంలో సూఫీలకు విచ్చలవిడితనాన్ని అప్పగించింది. సుదీర్ఘ రాజ్యాధికారాన్ని అనుభవించిన ఔరంగజేబ్‌తో భారతదేశంలో అనేక మంది రాజులు తమ అస్తిత్వాన్ని, జాతి మనుగడను కాపాడుకోవడం కోసం వీరోచితంగా పోరాడారు. అందులో ఒకరు.. ముఖ్యమైనవారు.. దేశమంతటా హిందూ మహా సామ్రాజ్యాన్ని స్థాపించినవారు.. ఛత్రపతి శివాజీ.. భారతదేశపు వెయ్యేండ్ల బానిసత్వపు సంకెళ్లను తుంచేసిన మహావీరుడు. శ్రీకృష్ణుడి యుద్ధనీతిని, చాణుక్యుడి రాజనీతిని పుణికిపుచ్చుకొని జన్మించిన పురుషోత్తముడు.. మొఘలుల సామ్రాజ్యపు పునాదులను బలహీనం చేసిన వీరుడు.. శివాజీ.. మోసాన్ని మోసంతోనే జయించాడు. అధర్మానికి అధర్మంతోనే బదులిచ్చాడు. యుక్తిగా రాజనీతి చేశాడు. తెలివిగా శత్రుమూకల్ని తెగనాడాడు. హిందూ సామ్రాజ్యాన్ని దేశమంతటా స్థాపించాడు. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన అధ్యాయమిది. బీజాపూర్ సుల్తాన్ తనను పట్టి తేవడానికి పంపించిన అఫ్జల్ ఖాన్‌ను తన చేతి గోళ్లతో పొట్ట చీల్చి హతమార్చి.. నారసింహావతారాన్ని పునః ప్రదర్శించడంతో ఔరంగజేబ్ ప్రభువుల వారికి శివాజీ గురించిన సమాచారం మొదటిసారి అందింది. వెంటనే శివాజీకి బుద్ధి చెప్పడానికి తన మేనమామ ఫయిస్తాఖాన్‌ను పంపించాడు. ఒక పక్క బీజాపూర్ సుల్తానులు, మరోపక్క మొఘలాయీల దాడులతో శివాజీ ఉక్కిరిబిక్కిరైపోయాడు. పూణా కోట ఫయిస్తాఖాన్ వశమైపోయింది. ఫయిస్తాఖాన్ తన స్థావరాన్ని ఆ కోటకు మార్చుకున్నప్పటికీ.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసుకొన్నాడు. కానీ.. శివాజీ తాను చిన్నప్పటి నుంచి ఉన్న కోట ఆనుపానులన్నీ తెలిసినవాడు కాబట్టి.. అందులోకి సులభంగా ప్రవేశించి ఫయిస్తాఖాన్‌ను హతమార్చడానికి ప్రయత్నించాడు. కానీ.. అతను తృటిలో తప్పించుకున్నాడు. దీంతో ఔరంగజేబ్‌కు ఏమీ పాలుపోలేదు. తన మేనమామకే ఎదురుదెబ్బ తగలటంతో ఈసారి రాజా జయ్ సింగ్‌ను పంపించాడు. ఎలాగైనా శివాజీని అణచివేయాలని ఆదేశించాడు. మళ్లీ అదే పరిస్థితి. బీజాపూర్ సుల్తానులు, గోల్కొండ నవాబు, ఫయిస్తాఖాన్, అఫ్జల్ ఖాన్‌ల అనుచరులు, తన ఆస్థానంలోనే ఉన్న కుట్రదారులందరు ఏకమై విరుచుకుపడటంతో జయ్ సింగ్ విజయం సాధించగలిగాడు. మూడు నెలలపాటు భీకర పోరు జరిగినప్పటికీ.. చివరకు పురందర్ కోటను కూడా శివాజీ వదులుకోవాల్సి వచ్చింది. చివరకు పరిస్థితి కలిసిరాకపోవడంతో ఔరంగజేబ్ కమాండర్లయిన రాజా జైసింగ్, దిలేర్ ఖాన్ లతో శివాజీ సంధి కుదుర్చుకున్నాడు. 1665 జూన్ 12 న ఈ ఒప్పందం జరిగింది. ఔరంగజేబ్ కాలంలో రాజ్యాలను పూర్తిగా ఆక్రమించడానికి ముందుగా జరిగే తతంగమే ఈ ఒప్పందం. తరువాత విజేత ఆస్థానంలో ప్రవేశపెట్టి లొంగిపోయేలా ఒత్తిడి తేవడం.. లేకపోతే చంపేయడం వంటివి జరిగేవి. హిందూ రాజుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడం, వాళ్ల కొడుకులను, కూతుళ్లను బందీలను చేసి హారెమ్ లకు తరలించి.. లొంగిపోయేందుకు ఒత్తిడి చేయడం ఔరంగజేబ్ కాలంలో అత్యధికంగా జరిగింది. శివాజీ విషయంలోనూ ఔరంగజేబ్ అదే పనిచేశాడు. జయ్ సింగ్‌తో ఒప్పందం చేసుకొన్న తరువాత అతని పర్యవేక్షణలో శంభాజీపై అత్యాచారం జరుగకుండా ఉంటుందని, మతమార్పిడికి ఒత్తిడి జరుగకుండా ఆగుతుందని నమ్మకంతో శంభాజీని పంపించండానికి అంగీకరించాడు. ఒప్పందం చేసుకున్నప్పటికీ.. జయ్ సింగ్‌కు ఎక్కడో అనుమానం బాగా ప్రబలింది. శివాజీపై యుద్ధం ద్వారా తాను సంపాదించుకున్న భూభాగం, సంపద అంతా కూడా తిరిగి శివాజీ ఎత్తుగడలతో పోగొట్టుకొంటానేమోనన్న భయం వెంటాడింది. దీంతో ఔరంగజేబ్‌కు రహస్య వర్తమానం పంపించాడు. శివాజీని తన దర్బారులో హాజరు పరచాలని తనకు ఉత్తర్వులు ఇప్పించుకున్నాడు. రాజా జయ్ సింగ్ ఈ వర్తమానాన్ని చూపించి.. ఔరంగజేబ్ దర్బారుకు రావడానికి శివాజీని ఒప్పించాడు. శివాజీ తన ఎనిమిదేండ్ల కొడుకు శంభాజీని వెంటేసుకొని ఔరంగజేబ్ ఆగ్రా కోటకు రెండు నెలల పాటు గుర్రం మీద ప్రయాణం చేసి చేరుకొన్నాడు. 1966 మార్చి 3న వారు ఆగ్రాకు చేరుకున్నారు. కొన్నాళ్ల తరువాత ఔరంగజేబ్ దర్బారులో శివాజీ ప్రవేశించాడు. కానీ, శివాజీని ఒక స్వతంత్ర రాజుగా గౌరవించకుండా రెండో శ్రేణి పౌరుడి మాదిరిగా అందరి వెనుకకు పోయి నిలుచోమన్నాడు బాద్షా. ఈ అవమానాన్ని శివాజీ ఎంతమాత్రం సహించలేకపోయాడు. ఎవరూ ఊహించని విధంగా శివాజీ.. మొఘల్ దర్బార్ లో ఔరంగజేబ్ పై గర్జించాడు. ఎడమ చేత్తో కత్తి, కుడిచేతితో కుమారుడు శంభాజీని గట్టిగా పట్టుకొని ఔరంగజేబ్ పై తీవ్రంగా నిరసన వ్యక్తంచేశాడు. ఆ తరువాత ఆవేశంగా దర్బారు నుంచి వెళ్లిపోయి, జయ్ సింగ్ ఇంటికి చేరుకున్నాడు. మరోపక్క జయ్ సింగ్ ఔరంగజేబ్‌తో శివాజీనా ఆగ్రాలోనే బందీగా ఉంచాలని సలహా ఇచ్చాడు. శివాజీని ఆగ్రాకే పరిమితం చేస్తే.. దక్కన్ ప్రాంతంలో తాను పోగొట్టుకున్న ప్రతిష్ఠను తిరిగి సంపాదించవచ్చని ఆశించాడు. జయ్ సింగ్ సలహా మేరకు శివాజీని నిర్బంధంలో ఉంచాల్సిందిగా ఔరంగజేబ్ ఆదేశించాడు. 24 గంటలపాటు శివాజీని ఉంచిన ఇంటిపై నిఘా ఉంచాలని కూడా ఆదేశించాడు. అనేక నెలల పాటు శివాజీ తన కొడుకుతో ఆగ్రాలోనే నిర్బంధంలో ఉండిపోయాడు. ఆ సమయంలోనే.. శివాజీ కుమారుడు శంభాజీ పట్ల ఔరంగజేబ్ హారెమ్ లోని ఆడవాళ్లు ఆకర్షితులవటం మొదలుపెట్టారు. పాలుగారని పసివాడు అయినప్పటికీ మంచి పొడుగరి కావటంతో హారెమ్ లోని మహిళలకు మతిపోయింది. అతడిని ప్రలోభపెట్టారు. లొంగదీసుకోవటానికి ప్రయత్నించారు. అతడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దుర్వ్యసనాలకు బానిసను చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో శివాజీ.. పారిపోవటానికి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటూ వచ్చాడు. 1666 ఆగస్టు 17న తాను నమ్మిన చిన్న బంటును వెంటేసుకొని.. కుమారుడిని పట్టుకొని.. కావడిలో దాక్కుని శివాజీ తప్పించుకున్నాడు. శివాజీ తప్పించుకున్న 18 గంటల తరువాత కానీ చక్రవర్తి ఔరంగజేబ్ కు సమాచారం తెలియలేదు. తన కస్టడీలో ఉన్న శివాజీ తప్పించుకోవడాన్ని ఔరంగజేబ్ ఎంతమాత్రం సహించలేకపోయాడు. ఉన్నవాడు ఉన్నట్టుగా శివాజీని బంధించిన ఉంచిన ఇంటికి పరిగెత్తుకొంటూ వచ్చాడు. అది జయ్ సింగ్ తమ్ముడు రాం సింగ్ ఇల్లు. ఇంటి చుట్టూ గట్టి బందోబస్తు ఎట్లాగైతే ఏర్పాటు చేశారో అట్లాగే ఉన్నది. ఇంట్లోకి వెళ్లి మూల మూలనా పరిశీలించాడు. వేసిన కిటికీలు వేసినట్టే ఉన్నాయి. సీలింగ్ బద్దలు కొట్టిన ఆనవాళ్లూ లేవు. ఫ్లోరింగ్ కూడా చక్కగా ఉన్నది. గోడలకు చిన్న గీత కూడా కనిపించలేదు. శివాజీ ఎలా తప్పించుకొన్నాడో తెలియక ఔరంగజేబ్ తల బద్దలు కొట్టుకొన్నాడు. శివాజీ.. తన కొడుకు శంభాజీని కుటుంబ పూజారి అయిన కృష్ణాజీ విశ్వాస్ రావు నివాసం మధురలో ఉంచి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మూడు నెలల తరువాత 1666లో తిరిగి రాయ్ గఢ్ కోటకు చేరుకున్నాడు. కొన్ని నెలల తరువాత కృష్ణాజీ.. శంభాజీని తిరిగి మరాఠా రాజ్యానికి సురక్షితంగా పంపించాడు.

శివాజీ తప్పించుకోవడంతో ఔరంగజేబ్‌కు మతిపోయింది. ఆయన్ను అణచివేయడానికి ఈసారి తన కొడుకు షాహ్ జాదా మహమ్మద్ మౌజమ్ ను దక్కన్‌కు వైస్రాయ్‌గా పంపించాడు. తన చేతుల్లోంచి తప్పించుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఔరంగజేబ్ స్పష్టంగా చెప్పాడు. కనీసం శివాజీ కొడుకు శంభాజీనైనా మరోసారి బందీ చేసి తన ముందు హాజరు పరచాలని ఆదేశించాడు. అదే సమయంలో శివాజీపై పూర్తిస్థాయిలో యుద్ధం చేయడానికి ఔరంగజేబ్‌కు వీలు లేకుండా ఒకవైపు పర్షియన్లు, మరోవైపు పెషావర్‌లో తిరుగుబాటు అడ్డం వచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్న శివాజీ తాను పోగొట్టుకున్న కోటలన్నింటినీ తిరిగి సాధించుకున్నాడు. ఆనాడు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న సూరత్‌ను కూడా వశపరచుకున్నాడు. దిలేవర్ ఖాన్ తదితరులు శివాజీని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అత్యంత రహస్యంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తూ హిందూ మహాసామ్రాజ్య విస్తరణ చేశాడు ఛత్రపతి. 1674 నాటికి శివాజీ లక్షలాది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. నావికా దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లక్షల మంది సైనికులతో అశ్విక దళం ఏర్పడ్డది. 1674 జూన్ 6 న రాయ్ గఢ్‌లో పట్టాభిషక్తుడయ్యాడు. రాజులందరికీ చక్రవర్తిగా ఛత్రపతి బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. దుర్భేద్యమైన కోటల నిర్మాణంలో శివాజీకి నాడు సాటి వచ్చేవారే లేదు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మద్రాసు దగ్గర జింగి దాకా దాదాపు 300 కోటలు శివాజీ స్వాధీనంలో ఉన్నాయి. ఆ తరువాత ఇక శివాజీని ఎదిరించి నిలవటం, గెలవటం ఔరంగజేబ్‌కు అసాధ్యమైంది. 1679లో శివాజీ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అప్పటికి ఆయన వయస్సు 50 సంవత్సరాలు మాత్రమే. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా విదేశీ రాజులపై పోరాడి.. అఖండ హిందూ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించిన ఒక గొప్ప చక్రవర్తి, మిలిటరీ జీనియస్, శివాజీ 1680 ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం మరణించాడు. చరిత్రకారులు దొంగ, పిరికివాడు.. లాంటి ఎన్నో పేర్లను శివాజీకి తగిలించారు. కానీ.. ఇవేవీ భారత రాజ్య పరిరక్షకుడికి అంటేవి కానే కావు. వెయ్యేండ్లకు పైగా అల్లకల్లోలమైన భారతదేశంలో స్వరాజ్యం, స్వపరిపాలన లక్ష్యాలకు బీజం వేసింది శివాజీయే. శివాజీ కారణంగా మొఘలుల బలం క్రమంగా క్షీణించసాగింది. అదే సమయంలో పోర్చుగీసు వాళ్లు పడమర నుంచి మహారాష్ట్రలోకి చొరబడసాగారు. దేశంపై ఇస్లాం తరువాత చర్చి దాడికి ఇక్కడే బీజం పడింది. కానీ శివాజీ నాటిన బీజాలు క్రమంగా స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరులూదాయి. నానాసాహెబ్ పీష్వా, తాంతియాతోపే వంటివారు 1857 తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాతి కాలంలో ఇదే స్వరాజ్ నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ఇక్కడి నుంచే నినదించాడు.

ధర్మం ధర్మం అని ధర్మయుద్ధాల కోసం పాకులాడిన రాజులందరూ ముస్లిం రాజుల దౌష్ట్యానికి బలైన వారే. సింధులో నాడు దాహిర్ సేన్ నుంచి.. చరిత్ర క్రమంలో భారతీయ రాజుల చరిత్రను గమనిస్తే వెయ్యేండ్లలో జరిగిందంతా ఈ ‘ధర్మ’ యుద్ధాల ఓటమేనని స్పష్టంగా కనిపిస్తుంది. పురుషోత్తముడు కావచ్చు, రాణాప్రతాపుడు కావచ్చు, జాట్లు కావచ్చు, రాజ్‌పుత్‌లు కావొచ్చు.. మరాఠాలు కావొచ్చు.. ఎవరి గురించి లోతుల్లోకి వెళ్లి తరచి చూసినా.. ఈ ‘ధర్మ’ యుద్ధపు విషాదాలే కనిపిస్తాయి. శివాజీ శత్రువు పీచమణచడానికి వాడి మార్గంలోనే వెళ్లి తిరుగులేని దెబ్బ కొట్టాలని నిరూపించాడు. నాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చూపించిన మార్గమే ఇది. విచిత్రమేమిటంటే.. మన దేశంలో ఈ లక్షణం ఇవాళ్టికీ కొనసాగుతుండటం.. ‘వాడి పాపాన వాడు పోతాడులే’, ‘పైన దేవుడున్నాడు.. చూసుకొంటాడు’, ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదాలను ఇవాళ్టికీ మన ప్రవచనకారులు వినిపిస్తూనే ఉంటారు. దీనివల్లనే వీధికో ఔరంగజేబ్ పుట్టుకొచ్చి ఇప్పటికీ మన మీద దాడి చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో తిడతాడు, టీవీ చర్చల్లో తిడతాడు. బొమ్మలమీద అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. యూనివర్సిటీల్లో వికృత వేషాలు వేస్తాడు. ఇప్పటికైనా ఈ దేశంలో ప్రవచనకారులు పురాణాలు, ఇతిహాసాలను కథలుగా, పాపపుణ్యాల లెక్కలు కట్టి చెప్పడం మానుకోవాలి. ఆ పురాణాలు, ఇతిహాసాల వెనుక రహస్యంగా దాగిన కథనాలను వెలికి తీయాలి. రామాయణం, భారతం, భాగవతమే కాదు.. ఒక పురుషోత్తముడు, ఒక దాహిర్ సేన్, ఒక పులకేశి, ఒక ఛత్రపతి, ఒక రాణా ప్రతాప్, ఒక ప్రతాప రుద్రుడు, ఒక కృష్ణ దేవరాయలు.. వీళ్ల గురించి కూడా ప్రవచనాలు చెప్పాలి. ఈ దేశంలోకి చొచ్చుకొని వచ్చిన విదేశీ అసుర గణాల దాష్టీకాలను గురించి కూడా ప్రవచించాలి. ఇవేవీ చెప్పనంతకాలం ఈ దేశంలో శివాజీలు దొంగలుగా కనిపిస్తారు. ఔరంగజేబ్ లాంటి వారు.. సూఫీ సాధువుల్లా వెలుగొందుతూనే ఉంటారు. మొఘల్ రాజులందరిలోనూ అత్యంత నీచుడు, పైశాచిక మనస్తత్వం ఉన్న ఈతగాడి దౌష్ట్యాలను గురించి మరో వ్యాసంలో చదువుకొందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here