Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-30

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]ఛ[/dropcap]త్రపతి శివాజీ కుమారుడి పేరు శంభాజీ. 1657 మే 14 వ తేదీన పూణాకు 16 మైళ్ల దూరంలో పురందర్‌లో శంభాజీ జన్మించాడు. ఇతను చాలా పొడవుగా, అందంగా ఉండేవాడు. మొదట్నుంచీ కూడా దూకుడు స్వభావం ఉన్నవాడు. సాహసి. చిన్నప్పటి నుంచే తండ్రికంటే కూడా స్వతంత్రేచ్ఛతో పెరిగినవాడు. శంభాజీ కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధమైన యోధులు వేల సంఖ్యలో ఉండేవారు. ముగ్గురు కూతుళ్ల తరువాత శివాజీకి పుట్టిన ఏకైక కుమారుడు శంభాజీ. అఖండ భారతావనిలో శివాజీ స్థాపించిన హిందూ సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. రెండున్నరేండ్ల వయసులోనే తల్లి సాయిబాయి (శివాజీ భార్య), ఆ తరువాత మరో నాలుగేండ్లకు (1664 జూన్) నానమ్మ జిజియాబాయి (శివాజీ తల్లి) చనిపోవడంతో అమ్మ, నానమ్మల ప్రేమలకు శంభాజీ దూరమయ్యాడు. ఆ తరువాత సంస్కృత పండితుడు కేశవ్ పండిట్ దగ్గర సంస్కృతం నేర్చుకున్నాడు. 16-17 ఏండ్ల నాటికే సంస్కృతంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. బుద్ధ్ భూషణమ్ అన్న గ్రంథాన్ని కూడా శంభాజీ రచించాడు. ఈ పుస్తకాన్ని డాక్టర్ ప్రభాకర్ తాకవలె మరాఠీలోకి అనువదించారు. ఈ రెండు రచనలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నానమ్మ జిజియాబాయి చనిపోయేనాటికి శంభాజీ వయస్సు ఏడేండ్లు మాత్రమే.  ముందే చెప్పుకున్నట్టు శంభాజీకి ఎనిమిదేండ్ల వయసులో తండ్రి శివాజీతోపాటు ఔరంగజేబ్ నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. శివాజీ అక్కడి నుంచి విజయవంతంగా పారిపోయిన తరువాత మధురలోని బృందావనంలో కృష్ణాజీ విశ్వాసరావు దగ్గర కొద్దిరోజుల పాటు ఉంచాల్సి వచ్చింది. ఆయన దగ్గర కూడా శంభాజీ విద్య నేర్చుకున్నాడు.

1675 ఏప్రిల్.. అప్పటికి శంభాజీ వయసు పద్దెనిమిదేండ్లు మాత్రమే. ఆ వయసులోనే బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పై యుద్ధం చేసి రాజధానిని ఆక్రమించాడు. దీంతో శృంగార్‌పూర్ హెడ్‌క్వార్టర్స్‌గా కొన్ని ప్రాంతాలపై ఆధిపత్యాన్ని శంభాజీకి శివాజీ అప్పగించాడు. 1677లో మొఘల్ కమాండర్లు జయ్ సింగ్, దిలేర్ ఖాన్‌లు మరో కుట్ర పన్ని శివాజీ నుంచి శంభాజీని వేరు చేయడానికి ప్రయత్నించారు. ఔరంగజేబ్‌కు విధేయుడిగా మార్చాలని యత్నించారు. ఏడేళ్ల వయసులోనే వాళ్ల మధ్యన ఉన్నవాడు కాబట్టి వారి వ్యవహారాలను శంభాజీ చాలా దగ్గరగా చూసిన వాడు కాబట్టి వారిపట్ల ఎలాంటి భ్రమలు పెట్టుకోలేదు. అతడిని మొఘల్ కోర్టులో గొప్ప వ్యక్తిగా, అతని తండ్రి శివాజీని మిత్ర పక్షంగా కూడా ఔరంగజేబ్ గుర్తించాడు. ఒకవైపు గుర్తిస్తూనే.. శంభాజీని మొఘల్ సైన్యం ముందు నిలిపి మరాఠా రాజ్యాన్ని నాశనం చేయడం కోసం ఒక ఉపకరణంగా వాడుకొన్నాడు. ఒకవైపు శివాజీ.. తురకలు, టార్టర్లు, మంగోలులు తదితరులు ఆక్రమించిన మరాఠా సామ్రాజ్యాన్ని స్వతంత్రం చేయడానికి ప్రయత్నిస్తుంటే.. శంభాజీ ప్రతీఘాతుక శక్తుల చేతిలో సాధనంగా మారిపోయాడు. దిలేర్ ఖాన్ భూపాల్ కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు శంభాజీ ఆ దారుణానికి సాక్షీభూతంగా ఉన్నాడు. భూపాల్ కోటను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 700 మంది పురుషులను బందీలుగా చేసి వారి వేళ్లను తెగనరికారు. ఇండ్లను నామరూపాలు లేకుండా విధ్వంసం చేశారు. మహిళలను, పిల్లలను బందీ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఇవన్నీ కూడా తన కండ్లముందు జరుగుతున్నా.. ఒక విధమైన నిస్సహాయ స్థితి శంభాజీది. 1679లో శంభాజీ, దిలేర్ ఖాన్, సార్జేకాన్‌ల సైన్యం సంయుక్తంగా అఠ్నీ నగరంపై దాడి చేసి తుఫాను సృష్టించింది. మొఘల్ సైన్యం అరాచకం అంతా ఇంతా కాదు. ఈ యుద్ధం తరువాత శంభాజీ మొఘలులను విడిచిపెట్టాడు. 1679 నవంబర్ 23న తన భార్యకు మగవేషం వేయించి, ఆరుగురు అశ్విక దళ సభ్యులను వెంటపెట్టుకొని రోడ్డు మార్గంలో తప్పించుకొని వెళ్లిపోయాడు. శంభాజీ భార్యతో సహా తప్పించుకున్నాడని తెలియడంతోనే దిలేర్ ఖాన్ అతడిని పట్టుకోవడానికి సైన్యాన్ని పంపించాడు. కానీ, శంభాజీ తప్పించుకొని సురక్షితంగా కొల్హాపూర్ దగ్గర పన్హాలా కోటకు చేరుకున్నాడు. 1680లో తండ్రి శివాజీతో మళ్లీ సమాగమం కలిగింది. కానీ చరిత్రకారులు మాత్రం శంభాజీని తండ్రే పన్హాలా కోటలో బంధించాడని రాసుకొచ్చారు. వికీపీడియా కూడా అదే చెప్తున్నది.

1680 ఏప్రిల్ 3న ఛత్రపతి శివాజీ అనారోగ్యంతో అస్తమించాడు. 1681 జనవరి 16న శంభాజీ మరాఠా ఛత్రపతిగా అధికారంలోకి వచ్చాడు. శివాజీ చనిపోయిన తరువాత ఛత్రపతి ప్రారంభించిన గెరిల్లా యుద్ధాన్ని శంభాజీ మరింత దూకుడుగా కొనసాగించారు. ఇవాళ ఆ శివాజీ మొదలు పెట్టిన గెరిల్లా యుద్ధాన్నే.. ఈ దేశంలో మావోయిస్టులు కొనసాగిస్తున్నారన్న సంగతి ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఆ శివాజీ మొదలు పెట్టిన గెరిల్లా యుద్ధాన్నే మన గ్రేహౌండ్ దళాలు ఆర్మీ వినియోగిస్తున్నాయి.  శివాజీ మహారాజు కొంత ముందు వెనుక చూసుకొని.. నిదానంగా వ్యవహరించాడేమో కానీ.. శంభాజీ ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా.. అత్యంత దూకుడుగా ముందుకు వెళ్లాడు.

శంభాజీ అధికారం చేపట్టిన సమయంలోనే రాజస్థాన్‌లో ఉన్న ఔరంగజేబ్ కుమారుడు అక్బర్ తిరుగుబాటు చేశాడు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు. దీంతో వెంటనే ఔరంగజేబ్ సైన్యాలు అక్బర్‌ను చుట్టుముట్టాయి. మరోదారి లేక తనకు రక్షణ కల్పించాల్సిందిగా శంభాజీకి అక్బర్ లేఖ రాశాడు. ‘Since his coming to the throne, my father the Emperor Aurangzeb has formed the deliberate resolution of putting down the Hindus. This is the sole cause of his war against the Rajputs. While in the eyes of god all men are his equal children and deserve impartial protection from their ruler. I became convinced that by such extreme measures my father would lose his hold on the country and decided to oppose him in this disastrous move. I am therefore, coming to you as a friend as your kingdom is oft of the Emperor’s reach. The valiant Durgadas Rathod accompanies me. Please do not entertain any false suspicions about my intentions. If by the grace of god I succeed in my endeavour to depose my father I shall remain only nominal master and shall let you exercise all the power. We shall fully cooperate in putting down the Emperor’ (pp.295, new history of the marathas by g.s.sardesai)

ఈ దేశంలో పురుషోత్తముడి దగ్గరి నుంచి ప్రతి భారతీయ రాజు ధర్మం, ఔదార్యం, శరణాగతి అన్న ధార్మిక మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నవారే. శరణు కోరిన వారు ఎలాంటి వారైనా కాపాడి తీరాలన్న భారతీయత నేర్పిన రాజధర్మాన్ని శంభాజీ కూడా పాటించాడు. బీభత్సం, హింస, ద్రోహం, దురాశ, దుష్పరిపాలన, భయానక పరిస్థితులనుంచి బయటపడటానికి వచ్చిన వారికి రక్షణ కల్పించడంలో శంభాజీ తన పూర్వికులకు ఏమీ తక్కువగా లేడు. అక్బర్‌ను మరాఠా రాజ్యంలోకి అనుమతించాడు. రాయ్‌గడ్ కోట పరిధిలోని ధోండ్సా గ్రామంలో అతడిని సురక్షితంగా ఉంచాడు. ఒక్క అక్బర్ మాత్రమే కాదు. ఔరంగజేబ్‌ను వ్యతిరేకించే వారందరికీ, ఔరంగజేబ్ నియంతృత్వం వల్ల అల్లాడిపోతున్న వారందరికీ శంభాజీ క్రమంగా నాయకుడిగా ఎదిగాడు.

కానీ శంభాజీ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేడు. ఒకవైపు అబిస్సినియన్ ముస్లింలు కొంకణ్ తీరం లోని జంజీరా దగ్గర కాచుకున్నారు. ఇంకోవైపు గోవా నుంచి పోర్చుగీసు వారు శంభాజీపై దాడికి దిగారు. మరోవైపు గోల్కొండ నుంచి కుతుబ్ షాహీ దూసుకొచ్చారు. బీజాపూర్ నుంచి ఆదిల్ షా పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. వీటికి తోడు అంతర్గత రాజకీయాలు కూడా శంభాజీని తిప్పలు పెట్టాయి. దాదాపు తొమ్మిదేండ్లు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన శంభాజీ విరామం లేకుండా ఒంటరిగా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఇతని గెరిల్లా యుద్ధం తండ్రిని మించింది. ఎప్పుడు ఎటు నుంచి శత్రువుపై విరుచుకు పడతాడో తెలియదు. ఒకవైపు మొఘలులను ఎదుర్కుంటూనే.. మరోవైపు పోర్చుగీసు వారిపై విరుచుకుపడ్డాడు. ఇటు జంజీరా సిద్దీలనూ వదలలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే శంభాజీ పేరు చెప్తేనే టెర్రరైజ్ అయ్యే పరిస్థితి నెలకొన్నది. ఔరంగజేబ్ సామ్రాజ్యాన్ని పతనం చేయడానికి శంభాజీ మూడు ఎత్తుగడలు వేశాడు. ఒక వైపు అతడి కొడుకు అక్బర్ పర్షియా వెళ్లి.. అక్కడి రాజుతో ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడటానికి సైనిక సహకారాన్ని కోరాడు. దుర్గాదాస్ రాథోడ్ శంభాజీకి చెందిన కొంత సైన్యాన్ని వెంట పెట్టుకొని రాజస్థాన్ లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఔరంగజేబ్ సైన్యాన్ని వెనక్కి పంపాలన్నది రాథోడ్ వ్యూహం. ఇంకోవైపు దక్కన్ రాజులను శంభాజీ వరుస యుద్ధాలు చేస్తూ గెలిచాడు.

శంభాజీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదో ఏట.. క్రూరమైన విదేశీమూకలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగాయి. వీటిలో శంభాజీ అనేక విజయాలు సాధించాడు. ఒక్కో కమాండర్‌పై విశ్వాసం కోల్పోవడంతో ఔరంగజేబ్ తాత్కాలికంగానైనా దక్కన్ నుంచి వెనుకకు తగ్గాడు. దాదాపు 3 లక్షల మంది సైన్యం, ఔరంగజేబ్ మరో ఇద్దరు కొడుకులు దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1685 నవంబర్ 24 న ఫాండా వద్ద పోర్చుగీసు వారిని శంభాజీ ఓడించాడు. సల్హేర్ కోటను కబ్జా చేసిన బహదూర్ ఖాన్ శంభాజీ దెబ్బకు కోటను విడిచి పారిపోవాల్సి వచ్చింది. మరోవైపు ఔరంగజేబ్ చేతుల్లోంచి వాణిజ్య నగరం సూరత్‌ను శంభాజీ లాక్కున్నాడు.

దీంతో ఔరంగజేబ్‌కు మతి పోయింది. ఏమి చేసినా మరాఠాలను లొంగదీసుకోవడం సాధ్యం కావడం లేదు. శంభాజీ గెరిల్లా యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఔరంగజేబ్ తల పట్టుకున్నాడు. ఔరంగజేబ్ ముందున్నది శంభాజీని ఎలాగైనా ఒంటరి చేయడం. ఇందుకోసం అతని రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలి. ఈ వ్యూహంతో ఔరంగజేబ్ 1685 జూన్‌లో అహ్మద్ నగర్ నుంచి క్యాంప్ ఎత్తేశాడు. 1686 సెప్టెంబర్ 13న బీజాపూర్ పై దాడి చేసి అక్కడి రాజు సికిందర్ ఆదిల్ షాను బందీ చేసి కోటను స్వాధీన పరుచుకొన్నాడు. సికందర్‌ను జైల్లో వేసి 14 ఏండ్ల పాటు బందీగా ఉంచి ఆ తరువాత విషం పెట్టి చంపించాడు.. అది వేరే కథ.

ఆ తరువాత గోల్కొండ కోట మీద పడ్డాడు. 1687 సెప్టెంబర్ 22 అర్ధరాత్రి వేళలో.. లంచం తీసుకొన్న ఓ నమ్మక ద్రోహి ద్వారా గోల్కొండ ద్వారాలు తెరుచుకున్నాడు. అబుల్ హసన్ ఔరంగజేబ్ చేతులకు చిక్కాడు. దౌలతాబాద్ కోటలో బందీ అయ్యాడు. 13 ఏండ్లు బందీగా ఉన్నతరువాత 1700 సంవత్సరంలో అతను చనిపోయాడు. అటు రాజస్థాన్‌కు వెళ్లిన దుర్గాదాస్ రాథోడ్, ధనాజీ జాదవ్ వర్గం మొఘల్ సైన్యాన్ని బుందేల్ ఖండ్  వరకు తరిమికొట్టింది.

మొఘలులు, మరాఠాల మధ్యన ఈ తరహా యుద్ధాలు నిరంతరం కొనసాగుతూనే వచ్చాయి. ఎత్తుకు పై ఎత్తులతో కొంచెం కూడా ఊపిరి సలపనంతగా కొనసాగాయి. 1688లో మహమ్మద్ షా, ఖాన్ బహదూర్ ఫిరోజ్ జంగ్‌ల నేతృత్వంలో రెండు బలమైన సైనిక బలగాలను శంభాజీ మీదకు ఔరంగజేబ్ పంపించాడు. అప్పటికి భారతదేశం మొత్తం మీద ఔరంగజేబ్ పాలిట బలమైన శత్రువుగా ఉన్నది ఒక్క శంభాజీ మాత్రమే. ముకర్రబ్ ఖాన్ అలియాస్ షేక్ నిజాం నేతృత్వంలో మూడో సైనిక దళాన్ని తయారుచేసి కొల్హాపూర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఔరంగజేబ్ పంపించాడు. ఈ మూడు సైన్యాలు ఒకేసారి సునామీ వరదలా, తుఫానులా.. ఇంకా చెప్పాలంటే ప్రళయంలాగా విరుచుకుపడ్డాయి. వీటికి తోడు శంభాజీ దెబ్బకు పారిపోయిన కొన్న ముస్లిం రాజులు నెమ్మదిగా మరాఠాలోకి చొచ్చుకువచ్చారు. ఒక్కసారిగా ముప్పేట దాడులతో మరాఠా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతున్నదో తెలియక అల్లాడిపోయారు. అదే సమయంలో కొందరు మరాఠా భూస్వాములు మొఘలుల పంచన చేరిపోయారు. శంభాజీకి చాలా సన్నిహితుడైన గానోజీ షిర్కే.. మొఘలులకు కోవర్టుగా మారిపోయాడు. శంభాజీ బాగా విశ్వసించిన వ్యక్తుల్లో షిర్కే ముఖ్యుడు. పరిస్థితులను చక్కదిద్దడానికి రాజధానికి శంభాజీ బయలుదేరాడు. అతని వద్ద నాలుగు వందల నుంచి 500 మంది వరకు మాత్రమే సైన్యం ఉన్నది. కొంకణ్ దగ్గర సంగమేశ్వరంలో అక్కడి స్థానిక కలెక్టర్ నివాసంలో బస చేశాడు. ఈ విషయాన్ని షిర్కే ముకర్రబ్ ఖాన్‌కు చేరవేశాడు. శంభాజీ ఎక్కడ ఉన్నాడు.. అతని వెంట సైనిక బలం, ఆయుధాలు ఏమేరకు ఉన్నదీ సమాచారం అందించాడు. ఇంకేం ముకర్రబ్ ఖాన్‌కు మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకో దలచుకోలేదు. అతను ఏకంగా నాలుగు వేల మంది సైన్యాన్ని వెంటపెట్టుకొని.. భారీ ఆయుధాలతో సంగమేశ్వరం వైపు కదిలాడు. షిర్కే అతడికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ సంగమేశ్వరం చేర్చాడు. శత్రువు రాకను శంభాజీ కనిపెట్టలేకపోయాడు. వాస్తవానికి నాలుగు రోజులు కలెక్టర్ సిల్వన్ ఆతిథ్యంలో ఉండాలనుకొని నిర్ణయించిన శంభాజీ 1689, ఫిబ్రవరి 1 న సంగమేశ్వరం వచ్చాడు. షిర్కే ద్రోహంతో ముకర్రబ్ ఖాన్ సైన్యం శంభాజీ ఫామ్ హౌస్ సమీపానికి చేరుకొన్నది. ముందుగా శంభాజీ బాడీగార్డ్‌ను స్కిర్మిష్‌లో హతమార్చాడు. శంభాజీ కౌన్సిలర్ (సలహాదారు) కవి కలష్ కుడిచేతికి గాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కసారిగా శత్రు సైన్యం విరుచుకుపడ్డా.. తమ రాజును కాపాడటానికి శంభాజీ సైన్యం తీవ్రంగా శ్రమించింది. ఐదుగురు కమాండర్లు ఈ పోరులో వీరమరణం చెందారు. శంభాజీనీ ఫామ్ హౌస్ లోని బేస్‌మెంట్ లోకి తీసుకొని వెళ్లి అతని గడ్డాన్ని తొలగించి మారు వేషంలో తప్పించాలని ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. అత్యంత అసాధ్యమైన కార్యం చివరకు సాధ్యమే అయింది. ఛత్రపతి శంభాజీ ముకర్రబ్ ఖాన్ చేతికి చిక్కాడు. ఈ ఆనందకర వార్తను ముకర్రబ్ ఖాన్ ప్రత్యేక కొరియర్ ద్వారా ఔరంగజేబ్‌కు చేర్చాడు. ఔరంగజేబ్ ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయింది. ఆగ్రా అంతటా పండుగ చేశాడు. తిన్నవారికి తిన్నంత.. తాగిన వారికి తాగినంత అన్నట్టుగా దర్బార్ దావత్ ఇచ్చాడు.

(సశేషం)

Exit mobile version