దేశ విభజన విషవృక్షం-32

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రతదేశం ఒక నానాజాతి సమితి.. ఒక దేశం కాదు.. పలు దేశాల సమాహారం, పలు జాతుల కలగూర గంప అని వాదించే మూర్ఖులు అంతా తాము మేధావులమని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. వారంటున్నట్టు ఈ నానాజాతి సమితి ఎట్లా ఏర్పడిందో చెప్పగలరా? రామాయణం, మహాభారత కాలాల్లో ఈ నానాజాతి సమితి ఏర్పడిందా? అంటే.. అబ్బెబ్బే అవి రెండూ మిథ్య అని కొట్టి పారేస్తారు. అవి ఎలా మిథ్య అవుతాయో చెప్పరు. అరే బాబూ.. మరి రాముడు, కృష్ణుడు దేశమంతా ఎట్లా విస్తరించారని అడిగితే.. అంతా మూఢులని తెగనాడుతారు. పోనీ వీళ్లకు తెలిసిన చారిత్రక కాలంలోనే.. నానా జాతి సమితి అయిందా? మౌర్యుల కాలంలోనా, గుప్తుల కాలంలోనా? చాళుక్యులా? పాండ్యులా? చోళులా? పల్లవులా? శాతవాహనులా? కాశ్మీరీ రాజులా? మరాఠాలా? రాజపుత్‌లా? కాకతీయులా? విజయనగర రాజులా? నాయక రాజులా? పోనీ సరస్వతీ, సింధు నాగరికతల కాలంలో ఈ దేశం నానాజాతి సమితినా? ఎప్పుడూ కాదు. అప్పుడు అత్యధికంగా అమలులో ఉన్న భాష సంస్కృతం.. స్థానికంగా వేర్వేరు భాషా సంస్కృతులు.. సంప్రదాయ ఆచారాలు ఉన్నాయి. రాజులు వేరుగా ఉన్నారు కానీ.. ధర్మం ఒకటే.. జాతి ఒకటే.., శివుడిని, శక్తిని, విష్ణువును.. ఇతర పూజా విధానాలను దేశమంతా తమ తమ పద్ధతుల్లో ఒకటిగానే పూజించారు. మోక్షం కోసం కన్యా కుమారి నుంచి కాశీ దాకా నడుచుకుంటూ వెళ్లారు. గోవును, పామును, చెట్టును, పుట్టను దేశమంతా ఆరాధించారు. ప్రకృతిని సమాదరించారు. సింధులోని మహత్తరమైన సూర్యదేవాలయంలో ఎలా తల నీలాలు సమర్పించారో.. దక్షిణాపథంలో ఉన్న తిరుపతిలో ఇవాళ తల నీలాలు సమర్పించే దాకా సంప్రదాయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నది. మరి నానాజాతి సమితి ఎట్లా అయింది? విదేశీ మతాల మూకలు విచ్చలవిడిగా విశృంఖల విహారం చేయడం వల్ల జరిగింది. కొత్త కొత్త జాతులు పుట్టుకొచ్చాయి. ఇక్కడి కల్చర్‌తో ఎంతమాత్రం సంబంధం లేకుండా.. నీచంగా తీసిపారేస్తుంటే మనం చూస్తూ ఉండిపోయాం. ఇప్పటికీ అలాగే ఉన్నాం. మొఘలుల కాలంలోనే మొట్ట మొదటి జాతీయ ప్రభుత్వం ఏర్పడిందని అప్పటిదాకా లేనే లేదని చెప్పుకొస్తారు. అంటే.. జాతీయత, జాతీయ భావన అనే పదాలు మనకు విదేశాలనుంచి చొరబడి.. మనల్ని ఉద్ధరించిన ముస్లిం రాజులదేనని చరిత్ర రాస్తారు.. సినిమాలు తీస్తారు.. పాఠాలు చెప్తారు. మరి గుప్తులు ఏమయ్యారు? మౌర్యులు ఏమయ్యారు.. చరిత్ర అనే దానిని మనం ఎలా తెలుసుకోవాలి? దాని పరికరాలు ఏమిటి? దాన్ని ఎలా అంచనా వేయాలి? ఇందుకు కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

ఏది చరిత్ర?

ఈ చరిత్రను చెప్తున్నది ఎవరు?

ఈ చెప్తున్న వారు అనుసరిస్తున్న పరికరాలు ఏమిటి?

వాటి ద్వారా వారు పరిశోధించి నిజంగా తెలుసుకున్న చరిత్ర ఏమిటి?

వారు చెప్తున్నది వారు శోధించి తెలుసుకున్న చరిత్రా.. లేక ఇతరులెవరో రాసిన దానికి వీరు చెప్పిన భాష్యమా? వ్యాఖ్యానమా?

అందులోని విశ్వసనీయత ఎంత?

ఈ దేశంలో.. ఈ దేశ చరిత్రను రాసిన వారంతా మేము యురోపియన్ చరిత్రకారులమన్నారు.. మార్క్సిస్టు చరిత్రకారులమన్నారు.. ముస్లిం చరిత్రకారులమన్నారు. ఎవరూ కూడా భారతీయ చరిత్రకారులమని ఏ ఒక్క పద్మభూషణుడూ.. విభీషణుడూ కూడా చెప్పుకోలేదు. మరి ఈ చరిత్రకు ఏ ప్రాతిపదికన విశ్వసనీయత ఆపాదించారు. ఈ దేశంలో ఇప్పుడు మనం చెప్పుకొంటున్న చరిత్ర.. చరిత్ర కానే కాదు. ఇది కేవలం వారి వారి ఎడమ కంటితో చూసి.. వారు బానిసలుగా మగ్గుతున్న విదేశీ సిద్ధాంతకర్తలు ప్రతిపాదించిన దృక్పథంతో రచించిన వ్యాఖ్యానాలు మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ దేశానికి వాస్తవమైన చరిత్రను సమగ్రంగా రచించిందే లేదు. రాజ్యం అండ లేకుండా రచించిన వాటికి విలువ లేదు.

ఈ దేశంలోకి ముస్లిం చొరబాటుదారులు చొరబడ్డ తరువాత సమాజం విచ్ఛిన్నమైందని ఏ ఒక్క చరిత్రకారుడైనా గుండెమీద చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పగల సాహసం చేయగలడా? ఆ చొచ్చుకొచ్చిన ముస్లిం చొరబాటుదారులు అత్యంత భయంకరమైన పైశాచికమైన హింసాకాండకు పాల్పడటం వల్ల మాత్రమే ఈ నానాజాతి సమితి ఏర్పడిందని ఈ సూపర్ చరిత్రకారులు చెప్పగలరా? ఇంకా చెప్పాలంటే.. డార్విన్ సూత్రం ప్రకారం మనుగడ కోసం పోరాటం అన్నట్టుగా ఆ మతంలోకి మారాల్సి వచ్చింది. ఏ ఒక్కరూ స్వచ్ఛందంగా ఆ మతంలోకి మారిన ఒక్కటంటే ఒక్క ఉదాహరణ కనిపించనైనా కనిపించదు. ఆ తరువాతి తరాలు ఈ వాస్తవాలు తెలియక తమను తాము ఒక జాతిగా అనుకోవటం జరిగింది. ఇది మొఘలుల కాలంలోనే ఒక పరిణామ దశకు చేరుకొన్నది. అదీ కూడా ఔరంగజేబు సమయంలో పరాకాష్ఠకు చేరింది. ఎందుకంటే.. అక్బర్ తన పైత్యం కొద్దీ ఒక సంకర మతాన్ని స్టార్ట్ చేయాలని చూశాడు. హిందూ ధర్మం, ముస్లిం మతం లోని కొన్ని కొన్ని అంశాలను కలగలిపి.. ఒక కషాయం తయారుచేశాడు. ఈ కషాయాన్ని అందరూ తాగేలా చేయాలని.. తద్వారా.. తానే దేవుడిగా ఎమర్జ్ కావాలని ప్రయత్నించాడు. కానీ.. అతని కొడుకే దాన్ని కాలదన్నాడు. ఇక ఔరంగజేబ్ సర్హిండి ప్రతిపాదించిన షరియాను అత్యంత దారుణంగా అమలులోకి తీసుకొని వచ్చాడు. దాని వల్ల 50 ఏండ్లపాటు దేశం నరకాన్ని చవిచూసింది. నిత్యం యుద్ధాలు, పోరాటాలు, కుట్రలు, కుతంత్రాలు.. ఇలా భయంకరంగా సాగింది. ఇదే సమయంలో ఒకవైపు మరాఠాలు ఎదురుతిరిగారు. ఇంకోవైపు పంజాబ్‌లో సిక్కులు తిరుగుబాటు చేశారు. ఔరంగజేబు అరాచకాలను తట్టుకోలేక.. వేల మంది వచ్చి సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్‌కు మొరపెట్టుకొన్నారు. గురు అర్జున్ దేవ్‌ను హతమార్చిన నాటి నుంచి కూడా సిక్కుల్లో శాంతి కాముకత నశించిపోయింది. విజయమో వీర స్వర్గమో అన్నట్టు అన్నింటికీ సిద్ధపడ్డారు. ఒక పక్క కొందరు హిందూ రాజులు ఒత్తిడిని తట్టుకోలేక సుల్తాన్ చెప్పుచేతల్లోకి వెళ్తున్నా.. సిక్కు గురువులు మాత్రం కృపాణమే ఆయుధం చేసుకొని తల నరుక్కుంటామే తప్ప తల వంచేది లేదన్న స్థాయిలో మొఘలు రాజులపై విరుచుకుపడ్డారు.

తేజ్ బహదూర్ గురించి కానీ.. ఆయన కుమారుడైన గురు గోవిందుడి గురించి కానీ తెలుసుకోకుండా.. ఈ దేశంలో ఇస్లాం పేరుతో సృష్టించబడిన జాత్యహంకారాన్ని కానీ, దాన్ని పరాకాష్టకు తీసుకెళ్లిన ఔరంగజేబ్ దాష్టీకాన్ని కానీ సరిగా అంచనా వేయలేము. ఔరంగజేబ్ నుంచి హిందువులకు, సిక్కులకు విముక్తి కల్పించడం కోసం తేజ్ బహదూర్ అన్నింటికీ సిద్ధపడి ఢిల్లీకి ఉరకలెత్తాడు. అతడికి ముందే తెలుసు.. తాను తిరిగి రావడం కష్టమేనని. అందుకే కొడుకు గురు గోవిందుడు తొమ్మిదేండ్లవాడే అయినా.. అతడికి గురు పీఠాన్ని అప్పగించి మరీ వెళ్లాడు. ఔరంగజేబ్ తేజ్ బహదూర్‌ను బంధించి పట్టుకొని రమ్మని తన మూకలను ఆదేశించాడు. 1675 జూలై 12 ఔరంగజేబ్ మూకలు తేజ్ బహదూర్‌ను.. ఆయన అనుచరులను బంధించాయి. పంజాబ్ లోని సిర్హిండ్ జైల్లో మూడు నెలలపాటు బంధించిన తరువాత శంభాజీ మాదిరిగానే ఇనుప బోనులో బంధించి ఔరంగజేబ్ దర్బార్‌కు తీసుకొని వెళ్లారు. వీళ్లంతా పులులు.. సింహాలు.. వీరిని బంధించడం అనేది ప్రత్యక్షంగా సాధ్యమయ్యే పనే కాదు. భారతదేశంలో ఈ ముస్లిం రాజులు.. హింసించి చంపించిన వీరులందరూ దొంగదెబ్బ తీయడం వల్ల పట్టుబడ్డ వారే. దొంగ దెబ్బ తీసి పట్టుకొని చిత్రహింసలు పెట్టి మహా మానవ హననానికి పాల్పడ్డారు. ఏ ఒక్కరికి కూడా నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అందరూ పిరికి వాళ్లు.. ప్రాణభయం ఉన్నవాడు. అందుకే ఆ భయాన్నే అస్త్రం చేసుకొని ఈ దేశంపై బీభత్సాన్ని సృష్టించారు. దాని పర్యవసానం ఈ దేశం మూడు రంగుల విషపు చెట్టుగా మారిపోయింది. ఒక కొమ్మకు మరో కొమ్మ అంటే పడని పరిస్థితి నెలకొన్నది.

తేజ్ బహదూర్‌ను జైల్లో వేసి.. తనను.. తనతో పాటు తన ధర్మావలంబులందరినీ ఇస్లాంలోకి మారాలని చిత్రహింసలు పెట్టారు. ఎంత చేసినా వినకపోయేసరికి.. జైల్లో నుంచి తమ అంతఃపుర ఆడవాళ్లను చూస్తున్నాడని అభియోగం మోపారు. ఇంతకంటే సిల్లీ ఇంకేముంటుంది చెప్పండి.. అప్పుడు తేజ్ బహదూర్ చెప్పిన మాట ఏమిటంటే.. ‘Emperor Aurangazeb, I was on the top storey of my prison. But I was not looking at thy private apartments, of at the queen’s. I was looking in the direction of the Europeans, who are coming from beyond the see to tear down thy hangings (pardas) and destroy thy empire’

(The Oxford history of India, VA smith, p.454)

నేను నీ అంతఃపురాన్ని చూడటం లేదు. నీ రాణులను చూడటం లేదు. సుదూర సముద్ర తీరం ఆవలి నుంచి నీ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయడానికి వస్తున్న యురోపియన్ల రాకను గమనిస్తున్నా అని అన్నాడు.

దీంతో ఔరంగజేబ్‌కు కోపం నషాళానికి అంటుకొన్నది. తమ మతాచారం ప్రకారం చిత్రహింసలు పెట్టి చంపాలని ఆదేశించాడు. ఇంకేం.. ముందుగా తేజ్ బహదూర్ శిష్యులకు భూమ్మీదే నరకాన్ని చూపించారు. ఒకరిని రంపం పెట్టి నిలువునా కోశారు. మరొకరిని మరిగే నీళ్లలో ముంచేశారు. ఇంకొకరిని దూది చుట్టి కాల్చి పారేశారు. చివరకు తేజ్ బహదూర్‌ను 1675 నవంబర్ 11 న అందరూ చూస్తుండగా తల నరికేశారు. ఎక్కడ నరికారో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తేజ్ బహదూర్ శిష్యులు రాత్రివేళ రహస్యంగా ఆయన తలను తీసుకొని ఆనందపూర్‌కు చేర్చి గురుగోవింద్ ముందుంచారు. మొండేన్ని మరో శిష్యుడు తన గుడిసెలోకి తీసుకొని వెళ్లి.. బహిరంగంగా అంత్యక్రియలు చేయలేని పరిస్థితులు ఉండటంతో తన గుడిసెకే నిప్పు అంటించి గురువుగారికి అంతిమ సంస్కారం చేశారు. అక్కడ ఆనందపూర్‌లో తేజ్ బహదూర్ శిరస్సుకే గురు గోవిందుడు అంత్యక్రియలు నిర్వహించాడు.

ఇంత జరిగితే.. మహానుభావుడు సతీశ్ చంద్ర ఎన్ సీఈఆర్ టీ 11 వ తరగతి పాఠ్య పుస్తకంలో ఏం రాశాడో ఒక్కసారి చూడండి..

“In 1675, Guru Tegh Bahadur was arrested… and executed. The official explanation for this… is that after his return from Assam, the Guru.. had resorted to plundering and rapine, laying waste the Punjab. According to Sikh tradition, the execution was due to the intrigues of some members of his family who disputed his succession.. Aurangzeb was annoyed because the Guru had converted a few Muslims to Sikhism.. For Aurangzeb, the execution of the Guru was only a law and order question.”

– Medieval India, Satish Chandra

తేజ్ బహదూర్ దోపిడీదారు.. పంజాబ్‌ను దోచుకున్నాడు. అత్యాచారాలు చేశాడు.. వారసత్వం కోసం అతని కుటుంబ సభ్యులు కుతంత్రాలు చేశారు. ముస్లింలను సిక్కుల్లోకి మార్చాడు. దీంతో ఔరంగజేబ్‌కు చట్టం ప్రకారం అతడికి మరణ దండన విధించడం తప్ప మరో గత్యంతరం లేకపోయింది.

పర్షియన్ చరిత్రకారులు ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ.. తేజ్ బహదూర్‌ను కించపరుస్తూ ఏవైతే కూతలు కూశారో.. రాతలు రాశారో వాటిని యథాతథంగా ఉటంకించడం తప్ప ఇతడు చేసింది ఏమీ లేదు. ఇతడిని మనం డాక్టర్ సతీశ్ చంద్ర.. మహా మహా చరిత్రకారుడని కీర్తి కిరీటాలు తొడుగుతున్నాం. ఇంకా ఈ కిందివి కూడా చూడండి..

ఇది మరీ విచిత్రమైన చారిత్రక వాక్యం..

“Although Shivaji had assumed the title of ‘Haindava-Dharmoddharak’ (Protector of the Hindu faith), he plundered mercilessly the Hindu population of the area.”

– Medieval India by Satish Chandra

ఛత్రపతి శివాజీకి హైందవ ధర్మోద్ధారక అన్న బిరుదు ఉన్నప్పటికీ.. తన ప్రాంతంలో హిందువులను ఎలాంటి మానవత్వం లేకుండా దారుణంగా హింసించి.. చంపించాడు..

ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి చరిత్రకారులను ఏమని అనాలి? ఎలా పేర్కొనాలి? పోనీ.. దీనికి వారి దగ్గర ఏవైనా వాస్తవ ఆధారాలు ఉంటే అవైనా చెప్పవచ్చు. కానీ.. ఎవడో పర్షియన్ చరిత్రకారుడు.. వాడికి అనుకూలంగా రాసిన చరిత్ర అనబడే దానిని తీసుకొచ్చి అనేక తరాల మీద రుద్దడం ఏమిటి? బాబూ మేం ఇలా ఇలా చేశాం అని ప్రతి ఒక్క ముస్లిం రాజు స్వయంగా రాసుకొన్న తరువాత కూడా తప్పుడు చరిత్రను భారతదేశం మీద రుద్ది.. అనేక తరాలకు తమ మూలాల మీద తమకే అసహ్యం కలిగేలా చేసినవాళ్లను ఏం చేయాలి?

తేజ్ బహదూర్ పైన రాసిన రాతలన్నీ కూడా ‘utterly incompatible with the whole tenor of guru Tegh bahadur’s life and writing’ అని సిఖ్ రిలీజియన్ అన్న గ్రంథాన్ని రచించిన ఎంఏ మెకాలిఫ్ విస్పష్టంగా ఖండించాడు. Bhattvahi Multani sindhi, bhatt vahi jadavbansian, guru kian sakhiyan’ వంటి సిక్కు గ్రంథాలు తేజ్ బహదూర్ గురించి రాసిన ప్రామాణిక యథార్థ గాథలు ఈ సతీశ్ చంద్రలాంటి వాళ్లకు కనిపించవు.

ముస్లిం రాజులు దేశంలోకి చొరబడి.. ఇస్లామీకరణకు ప్రయత్నించడం కంటే కూడా ఘోరంగా భారతీయ ధర్మాన్ని మూలాలతో సహా పెకిలించి వేయడానికి ఈ నీచమైన చరిత్రకారులు కంకణబద్ధులై ప్రయత్నించారు. వారికి పాలకులు సహకరిస్తూనే ఉన్నారు. దేశంలో మతాల మధ్యన, సమాజాల మద్యన, సంస్కృతుల మధ్యన ఇంటిగ్రేషన్ ఎప్పటికీ లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఈ దేశం మూడు ముక్కలైంది. తాజాగా 2023లో మరోసారి మరో మత రాజ్యం పేరుతో దేశాన్ని విడదీయాలని గొంతులు పెకులుతున్నాయి. ఈ గొంతుల్లోతుల్లోంచి కొండ నాలుకలను పెకిలించి బయటకు విసిరేస్తే తప్ప ఈ నినాదాల రొద ఆగదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here