Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-34

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]‘మొ[/dropcap]ఘల్ శాసనకర్తలందరూ కూడా మతపరమైన ఆచార సంప్రదాయాలకు, పూజా పునస్కారాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. షాజహాన్, ఔరంగజేబ్‌ల కాలంలో ఒకవేళ యుద్ధాల కారణంగా పొరపాటున ప్రార్థనా మందిరాలు కూలిపోతే.. లేదా ధ్వంసమైపోతే.. ఆ తరువాత వాటి మరమ్మతులకు నిధులు కేటాయించారు.’ 12వ తరగతి చరిత్ర పాఠ్య పుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ రచయితలు రచించి.. విద్యార్థులకు బోధపరచిన అంశమిది. (234వ పేజీలో ఉన్నది)

2020 మార్చి 9న ఎన్‌సీఈఆర్‌టీ సంస్థను ఒక సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐఏ కింద దరఖాస్తు చేసుకొని కొన్ని ప్రశ్నలకు సమాధానం కోరాడు.

  1. 12వ తరగతి పాఠ్య పుస్తకం ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 లోని 234 వ పేజీలోని రెండో పేరాగ్రాఫ్‌లో పేర్కొన్న అంశం..‘షాజహాన్, ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో జరిగిన యుద్ధాల కారణంగా కూలిపోయిన దేవాలయాల మరమ్మతులకు యుద్ధాల తరువాత నిధులు కేటాయించారు’ అన్న అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సోర్స్ (సమాచారం విశ్వసనీయంగా లభించిన విధానం) చెప్పండి.
  2. అదనంగా షాజహాన్, ఔరంగజేబ్‌లు ఎన్ని దేవాలయాలకు మరమ్మతులు చేయించారో దయచేసి చెప్పగలరు.

ఈ దరఖాస్తుకు ఎన్‌సీఈఆర్‌టీ నవంబర్ 18న ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ‘THE INFORMATION IS NOT AVAILABLE IN THE FILES OF THE DEPARTMENT’ తమ శాఖ లోని ఫైళ్లలో ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని దీని అర్థం.

ప్రపంచంలోనే రక్తసిక్తమైన, అతిభయంకరమైన చరిత్ర ఏదైనా ఉన్నదంటే.. అది భారత్‌పై ముస్లింల దాడులేనని అమెరికన్ రచయిత, ఫిలాసఫర్ విల్ డురాంట్ విస్పష్టంగా పేర్కొన్నాడు. కానీ.. మొఘలులతో సహా ముస్లింల అరాచకాల గురించి భారత చరిత్ర పుస్తకాలు ఎన్నటికీ చెప్పవు. అసలలాంటి వాటికి ఎలాంటి చోటు ఉండదు. కానీ, వారిని గొప్పవారుగా చిత్రించడానికి మాత్రం తెగ ఆరాటపడుతుంటారు. నిజం ఎప్పటికీ చెప్పరు. ఎన్‌సీఈఆర్‌టీ మోసపూరిత చరిత్ర రచనల గురించి ఇప్పటికే పలువురు చర్చించారు. మహమ్మద్ హబీబ్, ఇర్ఫాన్ హబీబ్, రోమిలా థాపర్‌ల శకం ముగిసిన తరువాత సతీశ్ చంద్ర లాంటి వారి శకం మొదలైంది. ఎన్‌సీఈఆర్‌టీ వారి ఈ ఫేక్ చరిత్ర.. ముఖ్యంగా షాజహాన్, ఔరంగజేబ్‌ల కాలంలో ఆలయాల విధ్వంసంపై తప్పుడు సమాచారాన్ని కుప్పలు పోసిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నేవార్క్ లోని రట్గెర్స్ యూనివర్సిటీలోని చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఆడ్రే ట్రష్కే రాసిన ది లైప్ అండ్ లెగసీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్సియల్ కింగ్ (2017లో అచ్చయింది) అన్న గ్రంథంలో ఔరంగజేబ్‌ను బీభత్సంగా పొగిడింది. ఇందుకు సంబంధించిన వ్యాసం స్క్రోల్ వెబ్ సైట్‌లో ‘హిందూ దేవాలయాలను రక్షించడానికి ఔరంగజేబ్ ఏం చేశాడు’ అన్న శీర్షికన ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. ఔరంగజేబ్ గొప్ప సహనశీలిగా.. ముస్లిమేతరులను రక్షించిన గొప్పవాడిగా ఈ వ్యాసం వ్యాఖ్యానించింది. దేశంలో ప్రధాన స్రవంతిలో ఉన్న పాఠ్య పుస్తకాలు, ముఖ్యమైన పత్రాలన్నింటిలోనూ ఈ చారిత్రక విధ్వంస రచనలు జరిగాయి.. ఇవాళ్టికీ జరుగుతూనే ఉన్నాయటానికి ఇంతకంటే తార్కాణం ఏం కావాలి?

బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్.. ఇలా ప్రతి ఒక్క మొఘల్ రాజు.. వేల కొద్దీ దేవాలయాలను నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. ఔరంగజేబ్ అనేవాడు వీళ్లందరిలోనూ అత్యంత హీనమైన, నీచుడైన రాజు. దేశవ్యాప్తంగా సోమ్‌నాథ్, కాశీ విశ్వనాథ్ దేవాలయం, త్రయంబకేశ్వరంలో శివాలయంతో పాటు.. మధ్య యుగాలలో అత్యద్భుతంగా నిర్మించిన ఆలయాలన్నింటినీ  ప్రధానంగా యూపీ, మధ్యప్రదేశ్ తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆలయాలను ఔరంగజేబ్ నాశనం చేశాడు. అంతే కాదు.. తాను ధ్వంసం చేసిన ఆలయాలను ఎవరైనా పునర్నిర్మించినట్టయితే.. వాటిని నేలమట్టం చేయాలని హిందువులు ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశాడు. ఇతడు ధ్వంసం చేసిన వందలాది ఆలయాలను కాల క్రమంలో హిందువులే పునర్నిర్మించుకొన్నారు తప్ప ఎన్‌సీఈఆర్‌టీ వారు ప్రచారం చేస్తున్నట్టు ఏ షాజహానో, ఔరంగజేబో నిర్మించడం కానీ, పునర్నిర్మించడం కానీ చేయనే లేదు. కనీసం ఆలయాల నిర్మాణానికి భూముల కేటాయింపు కూడా చేయలేదు. కొన్ని ఉదాహరణలు తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే.. ఇవాళ్టికీ విభజన రాజకీయాలు కొనసాగిస్తున్న వారికి ఇది గుణపాఠం కావాలి. ఇప్పటికీ సహనశీలత ఎక్కువగా ఉన్నది కాబట్టే హిందువులు ఎంతసేపూ సంజాయిషీలు మాత్రమే ఇచ్చుకుంటూ.. వారి పాపాన వారే పోతారని అనుకొంటూ ఊరుకొంటున్నారు.

మధ్యప్రదేశ్ లోని విదిశలో బిజా మండల్ దేవాలయం ఉన్నది. భారతదేశంలోని అత్యద్భుత దేవాలయాలలో ఇది ఒకటి. సూర్యుడు, మహాదేవుడు, పార్వతి, కృష్ణుడికి అంకితమైన మహాద్భుత దేవాలయమిది. ఈ ఆలయ విస్తీర్ణం ఒక కిలోమీటర్ వెడల్పు.. 315 అడుగుల ఎత్తున్న వైభవోపేతమైన దేవాలయి ఇది. ఈ ఆలయాన్ని ఔరంగజేబ్ ధ్వంసం చేయకపోయి ఉంటే.. దాని మానాన దాన్ని వదిలేసి ఉంటే.. ఇది మరో అంగ్‌కార్వాట్ దేవాలయంలాగా ఉండేది. ఈ దేవాలయాన్ని పరమర రాజ నర వర్మన్ 5, 6 శతాబ్దాల మధ్యన నిర్మించినట్టు వేదవీర్ ఆర్య రచించిన క్రానికల్ ఆఫ్ ఇండియా గ్రంథం చెప్తున్నది. కొన్ని పుస్తకాలు.. ఇతని కాలాన్ని 11, 12 శతాబ్దాలుగా చెప్తున్నాయి. ఈ ఆలయాన్ని ఇస్లామిక్ చొరబాటు దారులు ఎన్నిసార్లు ధ్వంసం చేశారో లెక్కే లేదు. మహమ్మద్ ఘజ్నీ, అల్త్ మష్, మాలిక్ కాఫర్ (అల్లావుద్దీన్ ఖిల్జీ గే పార్టనర్), గుజరాత్‌ను పాలించిన బహదూర్ షా,  చివరకు ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన ప్రతిసారీ.. హిందూ రాజులు దాన్ని పునర్నిర్మించుకొంటూ వచ్చారు. దేవాలయంలోని ప్రతి శిల్పాన్ని నాశనం చేశాడు. అంతేకాదు.. ఇదే ఆలయంలో కొంతభాగంలో మసీదును నిర్మించాడు. ఈ మసీదు ఇవాళ్టికి కూడా అక్కడే ఉన్నది.

నాసిక్ లోని అతి ప్రాచీనమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయాన్ని 1690లో ఔరంగజేబ్ ధ్వంసం చేశాడు. అదే సమయంలో అతని అనుచరులు ఎల్లోరా, నర్సింగ్ పూర్, పండర్‌పూర్, జేజూరీ, యవత్ ఆలయాలపై విరుచుకుపడి విశృంఖల వీర విహారం చేశారు. వివరాలు కావాలనుకొనేవారు జాదూనాథ్ సర్కార్ రాసిన హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్ గ్రంథాన్ని చూడవచ్చు. కేఎన్ సేన్ రాసిన వార్షిక్ ఇతివృతలోని కొన్ని కోట్స్‌ను జాదూనాథ్ తన పుస్తకంలో ప్రస్తావించాడు. త్రయంబకేశ్వర్ సహా కొన్ని ఆలయాలలో మొఘల్ సేనలను మిడతల దండు, విష పాములు, తేళ్లు అడ్డుకొన్నాయిట. అల్వార్ లోని ప్రాచీన నీలకంఠ శివాలయంలో గర్భగృహాన్ని ధ్వసం చేయడానికి ప్రయత్నించినప్పుడు తేనెటీగలు పెద్ద ఎత్తున ఔరంగజేబ్ సేనలపై విరుచుకుపడ్డాయి. గోవింద్ సఖారామ్ దేశాయ్ రాసిన మరాఠాల చరిత్ర రెండో సంపుటంలో త్రయంబకేశ్వర దేవాలయాన్ని నానా సాహెబ్ (పేష్వా బాలాజీ బాజీరావ్ భట్) 1754 లో పునర్మించాడని పేర్కొన్నారు. 1690లో ఇక్కడ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఔరంగజేబ్ నిర్మించిన మసీదును నానా సాహెబ్ తొలగించాడని కూడా ఈ గ్రంథం చెప్తున్నది.

కాశీ విశ్వనాథ దేవాలయాన్ని 1664లోనే విధ్వంసం చేయడానికి ఔరంగజేబ్ చేసిన తొలి ప్రయత్నాన్ని నాగా సాధువులు విజయవంతంగా అడ్డుకొన్నారు. నాగా సాధువుల చేతిలో ఔరంగజేబ్ సైన్యం తుక్కు తుక్కుగా ఓడిపోయింది. వారణాసిలోని మహా నిర్వాణీ అఖాడాకు చెందిన నాగా సాధువులు ఔరంగజేబ్ సైన్యాన్ని కాశీలో తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ విషయాన్ని జేమ్స్ జీ లాఖ్ట్ ఫీల్డ్ తన ఇల్లస్ట్రేటెడ్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజమ్ అన్న గ్రంథం తొలి సంపుటంలో ఈ చరిత్రాత్మక ఘటన గురించి సవివరంగా చర్చించారు. చేతి రాతతో రాసిన ఈ పుస్తకం మహా నిర్వాణీ అఖాడా ఆర్కైవ్స్‌లో ఇప్పటికీ భద్రంగా ఉన్నది. ఈ యుద్ధాన్ని ‘బ్యాటిల్ ఆఫ్ గ్యాన్ వాపీ’గా పేర్కొన్నాడు. ఇవాళ మనం చూస్తున్న కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని ఆనుకొని ఉన్న మసీదు పేరు గ్యాన్ వాపీ.. ఇందులోనే శివలింగం బయటపడింది. జాదూనాథ్ సర్కార్ రాసిన ఎ హిస్టరీ ఆఫ్ దస్నమి నాగా సన్యాసీస్ అన్న గ్రంథంలో కూడా 1664లో నాగా సాధువులు ఔరంగజేబ్ ను ప్రతిఘటించిన చరిత్రను విపులంగా చర్చించారు. ‘నాగా సాధువులు గొప్ప విజయాన్ని సాధించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పెద్ద ఎత్తున పోరాడి తమను తాము హీరోలుగా నిరూపించుకొన్నారు. విశ్వనాథుడి పవిత్ర స్థల గౌరవాన్ని కాపాడారు.‘ అని జాదూనాథ్ సర్కార్ వివరించారు.

ఆ తరువాత 1669లో మరోసారి విశ్వనాథ్ దేవాలయంపై ఔరంగజేబ్ దాడిచేశాడు. ఈసారి అతడే జయించాడు. మరోసారి హిందువులందరికీ అత్యంత ముఖ్యమైన, అతి పవిత్రమైన విశ్వనాథుడి మందిరాన్ని తిరిగి నిర్మించకుండా ఉండేందుకు అక్కడే గ్యాన్ వాపీ మసీదును నిర్మించాడు. ఆలయ ప్రాంగణంలోనే ఈ మసీదు ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. దీన్ని తొలగించే ధైర్యం సెక్యులర్ పాలకులు ఎన్నటికీ చేయలేదు. ఇక్కడి స్థానిక గాథల ప్రకారం రెండోసారి ఔరంగజేబ్ చేసిన దాడిలో దాదాపు 40 వేల మంది నాగా సాధువులు జ్యోతిర్లింగాన్ని రక్షించడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. చాలా కాలం తరువాత.. 1742లో అప్పటి ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ ఆమె మామగారు మల్హర్ రావు హోల్కర్ (అప్పటి మరాఠా రాజు) గ్యాన్ వాపీ మసీదును ధ్వంసం చేసి కాశీ విశ్వనాథ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నించారు. కానీ లక్నో నవాబులు అడ్డు కోవడంతో వారి ప్రణాళిక ఫలించలేదు. ఎనిమిదేండ్ల తరువాత 1750లో జైపూర్ మహారాజు వారణాసిలో విశ్వనాథ మందిరాన్ని మసీదును కూల్చి కట్టాలని భావించాడు. ఇందుకోసం ఆలయం, మసీదు ఉన్న భూభాగాన్ని మొత్తం కొనేయాలని నిర్ణయించాడు. ఈ ప్రణాళిక కూడా విఫలమైంది. చివరకు 1780లో అహల్యాబాయ్ హోల్కర్ చేతుల మీదుగానే కాశీ విశ్వనాథ మందిరం పునర్నిర్మాణానికి నోచుకొన్నది. ముస్లిమేతర ప్రజలపై ఔరంగజేబ్ అరాచకాల గురించి, ఆలయాలను ధ్వంసం చేసిన చరిత్ర గురించి డజన్ల కొద్దీ పుస్తకాలు వచ్చాయి. వందలాది పిట్ట కథలు ఉన్నాయి. జాదూనాథ్ సర్కార్ వంటి వారి సాధికారమైన చారిత్రక గ్రంథాలు కూడా ఉన్నాయి. కానీ.. మన పాలకులు మాత్రం ఔరంగజేబ్ చాలా గొప్పవాడనే చెప్తారు.

జాదూనాథ్ సరార్ రాసిన అనెక్టడోట్స్ ఆఫ్ ఔరంగజేబ్ అండ్ హిస్టారికల్ ఎస్సేస్ అన్న గ్రంథంలోని మరో మాట యథాతథంగా చూడండి.. ‘mean time auranzeb had begun to give free play to his religious bigotry. In april, 1669.. he ordered the provincial governors to ‘destroy the temples and schools of the brahmans.. and to utterly put down the teachings and religious practices of the infidels….. the grandest shrine of Mathura kesav rai’s temple built at a cost of 33 lakhs of rupees by the bundela rajah birsingh dev, was razed to the ground in January, 1670, and a mosque built on its site. The idols were brought to agra and buried under the steps of jahanara’s mosque. That they might be constantly trodden on by the muslims going in to pray. About this time the new temple of somnath on the south coast of the Kathiawar peninsula was demolished, and the offering of worship there ordered to be stopped. The smaller religious buildings that suffered havoc were beyond count. The Rajput war of 1679..80 was accompanied by the destruction of 175 temples in mewar alone. Including the famous one of someshwar and three grand ones at Udaipur. On 2nd april, 1679, tha jazia or poll tax on non muslims was revived. The poor people who appealed to the emperor and blocked a road abjectly crying for its remission, were trampled down by elephants at his order and dispersed.’

కాశీ విశ్వనాథ మందిరం మాదిరిగానే మధురలో కృష్ణ మందిరాన్ని ధ్వంసం చేసిన ఔరంగజేబ్ అక్కడ కూడా ఒక మసీదు కట్టాడు. ఒక్క మేవాడ్‌పై యుద్ధానికి దిగినప్పుడే దాదాపు 175 మందిరాలను ధ్వంసం చేశాడు. ముస్లిమేతరులపై జిజియా పన్ను మళ్లీ విధించాడు.  ఔరంగజేబ్ గురించి మునిలాల్ రాసిన గ్రంథం కూడా అనేక ఉదాహరణలతో ఔరంగజేబ్ చేసిన ధ్వంస రచన గురించి విస్తారంగా చర్చించింది.

హిందూ శిల్పాలు, విగ్రహాల ధ్వంసం ఎంత బీభత్సంగా జరిగిందో వివరించింది. హిందూ దేవతలు, దేవుళ్లు, హిందూ సంగీతం, జ్యోతిషం, అనుబంధ విజ్ఞాన శాస్త్రాలన్నింటినీ ఔరంగజేబ్ నిషేధించాడు. హిందూ రాజుల తిలక ధారణను నిషేధించాడు. స్టడీస్ ఇన్ ఇస్లామిక్ హిస్టరీ అండ్ సివిలైజేషన్ అన్న గ్రంథం రాసిన డేవిడ్ ఆయలాన్.. ఔరంగజేబ్ ఎంత బలవంతంగా హిందువులను ముస్లింలుగా మతమార్పిడులు చేసిందీ, ఆలయాలను ధ్వంసం చేసిందీ.. సవివరంగా చర్చించాడు.

ఎంపరర్స్ ఆఫ్ ది పీకాక్ థ్రోన్ ది సాగా ఆఫ్ ది గ్రేట్ మొఘల్స్ అన్న గ్రంథంలో.. ఔరంగజేబ్ హయాంలో ఉజ్జయిని చుట్టూ దేవాలయాల ధ్వంసం చేసిన తీరును వివరించాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేక మంది.. ఔరంగజేబ్ అరాచకాలను కూలంకషంగా వివరిస్తూ వెళ్లారు. లెక్కలేనన్ని అరాచకాలకు కేరాఫ్ ఔరంగజేబ్.. అతడి అరాచకాలకు సంబంధించి ఇంత సమాచారం అందుబాటులో ఉండి కూడా ఎన్‌సీఈఆర్‌టీ వారు మాత్రం డెలిబరేట్‌గా చరిత్రను వక్రీకరించడానికి బరితెగించింది. ఇక్కడి ప్రజలను ఒకటిగా ఉంచకుండా చేయడానికి.. ఇక్కడి సమాజాన్ని ఏకత్రితం కాకుండా చేయడానికి, ఇక్కడ ప్రజల మధ్య నిరంతరం వైరుధ్యాలు కొనసాగేలా చూడటానికి చేస్తున్న విభజన అరాచకీయాలకు ఎన్‌సీఈఆర్‌టీ, జేఎన్యూ లాంటి ఎలైట్ సంస్థలు.., రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు ఈ విభజన విషవృక్షానికి వేర్లుగా విస్తరించాయి.

(సశేషం)

Exit mobile version