(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]సూ[/dropcap]ఫీలను సాధు పురుషులుగా మనవాళ్లు బ్రహ్మాండంగా కొలిచారు.. ఇవాళ్టికీ కొలుస్తున్నారు కూడా. కానీ.. రెండు దేశాల సిద్ధాంతాన్ని పాదు కొల్పిందే సూఫీలన్న విషయాన్ని వీరు మాట్లాడరు. చక్కగా ఖవ్వాలీ పాటలు పాడుకొంటూ, నాట్యాలు చేసుకొంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడేమో.. భారతీయులే అసహనశీలురని వ్యాఖ్యానిస్తారు. షా వలీవుల్లా లెటర్ ఎంత పని చేసిందంటే.. ఇంతకు ముందరి వ్యాసంలో చెప్పినట్టు పానిపట్ యుద్ధానికి దారి తీసింది. అబ్దాలీ అభ్యర్థన మేరకు 34 ఉలేమాలు అతనికి అనుకూలంగా సంతకాలు చేశారు. నవాబులు ఆయన వెంట నడిచారు. దార్ ఉల్ హరబ్ (ఇస్లాంను విశ్వసించని ప్రాంతం) పై యుద్ధం చేసి దార్ ఉల్ ఇస్లాం (ఇస్లాం రాజ్యం) గా మార్చాలని నిర్ణయం తీసుకొన్నారు. వీళ్లందరు కలవడంతో మూడో పానిపట్ యుద్ధం జరిగింది. మొదటి పానిపట్ యుద్ధం మొఘలులు భారతదేశంలో ప్రవేశించడానికి నాంది పలికితే.. మూడో పానిపట్ యుద్ధం బ్రిటిష్ వాళ్లు దేశంలోకి చొచ్చుకొని రావడానికి దారి ఏర్పరిచింది. 1526లో మొదటి పానిపట్ యుద్ధం బాబర్‌కు సుల్తాన్ ఇబ్రహిం లోఢీకి మధ్య జరిగింది. బాబర్ సైన్యం తెలివిగా లోఢీని జయించి భారత్‌లో మొఘలుల రాజ్యం స్థాపించింది. రెండో పానిపట్ యుద్ధం 1556లో బైరంఖాన్‌కు హేమూ మధ్యన జరిగింది. ఈ యుద్ధంలో విజయంతో మొఘలులు తమ ఆధిపత్యంపై పూర్తి పట్టు సాధించారు. ఇక మూడో పానిపట్ యుద్ధం ఇప్పుడు మనం చర్చించుకొంటున్నది. అప్పటికే మరాఠాలు దేశమంతటా విస్తరించారు. మొఘలుల ప్రాభవం తగ్గిపోతున్నది. ఆ సమయంలో షా వలీవుల్లా.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి సైన్యాధ్యక్షుడు అహ్మద్ షా అబ్దాలీని రప్పించాడు. అబ్దాలీ అప్పటికే ఒకసారి భారత్ పై దండెత్తాడు. వలీవుల్లా సూచనకు తోడు ఉలేమాలు, నవాబులు తోడు కావడంతో రెట్టించిన ఉత్సాహంతో మరోసారి దాడికి తెగబడ్డాడు. 1761 జనవరి 14 న పానిపట్‌లో మరాఠా సామ్రాజ్య సైన్యానికి, అబ్దాలీ సైన్యానికి మధ్యన భీకర పోరు సాగింది. ముందుగా చెప్పుకొన్నట్టు నజీబుద్దౌలా, షాజుద్దౌలా అబ్దాలీ వెంట నడిచారు. మరాఠా సైన్యానికి ఛత్రపతి, పేష్వా, సదాశివరావు భావు నాయకత్వం వహించారు. 18వ శతాబ్దంలో జరిగిన అతి పెద్ద యుద్ధం ఇదేనేమో. ఈ యుద్ధంలో 60 వేల నుంచి 70 వేల వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజుల పాటు సాగిన ఈ యుద్ధం సరిగ్గా ఎక్కడ జరిగిందో కూడా మన సోకాల్డ్ చరిత్రకారులు చెప్పలేకపోయారు. ఎప్పుడో రామాయణ భారతాల కాలం అంటే తెలియదనుకొందాం.. 18 శతాబ్దంలో జరిగింది కూడా అంటే ఓ మూడు వందల ఏండ్లు.. అప్పుడు జరిగిందైనా తెలుసుకోలేని చరిత్రకారులు ఏవిధంగా ఆ పేరుతో పిలువబడుతున్నారో అర్థం కాదు. ఒకరేమో కాలా అంబ్ దగ్గర అని చెప్తారు.. మరొకరి సనౌలీ రోడ్ దగ్గర జరిగిందంటారు. ఈ మాత్రం దానికే వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలు లభిస్తాయి. యుద్ధం మొదలైన రెండో రోజే దాదాపు 40 వేల మందిని ఊచకోత కోసినట్టుగా షాజుద్దౌలా దివాన్ రాసిన హిస్టరీ ఆఫ్ మరాఠా గ్రంథంలో కనిపిస్తుంది. షేజ్వల్కర్ రాసిన మొనోగ్రాఫ్ ఆఫ్ పానిపట్ గ్రంథంలో యుద్ద సమయంలో, ఆ తరువాత కానీ దాదాపు లక్ష మంది మరాఠా సైనికులు చనిపోయినట్టు ప్రస్తావన ఉన్నది. అప్పటిదాకా మొఘలులపై తిరుగులేని పట్టు సాధించి అప్రతిహతంగా ముందుకు సాగుతున్న మరాఠాల ఆధిపత్యానికి మూడో పానిపట్టు బ్రేక్ వేసింది. దాదాపు పదేండ్ల పాటు మరాఠా భూభాగాలు అస్థిర మయ్యాయి. ఆ ఆధిపత్యాన్ని పునరుద్ధరించడానికి మాధవరావు పేష్వా కొంత ప్రయత్నించినప్పటికీ అది ఎక్కువకాలం సాగలేదు. 1818 నాటికి బ్రిటిష్ వారి చేతికి మరాఠా సామ్రాజ్యం చేతికి చిక్కింది. మూడో పానిపట్ యుద్ధం తరువాత భారత్‌పై ఇస్లాం ప్రాభవం తగ్గినట్టు కనిపించినా.. క్రైస్తవ ప్రాబల్యం పెరిగినప్పటికీ.. బ్రిటిష్ వాడి డివైడ్ అండ్ రూల్ విధానంలో భాగంగా ముస్లింలను నెత్తిన పెట్టుకొన్నారు. ఇవాల్టి మన పాలకుల మాదిరిగానే. కాబట్టి బ్రిటిష్ వాళ్లు వచ్చినప్పటికీ భారత్‌లో పెద్దగా మార్పు రాలేదు. ముస్లిం రాజులు వెళ్లిపోయి.. క్రైస్తవ పాలకులు వచ్చారు అంతే తేడా.. క్రైస్తవులు వచ్చినప్పటికీ.. ముస్లిం సంతుష్టీకరణ మరింత పరాకాష్టకు చేరుకొన్నది.
బాలాకోట్ యుద్ధం
మరోవైపు ఇస్లామీయుల జిహాదీ ఎంతమాత్రం ఆగలేదు. షా వలీవుల్లా కొడుకు అబ్దుల్ అజీజ్.. భారతదేశంలో జిహాదీ నిర్వహించడానికి ముఖ్యంగా కాశ్మీర్‌లో ఖలీఫా రాజ్యం స్థాపించడానికి సయ్యద్ అహ్మద్ బరేల్వీ ని నియమించాడు. ఓ పక్క బ్రిటిష్ వాళ్లు విజృంభిస్తున్న తరుణంలో అది కూడా 1831లో సైతం అహ్మద్ బరేల్వీ దాదాపు 80 వేల మంది జిహాదీలను తయారు చేశాడంటే.. భారత్‌లో పరిస్థితి ఏ విధంగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. దారుల్ హరబ్ (ఇస్లాంను విశ్వసించని ప్రాంతం)పై జిహాద్ చేయాలని నిర్ణయించుకొన్న తర్వాత బరేల్వీ.. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించాడు. ఎక్కడికక్కడ జిహాద్ చేయాల్సిన అవసరాన్ని చెప్పుకొంటూ.. మానవబాంబులను తయారు చేసుకొంటూ పోయాడు. ఇలా దాదాపు 80 వేలమందిని సమీకరించాడు. దేశంలోకి ముస్లింలు తప్ప మరొకరు రాకుండా అడ్డుకోవాలని లక్ష్యంగా అతడు ముందుకు సాగాడు. ఇతర మత ప్రవక్తల మాదిరి కాకుండా నేరుగా ఇస్లాం యువకులను కలిసి వారిని సంబోధిస్తూ ఉత్తేజకరమైన ప్రసంగాలతో ఆకర్షిస్తూ వారిని జిహాద్ వైపు మళ్లేలా చేశాడు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం, అల్లాపై విశ్వాసం.. ఈ రెండు మాత్రమే అనుసరించదగినవి. ఈ రెండింటిని వీడి ఒక్క అడుగు కూడా ఇతర మార్గంలో పెట్టడానికి వీల్లేదు. మహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గాన్ని (తరీఖా ఇ మహమ్మదియా) మాత్రమే పాటించాలని ఖండితంగా చెప్పాడు. సూఫీలు, ఇతరులు చెప్పిన ఇతర మార్గాలన్నింటినీ విడిచిపెట్టాలని శాసించాడు. షియా ప్రభావం ఉన్న అన్ని ఆచారాలను వెంటనే నిషేధించాలని ఆదేశించాడు. తాను స్వయంగా అనేక తజియాలను ధ్వంసం చేశాడు. తగులబెట్టాడు. దీంతో పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. కానీ బరేల్వీ తన దారిని విడిచిపెట్టలేదు. హిందూ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం తజియాల ధ్వంసంతో వస్తుందని చెప్పుకొచ్చాడు. 1821లో హజ్ యాత్రకు వెళ్లి రెండేండ్ల తరువాత తిరిగి వచ్చిన బరేల్వీ.. జిహాదీని పెద్ద ఎత్తున ప్రారంభించాడు. ఈ క్రమంలో బరేల్వీ మొట్టమొదటి శత్రువు పంజాబ్ అయింది. సిక్కుల రాజు రంజిత్ సింగ్‌ను తుదముట్టించేందుకు బరేల్వీ తన జిహాదీలను ప్రయోగించాడు. అప్పటికి రాజా రంజిత్ సింగ్ తన సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరిస్తున్నాడు. కాశ్మీర్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ దాకా విస్తరించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ పరిణామాన్ని గమనించిన బరేల్వీ ముందుగా రంజిత్ సింగ్ పైనే విరుచుకుపడ్డాడు. రంజిత్ సింగ్‌ను తుదముట్టించి ఆఫ్ఘనిస్తాన్ తోపాటు, పెషావర్ లోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్‌ను జయించడం ద్వారా ఒక బలమైన ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని పూనుకొన్నాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఒకవైపు మొఘలులు పతనం కావడం.. మరోవైపు బ్రిటిష్ వారు భారత్‌ను ఆక్రమించడంతో.. మున్ముందు భారత్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఒక వ్యూహాత్మక స్థావరంగా తాను ఏర్పాటుచేయనున్న ఇస్లాం రాజ్యం బాగా ఉపయోగపడుతుందని బరేల్వీ ప్రణాళిక వేసుకొన్నాడు. సైనిక చర్య ప్రారంభించినప్పుడు కొంతమంది నవాబులు బరేల్వీకి నిధులు సమకూర్చారే తప్ప అతనితోపాటు యుద్ధంలో పాల్గొనలేదు. బరేల్వీ దాదాపు 8 వేల మంది ముజాహిదీన్లను వెంటబెట్టుకొని సైనిక చర్యకు పూనుకొన్నాడు. ఆ 8 వేల మందిలో అత్యధికులు పేద ప్రజలు.. కూలీ డబ్బుల కోసం వచ్చినవారు. మిగతావారు మతాధికారులు. కాకపోతే.. బరేల్వీకి టోంక్, గ్వాలియర్, రాంపూర్ పాలకులు సహాయపడ్డారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే.. బరేల్వీకి సహాయపడటానికి వీరు బ్రిటిష్ వాళ్ల అనుమతి తీసుకొన్నారు. అప్పటికే వీరు బ్రిటిష్ వారిమీద ఆధారపడి ఉన్నారు. అలాంటప్పుడు భవిష్యత్తులో తాము యుద్ధం చేయబోయే దేశానికి (భారత్) శత్రువైన బరేల్వీకి సహాయపడటానికి బ్రిటిష్ వాడు ఎందుకు వద్దంటాడు? అది వాడికే ప్రయోజనకారిగా ఉంటుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి.. అప్పటి వరకు బరేల్వీని బ్రిటిష్ వాళ్లు కూడా ప్రోత్సహించారు. దీంతో.. బరేల్వీ.. పెషావర్ లోయలోని హంద్, జాయిదా, స్వాబి జిల్లాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోగలిగాడు. అక్కడి నుంచి మొదట స్థానిక పష్తూన్‌లు, హాజారేవాల్ తెగల మీద జిహాదీ ప్రకటించాడు. వాళ్ల జాతి ఆచారాలన్నీ తక్షణం మానుకోవాలని.. షరియాను కచ్చితంగా పాటించాలని ఆదేశించాడు. సంప్రదాయబద్ధంగా అప్పటి వరకు ఉన్న ఖాన్‌లు బరేల్వీ దెబ్బకు ఉలేమాలుగా మారిపోయారు. జిహాద్ నిర్వహణ కోసం ఇస్లామిక్ పన్నుల వసూళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. షరియాను విజయవంతంగా పున:స్థాపించడం పూర్తయిన వెంటనే రంజిత్ సింగ్‌పై సయ్యద్ బరేల్వీ జిహాద్ ప్రకటించాడు. ఇందుకు సంబంధించి అతడికి ముందుగా ఒక హెచ్చరికను పంపించాడు. అందులో మూడు ఆప్షన్లను ఇచ్చాడు. మొదటిది ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింగా మారిపోవడం. రెండవది తనకు జిజియా పన్ను చెల్లించడం, మూడోది.. యుద్ధం చేసి తన చేతిలో హతమవడం.. బరేల్వీ ఈ మూడు ఆప్షన్లతో రంజిత్ సింగ్‌కు హెచ్చరిక పంపించాడు. ఈలోగా ముజాహిదీన్లకు ఇస్లాం సిద్ధాంతాలతోపాటు.. షూటింగ్, బాణ విద్య, కుస్తీ వంటి వాటిలో కఠినమైన శిక్షణలు ఇస్తూ వెళ్లాడు. వాళ్లు కలలో కూడా జిహాదీని విడిచిపెట్టనంత తీవ్రంగా వారికి శిక్షణనిచ్చాడు. ఇతడు ఇచ్చిన శిక్షణలో బాగా పాపులర్ అయిన గేయం రిసాలా జిహాద్ పేరుతో ప్రసిద్ది చెందింది.
~
War against the Infidel is incumbent on all Musalmans;
make provisions for all things.
He who from his heart gives one farthing to the cause,
shall hereafter receive seven hundredfold from God.
He who shall equip a warrior in this cause of God,
shall hereafter obtain a martyr’s reward;
His children dread not the trouble of the grave,
nor the last trump, not the Day of Judgement.
Cease to be crowded; join the divine leader, and smite the Infidel.
I give thanks to God that a great leader has been born,
in the thirteenth of the Hijra
~
1826లో బరేల్వీ అకోరా వద్ద సిక్కు సైన్యాలతో తలపడ్డాడు. కొంత సక్సెస్ సాధించేసరికి 1827 జనవరి 11 న తనను తాను ఖలీఫాగా ఇమామ్‌గా ప్రకటించుకొన్నాడు. కానీ ఈ చర్య అందరి ఆమోదం పొందలేదు. శుక్రవారపు ప్రార్థన అతని పేరు మీద చదవటంతో అది అతని అధికారానికి ప్రతీకాత్మకమైంది. దీంతో పలు తెగల నాయకులు ఆందోళన చెందారు. కానీ.. అతడు దానికి సమాధానం చెప్తూ తన చర్యలన్నీ కాఫిర్లపై జిహాద్ చేయడం కోసమేనని, ఇస్లాం రాజ్యం స్థాపించడం కోసమేనని సంజాయిషీ ఇచ్చాడు. క్రమంగా బరేల్వీ ఆధిపత్యం పెరుగుతూ పోయింది. పెషావర్ లోయలో వివిధ తెగలకు చెందిన సమాజాలు బలహీనపడుతూ పోయాయి. వారి పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు అన్నింటినీ నిషేధించారు. సయ్యద్ బరేల్వీ ఆధిపత్యం ఉత్తర భారతదేశంలో హిందూ ఆధిపత్యాన్ని బలహీనపరచడం బ్రిటిష్ వారికి అనుకూలమైపోయింది. దేశమంతటా ఇదే పద్ధతి ద్వారా సమాజాలను విడగొట్టి జాతి విద్వేషాలు రగుల్కొల్పడం ద్వారా దేశాన్ని పూర్తిగా ఆక్రమించాలని సుదీర్ఘ వ్యూహరచన చేశారు. ఇలా ఉండగానే బరేల్వీ బాలాకోట్ దగ్గర రాజా రంజిత్ సింగ్‌పై యుద్ధానికి తెగబడ్డాడు. 1831 మే 6న బాలాకోట్ యుద్ధం భీకరంగా సాగింది. మాన్‌సెహ్రా జిల్లా కొండప్రాంతంలోని బాలాకోట్ మైదానంలో ఈ యుద్ధం జరిగింది. దాదాపు పదివేల మంది ముజాహిదీన్లు, 12 వేల మంది సాయుధ సిక్కు సైన్యంతో తలపడ్డారు. ఈ యుద్ధంలో సయ్యద్ బరేల్వీతోపాటు షా ఇస్మాయిల్, సయ్యద్ అహ్మద్ వంటి నాయకులు పాల్గొన్నారు. సిక్కు సైన్యానికి షేర్ సింగ్ నాయకత్వం వహించాడు. ఆరోజు యుద్ధంలో 9 వేల మంది ముజాహిదీన్లు, 5 వేల మంది సిక్కు సైనికులు చనిపోయారు. ముజాహిదీన్లు మస్జిద్ ఏ బాలా దగ్గరకు చేరుకొని సిక్కులపై తెగబడ్డాయి. అక్కడి నుంచి బరేల్వీ సైన్యాలు యుద్ధం చేసుకొంటూ మేటికోట్ కొండపైకి చేరుకొన్నాయి. అక్కడ సిక్కు సైన్యం బరేల్వీపై విరుచుకుపడ్డాయి. సిక్కుసైనికులు బరేల్వీ తల నరికేశారు. అతడు చనిపోయిన విషయం పొక్కకుండా ముజాహిదీన్లందరినీ కొండపైకి రప్పించి ఊచకోత కోశారు. ఆ తరువాత బరేల్వీ శవాన్ని కున్హార్ నదిలో విసిరేశారు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన బరేల్వీ శవం ఎవరికీ దొరకలేదు. బ్రిటిష్ వాళ్లు భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత తీవ్రంగా జరిగిన అతి పెద్ద జిహాదీ యుద్ధం ఇదే.
(సశేషం)