(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]భా[/dropcap]రతదేశంలో విదేశీ మతం నాటిన విష బీజాలు వటవృక్షంగా మారాయి. ముస్లింల నుంచి బ్రిటిష్ వారు దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఈ విభజన విషవృక్షాన్ని పాలుపోసి పెంచిన బ్రిటిష్ వాళ్ల తెలివితేటలను గురించి తెలుసుకోవడానికి ముందు.. కాశ్మీర్‌లో సూఫీలు చేసిన మారణహోమం గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్ర్యానంతరం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ముందు వరకు.. ఇంకా చెప్పాలంటే.. 1990లో కాశ్మీర్ నుంచి పండిట్లను ఊచకోత కోసి వెళ్లగొట్టేంత వరకూ కూడా హిందూ ముస్లింలు చాలా సామరస్యంగా.. ఎలాంటి కల్లోలం లేకుండా ఉన్నారని సౌభ్రాతృత్వంతో జీవించారని చెప్పుకుంటూ వచ్చారు. సూఫీల ప్రభావం వల్ల రెండు ధర్మాల మధ్యన అసలు ఎలాంటి గొడవలూ జరుగలేదని చెప్పుకుంటూ వచ్చారు. దురదృష్టమేమిటంటే.. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి లేనే లేదు. నిజానికి కాశ్మీర్‌లో హిందువుల మీద మృత్యువు కరాళ నృత్యమే చేసింది. సూఫీల నేతృత్వంలోనే ఈ పిశాచాల విలయతాండవం కొనసాగింది. హిందువులు కాశ్మీర్ లోయను వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాశ్మీర్ అన్నది మనకు అందని కాలం నుంచి కూడా హిందూయిజం, హిందూ సంస్కృతికి కేంద్రస్థానంగా ఉన్న గొప్ప ప్రాంతం. మహర్షులు, మేధావులు, శాస్త్రవేత్తలు.. విద్యావేత్తలు.. ఎంతమంది కాశ్మీర్ నుంచి వచ్చారు? వీరిలో ఎవరి గురించైనా మన చరిత్రకారులు చెప్పారా? కాశ్మీర్ అంటే స్వర్గం. విద్యాసరస్వతికి ఆస్థానం. ఇక్కడి నుంచి విజ్ఞానం అన్నది విశ్వమంతటా వ్యాప్తి చెందింది.
మహర్షి కశ్యపుడు కాశ్మీర్ లోయకు వచ్చి సంవత్సరాల తరబడి మెడిటేషన్ చేశాడు. మెడిటేషన్ అంటే పరిశోధన, రిసెర్చ్ అని అర్థం. ముక్కు మూసుకొని ఉండటం కానే కాదు. తెలుసుకోవాలంటే ముందుగా సంస్కృతం నేర్చుకొని.. ఆ తరువాత సంస్కృత గ్రంథాలు చదివితే మెడిటేషన్ అంటే ఏమిటో అర్థమవుతుంది.
ఆదిశంకరాచార్యుల వారు కేరళ నుంచి కాశ్మీరానికి కాలినడకన వచ్చారు. ఇక్కడ శారదా పీఠాన్ని స్వయంగా స్థాపించారు. ఎక్కడి కేరళ.. ఎక్కడి కాశ్మీర్.. సరస్వతికి కాశ్మీరం ఆలవాలం అనడానికి ఇంతకంటే తార్కాణం మరేమీ లేదు. ఎంతోమంది విద్యార్థులు మనం విదేశాల్లో విద్య నేర్చుకోవడానికి వెళ్లినట్టు కాశ్మీర్‌కు వెళ్లి విద్యను నేర్చుకున్నారు. పండిట్లు అయ్యారు. పండిట్ అంటే.. మన పరిభాషలో చెప్పుకోవాలంటే పీహెచ్‌డీ అని అనవచ్చేమో. అంటే పరిశోధకులు అని అర్థం. పండిట్ అనేది కులం కాదు. డాక్టరేట్ అని అర్థం. హిందూయిజాన్ని మతంగా మార్చినట్టే.. పండిట్‌ను కూడా ఒక కులంగా మార్చేసి కాశ్మీర్ ను నాశనం చేశారు.
అభినవ గుప్తుడు, ఉత్పలదేవుడు ఫిలాసఫీ మీద కాశ్మీర్ లో పరిశోధన చేశారు.
లాగాక్షి ఆస్ట్రానమీ మీద పరిశోధించాడు. ఈయన ప్రపంచంలోనే తొట్టతొలి ఆస్ట్రానమర్.
చరకుడు, వాగ్భటుడు ఆయుర్వేదం మీద పరిశోధన చేశారు.
శుశ్రుతుడు ఇతర వైద్య విధానాల మీద పరిశోధించాడు.
పాణిని వ్యాకరణంపై రీసర్చ్ చేశాడు.
వటేశ్వరుడు ట్రిగొనామిట్రీ (త్రికోణమితి) మీద పరిశోధన చేశాడు.
సూయుడు హైడ్రాలిక్ ఇంజినీరింగ్ పై పరిశోధించాడు.
జయంత భట్టుడు.. న్యాయ శాస్త్రం (లా) పై పరిశోధన చేశాడు.
కాళిదాసు, రుద్రటుడు.. సంస్కృత సాహిత్యంపై పరిశోధించారు.
భాముడు సౌందర్యశాస్త్రం (ఈస్థటిక్స్) పై పరిశోధించాడు.
సంగమదేవుడు.. సంగీత శాస్త్రంపై పరిశోధించాడు.
కల్హణుడు, జోనరాజు.. చరిత్రకారులయ్యారు.
వసుగుప్తుడు, సోమానందులు.. అద్వైతంపై పరిశోధించారు.
విష్ణుశర్మ.. మోరల్ సైన్స్ పై పరిశోధించి పంచతంత్రాన్ని రచించాడు.
భరతుడు నాట్యశాస్త్రంపై పరిశోధించాడు.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు.. వీళ్లందరూ వేర్వేరు కాలాల్లో.. వేర్వేరు ప్రాంతాల నుంచి కాశ్మీర్‌కు వచ్చి వెళ్లిన వారే. ఇక్కడి నుంచి జ్ఞానం సంపాదించుకొన్నవారే. కాశ్మీర్ అన్నది ప్రపంచ విశ్వవిద్యాలయం. మనవాళ్లు చెప్తే ఎలాగూ నమ్మరు.. ఒక ఐరిష్ చరిత్రకారుడు జార్జ్ అబ్రహం గ్రేయిర్ సన్.. కాశ్మీర్ గురించి ఏం రాశాడో చూడండి..
“For upwards of two thousand years, Kashmir has been the home of Sanskrit learning and from this small valley have issued masterpieces of history, poetry, romance, fable, and philosophy. Kashmiries are justly proud of the literary glories of their land. For centuries Kashmir was the house of the greatest Sanskrit scholars and at least one great Indian religion of Shaivism has found some of its most eloquent teachers on the banks of the vitasta. Some of the greatest Sanskrit scholars and poets were born and wrote in the valley and from it has issued in Sanskrit language world famous collection of folklore, Panchatantra.”
కాశ్మీర్‌పై ఇస్లామీయులు ఎందుకు దాడి చేశారంటే.. ఇందుకు. ఇక్కడి నాలెడ్జిని ధ్వంసం చేయడానికి. ఇందుకోసమే.. ఇక్కడి సంస్కృత గ్రంథాలన్నీ ఎత్తుకెళ్లి.. అరబ్బీలోకి, పర్షియాలోకి అనువాదం చేసుకొని సొంతపేర్లు పెట్టుకొని అడ్డగోలుగా వాడుకున్నారు. దీని గురించి మన చరిత్రకారులు చెప్పరు. పాఠాల్లో ఉండవు. ప్రభుత్వాలు, హేతువాదులు, లిబరలిస్టులు, మార్క్సిస్టు చరిత్రకారులు ఉండనివ్వరు. నిజమే ముందుగా చెప్పినట్టు కాశ్మీర్ లోయ ప్రశాంతంగా ఎప్పుడు ఉన్నది అంటే.. 14వ శతాబ్దానికి ముందు వరకు. 8వ శతాబ్దంలో ముస్లిం చొరబాటుదారులు కాశ్మీర్ లోకి చొచ్చుకొని రావడానికి ప్రయత్నించినప్పుడు రారాజు లలితాదిత్యుడు వాళ్లను తరిమి తరిమి కొట్టాడు. 14వ శతాబ్ది దాకా హిందువులు, నేపాళం, సింహళం నుంచి వచ్చి ఇక్కడ పరిశోధనలు చేసిన బౌద్ధులు సామరస్యంగా, శాంతియుతంగానే ఉన్నారని చెప్పాలి. ముస్లింలు చొచ్చుకొని వచ్చిన తరువాతే.. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం బౌద్ధులు హిందువులకు సహకరించకుండా అహింస పేరుతో పక్కకు తప్పుకోవడం ద్వారా వారు చొచ్చుకొని రావడానికి కారకులయ్యారు. తురకల చొరబాటు సింధు లోయలో మొదలై ముందుగా ఆఫ్ఘనిస్థాన్ దాకా సాగటమే కాకుండా కొండొకచో.. సముద్రతీరం వెంబడి విస్తరిస్తూ వచ్చింది. 14వ శతాబ్దంలో ముస్లింలు కాశ్మీర్ లోకి చొరబడ్డారు. తరువాత క్రమంగా ఆక్రమించుకోసాగారు. సుల్తాన్ ఖుత్బుద్దీన్ కాలంలో సూఫీలు కాశ్మీర్ లోని విద్యా సరస్వతిని హతమార్చారు. ఎందుకంటే కాశ్మీర్‌లో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తే తప్ప ఆ ప్రాంతం వశం కాదని అర్థమైంది. ఇందుకు మొట్టమొదటగా సూఫీలే నడుం కట్టారు. ఇరాన్ నుంచి మీర్ సయ్యద్ అలీ హమ్‌దానీ అనే సూఫీ 700 మంది అనుచరులతో కాశ్మీర్ లోకి చొరబడ్డాడు. యుద్ధం చేయడానికి ఎవడైనా వస్తే వాళ్లను రాజులు ఎదుర్కునేవారు. కానీ.. తాను సాధువునని, సన్యాసిని చెప్పుకొని వచ్చేసరికి.. రోజూ ధర్మపన్నాలు చెప్పుకొని బతికేవారికి ఈ హమ్‌దానీ కూడా మంచోడిగానే కనిపించాడు. ఇరాన్ నుంచి తైమూర్ వెళ్లగొట్టడం వల్ల ఈ హమ్‌దానీ భారత్‌కు వచ్చాడని కొందరు చరిత్రకారులు చెప్తారు. కానీ.. ఇతడు సన్యాసి వేషం వేసుకున్న అతి భయంకరమైన ‘ఇన్‌టాలరెన్స్’ గ్రూప్‌కు చెందిన వాడు. ఇతడు ముందుగా కాశ్మీర్‌లో నూలు వస్త్రాల తయారీకి నాంది పలికాడు. ఈ పరిశ్రమ క్రమంగా విస్తరించడం ప్రారంభమైంది. చాలామంది ముస్లింలు పొరుగున ఉన్న లద్దాక్‌కు వలస వెళ్లారు. ఎందుకంటే.. అక్కడ గొర్రెల సంపద ఎక్కువగా ఉన్నది కనుక. ఈ పరిశ్రమ ఎప్పుడైతే ఉపాధి కల్పించడం మొదలైందో.. క్రమంగా హమ్‌దానీ ప్రభావం కాశ్మీర్‌పై పడటం ప్రారంభమైంది. క్రమంగా కాశ్మీర్‌లో సంగీత కచేరీలు నిషేధానికి గురయ్యాయి. నృత్య ప్రదర్శనలు నిషేధానికి గురయ్యాయి. హిందూ చిత్రకళ నిషేధానికి గురైంది. ఇస్లాం ఛాందసవాద విధానాలు పెద్ద ఎత్తున అమలు కావడమూ మొదలయ్యాయి.
ఐఏఎస్ క్యాడర్ కు చెందిన ఒక కాశ్మీరీ అధికారి ఎంకే కా(MK Kaw).. ఏం రాశారో చూడండి..
“But when Islam came to Kashmir in 14th century with its ideology and beliefs, its theology and dogmas, its laws and code of conduct, its lore and legends, everything that Kashmiri society stood for earlier was upturned. Its entire social, spiritual, and cultural fabric was shattered by the cataclysmic events that followed”
భారతదేశం నుంచి హిందూయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తే తప్ప.. (ఇప్పడు మన హేతువాదులు, లిబరలిస్టులు, కమ్యూనిస్టులు, అరస, విరస, కురస సంఘాల వాళ్లు.. భావిస్తున్నట్టే.. ఎందుకంటే వీళ్లూ వారి వారసులే కాబట్టి) భారతదేశంలో సంపూర్ణ ఇస్లామీకరణ సాధ్యం కాదన్న బలమైన విశ్వాసంతో ఒక రాజ్యాంగాన్ని గ్రంథ రూపంలో రాసుకొని వచ్చారు. (పైన చెప్పిన వాళ్లు మనుస్మృతి.. షరియా అంటుంటారే.. అచ్చం అలాంటిదే..) దాని పేరు జకీరత్ ఉల్ ముల్క్. ఇది ఓ చిన్న బుక్‌లెట్. దీన్ని రాసుకొని తెచ్చి సుల్తాన్‌కు ఇచ్చాడు. అందులో తాను రాసిన రూల్స్ ఆఫ్ లా ను తుచ తప్పకుండా పాటించాలని సూచించాడు. వాటిలో మచ్చుకు కొన్ని మీ ముందుంచుతాను.
- హిందువులు కొత్తగా దేవాలయాలు నిర్మించుకోవడానికి అనుమతించరాదు.
- ప్రస్తుతం ఉన్న దేవాలయాలను మరమ్మతులు చేసుకోవడానికి కూడా హిందువులను అనుమతించరాదు.
- హిందువులు తమ పిల్లలకు ముస్లిం పేర్లు పెట్టరాదు
- హిందువులు పర్వతారోహణ చేయరాదు
- హిందువులు ఆయుధాలు ధరించరాదు
- హిందువులు వజ్రపుటుంగరాలు ధరించరాదు
- పంది మాంసం తినడాన్ని నిషేధించాలి
- విగ్రహాల ఊరేగింపులను నిషేధించాలి
- ముస్లింల ఇండ్ల పక్కన హిందువులు ఇండ్లను నిర్మించరాదు.
- ముస్లిం స్మశానాల దగ్గర హిందువుల స్మశానాలు ఉండరాదు
- వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ముస్లిం యాత్రికులు హిందువుల దేవాలయాలలో విశ్రమించే హక్కు కలిగి ఉంటారు. వారికి మంచి ఆహారం అందించి మర్యాదలు చేయాలి.
- ముస్లిమేతరులు ముస్లింలకు గౌరవ మర్యాదలు చేయాలి. ముస్లింలు ప్రవేశించిన వెంటనే ముస్లిమేతరులు తమ స్థానాన్ని విడిచి వారికి సముచిత స్థానం కల్పించాలి.
- ముస్లింల వేషధారణకు భిన్నంగా ముస్లిమేతరుల వేషధారణ ఉండాలి. వారిని సులభంగా గుర్తించడానికి ఇది వీలు పడుతుంది.
వీటిని చదివాక ఇప్పుడు చెప్పండి ఎవరైనా సూఫీలు సహనశీలురని.. ఇదేనా సహనశీలత. దీని తరువాత కాశ్మీర్‌లో జరిగిన ఊచకోతకు అంతే లేదు. ఖాసిం దగ్గరి నుంచి 1996లో పండిట్లను వెళ్లగొట్టేంత వరకు కూడా అందరిదీ ఒకే నినాదం. “convert, die, leave”. మతం మారండి.. లేదా చావండి.. లేదా పారిపోండి.. ఇదే సిద్ధాంతం. దొరికిన వారిని దొరికినట్టు పట్టుకోవడం.. వాళ్ల జంధ్యాలు తెంపేయడం.. వాళ్లతో కల్మా చదివించడం.. ఇస్లాం పట్ల విధేయతగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం.. మతం మార్పించడం. ఇదీ ఈ సూఫీ సన్యాసి సైనికులు చేసిన పని. అలా వినని వాళ్లను అత్యంత భయానకంగా రాజా దాహిర్‌ను హతమార్చినట్టే తల నరికి చంపేయడం. మతం మారేవాళ్లు మతం మారడం.. బతుకు కోసం కాశ్మీర్ లోయను విడిచి పారిపోయే వాళ్లు పారిపోవడం. కొన్నేండ్లపాటు ఇదే జరిగింది. మనం జాగ్రత్తగా గమనిస్తే.. 1996లో జరిగిన ఊచకోత కూడా ఇలాగే జరిగింది. మీర్ శంషుద్దీన్ అరాఖీ కూడా షియా తెగకు చెందిన సూఫీ. జమ్ము కాశ్మీర్‌లో హిందూ పండిట్ల ఊచకోతపై ఇతను రాసుకున్న రాతప్రతి.. ఇప్పటికీ జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ప్రచురణలు, పరిశోధన విభాగంలో (యాక్సెసన్ నంబర్ 551) దొరుకుతుంది. ఎవరైనా వెళ్లి చూసుకోవచ్చు. కావాలంటే జిరాక్స్ కూడా తీసిస్తారు. ఇతడి అనుచరులు రోజుకు దాదాపు రెండు వేలమందికి పైగా పండిట్లను పట్టుకొని వాళ్లను మతం మార్చడమో, చంపేయడమో, వెళ్లగొట్టడమో చేశారు. చివరకు లోయలో పండిట్లు అనేవారే లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. తాను చేసిన పనిని నిస్సిగ్గుగా అతడే చెప్పిన తరువాత కూడా కాశ్మీర్ లో అలాంటి ఘటనలేవీ జరుగలేదని.. ఈ సోకాల్డ్ మేధావులు చెప్తుంటారు.
హమ్‌దానీ తాను అనుకొన్నది పూర్తిగా సాధించకుండానే కాశ్మీర్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. కాశ్మీర్ వదిలి వెళ్లిన తరువాత కూడా మనశ్శాంతితో నిద్ర పట్టటం లేదని తన సహచరుడు మహమ్మద్ ఖావారజీమ్‌కు ఓ లేఖ రాస్తాడు. ‘కాశ్మీర్‌ను పూర్తి ఇస్లామీకరించడం నా చిరకాల కల. అది పూర్తిగా నెరవేరాలి. చాలావరకు మనం సాధించినప్పటికీ.. ఇంకా అక్కడక్కడ కొందరు హిందువులు మిగిలిపోవడం.. వాళ్లు హాయిగా జీవిస్తూ ఉండటం చూస్తుంటే.. నాకు మనశ్శాంతితో నిద్ర పట్టడం లేదు’. ఇదీ ఒక సూఫీ సన్యాసి మనసులో మాట.
14వ శతాబ్ది చివరలో 1384లో హమ్‌దానీ చనిపోయాడు. అతడి కొడుకు మహమ్మద్ హమ్‌దానీ తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు. ఇతడు తండ్రిని మించిన క్రూరుడు. 1393లో మూడొందల మందిని వెంటేసుకొని కాశ్మీర్‌లో వీర విహారం చేశాడు ఈ కుమార రత్నం. ఇతడు కాశ్మీర్ లోకి వచ్చే సమయానికి కుత్బుద్దీన్ కొడుకు సికందర్ అధికారంలో ఉన్నాడు. ఇతని ప్రధానమంత్రి సైఫుద్దీన్. ఈ ముగ్గురూ కలిసి మనకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పని.. మనకు తెలియకుండా దాచి ఉంచిన మహా మారణహోమానికి కారకులయ్యారు. మిగతా ముస్లిం రాజుల మాదిరిగానే హిందువులపై జిజియా పన్ను విధించారు. సేమ్ టు సేమ్.. కన్వర్ట్.. డై.. లీవ్.. అన్న విధానాన్నే అమలు పరిచారు. ఇస్లాంలోకి మారకుండా అక్కడే ఉంటామన్న వారిని శ్రీనగర్ లోని ‘రైనావారి’ ప్రాంతంలో సజీవంగా దహనం చేశారు. ఇవాళ ఈ ప్రాంతాన్ని ‘భాట్టమజర్’ లేదా పండిట్ల స్మశాన వాటిక అని పిలుస్తారు. ఒక రోజు దాదాపు మతం మారిన వారి శరీరం నుంచి తెగి పడిన జంధ్యాల బరువు 222 కిలోగ్రాములు.. మతం మారలేక దారుణంగా హతమైన వారి శరీరాల నుంచి తెగిన జంధ్యాల బరువు 260 కిలోగ్రామలు ఉన్నాయని ప్రఖ్యాత చరిత్రకారుడు డబ్ల్యు ఆర్ లారెన్స్ రాశారు. విగ్రహాలను కరిగించి నాణాలుగా మార్చారు. కొన్ని విగ్రహాలను మసీదులకు మెట్లుగా చేశారు. హిందూ గ్రంథాలను దాల్ సరస్సులోకి తోసేశారు. ‘శ్రీనగర్ లోని అతి పెద్ద దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు. ప్రతి దేవాలయం స్థానంలో మసీదు రిప్లేస్ చేయబడింది. మహమ్మద్ హమ్‌దానీ కోరిక నెరవేరింది. తాను కోరుకున్న స్వర్గంగా కాశ్మీర్ మాపోయింది’ అని తారిక్ ఏ కాశ్మీర్ అన్న గ్రంథంలో చరిత్రకారుడు సయ్యద్ అలీ రాశాడు. వెరసి కాశ్మీర్ ప్రాచీన నాగరికత సమూలంగా నాశనమైపోయింది. ఇవాళ ‘ఛీన్ కే లేంగే ఆజాదీ’ అని జేఎన్‌యూలో విద్యార్థి ముసుగుల్లో ఉన్న ఉన్మాదులు అరుస్తున్నారు.
(సశేషం)