Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మ[/dropcap]న దేశంపై అలెగ్జాండర్‌ తో సహా  ఎంతోమంది దాడులు చేశారు. ఆక్రమణలకు ప్రయత్నించారు. ఈ దాడులు.. ఆక్రమణలు అన్నీ కూడా భారత దేశంలో ఉన్న సంపదను దోచుకోవడం కోసమే ప్రధానంగా జరిగినవే తప్ప ఇతర  ప్రయోజనాల కోసం కాదు. ప్రపంచంలోనే అత్యధిక సంపద పోగుపడి ఉన్న ప్రాంతం మనది. అందువల్లే దోపిడీదారులు వరుసగా మన దేశంమీద పడ్డారు. కానీ ఇస్లామీకరణ అనేది పూర్తి భిన్నంగా సాగింది. మూలాల్లోకి వెళ్తే దీర్ఘ కాల లక్ష్యాలు కనిపిస్తాయి. ఇస్లామీకరణతో ఏక ప్రపంచాన్ని సాధించడం అన్నది దీని ముఖ్యమైన లక్ష్యంగా కొనసాగింది. ఈ విషయంలో అరేబియాలో సంపూర్ణ విజయం లభించింది. అంతకు ముందున్న సంప్రదాయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. విగ్రహారాధన మాయమైపోయింది. సామాజిక జీవన విధానంలోనూ సమూల మార్పు చోటు చేసుకొన్నది. ఆ తరువాత 622 సంవత్సరం నుంచి 629 వరకు యూదుల మీద దాడులు జరిగాయి. 634 సంవత్సరం నుంచి 651 వరకు పర్షియా లక్ష్యంగా దాడులు కొనసాగుతూ వచ్చాయి. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తే.. పవిత్ర యుద్ధం ద్వారా ప్రపంచాన్ని సంస్కరించాలి. ఇస్లామీకరణ జరగాలి. అప్పుడే ఈ ప్రపంచం ఏక ఇస్లాం ప్రపంచంగా పరిఢవిల్లుతుంది అన్న భావనతోనే విస్తరణ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఏకేశ్వరారాధన.. అంటే అల్లా ఒక్కడే దేవుడు. అంతకు మించి మరో దేవుడు లేడు. ప్రార్థనాపద్ధతి ఒక్కటే ఉండాలి. ఇతర మార్గాలను అంగీకరించవద్దు. ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన అంశం ఒకటున్నది. ఆనాటి ఇస్లామీయుల ఆలోచనల ప్రకారం మత మార్పిడి అంటే కేవలం ధార్మికమైన విధానాన్ని మార్చుకోవడం కాదు. ప్రార్థనా పద్ధతిని మార్చుకోవడం కాదు. అంతకు ముందున్న సంప్రదాయాన్ని మూలచ్ఛేదం చేయడం. ధర్మాన్ని విధ్వంసం చేయడం. ఇతరంగా ఆలోచించే వాళ్లు గౌరవానికి అర్హులు కానే కారు. అలాంటి వారిని ఏమి చేసినా దేవుడు సంతోషిస్తాడు.. అన్న ఒక్క సైద్ధాంతిక ప్రాతిపదికతోనే ఈ దాడులన్నీ జరిగాయి. అరేబియాలో తమ అనుచరులు బలపడిన తరువాత పర్షియా లక్ష్యమైంది. 17 ఏండ్లలో పర్షియాలో ఇస్లామీకరణ జరిగిపోయింది. సిరియాను లొంగదీసుకోవడానికి ఆరు నెలలు కూడా పట్టలేదు. ప్రజలంతా తమ మూలాలను మరచిపోయారు. ఒకవిధంగా చెప్పాలంటే మరిపించారు.

మొదటి గజ్వా- ఏ- బదర్‌  నేపథ్యంలోకి వెళ్తే.. 624 సంవత్సరంలో రంజాన్‌ మాసం 17వ రోజునాడు సిరియా నుంచి తిరిగి వస్తున్న యూదు వ్యాపారులపై మహమ్మదీయుల దాడి జరిగింది. ఇది తొలి భయంకరమైన దాడి. దాదాపు 70 మంది వ్యాపారుల తలలు నరికేశారు. ఈ దాడిని గజ్వా- ఏ- బదర్‌ పేరుతో సెలబ్రేట్‌ చేసుకొన్నారు. ఈ విజయంతో వారి ఉత్సాహం ప్రబలింది. రెట్టించిన ఉత్సాహంతో యూదుల నగరాల్లోకి చొచ్చుకుపోయి దాదాపు 900 మందిని ఊచకోత కోశారు. పిల్లలు, మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వేల మందిని బానిసలుగా తీసుకొనిపోయారు. ఇస్లాం  దండయాత్రలు జరిగిన ప్రతి ప్రాంతంలోనూ ఇదే తరహా అమానవీయ ఘటనలు కొనసాగుతూ వచ్చాయన్నది గుర్తుంచుకోవాలి. అయితే మతం మారాలి. లేదంటే పురుషులు ప్రాణాలు కోల్పోవాలి. మహిళలు బానిసలు కావాలి. యూదులను మహమ్మదీయులే కాదు.. క్రిస్టియన్లు కూడా విడిచిపెట్టలేదు. రెండు ధార్మిక వ్యవస్థలు కలిసి యూదులను ఈ ప్రపంచంలో నామమాత్రం చేశాయి.

పర్షియాపై దాడి అనంతరం పక్కనే ఉన్న సింధు సరిహద్దుల్లో దాడులు మొదలయ్యాయి. ముందుగా హిందూ ఆఫ్గనిస్తాన్‌పై యుద్ధం జరిగింది. 634 సంవత్సరం నుంచి దాదాపు దశాబ్దం వరకు ఆక్రమణ పర్వం కొనసాగింది. అబు బకర్‌ తరువాత ఖలీఫా అయిన ఉమర్‌  ఆదేశాలతో సింధ్‌ సరిహద్దుల్లో నౌకా యుద్ధం మొదలైంది. 634లో థానేపై ముందుగా దాడి జరిగింది. 635లో గుజరాత్‌లోని బారూచ్‌ తీరంపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత కరాచీ దగ్గర దేబాల్‌పూర్‌ వద్ద దాడి (643 సంవత్సరం) జరిగింది.

అరేబియా, సిరియా, పర్షియాలను ఆక్రమించుకొన్నంత  సులభంగా భారత్‌ను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. తన ధర్మాన్ని, సార్వభౌమత్వాన్ని, సనాతన మూలాలను కాపాడుకోవడానికి దాదాపు 1500 సంవత్సరాలుగా ఈ దేశం నిరంతరం పోరాడుతూనే ఉన్నది. ఇవాళ్టికి కూడా. థానేపై దాడి చేసిన సమయంలో ఆ ప్రాంతాన్ని చాళుక్యులలో అత్యంత శక్తిమంతుడైన రెండో పులకేశి పరిపాలిస్తున్నాడు. అతడిని జయించి థానేను స్వాధీనం చేసుకోవడం శత్రువులకు సాధ్యం కాలేదు. 543 నుంచి 566 దాకా యావత్‌ దక్షిణ భారతాన్ని పరిపాలించిన గొప్ప రాజు పులకేశి. పశ్చిమాన గుజరాత్‌ వరకు చాళుక్య రాజ్యాన్ని విస్తరించిన పులకేశిని దాటి ముందుకు వెళ్లలేకపోయారు.

ఆ తరువాత గుజరాత్‌లోని బారూచ్‌పై దాడి చేసి గుర్జారాలను వశం చేసుకొని ఇస్లామీకరణ చేయాలన్న లక్ష్యమూ విఫలమే అయింది. ఇక్కడ విజయరాజ చాళుక్యుడు శత్రుమూకను తరిమికొట్టాడు. బారూచ్‌పై యుద్ధం దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది. కానీ విజయరాజ చాళుక్యుడు ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు బారూచ్‌పై ఇస్లామీయుల దాడి కూడా విఫలమే అయింది.

643లో అల్‌ హకమ్‌ సింధ్‌ సరిహద్దుల్లో దాడికి పూనుకొన్నాడు. కరాచీలోని దేబాల్‌పూర్‌ రేవుపై నౌకాదాడి జరిగింది. అప్పుడు ఆ ప్రాంతాన్ని ఆలోర్‌ వంశానికి చెందిన చాచ్‌ పరిపాలిస్తున్నాడు. సింధ్‌పై యుద్ధంలో విజయం సాధించామని అల్‌ హకమ్‌ ప్రకటించుకొన్నాడు. కానీ, దేబాల్‌పూర్‌ వారి స్వాధీనమే కాలేదు. చాచ్‌నామా చాలా స్పష్టంగా హిందువులు అరబ్బులపై విజయం సాధించినట్టు ప్రకటించింది. ఈ నౌకా దాడుల వల్ల ముస్లింలు భారత్‌లో ఇంచు కూడా సాధించలేకపోయారు.

(సశేషం)

Exit mobile version