Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-40

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]కా[/dropcap]శ్మీర్‌లో జరిగిన దారుణాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగింది.. చెప్పుకొని తీరాల్సింది.. మార్తాండ దేవాలయ విధ్వంసం. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత మొత్తుకొన్నా తీరని బాధ ఇది. అక్షరాలా ఏడాది పాటు  ముల్తాన్‌లో మహమ్మద్ బిన్ ఖాసిం మహత్తరమైన సూర్య దేవాలయాన్ని నామరూపాలు లేకుండా చేస్తే.. మార్తాండ దేవాలయంపై సికందర్ పెను విధ్వంసానికి పాల్పడ్డాడు. సూఫీ సెయింట్ మహమ్మద్ హమ్‌దానీ సికందర్‌కు బుత్‌షికన్ (BUTSHIKAN) అని బిరుదు కూడా ఇచ్చాడు. అంటే విగ్రహ విధ్వంసకుడు (DESTROYER OF IDOL) అని అర్థం. ఇదే భారతదేశ ప్రాచీన సంస్కృతి నాశనానికి కారణమైంది. మార్తాండ దేవాలయం అంటే సామాన్యమైన దేవాలయం కాదు. ముల్తాన్, మధేరా, కోణార్క్ దేవాలయాల కంటే కూడా ఎన్నో రెట్లు విశాలమైన.. ఎంతో ఎత్తైన దేవాలయమిది. రాజా లలితాదిత్యుడు ఎంతో అద్భుతంగా నిర్మించిన దేవాలయం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న శిథిలాలు అనంతనాగ్ జిల్లాకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇంత శిథిలమైన తరువాత కూడా ఆ శిథిలాలపై చూస్తున్న శిల్పాలు కండ్ల నిండా శాశ్వతంగా మనల్ని నిలబెడతాయి. కల్హణుడు తన కశ్మీర రాజతరంగిణిలో ఈ దేవాలయ నిర్మాణం గురించి అభివర్ణించాడు. (కస్తూరి మురళీకృష్ణ  తెలుగు అనువాదం అందుబాటులో ఉన్నది) ఈ ఆలయ నిర్మాణంలో రాజా రణాదిత్యడు, గోనంద వంశస్తుడైన ఆర్యరాజుల పేర్లు వినిపించినా.. ఈ ఆలయ నిర్మాణం మాత్రం లలితాదిత్యుడే చేయించాడని కల్హణుడు విస్పష్టంగా పేర్కొన్నాడు. దీని నిర్మాణం  భారతదేశ వాస్తు కళకు ఒక చక్కని ఉదాహరణ. ఒకటా రెండా.. గుప్తులు, గాంధారులు, చైనా, రోమ్, సిరియా, గ్రీకు.. ఇలా సమస్త వాస్తు నిర్మాణ శైలులు పుణికి పుచ్చుకొని సమగ్రంగా మహోన్నతంగా నిర్మాణమైన ఆలయం ఏదైనా ఉన్నదంటే అది మార్తాండ దేవాలయమనే చెప్పాలి. భారతదేశంలోని అతి బారీ నిర్మాణాలలో ఇది కూడా ఒకటి. అంగ్‌కార్‌వాట్ ఆలయం కంటే కూడా విశాలమైనది. విస్తారమైన చుట్టు కొలత కలిగిన దేవాలయమిది.

చతురస్రాకారపు సున్నపురాళ్లు (లైమ్ స్టోన్).. నీలి రంగు సున్నపురాళ్ల దిమ్మలు.. మోర్టార్, ఇనుప బోల్టులతో అనుసంధానం చేసిన తీరు ఇవాళ్టి ఏ సాంకేతిక నిపుణుడికీ అందదు. అర్థం కాదు కూడా. ఇలా చెప్పుకుంటే ఈ అపూర్వ నిర్మాణాన్ని వర్ణించడానికి ఎన్ని గ్రంథాలు రాసినా సరిపోవేమో.. ఇక్కడి శిల్పాలన్నీ అలంకార శిల్పాలు. ఆలయ ప్రధాన ప్రాంగణం దాదాపు 84 వరుస స్తంభాలతో కూడుకొని ఉన్నది. ఈ విశాల ప్రాంగణం మధ్యలో గర్భాలయం కొలువై ఉన్నది. అందులో మార్తాండుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఇదీ ఈ ఆలయంలోని అద్భుత సన్నివేశం.

మార్తాండ దేవాలయం గురించి తెలుసుకోకుండా దాని ధ్వంసం గురించి మాత్రమే తెలుసుకుంటే.. అని గుళ్ల మాదిరిగానే దీన్నీ కూల్చారని నిర్లిప్తత వహించవచ్చు. అందుకే దీని గురించి ఇంతగా చెప్పాల్సి వస్తున్నది. మార్తాండ దేవాలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారమే ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. దేవాలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది. అందువల్ల పశ్చిమం వైపు నుంచే ఆలయం లోపలికి వెళ్లడానికి ఒక స్వాగత తోరణంగా ఈ ప్రవేశద్వారం ఉంటుంది. చతురస్రాకారంలో.. విశాలమైన ప్రవేశమార్గంతో చేసిన భారీ నిర్మాణం ఇది. దీని శిల్పనిర్మాణ వైచిత్రిని వర్ణించడానికి ఏ కవీ బహుశా సాహసించలేడేమో. అంత గొప్ప శిల్పకళా సంపత్తి ఈ ప్రవేశ ద్వారం పై మనం చూడవచ్చు. మండపం లేదా ప్రధాన ప్రాంగణం, గర్భగృహం, అంతరాలయంగా మూడు విభాగాలుగా మనకు ఈ ఆలయం దృశ్యమానమవుతుంది. ప్రత్యేకమైన కాశ్మీర శైలి, ఉత్తర భారతీయ మందిరాల నిర్మాణ శైలి, గాంధార, బౌద్ధ నిర్మాణాల శైలి స్పష్టంగా గోచరిస్తుంది.

చతుష్కోణంగా ఆలయ ప్రాంగణం బయటి నుంచి మనకు కనిపిస్తుంది. ఈ చతుష్కోణం మధ్యలో, ఉత్తర, దక్షిణాలలో చిన్న చిన్న నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలోకి ఒక కాలువ ద్వారా నీళ్లు వచ్చేలా చేశారు. దీంతో ప్రధాన ఆలయం చుట్టూ నీళ్లు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఆలయ ప్రాంగణం 220 అడుగుల పొడవు,142 అడుగుల వెడల్పుతో విశాలంగా, విస్తృతంగా కనిపిస్తుంది. ప్రాంగణం అంచుల వెంబడి సాల వృక్షాల మాదిరిగా 84 స్తంభాలు నిలుచొని ఉంటాయి. వీటి మధ్యలో సమతల వేదికపైన 63 అడుగుల పొడవు, 36 అడుగుల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మాణమై ఉన్నది. కాశ్మీర్‌లో మిగతా ఆలయాలకు ఉన్న మాదిరిగానే.. ఇంకా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో ఇతర దేవాలయాలకు ఉన్న మాదిరిగానే మార్తాండ దేవాలయానికి కూడా గోపురం పిరమిడ్ ఆకారంలో ఉండేది. ఇప్పుడు పై కప్పే లేదు.. ఇక గోపురాన్ని గురించి ఏమని చెప్పేది? సమతల పీఠంపై నిర్మించడం వల్లనేమో.. ప్రాంగణంలో ఎటు నుంచి చూసినా ఈ ప్రధాన దేవాలయం కనిపిస్తుంది. ఈ ఆలయం మధ్యలో 18 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో గర్భాలయాన్ని నిర్మించారు. దీనికి మూడు వైపులా ద్వారాలు ఉంటాయి.  ఈ మూడు ద్వారాలు కూడా గర్భాలయానికి చేరుకొనే దిశలో ఒకే దగ్గరకు వచ్చి కలుస్తాయి. ఇది 8వ శతాబ్దపు సాంకేతిక ప్రతిభ. పశ్చిమ ముఖంలో సూర్యుడు ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి సూర్యాస్తమయంలో రవి కిరణాలు గర్భాలయంలో మూలవరులను స్పర్శిస్తాయి. గర్భగుడికి వెళ్లే దారిలో.. గర్భగుడికి ముందున్న ప్రాంగణంలో సూర్యశిల్పాలే కాదు.. విష్ణు శిల్పాలు, గంగా, యమున, సరస్వతి వంటి నదీ దేవతల శిల్పాలు.. గాలిలో ఎగిరే గంధర్వుల శిల్పాలు.. ఇలా ఎన్నెన్నో శిల్పాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ప్రాంగణంలో గాలిలో ఎగిరే గంధర్వుల శిల్పాలుగా చెప్పబడుతున్నవి.. గ్రహాంతర వాసులకు ప్రతీకలని కూడా ఒక భావన ఉన్నది. భూమ్మీదకు వారి రాకపోకలు జరిగేవనడానికి ఇవి చిహ్నాలని.. ముల్తాన్ ఆలయంలో కూడా ఇలాంటి శిల్పాలు కానవచ్చాయని ఆస్ట్రోనాట్ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక గర్భగుడికి ముందున్న గదిలో ఉన్న విష్ణు విగ్రహం మూడు తలలు, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. ఇప్పటివారు దాన్ని విష్ణు విగ్రహం అని అంటున్నారు కానీ.. వాస్తవానికి అది సృష్టికర్త బ్రహ్మ విగ్రహం కావచ్చు గోడకు శిల్పీకరించడం వల్ల మూడు తలలు మాత్రమే రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మూడు తలలు, ఎనిమిది చేతులు మనకు కనిపిస్తున్నాయి. సూర్యుడు కాలానికి ప్రతినిధి. బ్రహ్మ సృష్టికి సారథి. కాలచక్రంతోపాటే సృష్టి పరిణామ క్రమం సాగుతూ ఉంటుంది. ఈ రెండింటికీ విడదీయరాని లంకె ఉంటుంది. కాలం ఆగదు. సృష్టీ ఆగదు. ఈ రెండూ కూడా సమాంతరంగా ముందుకు సాగిపోతూనే ఉంటాయి. అందువల్లే మార్తాండ దేవాలయంలో ఈ రెండింటికి ప్రాధాన్యమిచ్చారు. ఆలయంలో విగ్రహాలు, శిల్పాలు తీవ్రంగా విధ్వంసం చేయడం వల్ల అవి ఇప్పుడు గుర్తు పట్టడానికి వీల్లేకుండా తయారయ్యాయి. ప్రధానాలయానికి నాలుగు దిక్కుల్లో కూడా నడవడానికి వీలుగా వరుస స్తంభాలతో ఒక విశాలమైన కారిడార్ (నడవా)ను నిర్మించారు. ఈ కారిడార్ ను జాగ్రత్తగా గమనిస్తే కొంతమేర అవంతీపుర ఆలయశైలి గోచరించవచ్చు. అదే సమయంలో  ఆలయం నలుదిశలా నిర్మించిన వసారా లాంటి పెరిస్టైల్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయం బయటి సరిహద్దు 270 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఉన్నది.

ఫ్రాన్సిస్ యంగ్ హస్ బండ్ అనే బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ కాశ్మీర్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇతను లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో బ్రిటిష్ ఇండియాలో పనిచేశాడు. ఆయన తూర్పు, మధ్య ఆసియా ప్రాంతం అంతటా విస్తృతంగా తిరిగాడు. కాశ్మీర్‌తో పాటు ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలు చేశాడు. కాశ్మీర్ అన్న గ్రంథంలో మార్తాండ దేవాలయం గురించి ఆయన ఎలా వివరించాడో ఆయన మాటల్లోనే చదవండి.

‘Built on the most sublime site occupied by any building in the world-finer then the site of Parthenon or of the Taj Mahal or of St.Peters or of the Escurial- we may take it as the culmination of all the rest, and by it, we must judge the Kashmir people at their best. On a perfectly open and even plane, gently sloping a way from a background of snowy mountains, looking directly out, on the entire length of both, the smiling Kashmir valley and the snowy ranges which bound it stand the ruins of a temple second only to the Egyptians in massiveness and strength and to Greeks in elegance and grace.. no one without an eye for natural beauty would have chosen that special site for the construction of a temple and no one with an inclination to the ephemeral and transient world would have built it on so massive and enduring a scale.’

ఇవాళ భారతీయులు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని పోగొట్టుకున్నారు. ముల్తాన్ తరువాత మరో అద్భుత దేవాలయమిది. కేవలం అంటే కేవలం ఇస్లామీకరణ పేరుతో భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన జిహాద్ ఫలితమే ఇది. గమ్మత్తేమిటంటే.. ఈ ఆలయాన్ని ఏ రాజూ కూడా కూల్చనే లేదని.. 1554లో కశ్మీర్‌లో పెను భూకంపం వచ్చిందని మన గొప్పనైన చరిత్రకారులు చెప్పుకొంటూ వచ్చారు (అభిప్రాయంగానే లెండి). భారతదేశ చరిత్రలో ఈ సోకాల్డ్ మార్క్సిస్టు చరిత్రకారులు, గ్రీకు చరిత్రకారులు వాళ్లు స్పష్టంగా చెప్పలేని వాటన్నింటినీ వివాదంలోకి నెట్టేసి ఫలానా ఘటనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్తారు. అంతే.. దాని చరిత్ర ఎటూ కాకుండా పోతుంది. సింధు నాగరికత ఎట్లా అంతమైనదన్న దానిపై రోమిలా థాపర్ చెప్పిన రీతిలోనే మార్తాండ ఆలయ విధ్వంసానికి సంబంధించి కూడా ఒక విచిత్రమైన కథను చెప్పారు. ఈ కథపై యూపీఎస్సీ అనే ఘనత వహించిన సంస్థ ఐఏఎస్ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్న ఏమిటంటే.. కాశ్మీర్‌లో మార్తాండ దేవాలయం ఎలా ధ్వంసమైంది? అని. దీనికి జవాబు ఏమిటంటే.. ‘దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అత్యధికులు భూకంపం వల్ల ఈ ఆలయం ధ్వంసం అయిందని భావిస్తున్నారు’ అని. ఈ జవాబు చెప్తే పాస్ అయినట్టు లెక్క. ఈ ఆలయం ఎలా ధ్వంసం అయిందో పూస గుచ్చినట్టు జోనరాజు ద్వితీయ రాజతరంగిణిలో చాలా స్పష్టంగా వివరించాడు. మిషన్ ఇస్లామైజేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా సూఫీ సాధువు సయ్యద్ మహమ్మద్ హమ్‌దానీ మార్గదర్శనంలో ఈ ఆలయ విధ్వంసాన్ని సుల్తాన్ సికందర్ చేపట్టాడు. సుల్తాన్ సికందర్ నాయకత్వంలోనే ఈ ధ్వంస రచన జరిగిందని జోనరాజు చాలా స్పష్టంగా.. వివరించాడు. (వివరాలు అరబ్, సంస్కృతంలో లభించే జోనరాజ ద్వితీయ రాజతరంగిణిలో మనకు వివరంగా లభిస్తాయి. తెలుగులో కస్తూరి మురళీకృష్ణ దీన్ని సాకల్యంగా అనువాదం చేశారు. అందులో కూడా దీని వివరాలు మూలంతో సహా విపులంగా చర్చించారు. ఇది కూడా అందుబాటులో ఉన్నది.) మీకు తెలుసా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సికందర్‌కు ఏడాది కాలం కూడా సరిపోలేదు. ఏడాది పాటు ఈ ఆలయాన్ని కూల్చడానికి అనేక రకాలుగా ప్రయత్నించాడు. చివరకు కూలీలు కూడా మా వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో ఆలయం మొత్తాన్ని కట్టెలతో నింపి కాల్చి పారేశాడు. అయినప్పటికీ.. ఇంకా ఆలయ శిథిలాలు మనకు ఇవాళ కనిపిస్తున్నాయి. అంటేనే ఈ ఆలయం ఎలాంటిదో.. ఎంత గొప్పదో.. ఎంత పటిష్ఠమైనదో.. ఎంత కఠినమైన శిలలతో నిర్మించ బడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో సూఫీలు సాధారణ ముస్లిం రాజుల కంటే కూడా పైశాచికంగా ప్రవర్తించారు. సికందర్ ఆస్థానంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సూహభట్టు.. ఇస్లాం మతం స్వీకరించి మాలిక్ సైఫుద్దీన్‌గా మారాడు. ఈయన ఈ సూఫీల ద్వారా, ముస్లిం రాజులు కాశ్మీర్‌లో ధ్వంసం చేసిన ఆలయాల చరిత్రనంతా రికార్డు చేశాడు కూడా. ఇవేవీ మన చరిత్రకారులకు ఎంతమాత్రం పనికిరాలేదు.

సూఫీ సాదువులు ఎంత మతోన్మాదులంటే చెప్పనలవి కాదు. 1423-1474 మధ్య కాలంలో జైనులాబ్దీన్ హయాంలో కాశ్మీర్‌లో కొంత ప్రశాంత వాతావరణం నెలకొన్నది. కొద్ది రోజులు మతాల మధ్య సహన శీలత కొనసాగింది. సూఫీలు ప్రవేశించారు.. అక్కడ శాంతి కపోతం ఎగిరిపోయింది. బహారిస్తాన్ ఎ షాహీ అనే పర్షియన్ గ్రంథం ప్రకారం అమీర్ షంషుద్దీన్ మహమ్మద్ ఇరాకీ అనే సూఫీ.. కాశ్మీర్‌లో మతోన్మాదాన్ని మళ్లీ పెచ్చరిల్లజేశాడు. తోహఫాత్ ఉల్ అహబాద్ అనే ఆ కాలం నాటి ఇస్లామీ రాత ప్రతి ప్రకారం సుల్తాన్.. ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. అదేమంటే.. ప్రతి రోజూ 1500 నుంచి 2000 మంది హిందువులను పట్టుకొచ్చి షంషుద్దీన్ మహమ్మద్ ఇంటి ముందు నిలబెట్టాలి. ఆయన ఇంటి ముందుకు వచ్చి వారి జంధ్యాలను తెంపేస్తాడు. వాళ్లందరూ తప్పనిసరిగా కల్మా (ఇస్లాం పట్ల విశ్వాసం ప్రకటించడం) పదే పదే చదవాలి. ఆ తరువాత బీఫ్ మాంసం తినాలి. పీర్ గులాం హసన్ ఖుయిహమీ రాసిన తారిఖ్ ఏ హసన్ గ్రంథంలో ఈ షంషుద్దీన్..  దాదాపు 24 వేల మంది హిందువులను బలవంతంగా మతం మార్పించారని పేర్కొన్నారు.

పొరపాటున నిర్మల్ కాంతభట్ అనే హిందూ నాయకుడు.. మతం మార్చుకున్న కొన్ని కుటుంబాలను తిరిగి హిందూ మతంలోకి మార్చాడు. ఈ వార్త విన్న షంషుద్దీన్ తీవ్రంగా ఆగ్రహించాడు. కోపం కట్టలు తెంచుకొన్నది. సుల్తాన్ ఆదేశాలు తీసుకొని మాలిక్ ఖాజీ చాక్ అనే సైనిక అధికారి నేతృత్వంలో 1518 సంవత్సరం మొహర్రం రోజున ఒకే రోజు.. అంటే 24 గంటల వ్యవధిలో 800 మందిని (సమాజంలో గౌరవ స్థానంలో ఉన్న కొందరు పెద్దలతో సహా) ఊచ కోత కోసి పైశాచికంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. కాశ్మీర్ లోయలో ఉన్న హిందువులు అందరూ కూడా బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు. మాలిక్ కాజీ చాక్ సాధించిన అతి గొప్ప విజయంగా బహారిస్తాన్ ఎ షాహీ గ్రంథం అతడిని ఆకాశమంత కొనియాడింది. కానీ మన భారతీయ చరిత్రకారులు, సినిమా వాళ్లు.. ఈ నిజాలను తెరమరుగు చేసి కాశ్మీర్‌లో సూఫీలో మత సామరస్యం కోసం పాటుబడిన మహాత్ములుగా చిత్రీకరిస్తూ వచ్చారు.

(సశేషం)

Exit mobile version