Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-47

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]బెం[/dropcap]గాల్ విభజన గురించి.. అందులో వందేమాతరం ఉద్యమం గురించి ప్రస్తావించకుండా మనం దేశ విభజన గురించి మాట్లాడుకోవడం సరి కాదు. 1905లో జరిగిన బెంగాల్ విభజన ఎందుకు రద్దు అయింది.. 1947లో జరిగిన దేశ విభజన ఎందుకు ఆగిపోలేదు? ఈ రెండింటి మధ్యన అంతరం ఏమిటి? బెంగాల్‌ను తూర్పు పశ్చిమ ప్రావిన్సులుగా విడగొట్టిన కర్జన్.. నెలల తేడాతోనే ఇంగ్లండ్ వెళ్లి అక్కడి రాజకీయాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. బ్రిటన్ ప్రధాని కావాలని తీవ్రంగా ప్రయత్నించాడు కానీ.. కాలేకపోయాడు. అతడు భారత్‌లో పెట్టిన చిచ్చు.. ఈరోజుకు కూడా ఈ రోజుకు కూడా చల్లారలేదు. 1905లో బెంగాల్ అక్టోబర్ 16 నుంచి బెంగాల్ మతపరమైన విభజన అమలులోకి వచ్చింది. ఈ విభజనను బెంగాలీలు అందరూ తమకు తీరని అవమానంగా భావించారు. తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. ఆనాటి సామాన్య ప్రజల్లో ఎలాంటి మతపరమైన సంశయాలు, భేదభావాలు లేనేలేవు. బెంగాలీలు మాట్లాడే ప్రాంతమంతా ఒకే ప్రావిన్సుగా ఉండాలనే వారు కోరుకున్నారు. అవసరమనుకొంటే బెంగాలీ భాష మాట్లాడని ప్రాంతాలను వేరు చేసి కొత్త ప్రావిన్సును ఏర్పాటు చేసుకోవాలని కూడా బ్రిటీష్ ప్రభుత్వానికి సూచించారు. కానీ, బ్రిటీష్ ప్రభుత్వం దేశీయ నాయకుల మాటలను పట్టించుకొనేలేదు. దీంతో బెంగాల్ పరిరక్షణ కోసం, బెంగాల్ ఐక్యత కోసం పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. బెంగాల్ కోసం మొదలైన బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమం.. ఏడాది తిరిగేసరికి యావత్ దేశమంతటికీ విస్తరించి.. జాతీయోద్యమంగా రూపాంతరం చెందింది. బెంగాలీలే కాదు.. భారతీయులందరూ ఒక్కటే అన్న స్ఫూర్తిని బ్రిటీష్ వారికి చాటి చెప్పింది. బెంగాల్‌లో హిందూ ముస్లింలు కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు.

వందేమాతరం ఉద్యమంలోకి వెళ్లడానికి ముందు మరో ముఖ్య విషయం మనం ప్రస్తావించుకోవాల్సి ఉన్నది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరగడానికి 25 సంవత్సరాలకు ముందే.. యంగ్ బెంగాల్ ఉద్యమం కలకత్తాలో మొదలైంది. భారతదేశంలో స్వదేశీ మూలాలను పాదుకొల్పిన ఉద్యమం ఇది. దీనికి సారథ్యం వహించిన వారు.. హెన్రీ లూయీస్ వివియన్ డెరోజియో (1809-1831).. స్వతంత్ర బెంగాల్ ఆలోచనాపరులకు ఈయన నాయకత్వం వహించాడు. కలకత్తా హిందూ కాలేజీలో ఆయన పాఠాలు చెప్పేవాడు. ఆయన తన విద్యార్థులందరిలోనూ మాతృభూమి గురించిన చైతన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన అనుచరులందరినీ డెరోజియన్లని కూడా పిలిచేవారు. డెరోజియో బ్రిటిషర్ కాడు. ఈయన పోర్చుగీసు మూలాలున్నవాడు. ఫ్రెంచి విప్లవం నుంచి స్ఫూర్తి పొందిన డెరోజియో.. భారతదేశంలో కూడా ప్రేమ, సమానత్వం, స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నాడు. ఒక పక్క బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలకు చైతన్యం కలిగిస్తూనే.. ఫ్రెంచి విప్లవం మాదిరిగా భారత్ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చాలని తన విద్యార్థుల్లో ప్రేరణ కలిగించాడు. అదే సమయంలో విజ్ఞాన శాస్త్రాన్ని కూడా ఆయన తిరస్కరించలేదు. రాజారామ్మోహన్ రాయ్ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్లాడు. రాసిక్ కృష్ణ మల్లిక్, రామ్ గోపాల్ ఘోష్, హరచంద్ర ఘోష్, సిబ్ చంద్ర దేబ్, కృష్ణ మోహన్ బెనర్జీ, దక్షిణ రంజన్ ముఖర్జీ, మధబ్ చంద్ర మల్లిక్, రామ్ తను లాహిరి, మహేశ్ చంద్ర ఘోష్ వంటి విద్యార్థులు డెరోజియో ప్రభావానికి లోనయ్యారు. బ్రహ్మ సమాజానికి చెందిన బ్రజేంద్రనాథ్ సీల్ కూడా డెరోజియో ఉద్యమానికి ప్రభావితమైన వారే. దేశంలో జాతీయోద్యమ తొలితరం కవుల్లో డెరోజియో కూడా ఒకరు. బెంగాల్ విభజనకు దాదాపు 80 సంవత్సరాలకు ముందే భారతదేశాన్ని తల్లిగా దర్శించి, తన విద్యార్థుల్లో భారతమాత పట్ల భక్తి భావాన్ని ప్రేరేపించాడు. ఇది సుదీర్ఘ కాలంలో జాతీయోద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఆయన భారతమాత గురించి రాసిన కవిత్వ పంక్తులివి..

అతి వైభవం గల ప్రాచీన కాలంలోని నా దేశమా!
నీ శిరస్సు చుట్టూ పరమ సుందరమైన తేజోవలయం
ఆనాడు దేవతగా నిన్ను ఆరాధించాము
ఈనాడు ఏదీ ఆ వైభవం? ఏదీ ఆ పూజ్య భావం?
క్రూరమైన ఒక గ్రద్ద దంష్ట్రలకు కట్టుబడ్డావీ నాటికి
ధూళిలో నీవు సాష్టాంగ పడుతున్నావు
కాల సముద్రపు లోతుల్లో ఒకసారి ఈది
గతించిన అనేక యుగాల సందోహంలో నుంచి
శిథిలమైన ఉజ్జ్వల శకలాలను తీసుకురానీ నన్ను
ఈ మనిషి కంటికి ఎప్పుడూ విశిష్టంగా తోచనివి అవి
ఓ పతితమైన దేశమా, నీ కోసం ఒక మంచిమాట
నా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని వెలయించుకోనీ
(డెరోజియో కవితకు ఛాయానువాదం, చందనశాఖి, కోవెల సుప్రసన్నాచార్య, పే.31)

బెంగాల్ ఉద్యమం ప్రారంభానికి 80 సంవత్సరాలకు ముందే.. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పాతికేండ్లకు ముందే భారతమాత అన్న సమున్నతమైన భావోద్వేగానికి బీజం పడింది. బెంగాల్‌లో దీర్ఘకాల స్వాతంత్ర్య ఆకాంక్షకు డెరోజియో ప్రారంభించిన యంగ్ బెంగాల్ ఉద్యమం ఊపిరులూదింది. కేవలం 22 సంవత్సరాలు మాత్రమే జీవించిన డెరోజియో 1831 డిసెంబర్ 26న కలరా వ్యాధి వల్ల చనిపోయాడు. కానీ డెరోజియో మార్గంలో యంగ్ బెంగాల్ ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. ఆయన అనుచరులు ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకొనిపోయారు. ఒక డెరోజియో పది మంది విప్లవాత్మకమైన ఆలోచనాపరులను సృష్టించాడు. బెంగాల్ పునరుజ్జీవనంలో ఈ ఉద్యమం తీవ్రమైన ప్రభావం చూపించింది. 1828 నుంచి 1843 మధ్య కాలంలో జ్ఞానన్వెసన్, పార్థెనాన్, ఎంక్వైరర్, హిందూ పయనీర్, క్విల్, బెంగాల్ స్పెక్టేటర్ వంటి జర్నల్స్ ద్వారా ప్రజల్లో చైతన్య దీప్తిని యంగ్ బెంగాల్ మేధావులు రగిలించారు. “The pioneers of the modern civilisation of Bengal, the conscript fathers of our race whose virtues will excite veneration and whose failings will be treated with the gentlest consideration” అని డెరోజియన్లను సురేంద్రనాథ్ బెనర్జీ కొనియాడారు.

బెంగాల్‌లో ఒకదాని తరువాత ఒకటిగా స్వదేశీ ఉద్యమాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే వచ్చాయి. ఎవరికి వారు తమదైన మార్గంలో ఉద్యమాలను నిర్మిస్తూ పోయారు. బ్రహ్మ సమాజం, ప్రార్థనాసమాజం, ఆర్య సమాజం ఇవన్నీ కూడా ఒక పక్క సామాజికంగా సంస్కరణోద్యమాలుగా కొనసాగుతూనే.. భారతీయుల్లో స్వదేశీ కాంక్షను రగుల్కొలుపుతూ వచ్చాయి. బ్రహ్మ సామాజికులు తొలినాళ్లలో కాస్త క్రైస్తవ ముఖం కప్పుకున్నా.. ఆ తరువాత దాన్ని తొలగించుకొని.. భారతీయ మూల్యాలను సమగ్రంగా వ్యాఖ్యానించారు. ‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’ అన్న వేద సూక్తానికి రామకృష్ణ పరమహంస బోధనలు వ్యాఖ్యానాలుగా మారాయి. భారతదేశంలో నిద్రాణమైన కుండలిని శక్తిని రామకృష్ణులు మేల్కొలిపారు. కల్నల్ ఆల్కాట్, అనీబిసెంట్, మేడమ్ బ్లావట్ స్కీలు కలిసి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. ఇవన్నీ కూడా పాశ్చాత్య విద్యావిధానంతో ధ్వంసమైన భారతీయ అవిచ్ఛిన్న సంప్రదాయ, సంస్కృతిని, మూలాలను సమూల విచ్ఛిన్నం కాకుండా కాపాడే దిశగా ఉద్యమ నిర్మాణం చేశారు. ఇందులో భాగంగానే సంస్కరణలూ కొనసాగాయి. మూఢ విశ్వాసాలను తొలగిస్తూనే.. భారతీయ మూల సంస్కృతిని కాపాడుతూ వచ్చారు. అందువల్లనే ఈ ఉద్యమాలన్నీ కూడా కాలక్రమంలో జాతీయోద్యమానికి పరోక్షంగా తిరుగులేని బలాన్ని సమకూర్చి పెట్టాయి. అప్పటికే డెరోజియో కవితాత్మ మళ్లీ బంకించంద్ర చటోపాధ్యాయలో మేల్కొన్నది. వందేమాతర గేయాన్ని మహా మంత్రంగా ప్రతిధ్వనించింది. ఆనందమఠం నవలలో ఆయన రాసిన వందేమాతర గేయం నవలలోనే దాదాపు మూడు దశాబ్దాల పాటు నిద్రాణమై ఉండిపోయింది. ఈ ఉద్యమాలు రాకపోయి ఉంటే.. మన సంస్కృతి, నాగరికత, ప్రాచీన మూలాలు ధ్వంసం అయి ఉంటే.. ఇవాళ మన దేశం సగం క్రైస్తవం, సగం ఇస్లాం దేశాలుగా రూపాంతరం చెందేవి. కానీ మన ధర్మము అత్యంత ప్రాచీనమైంది. ఇందులోని చేవ ఎప్పటికీ చావదు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. తీవ్రమైన దాడులను ఎదుర్కోవచ్చు కానీ, దీన్ని ప్రలుప్తము చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని సంరక్షించడానికి రుషులు, యోగులు ప్రభవించని యుగం లేదు. శకం లేదు. సంభవామి యుగే యుగే అన్న మాటను నిజం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ దేశపు సనాతనమైన ధర్మాన్ని రక్షించడానికి పైన చెప్పిన వారంతా రకరకాల రూపాలలో అవతరించి.. రకరకాల మార్గాలలో ధర్మ సూత్రాన్ని ముందుకు తీసుకొని పోతూ వచ్చారు.

ఈ ఉద్యమాల కొనసాగింపులోనే దేశం 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే బెంగాల్ విభజనతో బ్రిటీష్ వాడు కత్తిపోటు పొడిచాడు. కానీ ఆ కత్తిపోటు.. బ్రిటీష్ వాడినే తిరిగి నరికే పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకూ దేశమంతా ఏకరీతిన సాగని స్వాతంత్ర్యోద్యమం కేవలం ఐదేండ్ల వ్యవధిలో జాతీయోద్యమంగా పరిణమించింది. ప్రజల్లో గుంభనంగా ఉన్న మాతృభూమి భావన ఒక్కసారిగా పెల్లుబుకింది. తమ మాతృభూమిని చీల్చారన్న ఆగ్రహం ఒక్కసారిగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తీవ్రమైన ఉద్యమ నిర్మాణానికి దారి తీసింది. బంకించంద్రుడి వందేమాతర గేయం మహామంత్రంగా పరిణమించింది. తన మాతృభూమి భంధ విముక్తికి ఏం కావాలో.. ఏం చేయాలో ఆయనకు స్పష్టంగా గోచరించింది. అందుకే ’తుమి విద్య తుమి ధర్మ.. తుమి హృది తుమి మర్మ.. త్వంహి ప్రాణ శరీరే.. బాహుతే తుమి మా శక్తి.. హృదయే తుమి మా భక్తి..’ అన్నాడు. పాలకుల నిర్బంధ శక్తిని బలంగా ఎదుర్కోవాలంటే, పాలితులకు దృఢమైన శక్తి, జాతి బలం కావాలన్నది ఆయన ఆకాంక్ష. బంకించంద్రుడికి సాక్షాత్కరించిన భారతమాత బిచ్చగత్తె కాదు. వీర స్వరూపిణి కాదు. చేతిలో జోలె పట్టుకొని తనను బంధ విముక్తురాలిని చేయాలని కోరుకొన్న అబల కాదు.. కోట్లాది భుజోధృత ఖడ్గధారిణి.. (కోటి కోటి భూజైధృక కర ఖరవాలే.. అన్నాడు). మన భుజబలానికి, ధర్మ బలానికి ఉండవలసిన అంతఃశక్తి అంతా అమ్మే. అప్పటి వరకు జరుగుతుందో కాదో.. బ్రిటీష్ వాళ్లను ఎదుర్కోగలమో లేదో.. అన్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఎందుకంటే ఏ ఉద్యమమైనా సరే.. అందరూ ముందుకు రారు. కొందరు మాత్రమే ముందుండి నడిపిస్తారు. దేశమా కుటుంబమా అన్న మీమాంస వచ్చినప్పుడు సామాన్యుడైన వాడు ముందుగా కుటుంబం గురించే ఆలోచిస్తాడు. అన్నింటినీ త్రోసి రాజనుకొని ముందుకు రావడం జరగాలంటే ఒక మహత్తరమైన ప్రేరణ కావాలి. అది నిరంతరం.. నరనరానా ప్రవహించి.. ఆత్మను ఆవహించాలి. అది వందేమాతరం అయింది. దేశమంటే మట్టి కాదు.. మనుషులు అని మాట్లాడినంత సరిపోదు.. దేశం దివ్య సౌందర్యమైన సంపన్నమైన మహా మోహనమైన మాతృమూర్తిగా, జగదంబగా, పరాశక్తిగా గోచరించనప్పుడు.. అనంతమైన శక్తి మనకు కలుగుతుంది. బంకించంద్రుడు ఈ గేయాన్ని రాసినప్పుడు దీన్ని వినిన వాళ్లే లేరు. కానీ.. బెంగాల్ విభజన అనంతరం దిక్కుతోచని పరిస్థితుల్లో ముందుకు తీసుకొనిపోయే చుక్కాని కనిపించని అత్యంత అయోమయ పరిస్థితుల్లో ఎవరో పుణ్యాత్ముడు వందేమాతరాన్ని నినదించాడు. ఒక్కసారి మంత్రం ఉచ్చరితమైనదో.. దాని ప్రకంపనలు భారతదేశపు ఆకాశమంతటా ప్రతిధ్వనించాయి. కోట్లాది గొంతులు వందేమాతరాన్ని నినదించడంతో భరతమాత దర్శనమైంది. మాత ప్రత్యక్షమైనది. దేశమంతా ‘దేశారాధన’ మతం స్వీకరించింది. ఒక్కసారిగా ఆలయ నిర్మాణం, బింబ ప్రతిష్ఠ, బలి సమర్పణ, దివ్య దర్శనం లభిస్తే ఎలా ఉంటుంది.. వందేమాతరం భరతమాత దివ్యదర్శనాన్ని అలా కల్పించింది. ఇక ఈ దేశం దాస్యానికి ఏ మాత్రం లొంగదు.. ఈ జాతికి తిరుగు లేదు. ఈ ఉద్యమానికి నిద్ర లేదు.. ఆపు లేదు.. దీన్ని నిలువరించే శక్తి ఏ ఒక్కరికీ లేదు.. ఇది కేవలం బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. యావత్ దేశానికి విస్తరించింది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలకరించినా వందేమాతరమే..

ఇక బెంగాల్ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. బెంగాల్ విభజన జరిగిన రోజునే అంటే 1905 అక్టోబర్ 16 న ఒక్క బెంగాల్ లోనే కాదు.. దేశమంతటా సంతాపం, ఉపవాస దీక్షలు పాటించారు. మహాత్మాగాంధీ జాతీయోద్యమ యవనికపై ప్రవేశించిన తరువాతే అహింస, సత్యాగ్రహం అన్న ఆయుధాలు సమకూరాయి అని మనకు తెలిసినంత వరకు అనుకొంటాం. కానీ.. ఈ దేశంలో మౌలికంగానే ఆ రకమైన లక్షణం ఉన్నది. సామదానభేద దండోపాయాలు మనం ముందు నుంచీ పాటిస్తున్నవే. బెంగాల్ ప్రేరితంగా దేశమంతటా ప్రారంభమైన ఉద్యమం ముందుగా సంతాపం, ఉపవాసాలతో మొదలైంది. స్వదేశీ నినాదం ఊపందుకొన్నది. విదేశీ వస్తు బహిష్కరణ మహత్తరమైన ఆయుధంగా మారింది. ఆ తరువాత మహాత్మాగాంధీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చాడు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావడం కోసం అనేక రకాల ఉద్యమ రూపాలు ఆవిష్కారమయ్యాయి. స్వదేశీ సంస్థల ఏర్పాటు ఊపందుకొన్నవి. భారతీయులు స్వదేశీ నూలు మిల్లులు, సబ్బులు, అగ్గిపెట్టల కర్మాగారాలు, చేనేత వ్యవస్థల దగ్గరి నుంచి చివరకు జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలను కూడా ఏర్పాటు చేయడం ప్రారంభించారు. బెంగాల్ సహా దేశ వ్యాప్తంగా అనేక స్వదేశీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే… బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్‌ను ప్రారంభించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కలకత్తాలో స్వదేశీ స్టోర్‌ను ప్రారంభించారు. ఊహించని విధంగా ఒక్కుదుటున భారతదేశంలో ఒకదాని వెంట ఒకటిగా చేసుకుంటున్న పరిణామాలు బ్రిటీష్ పాలకులకు ఒక విధంగా దిక్కుతోచని పరిస్థితిని కల్పించాయి. ఇదంతా ఒక వైపు సాగుతుండగానే.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మేధావులు మాత్రం ఈ విభజనను ఆసరా చేసుకొని.. ప్రత్యేక దేశ ఏర్పాటు ఆకాంక్షకు ఆజ్యం పోయడం మొదలు పెట్టారు. ఇందుకు నాందిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడానికి పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

(సశేషం)

Exit mobile version