Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-49

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]బెం[/dropcap]గాల్‌లో మొదలైన వందేమాతరం ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి ముందుకు నడిపించింది అతివాదులే. వారిలో ముఖ్యలు లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్.. ఇప్పుడు కొందరు లిబరల్స్ దేశంలో హిందుత్వ భావనను ప్రేరేపించింది వినాయకరావు దామోదర్ సావార్కర్ అని అనుకుంటారు. కానీ హిందుత్వ భావనను జాతీయోద్యమం ద్వారా విస్తరింపజేసింది పైన పేర్కొన్న నలుగురే. వందేమాతరం ఉద్యమానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు నాయకత్వం వహించారు. మహారాష్ట్రలో తిలక్, పంజాబ్‌లో లాలా లజపతిరాయ్, మద్రాస్‌లో చిదంబరం పిళ్లై, ఆంధ్ర ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్, పంజాబ్‌లో అజిత్ సింగ్, బారాసోల్‌లో అశ్వని కుమార్ దత్త, ఢిల్లీలో సయ్యద్ హైదర్ రజా వంటివారు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నాయకుడు భారత స్వాతంత్ర్యోద్యమానికి బీజం వేశారు. వందేమాతరం ఈ దేశాన్ని అమ్మగా సాక్షాత్కరింపజేస్తే.. ప్రతి పౌరుడిలోనూ మాతృమూర్తి భావన పెల్లుబుకింది. ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను అన్న అస్మిత దర్శనమైంది. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన.. ‘భరత ఖండంబు చక్కని పాడియావు.. హిందువులు లేగదూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి’ అన్న పద్యంలో ఈ స్వాతంత్ర్యాకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక్క తెలుగునాటే కాదు.. భారతీయ సాహిత్యమంతటా ఈ భావ ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్న నేతలకు ప్రజలకు ఈ సాహిత్య ప్రవాహం ఉత్ప్రేరకంలా పనిచేసింది. ఇది ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చేదాకా.. వచ్చిన తరువాత కూడా కొనసాగుతూ వచ్చింది.

బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమ ప్రచారానికి ఊపిరులూదారు. 1907లో ఆయన ఆంధ్రాప్రాంతం అంతటా పర్యటించారు. ఆయన ప్రసంగాలను చిలకమర్తి వారే అనువాదం చేశారు. మరోవైపు శ్రీపాద కృష్ణమూర్తి వందేమాతరం పత్రికను నడిపించారు. ‘వందేమాతరం.. మనదే రాజ్యం’ అన్న నినాదం ఈ పత్రిక ద్వారానే ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది.

బెంగాల్ విభజన ఉద్యమం లేదా వందేమాతరం ఉద్యమం కేవలం భౌతిక (ఫిజికల్ ఫాం) రూపంలోని స్వపరిపాలన మాత్రమే కాకుండా అంతర్గతంగా సాంస్కృతికంగా వెయ్యేండ్లుగా సాగిన విధ్వంసంపైన కూడా యుద్ధం ప్రకటించింది. కేవలం రాజకీయ ఉద్యమంలా మాత్రమే కాకుండా భారతీయమైన ఆత్మను ఆవిష్కరింపజేసేందుకు ప్రయత్నం చేశారు. తిలక్, రవీంద్రుడు, అరవిందులు, వివేకానందుడు వంటి వారు ఒక రాజకీయ రంగానికో.. లేక మరో రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. వారి ప్రభావం, దర్శనం, ఉద్యమం, జీవనం అన్నీ కూడా వెయ్యేండ్ల ముస్లిం దురాక్రమణలు, దండయాత్రలు, తరువాత పాశ్చాత్యుల ఆధిపత్యం వల్ల నిద్రాణమై ఉన్న భారతీయ అంతశ్చేతనను మేల్కొలిపాయి. తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించాడు. స్వరాజ్ ఉద్యమం కోసం నిధి సమీకరణ చేశాడు. ఠాగూర్, అరవిందులు జాతీయ విద్యావిధానం వైపు ప్రజలకు మరల్చే ప్రయత్నం చేశారు. వివేకానందుడు ఆధునిక వేదాంత ఉద్యమం చేపట్టాడు. ఆయన ప్రభావంతో చైతన్యవంతుడైన శ్రీఅరవిందులు భారత దేశానికి సాంస్కృతిక స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమూ.. రాజకీయ స్వాతంత్ర్యమూ ఆయువుపట్టు అని ప్రకటించాడు. ఇందు ప్రకాశ్ పత్రిక (బొంబాయి నుంచి వచ్చేది) లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాసాలను రాశాడు. ఈ దేశానికి జాతీయత అన్నదే ఒక మతమని స్పష్టంచేశాడు. ఇది భారతీయ ఆత్మకు సంబంధించింది. దీనికి ప్రేరణ వందేమాతర గీతమైంది. బెంగాల్ ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకున్న దశలో అలీపూర్ జైల్లో ఉన్న అరవిందులకు వాసుదేవ సాక్షాత్కారం జరిగింది. ఆ తరువాత రాజకీయ పోరాటాన్ని విరమించి సాంస్కృతిక పోరాటం వైపు ప్రజలను నడిపించేందుకు పాండిచ్చేరికి వెళ్లిపోయారు. యావద్భారత దేశానికి నాయకత్వం వహించగల నాయకుడు వందేమాతర ఉద్యమ కాలంలో ఒకే ఒక్కడు బాలగంగాధర్ తిలక్ మాత్రమే. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కేవలం ఆంగ్ల విద్యావంతులతో, ఆంగ్ల భాషా మేధావులతో చర్చలు చేస్తూ ఉంటే.. సామాన్య ప్రజల్లోకి చొచ్చుకొని పోగలిగింది తిలక్ మహాశయుని మాటలు మాత్రమే. ఆయన ఉపన్యాసాలు, కార్యాచరణ మాత్రమే దేశమంతటా ప్రజలను స్వాతంత్ర్యోద్యమానికి అభిముఖంగా నడిపించినవి. సామూహికంగా ప్రజలను ఏకం చేయడం కోసమే ఆయన శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు. ఆ తరువాత గణేశ నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ప్రారంభించాడు. ఈ రెండూ కూడా అనేక నిర్బంధాల నడుమ కూడా ప్రజలను సామూహికంగా ఏకమయ్యేలా చేశాయి. ఒక చోట చేరే అవకాశాన్ని కల్పించాయి. ఇక్కడ అనేక రూపాల్లో స్వాతంత్ర్య కాంక్షను ప్రజల్లో రగిలించడంలో తిలక్ విజయవంతమయ్యారు. ఆయన చూపించిన మార్గం ఇవాళ్టికీ అనుసరణీయంగా దేశమంతటా సాగుతున్నది. ఆయన్ను కొందరు విప్లవ నాయకుడన్నారు. కానీ.. ఆయన జాతీయ నాయకుడు. ఆయన అతివాదమే యావత్ జాతిని స్వాతంత్ర్యం దిశగా కార్యోన్ముఖం చేసిందనడంలో సందేహం లేదు. బెంగాల్ ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం తీర్మానాలకు మాత్రమే పరిమితమైంది. ఇతర మార్గాల్లో కొనసాగిన ఉద్యమమే దాన్ని విజయపథం వైపు నడిపించింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 1885లోనే పురుడు పోసుకొన్నది. కానీ.. ఈ పార్టీ ప్రధాన లక్ష్యం ‘పూర్తి స్థాయి స్వాతంత్ర్యోద్యమం’ కాకుండా పోయింది. ఏటా డిసెంబర్ నెలలో దేశంలో ఏదో ఒక ఊళ్లో మూడు రోజుల పాటు సమావేశాలు పెట్టుకోవడం.. బ్రిటీష్ పాలకులకు ఏవో కొన్ని విన్నపాలు చేయడం వాళ్లు అలవాటు చేసిన చాయ్ పానీ, బిస్కత్తులు తిని ఎవరిళ్లకు వారు వెళ్లిపోవడం జరిగేది. అశ్వని కుమార్ దత్ కాంగ్రెస్ వాళ్ల సమావేశాలను ‘మూడు రోజుల తమాషా’ అని అభివర్ణించారంటే అది ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ సభలు ఎలా జరిగేవంటే.. ‘pray, petition, protest’ అన్న పద్ధతిలో సాగేవి. పాలకులను ప్రార్థించడం, పిటిషన్లు సమర్పించడం, ధర్నాలు చేయడం.. ఇంతకు మించి అప్పటికి కాంగ్రెస్ చేసిన ఉద్యమం అంటూ ఏమీ లేదు. బిపిన్ చంద్రపాల్ ‘institution of solicitation’ అని కాంగ్రెస్ పార్టీని అభివర్ణించాడు. పదవుల కోసం ఆకలిగొన్న నాయకుల పార్టీగా బంకించంద్రుడు సైతం విమర్శించారు. బెంగాల్‌ను విభజించిన కర్జన్ కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయే దశకు చేరుకొన్నదని.. దాన్ని ప్రశాంతంగా చనిపోయేలా చేయడమే తన గొప్ప కోరిక అని అన్నాడు. ఏడాదికోమారు కప్పల తక్కెడ మాదిరిగా సమావేశం కావడం వల్ల మనం ఏమీ సాధించలేమని.. స్వరాజ్యం ఎవరో ఇస్తే తీసుకొనే భిక్ష కాదని.. ‘స్వరాజ్యం నా జన్మ హక్కు.. పోరాటం ద్వారానే దాన్ని సాధిస్తాను’ అని నినదించాడు తిలక్. కాంగ్రెస్ పార్టీ ఆయన మాటల్ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయన తనదైన మార్గంలో పోరాటాన్ని కొనసాగిస్తూ పోయారు.

వందేమాతర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర

వందేమాతర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఎలా కొనసాగిందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 1905 అక్టోబర్‌లో బెంగాల్ విభజన అమల్లోకి వస్తే కొద్ది రోజులకే బెనారస్‌లో కాంగ్రెస్ సమావేశమైంది. ఆర్థిక బహిష్కరణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, స్వదేశీ ఉద్యమాన్ని బలపరచాలని బెంగాలీ ప్రతినిధులు కోరారు. ఆ సమావేశానికి గోపాల కృష్ణ గోఖలే అధ్యక్షత వహించారు. బెంగాల్ విభజనను ఖండించి స్వదేశీ ఉద్యమానికి మద్దతు పలుకుతూనే.. మెలిక పెట్టారు. బ్రిటీష్ యువరాజు దేశ పర్యటనకు వస్తున్నందున ఆయన పట్ల ఎలాంటి అమర్యాద చర్యలు సరికాదని, ఆయనకు స్వాగతం పలుకుతూ తీర్మానాన్ని ఆమోదిద్దామని గోఖలే ప్రతిపాదన తీసుకొని వచ్చారు. కానీ లాలా లజపతిరాయ్, తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ వంటి వాళ్లంతా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇలా లొంగిపోయినట్టు ఉంటే ఎప్పటికీ స్వాతంత్ర్యం రాదని వీరి కచ్చితమైన అభిప్రాయం. 1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో తిలక్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని అతివాదులు భావించారు. కానీ, దాదాభాయ్ నౌరోజీ పేరును గోఖలే ప్రతిపాదించారు. ఆ సమావేశంలో స్వదేశీ, స్వరాజ్ వంటి తీర్మానాలను ఆమోదించినప్పటికీ.. జాతీయ కాంగ్రెస్ దూకుడుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోలేదన్నది వాస్తవం. అదే సమయంలో బాలగంగాధర్ తిలక్ అధ్యక్షుడు అయి ఉంటే కాంగ్రెస్ ప్రస్థానం వేరుగా ఉండేది. వందేమాతరం ఉద్యమమే బ్రిటీష్ వాళ్ల పాలనకు చరమగీతం పాడేదేమో కూడా. వందేమాతరం ఉద్యమం బెంగాల్ పరిధి దాటి దేశమంతా విస్తరింపజేయడాన్ని కాంగ్రెస్ లోని మితవాదులు వ్యతిరేకించారు కూడా. కాంగ్రెస్ వ్యవహారం బ్రిటీష్ పాలకులకు మాత్రం ఆనందాన్నే కలిగించిందని చెప్పవచ్చు. 1907లో సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఈ సమావేశం ఏర్పాటే విభేదాలతో మొదలైంది. 23వ కాంగ్రెస్ సమావేశం నాగపూర్‌లో జరగాల్సి ఉండగా అక్కడ అతివాదులు ఎక్కువగా ఉన్నారంటూ సూరత్‌కు మార్చారు. ఈసారి అధ్యక్ష పదవికి లాలా లజపతి రాయ్‌ని ప్రతిపాదించగా మితవాదులు అడ్డుకొని రాస్ బిహారీ బోస్‌ను ప్రతిపాదించడంతో లాలా పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ సమావేశంలో బాలగంగాధర్ తిలక్‌ను మాట్లాడటానికి కూడా మితవాదులని చెప్పుకునేవారు అంగీకరించలేదు. అతివాదులంతా కలిసి నేషనలిస్ట్ పార్టీని స్థాపించారు.

ఇదే సమయంలో బ్రిటీష్ పాలకులు తమ మత విభజన వాదాన్ని మరింత బలంగా ముందుకు తీసుకొని వెళ్లారు. వరుసగా కొత్త చట్టాలను తీసుకొచ్చారు. వాటిలో కొన్ని ఇవి..

  1. Prevention of Seditions meeting Act -1907
  2. Explosive Substance Act – 1908
  3. Criminal Law amendment Act – 1908
  4. The News Paper Act 1908
  5. Indian Press Act – 1910

కాంగ్రెస్ లోని మితవాదులతో బ్రిటీష్ పాలకులకు ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా వాళ్ల వల్ల తమ పరిపాలన భారతదేశంలో కలకాలం చల్లగా సాగుతుందని కూడా వారు విశ్వసించారు. ముస్లింలు ఎలాగూ తమనే సమర్థిస్తారు. కాబట్టి ఇక మిగిలింది కేవలం అతివాదులు మాత్రమే. వీరిని నియంత్రించేందుకు మాత్రమే ఈ చట్టాలను తీసుకొని వచ్చారు. వీటిలో తొలి చట్టం ప్రివెన్షన్ ఆఫ్ సెడిషన్స్ మీటింగ్ యాక్ట్ కింద లాలా లజపతిరాయ్‌కి దేశ బహిష్కరణ శిక్ష విధించారు. ఇండియన్ ప్రెస్ యాక్ట్, న్యూస్ పేపర్ చట్టాల కింద బాలగంగాధర్ తిలక్‌కు ఆరేండ్ల జైలు శిక్ష విధించి మాండలే జైలుకు పంపించారు. ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద అరవింద ఘోష్‌ను శిక్షించి అలీపూర్ జైలుకు పంపించారు. బిపిన్ చంద్రపాల్ కూడా జైలు పాలయ్యారు. 1910 నాటికి వీళ్లందరూ జైలు పాలయ్యారు.

దీంతో నాయకుడు లేని చుక్కానిలా ఉద్యమం మారిపోయింది. కాంగ్రెస్ మితవాదులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.

మరోవైపు మహమ్మదీయులు వందేమాతరం ఉద్యమంలో పాల్గొనకుండా బ్రిటీష్ వాళ్లు సంతుష్టీకరణ చర్యలు చేపట్టారు. వందేమాతరం కేవలం హిందువులకు సంబంధించిన మతపరమైన గీతమేనని ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికీ అదే ప్రచారాన్ని హేతువాదులు, కమ్యూనిస్టులు, లిబరలిస్టులు ఇంకా ఫేసుబుక్కుల మేధావులు కొనసాగిస్తున్నారనుకొండి.. అది వేరే సంగతి. అప్పటికి బెంగాల్ రైతుల్లో ఎక్కువ మంది ముస్లింలే కావడంతో వారు విభజన వ్యతిరేక ఉద్యమంలో పెద్దగా పాల్గొనలేదు. దీనికి తోడు క్రిషక్ బంధు అన్న పత్రికలో విభజన అనుకూల వ్యాసాలను పెద్ద ఎత్తున రాయాలని మహమ్మదీయ నాయకులను బ్రిటీష్ అధికారులు ఉదారంగా ప్రోత్సహించారు. శివాజీ, అఫ్జల్ ఖాన్‌ను హతమార్చిన చారిత్రక ఉదంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. హిందువులు ముస్లింలకు వ్యతిరేకం అని పెద్ద ఎత్తున కాంపెయిన్ నిర్వహిస్తూ వచ్చారు. వందేమాతరం ఉద్యమంతో బ్రిటీష్ వాళ్ల ఎత్తుగడలు ప్రజల్లో మతపరమైన విభజన దిశగానే అడుగులు పడ్డాయి. ఇవాళ విభజించి పాలించు అనే సూత్రం బ్రిటీష్ వారి విషయంలో చెప్పే మేధావులు కానీ, ఇతర మహానుభావులు కానీ.. దానికి మూలం మతపరమైన విభజన అన్న మాట మాత్రం ఎందుకు చెప్పరో ఎంతకీ అర్థం కాదు. ఆ విషయం ఎలా ఉన్నప్పటికీ.. బ్రిటీష్ వారు మొదట చేసిన చర్య ఏమిటంటే.. ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్‌తో జత కట్టకుండా జాగ్రత్త పడటం. ఈ విషయంలో వారు పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ముస్లింలకు ‘ప్రత్యేక’ ప్రతిపత్తులు కల్పించడం ద్వారా వారు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. బ్రిటీష్ వారికి పూర్తిగా విధేయంగా ఉండాలనే ఒకే ఒక కండిషన్‌పై ముస్లింలకు అడిగింది.. అడగనివి కూడా ఇస్తూ పోయారు. ఇక 1906లో ప్రారంభమైన ముస్లింలీగ్ కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేకంగా, బ్రిటీష్ వారికి విధేయంగా కార్యాచరణ రూపొందించుకుంటూ వెళ్లింది. విచిత్రమేమిటంటే.. ఉన్నత వర్గాలకు చెందిన భారతీయులు కొందరు.. బ్రిటీష్ వారి చర్యలను సమర్థించారు. ముస్లింలీగ్‌కు, దాని డిమాండ్లకు అంగీకరించడాన్ని కూడా వారు వ్యతిరేకించలేదు. ఏమైతేనేం 1910లో అతివాద నాయకులందరూ జైళ్ల పాలైన తరువాత.. కూడా అలజడులు తగ్గకపోవడంతో.. బ్రిటీష్ వారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. 1911లో జార్జి చక్రవర్తి భారత్‌లో పర్యటించిన నేపథ్యంలో బెంగాల్ విభజన రద్దు ప్రకటన వచ్చింది. కానీ, ఈ అలజడుల కారణంగా ఇక కలకత్తా రాజధానిగా పరిపాలించడం కష్టమని భావించిన బ్రిటీష్ వాళ్లు.. మొఘలుల రాజధానిగా ఉన్న ఢిల్లీని తదుపరి రాజధానిగా ఎంచుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. బెంగాల్ విభజన రద్దు అయిపోయింది. కానీ.. మతపరమైన విభజన దేశంలో ప్రజల మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసింది.

(సశేషం)

Exit mobile version