Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-54

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]తా[/dropcap]జా వార్త.. భారత రాజకీయాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఎలా వాడుకొంటున్నాయనడానికి అద్భుతమైన ఉదాహరణ. 2023 ఆగస్టు.. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్.. కాశ్మీర్‌లో ఒక వ్యాఖ్యానం చేశారు. అదేమిటంటే.. ఈ దేశంలో ఇస్లాం పుట్టి పెరిగి ఎదిగిన పరిణామం కేవలం 1500 సంవత్సరాల లోపేనని.. హిందూ ధర్మం అనేది చాలా ప్రాచీనమైనదని.. మన పూర్విజులు అంతా.. ఆయా సమయాల్లో ముస్లింలుగా మతం మారిన వారేనని కుండబద్దలు కొట్టారు. దీంతో కాశ్మీర్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆజాద్ వ్యాఖ్యానంలో రాజకీయ ఉద్దేశం ఏది ఉన్నా.. వెంటనే ఆయనపై బీజేపీ బీ టీం అనే ముద్ర వేశారు. మన పూర్వికులు కోతులు అని కూడా ఎద్దేవా చేశారు. రెచ్చిపోయి మాట్లాడారు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల తంపరలు మొదలయ్యాయి. గులాం నబీ ఆజాద్ అన్న మాటల్లో తప్పేమున్నదో నాకైతే అర్థం కాలేదు. ఆ వ్యాఖ్యల వెనుక ఈ దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే అంశాలేమున్నాయో తెలియదు. చరిత్రను చరిత్రగా చెప్పుకోవడానికి కూడా భయపడే ఏకైక రాజకీయ వ్యవస్థ ఉన్నది కేవలం భారతదేశంలోనే కావచ్చు. 1930ల లోనే షార్ట్ స్టోరీ ఆఫ్ ముస్లింస్ ఇన్ ఇండియా అన్న గ్రంథం ఈ దేశంలో ముస్లిం మత విస్తరణ గురించి వెలుగులోకి వచ్చింది కదా.. దానివల్ల మత సామరస్యం దెబ్బతిన్నదా? ఈ దేశంలోకి ఇస్లాం అన్నది చొరబడిన మాట వాస్తవం. ఇందులో సందేహం లేదు. 636 సంవత్సరం నుంచి ఇస్లాం ఈ దేశంలో చొచ్చుకురావడం మొదలైంది. దాదాపు 2023 నాటికి 1413 సంవత్సరాలు అయింది. భారతదేశంలో ముస్లింల జనాభా ఎలా పెరుగుతూ వచ్చిందో చూస్తే దాని పరిణామ క్రమం అర్థమవుతుంది.

1200 సంవత్సరం నాటికి అంటే సింధ్ ప్రాంతంపై మహమ్మద్ బిన్ ఖాసిం.. అంతకుముందు అరబ్బు చొరబాటుదారులు దాడులు చేసి ఆక్రమించిన నాటి నుంచి ఆరువందల సంవత్సరాల వ్యవధిలో ఈ దేశంలో ముస్లింల జనాభా 4 లక్షలు మాత్రమే.

1400 సంవత్సరం నాటికి మొఘలులు మన దేశంలోకి చొరబడ్డారు.. మొఘలులు వచ్చాక దాదాపు రెండు వందల సంవత్సరాల వ్యవధిలోనే ముస్లింల జనాభా 35 లక్షలకు చేరుకొన్నది. ఈ కాలంలో దాదాపు 400 మిలియన్ల హిందువులు ఊచకోతకు గురయ్యారు.

1400 సంవత్సరం నుంచి 1535 సంవత్సరాల మధ్యన.. అంటే 135 సంవత్సరాల మధ్య కాలం. ఈ కాలంలో ముస్లింల జనాభా 1.28 కోట్లకు చేరుకొన్నది. మొఘలులు తిరుగులేని ఆధిపత్యం కనపరచిన సమయం ఇది.

1535 నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో అంటే అప్పటికి బ్రిటిషర్లు ప్రవేశించారు. మెల్లగా దేశమంతా విస్తరిస్తూ వస్తున్నారు. మొఘలుల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఆ మధ్య కాలంలో ముస్లింల జనాభా భారత్ లో 5 కోట్ల కు చేరుకొన్నది.

భారత్‌ను బ్రిటిషర్లు ఏలిన కాలం అంతా కలుపుకుంటే.. అంటే 1800 నుంచి 1951 వరకు (దేశ విభజన జరిగిన తరువాతి లెక్కల ప్రకారం).. ఈ దేశంలో ముస్లింల జనాభా అంటే 150 సంవత్సరాల మధ్య కాలంలో పెరిగిన ముస్లింల జనాభా ఎంతంటే.. 3.5 కోట్లు. ఈ జనాభా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ముస్లింల సంఖ్య కాదు. కేవలం విభజించబడిన భారతదేశంలో 1951 నాటి లెక్కల ప్రకారం ముస్లింల సంఖ్య.

ఇక ఘనత వహించిన స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముస్లింల సంతుష్టీకరణ నేపథ్యంలో గత 77 సంవత్సరాలలో (2023 నాటికి) భారతదేశంలో ముస్లింల జనాభా ఏకంగా 19.75 కోట్లకు చేరుకొన్నది. అంటే దాదాపు 20 కోట్లు అన్నమాట. అంటే దేశం విభజన జరిగి.. మూడు ముక్కలుగా అయిన తరువాత మెజార్టీ ముక్కలో అంతకు ముందు కంటే కూడా అతి వేగంగా ముస్లిం జనాభా పెరిగింది. ముస్లిం జనాభా పెరిగినంత శాతంలో మరే మతస్తుల జనాభా పెరుగలేదు. చివరకు హిందువుల జనాభా పెరుగుదల శాతం కూడా తగ్గింది.

ఇది చరిత్ర.. నిజం. ఈ నిజాన్ని ఎంతకాలం నివురు గప్పి ఉంచుతారు? దీనివల్ల ప్రయోజనం ఏమిటి?

దీని గురించి చెప్పుకోవడం వల్ల ఈ దేశంలో మత సామరస్యానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. దేశ చరిత్రలోని ఒక పరిణామాన్ని, దాని క్రమాన్ని విశ్లేషించుకోవడం అంటే.. దాని చరిత్రను స్థాపించడమే తప్ప.. ఇవాల్టి ప్రజల మధ్యన సమస్యలు సృష్టించడం కాదు. ఈ విషయాన్నైనా మనం చెప్పడాన్ని బట్టి, విశ్లేషించడాన్ని బట్టి దాని ప్రభావం ప్రజలమీద పడుతుంది. కానీ, ఈ దేశంలో హేతువాదం, కమ్యూనిజం, లిబరలిజం పేరుతో స్వయం ప్రకటిత మేధావులు అనబడే వారు గత వందేళ్లుగా చేస్తున్నది మత రాజకీయమే. అన్ని మతాల సామరస్యం ముసుగులో.. ముస్లిం అనుకూల మత రాజకీయం చేసేది వీళ్లు మాత్రమే. పేరుకే వీళ్లు కాగితాల్లో మార్క్సు, మావో, లెనినూ, స్టాలినూ.. అంటారు.. మోటార్ సైకిళ్లమీద.. టీషర్టుల మీద చెగువేరా బొమ్మలు ముద్రించుకొని.. ఎర్రెర్రని జెండాలు పట్టుకొని తిరుగుతారు. బౌద్ధం గురించి మాత్రం చాలా గొప్పగా మాట్లాడుతారు. జైనిజం, సిక్కిజం వీరికి నామమాత్రంగానైనా కనిపించవు. అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నారు కాబట్టి.. వీళ్లకు ఆదర్శ దేశమైన చైనాలో బుద్ధిజం కొనసాగుతున్నది కాబట్టి వీరికి బుద్ధిజం ఆదర్శమైంది. లేకపోతే దాన్ని కూడా వీరు పట్టించుకునేవారు కాదు. కమ్యూనిస్టులు మొదట్లో కొద్దో గొప్పో చేసిన భూపోరాటాలు కూడా ఇప్పుడు కనుమరుగైపోయాయి. కార్మికులు, కర్షకులు, ఇతరుల గురించిన పోరాటాలు ఏమయ్యాయో తెలియదు. ఇవన్నీ కాగితాలమీద అద్భుతంగా ఉంటాయి. కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు కనిపిస్తూ.. కన్ఫ్యూజన్‌గా మాట్లాడుతూ.. అందరినీ కన్ఫ్యూజన్ లోకి నెట్టడంలో వీరిని మించిన వారు లేరు. వాళ్లు మొదట్నుంచీ స్పష్టంగానే ఉన్నారు. ఈ దేశం.. ఇక్కడి ధర్మం.. ఇక్కడి జాతీయ జీవన విధానం విషయంలో చాలా చాలా క్లారిటీతో ఉన్నారు.. ‘ధ్వంసరచన.. హింస నచణ’ ఇదీ వారి అజెండా.. అంతకు మించి చెప్పడానికి వీలు లేదు. ముస్లింలు ఓటు బ్యాంకు కాకపోతే.. ఈ దేశంలోని ప్రాచీన సాంస్కృతిక విధ్వంసానికి వారు పరికరాలుగా మారకపోయి ఉంటే.. వారి ఊసును కూడా వీరు పట్టించుకునేవారు కాదు.

***

ఇక అసలు కథలోకి వద్దాం. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ ఇచ్చిన సత్యాగ్రహం పిలుపు పెద్దగా సక్సెస్ కాలేదు. ముందుగానే చెప్పినట్టు.. గాంధీజీ మొదట్నుంచీ.. హిందూ ముస్లిం ఐక్యత సాధించడం ద్వారానే స్వాతంత్ర్యం సాధించడం తేలికవుతుందని గట్టిగా నమ్ముతూ వచ్చారు. ఇందులో భాగంగానే ముస్లింలను సంతృప్తి పరచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. చివరకు రఘుపతి రాఘవ రాజారాం పాటలో రాముడిని అల్లాగా కూడా కొలుస్తూ రెండు పాదాలు చేర్చారు. కానీ ముస్లిం నాయకులు మాత్రం గాంధీజీని తమకు అనుకూలంగా పూర్తిగా వినియోగించుకున్నారు. ఇది భవిష్యత్తులో విభజన దాకా దారి తీస్తుందన్న విషయాన్ని గాంధీజీ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఊహించలేకపోయారు. గాంధీజీ చివరకంటా మత సామరస్యాన్ని ప్రబోధిస్తూ వెళ్లారు. 1857 తరువాతి నుంచి బ్రిటిష్ వాళ్లు ప్రదర్శించిన ముస్లిం సంతుష్టీకరణను అనివార్యంగా గాంధీజీ కూడా కొనసాగించారు.

1920 అక్టోబర్ 29 న ఖిలాఫత్ ఉద్యమకారుడు మహమ్మద్ అలీ జౌహర్ అలీగఢ్‌లో జామియా మిలియా ఇస్లామియాను స్థాపించాడు. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో.. మహమ్మద్ హసన్ దేవ్ బందీ, హకీమ్ అజ్మల్ ఖాన్, ముఖ్తార్ అబ్బాస్ అన్సారీ, అబ్దల్ మజీద్ ఖ్వాజా, డాక్టర్ జాకీర్ హుస్సేన్ (తరువాత భారత రాష్ట్రపతి అయ్యారు)తో పాటు మహాత్మాగాంధీ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (భారత తొలి విద్యాశాఖ మంత్రి) కూడా ఉన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాదిరిగా కాకుండా, ఎలాంటి ప్రభుత్వ ప్రమేయం లేకుండా జాతీయ ముస్లిం యూనివర్సిటీ కావాలన్న డిమాండ్ పై ఏర్పడ్డ విద్యాసంస్థ ఇది. దీని లక్ష్యాన్ని డాక్టర్ జాకీర్ హుస్సేన్ చాలా స్పష్టంగానే వివరించారు. ‘The movement of Jamia Millia Islamia as a struggle for education and cultural renaissance that aims to prepare a blueprint for Indian Muslims which may focus on Islam but simultaneously evolve a national culture for common Indian. It will lay the foundation of the thinking that true religious education will promote patriotism and national integration among Indian Muslims, who will be proud to take part in the future progress of India…’ నిజమైన మతపరమైన విద్యను బోధించడం లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటైంది. దీని పర్యవసానాలు వందేండ్ల తరువాత 2019లో బయటపడ్డాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియాలో జరిగిన ఆందోళనలను పోలీసులు బలవంతంగా అణచివేయాల్సి వచ్చింది. అలీగఢ్ నుంచి ఢిల్లీ ఓఖ్లాకు తరలి వచ్చిన జేఎంఐ ఇవాళ దేశమంతటా విస్తరించింది. దీన్ని స్థాపించిన జౌహర్ నేతృత్వంలోనే దేశంలో ఖిలాఫత్ ఉద్యమం పుట్టుకొచ్చింది. దీనికి సమాంతరంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు గాంధీ.

అంతకు ముందు మరికొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రౌలత్ చట్టానికి వ్యతిరేకమన్న పేరుతో పరోక్షంగా మొదలైన ఖిలాఫత్ ఉద్యమం ప్రాథమిక దశ విఫలం కావడంతో ముస్లిం నేతలు గాంధీజీని పక్కన పెట్టి.. తమంత తాముగా దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు బొంబాయిలో నాంది పడింది. 1919 మార్చిలో బొంబాయిలోని కొందరు సంపన్న ముస్లిం వ్యాపారులు ‘బొంబాయి ఖిలాఫత్’ సంఘం అని ఒకటి ప్రారంభించడానికి కావాల్సిన వనరులను సమకూర్చి పెట్టారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజు అమానుల్లా బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించాడు. అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయింది. ఒకవైపు జాతీయోద్యమంలో గాంధీ ప్రవేశించారు. అమృత్‌సర్ లోని జలియన్ వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ అత్యంత అమానుషంగా, పాశవికంగా స్వాతంత్ర్య సమరయోధుల ఊచకోత కోశాడు. దీని నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయోద్యమ కాంక్షలు ప్రబలమయ్యాయి. ఖిలాఫత్ ఉద్యమం ద్వారా అప్పటిదాకా అనుకూలంగా ఉన్న ముస్లింలు వ్యతిరేకంగా మారుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటు వంటి పరిణామాలన్నీ బ్రిటిష్ వారికి కొంత తలనొప్పిగానే మారాయి. దీంతో మొదట ముస్లిం సమస్యను తొలగించుకోవడంపై దృష్టి సారించారు. కానీ వారు ఇతరుల మాదిరిగా సామరస్యత గురించి ఆలోచించరు. ఎందుకంటే వాళ్ల అజెండా చాలా చాలా స్పష్టంగా ఉన్నది. ముస్లిం ప్రపంచంలో తిరుగులేనిదిగా ఉన్న ఒట్టమాన్ సామ్రాజ్యం పతనమైతే.. టర్కీ ఖలీఫా అధికారం లేకపోతే.. ప్రపంచంలో ముస్లింల ఉనికే ప్రమాదంలో పడుతుందని భారతీయ ముస్లింలు తీవ్ర ఆందోళన చెందారు. కాబట్టే.. అందివచ్చిన అన్ని అవకాశాలను వదిలిపెట్టకుండా ఖిలాఫత్ ఉద్యమానికి పదునుపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ రాజు తిరుగుబాటు చేయగానే.. అక్కడి రాజ ప్రతినిధులను కలిసి మద్దతు కోరేందుకు బొంబాయి ఖిలాఫత్ సంఘం నేతలు ప్రయత్నించారు. మరోవైపు అబ్దుల్ బారీ ముస్లింలను రెచ్చగొట్టసాగాడు. పవిత్ర యుద్ధం చేయాలని, మతపరమైన పవిత్ర యుద్ధం చేయాలని కరపత్రాలు పంచిపెట్టాడు. 1918 డిసెంబర్లో ఢిల్లీలో ముస్లింలీగ్ జాతీయ సదస్సు జరిగింది. అందులో సుదీర్ఘంగా చర్చించిన నాయకులు భారతదేశం కంటే ముందు టర్కీ సమస్యను పరిష్కరించుకోవాలని.. టర్కీ ఖలీఫాను కాపాడుకోవాలని ఇందుకోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని తీర్మానించింది. ఈ సమావేశంలో రిసెప్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ అన్సారీ సుల్తాన్ ఖలీఫ్ గురించి.. ఆయన సామర్థ్యాలను గురించి వివరించారు. ఆధునిక ప్రపంచంలో ముస్లింలకు మంచి చేసే ఏకైక ముస్లిం రాజు అతనొక్కడేనని.. అతను మాత్రమే అరబ్ ప్రపంచాన్ని ఏలగల సామర్థ్యం ఉన్నవాడని వివరించాడు.

‘Dr. Ansari was chairman of the reception committee and delivered a speech in which he qualified Sharif Husain of Mecca as a rebel, asserted that the Sultan-Caliph had discharged his duties to the satisfaction of the Muslim world, and that he was the only Muslim ruler capable of doing so in the modem world. Therefore the Jazirat-ul-Arab was to remain under his rule. Fazl-ul Huq’s presidential address contained only a few references to Turkey and the Caliphate.’ (The Khilafat movement in India 1919-1924 AC Niemeijer, Martinusnijhoff, 1972, p.81-82)

ఢిల్లీ సదస్సులోనే రెండో రోజు అబ్దుల్ బారీ మాట్లాడుతూ.. ముస్లింల పవిత్ర స్థలాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాల్సిందేనని బ్రిటిష్ పాలకులను హెచ్చరించాడు. ఈ సదస్సులో ఒకరిద్దరు మోడరేట్ ముస్లిం నేతలు ప్రభుత్వ విదేశీ వ్యవహారాల గురించి భారతీయ ముస్లింలకు సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారి మాటను ఎవరూ వినిపించుకోలేదు. ఈ సదస్సు వాడివేడి చర్చలతో నియంత్రణ కోల్పోయింది. చివరకు ఉలేమాలు.. అబ్దుల్ బారీ నేతృత్వంలో తీర్మానాలు ఆమోదించారు. ఆ తరువాత అబ్దుల్ బారీ, దేవ్ బండ్ నుంచి ఒక కరపత్రాన్ని విడుదలచేశాడు. ఇందులోనే మతపరమైన యుద్ధం తీవ్రంగా చేయాల్సిన ఆవశ్యకతను గురించి ప్రస్తావించాడు.

“Another remarkable fact was the role of the ulema, represented by Abdul Bari and a written message from Deoband. The (anonymous) author of the “Confidential Account”, referring to this fact, adds: “I was told by Khaliquzzaman … (one of the chief members of the Ansari-Sind party) that they were playing with fire in uniting with the Ulemas.” He also points to the fact that some leaders considered Ansari to go too far, and continues: “It is believed that efforts would be made to carry on this agitation at a very high pitch with the Ulemas as their tools. Some even talked of making Maulvi Mahmud Hasan (who they said was returning) a vice-president of the League.” And lastly Hindu-Muslim unity was stressed; a speaker mentioning Hindu acts of violence was “hooted down”.”(The Khilafat movement in India 1919-1924 AC Niemeijer, Martinusnijhoff, 1972, p.-82)

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా అంటే 1918లోనే జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ హిందూ-ముస్లిం ఐక్యత గురించి చర్చించింది. ఖలీఫా గురించిన చర్చ కూడా జరగింది. దీనిపై చేపట్టాల్సిన కార్యాచరణపైనా చర్చించారు. ఈ సదస్సుకు రిసెప్షన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన హకీం అజ్మల్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో హిందూ ముస్లింల సమైక్యత గురించి వివరించారు. అదే సమయంలో ఖలీఫా గురించిన ప్రస్తావన చేస్తూ.. ఇందుకు సంబంధించి భారత వైస్రాయ్ కి లేఖ రాసిన గాంధీజీకి కృతజ్ఞతలు తెలిపారు. ఖలీఫాకు సంబంధించి ముస్లిం మనోభావాల పట్ల సంఘీభావం తెలుపుతూ గాంధీజీ లేఖ రాయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

(సశేషం)

Exit mobile version