Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-6

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రత చరిత్రకారులు ఎంత గొప్పవారంటే వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. భారతీయ రాజులను, వారి పరాక్రమాన్ని ఎంత తక్కువ చేసి చూపించాలో అంత తక్కువ చేసి చూపుతారు. ఇతర దేశాల నుంచి వచ్చిన దోపిడీదారులను అద్భుతమైన వ్యక్తులుగా.. ప్రవక్తలుగా.. ఈ దేశాన్ని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించడానికి వచ్చినవారిగా చెప్తారు. మహమ్మద్‌ బీన్‌ ఖాసిం గురించి చరిత్రకారులు రాసింది కూడా ఇంచుమించు ఇలాంటిదే. సింధ్‌ రాజు రాజా దాహిర్‌ అరబ్బు వ్యాపారులను బందీలను చేసి పట్టుకొంటే వాళ్లను విడిపించడానికి అప్పటి ఖలీఫా.. ఈ ఖాసింను పంపించాడట. మన దేశ చరిత్ర అంతా ఇలాగే రాయబడింది. ఇట్లాగే రాశారు. ఇట్లాగే చదువుకొన్నాం కూడా. సింధ్‌ రాష్ట్రం పైకి దాడి చేసింది అల్‌హజ్జజ్‌కు చెందిన మూక. అరబ్బు వ్యాపారులు కానే కారు. సింధ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందు కాలంలో ప్రధాన వ్యాపారులుగా యూదులు ఎక్కువగా ఉన్నారు. పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియాలో యూదులు వ్యాపారం చేసేవారు. ముందుగా చెప్పుకొన్నట్టు సిరియా నుంచి తిరిగి వస్తున్న యూదు వ్యాపారులను అరేబియాలోని ఇస్లామీయులు  తలలు నరికి ఊచకోత కోశారనేది చరిత్ర చెప్తున్న కఠిన సత్యం అన్నది మరవద్దు. ఈ ఉదంతాన్నే గజబ్‌ అల్‌ బద్‌‌గా వాళ్లు సెలబ్రేట్‌ చేసుకొన్నారు కూడా. ఆ తరువాత సిరియా.. పర్షియా ప్రాంతాల్లో ఇలాగే విరుచుకుపడి దారుణ మారణ కాండకు పాల్పడి స్వాధీనం చేసుకొన్నారు. ఇస్లాం దండయాత్రలన్నీ కూడా ఆటవికం.. ఇంకా చెప్పాలంటే పైశాచికమైన పద్ధతుల్లో జరిగినవే. మహమ్మద్‌ బిన్‌ ఖాసిం రావడానికి ముందు సింధ్‌పై దాడికి పూనుకొన్న ముస్లింలను రాజా దాహిర్‌ ఎదిరించి జయించాడు కాబట్టే మహమ్మద్‌ బిన్‌ ఖాసిం పూర్తి బలంతో తెగబడి.. రాజా దాహిర్‌ తల నరికి తన ఖలీఫాకు పంపించాడు. ఈ చరిత్రను ఎందుకని వక్రీకరించారు?

దేబాల్‌ రేవు నగరం గురించి ప్రధానంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే.. భారతదేశపు ప్రాచీన నాగరికతకు సంబంధించిన అత్యంత ప్రధాన నగరం దేబాల్‌. హరప్పా, మొహెంజొదారోతో కూడిన సింధు నాగరికత వైభవంలో దేబాల్‌ కూడా ఒక భాగం కాబట్టి. ఈ దేశానికి హింద్‌, హిందుస్తాన్‌ అన్న పేరు రావడానికి కారణమైన ప్రాంతం కాబట్టి. ఇది ఆనాటికి ఆసియాలోనే అత్యుత్తమ వాణిజ్య కేంద్రంగా ఉన్నది కాబట్టే ఇక్కడ దాడి జరిగింది. దీన్ని కాపాడుకోవడానికి రాజా దాహిర్‌ ఆమరణాంతం తపించాడు. దేబాల్‌ను స్వాధీనం చేసుకొన్న తరువాత ముస్లింలకు భారత్‌లోకి ప్రవేశించడానికి మార్గం దొరికింది. క్రీస్తుపూర్వం 711 నుంచి 715 వరకు ఖాసిం సింధ్‌లోనే ఉన్నాడు. రాజ్యాన్ని విస్తరించుకొంటూ పోయాడు. వరుసగా ఆఫ్ఘన్‌, బలోచిస్తాన్‌, కరాచీ.. ఇలా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకొంటూ పోయాడు. అతని వారసులు ఆ తరువాత క్రమంగా భారత్‌లోకి చొచ్చుకొచ్చారు.

సింధ్‌పై జరిగిన దాడి కేవలం ప్రతీకారం కోసమో.. మత విస్తరణ కోసమో మాత్రమే కాదన్నది మనం గ్రహించాలి. సంపదను దోచుకోవడం కోసమేనన్నది మనం ముఖ్యంగా గమనించాల్సింది. ముస్లింలు అయినా, పర్షియన్లయినా, మంగోలులు అయినా, చివరకు బిట్రిషర్లయినా.. అందరూ కూడా తమ దగ్గర గతి లేక.. దిక్కులేక.. సంపద కోసం వెతుక్కొంటూ వచ్చి.. ఇక్కడి సంపదనంతా దోచుకొన్నారు. ఇందుకోసమే మతాన్ని వాడుకొన్నారు. ఇందుకోసమే సాంస్కృతిక విధ్వంసానికి పూనుకొన్నారు. ఇందుకు ఉదాహరణ దేబాల్‌ పోర్ట్‌ సిటీయే. దేబాల్‌పై దాదాపు 15 సార్లు దాడులు జరిగాయి. సోమ్‌నాథ్‌పై మహమ్మద్‌ ఘజనీ చేసిన మాదిరిగానే దేబాల్‌పైనా దాడులు వెల్లువెత్తాయి. ఎందుకంటే దేబాల్‌ అత్యంత సుసంపన్నమైన వాణిజ్య ప్రాంతం. ఇస్లాం ఆవిర్భవించడానికి చాలా కాలం ముందే.. క్రీస్తు అవతరించడానికి ముందే.. దేబాల్‌ ఆసియాలోనే అతి పెద్ద వాణిజ్య ప్రాంతం. సింధీ నౌకా వ్యాపారుల ప్రధాన కేంద్రంగా దేబాల్‌ కొనసాగింది. దూరదూరాల నుంచి సముద్ర వ్యాపారులు దేబాల్‌కు వచ్చి.. ఇక్కడి నుంచి వ్యాపార లావాదేవీలు కొనసాగించేవారు. ముఖ్యంగా పశ్చిమ దేశాలతో వ్యాపారం చేయడానికి దేబాల్‌ పోర్టు కేంద్రంగా వ్యవహరించింది. భారతదేశంలో మైదాన ప్రాంతం నుంచి పశ్చిమ దేశాలకు అనేక విధాలైన సరుకు రవాణా అరేబియా సముద్రం మీదుగానే సాగింది. ఇందులో దేబాల్‌ రేవు పట్టణం కూడా ముఖ్యమైంది. ఇవాళ మనకు కనిపిస్తున్న పాకిస్తాన్‌తో కలిసి ఉండిన భారతదేశం అన్ని విలువైన ఖనిజాలతో సర్వ సమృద్ధమైనదిగా ఉండింది. గోదావరి లోయలో బొగ్గు గనులు విపరీతంగా లభిస్తాయి. బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా, తెలంగాణ మీదుగా దాదాపు కాకినాడ వరకు ఉత్తమమైన బొగ్గు విస్తరించి ఉంది. అటు మధ్యప్రదేశ్‌, బొంబాయి, మద్రాసు, బీహార్‌, ఒరిస్సా, కర్ణాటక ప్రాంతాల్లో మాంగనీసు, క్రోమియం, రాగి, బాక్సైట్‌, సిమెంట్‌ పరిశ్రమకు అవసరమైన మ్యాగ్నిసైట్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవాళ ఇస్లాం ప్రాబల్యం ఉన్న అరబ్‌ ప్రాంతాలన్నీ కూడా ఒపెక్‌ దేశాలుగా మనం పిలుచుకొంటున్నాం. ఇక్కడ ఇంధన తైలం తప్ప మరేమీ లభించదు. మిగతా అంతా ఎడారి ప్రాంతం. వ్యవసాయమూ అంతంత మాత్రమే. నదులు ఉన్న ప్రాంతం కాదు. ఉప్పునీటి చెలమలు ఉన్నా.. మన దేశ సముద్రతటంలోని చెలమల నుంచి వచ్చే నాణ్యమైన ఉప్పు అక్కడ లభించదు. ఈ దశలో అరేబియా కేంద్రంగా రాజ్యం నడుపుతున్న ఖలీఫాలకు సంపద దోపిడీ చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇందుకు వారికి సమీపంలో సంపన్నంగా కనిపిస్తున్న ప్రాంతం భారతవర్షమే. అరేబియా తీరం వెంబడి నౌకా యుద్ధం చేయడం అరబ్‌ ముస్లింలకు సాధ్యం కాలేదు. థానే తదితర రేవు పట్టణాలపై యుద్ధానికి తెగబడి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇక భారతదేశంలోకి చొరబడటానికి మైదానం లింక్‌ ఉన్న వాయవ్య భారతం ఒక్కటే కనిపించింది. ఇక్కడ తీర ప్రాంతం నుంచి దాడిచేయడం కంటే.. గెరిల్లా యుద్ధమే సరైనదని భావించినట్టు ఉన్నారు. మహమ్మద్‌ బిన్‌ఖాసిం ముందుగా ఆఫ్ఘనిస్తాన్‌ మీదుగా దేబాల్‌కు ప్రయాణించాడు.

చాచ్‌నామా ప్రకారం దేబాల్‌ను ‘దేవల్‌’ అని పిలిచేవారు. దేవల్‌ అంటే దేవాలయం అని అర్థం. ప్రస్తుత పాకిస్తాన్‌లోని థట్టా ఒకప్పటి దేబాల్‌ ప్రాంతం. పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని అయిన కరాచీ కూడా దీని పరిధిలోనే ఉన్నదని చెప్తారు. భారతదేశంపై ముస్లిం దండయాత్రలకు సంబంధించి 9వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు అల్‌ బలాధురి.. సమగ్రంగా రికార్డు చేశారు. మహమ్మద్‌ బిన్‌ ఖాసిం.. దేబాల్‌ పట్టణంపై దాడిచేసి రాజా దాహిర్‌ను హతమార్చిన తరువాత విశృంఖలంగా మూడు రోజులపాటు క్షణమాగకుండా దారుణంగా మానవ ఊచకోత నిర్వహించాడని బలాధురి పేర్కొన్నాడు. దేబాల్‌ను స్వాధీనం చేసుకొన్న తరువాత ఖాసిం.. అక్కడ భారతీయ ఆనవాళ్లు ఏవీ లేకుండా చేశాడు. అక్కడ ఉన్న ప్రధానమైన శివుడి ఆలయాన్ని సమూలంగా నేలమట్టం చేశాడు. దాదాపు నాలుగువేల మందిని ఇక్కడ ఊచకోత కోశాడు. ఈ శివుడి ఆలయంపై ఖాసిం మసీదును నిర్మించాడు. ముస్లింల స్వాధీనం అయిన తరువాత కూడా దాదాపు నాలుగు వందల సంవత్సరాలపాటు దేబాల్‌ పోర్టు నుంచి లావాదేవీలు జరిగినట్టు తెలుస్తున్నది. భారతీయ ఆలయాల విధ్వంసకాండకు తొలి వేటు ఈ దేబాల్‌ నగరంలోనే జరిగింది. మహమ్మద్‌ బిన్‌ ఖాసింతో మొదలైన ఊచకోత విభజన.. విభజనానంతరం కూడా కొనసాగింది.

ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఒకటున్నది. సామ్రాజ్యవాద దమనకాండలో ముఖ్యమైన పని.. ప్రజలు చెప్పినట్టు వినేలా.. లొంగిపోయి ఉండేలా చేసుకోవడం. అప్పుడే తాము అనుకొన్నది సులువుగా సాధించుకోవచ్చు. అది క్రిస్టియానిటీ అయినా.. ఇస్లామీకరణ అయినా.. లక్షణం ఒక్కటే. ఇలాంటి లక్షణం లేనిది భారతీయులకు మాత్రమే. ఏ మతాన్నైనా తమలో అబ్జార్బ్‌ చేసుకొన్నారే తప్ప ఇతర మతాల విచ్ఛిన్నత గురించి ఆలోచించనైనా లేదు. మహమ్మద్‌ బిన్‌ ఖాసిం చేసిన పని కూడా అదే. అతి దారుణంగా ఊచకోత కోయడం, వేలమందిని బానిసలుగా తరలించడం ద్వారా ముందుగా సమాజంలో అంతులేని భయాన్ని కల్పించడం. మతం మారితే తప్ప ప్రాణాలకు రక్షణ ఉండదనే దశకు మొత్తం సమాజాన్ని తీసుకొని రావడం. మతం మారిన తరువాత పూర్వపు మతంతో కానీ, మతావలంబులతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా చూడటం.. దీంతో అంతకు ముందున్న వాళ్ల దేవుడు వాళ్లకు కాకుండా పోతాడు. కొత్త దేవుడు పుట్టుకొస్తాడు. అతను అక్కడెక్కడో.. మక్కాలోనో.. జెరూసలేంలోనో ఉంటాడు. అందుకు సంబంధించిన పూజారి ఏం చెప్తే అది తు.చ. తప్పకుండా పాటించాలి. తమ ఆస్తి తమది కాదు. తమ సంపద తమది కాదు. ఆ పూజారి కోసం ప్రాణాలైనా ఇస్తారు. తమ గుడులను తామే కూలగొడతారు. తామే మసీదులు నిర్మిస్తారు. సంపత్తినంతా ఆ పూజారికి తామే దోచి పెడతారు. దోపిడి దొంగలకు ఇంతకంటే సులువైన మార్గం ఏముంటుంది?

తొలినాళ్లలో భారతదేశంలో ఇస్లామీకరణ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా సాగింది. ఆ తరువాత క్రమంగా ఉన్మాదంగా రూపుదాల్చింది. మన చరిత్రకారులు రాసినట్టు.. ప్రచారం చేసినట్టు ఎక్కడ కూడా భయం లేకుండా, ప్రయోజనం లేకుండా స్వచ్ఛందంగా మత మార్పిడులు జరుగనే లేదు. హిందువుల దృష్టిలో మతం మార్చుకోవడం అంటే ఆరాధనా పద్ధతిని మార్చుకోవడం అని అనుకొంటారు. అంతే తప్ప జాతిపరంగా, సాంస్కృతిక పరంగా తాము వేరు అని ఎవరూ భావించరు. అందుకే మన దేశంలో ముక్కోటి దేవతలు వచ్చారు. కానీ ఇస్లాం, క్రిస్టియానిటీ మతాంతరీకరణల్లో చాలా భేదం కల్పించారు. ఇక్కడ మతం మారడం అంటే జాతీయత కూడా మారినట్టే. ఈ మతనిష్ట ఎంతలా ఉంటుందంటే.. మతం మార్చుకొన్న తరువాత స్వీయ వివేకానికి ఎలాంటి తావు ఉండదు. మత సూత్రాలను కచ్చితంగా పాటించాల్సిందే. షియా కావచ్చు, సున్నీ కావచ్చు.. వ్యక్తిగతంగా కావచ్చు.. సామాజికంగానైనా కావచ్చు.. ఏ ఆలోచన అయినా.. ఒక పని నైతికమైందా.. కాదా? అన్నది మతమే నిర్ణయిస్తుంది. నిజాయితీ, న్యాయం, మంచితనం, వివేకం, పవిత్రత అన్నవాటికి మత గ్రంథమే నిర్వచనాన్ని ఇస్తుంది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఇస్లాం సమూహాన్ని భౌగోళిక సరిహద్దుల ఆధారంగా ఫలానా దేశస్థులు అని విభజించడాన్ని ఆ మతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏ భౌగోళిక సరిహద్దులకు పరిమితం కాని ప్రపంచ ఇస్లాం అనే రాజకీయ ఉద్యమ ధోరణి తొలి నాటి నుంచీ కూడా కొనసాగుతూ వచ్చింది. దీన్ని గుర్తించడం పెద్ద కష్టమైన పనేం కాదు. యూదు వ్యాపారుల ఊచకోతల నుంచి ఖలీఫాల ధోరణి ఒకే విధంగా కొనసాగుతూ వచ్చింది. విభజన సమయంలోనూ.. స్వాతంత్య్రానంతర భారతంలోనూ ఈ ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

(సశేషం)

Exit mobile version