Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-62

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]19[/dropcap]35లో సైమన్ కమిషన్ రావడం.. దానికి వ్యతిరేకంగా నిరసనలు జరగటం,.. ఆ తరువాత అదే సైమన్ కమిషన్ సిఫారసులు.. ఇతరత్రా రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా వచ్చిన రికమండేషన్ల ఆధారంగా 1935 భారత చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోనే ప్రత్యేక ఎలక్టొరేట్లను ఏర్పాటు చేశారు. చట్టం అమలులోకి వచ్చిన తరువాత రెండేండ్లకు అంటే 1937లో దేశంలోని వివిధ ప్రావిన్సుల్లో ఎన్నికలు జరిగాయి. ఒక దేశంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడు.. ఆ దేశానికి సంబంధించిన భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దానికి తగినట్టుగా ఆ సంస్కరణలు తీసుకొని వస్తేనే అవి విజయవంతమవుతాయి. కానీ కాంగ్రెస్ నాయకులకు ఇవేమీ పట్టలేదు. చిన్నదో.. పెద్దదో.. ఏదోరకంగా తమకు అధికారం లభించిందనే భావించారు. అందుకే ఆ చట్టాన్ని అంగీకరించారు. అప్పటి వరకు పూర్ణ స్వరాజ్యకాంక్ష అనేది కాంగ్రెస్ మనసులో లేదన్న విషయాన్ని గ్రహించాలి. కేవలం ఏదో రకంగా అధికారంలోకి రావడమే కర్తవ్యంగా వారి కార్యాచరణ సాగింది. కానీ, బ్రిటిష్ పాలకులు, ముస్లింలీగ్ పార్టీల విభజన చీలిక తంత్రం కాంగ్రెస్‌కు అర్థం కాలేదు.. 1935 చట్టం.. భూ యాజమాన్యం, ఆస్తి పాస్తుల ఆధారంగా ప్రజలకు ఓటు హక్కును కల్పించింది. దాదాపు 30 మిలియన్ల మందికి ఓటు హక్కు లభించింది. దీనివల్ల ప్రజలందరికీ ఓటు హక్కు సంక్రమించకపోగా సమాజంలో ఒక చీలికను తీసుకొని వచ్చింది. దీనికి తోడు ప్రత్యేక నియోజక వర్గాలు మతపరంగా స్పష్టమైన విభజనను తెచ్చి పెట్టింది. దీనికి ఇవాళ కమ్యూనిస్టులు, హేతువాదులు లాజిక్కులు చెప్పుకుంటూ వస్తారు కానీ.. సామరస్య విచ్ఛిన్నం అన్నది ఇక్కడే జరిగిందన్న విషయాన్ని ఒప్పుకోరు. కాంగ్రెస్ వారు అసలే అంగీకరించరు. ఈ రోజుకు కూడా ప్రజలందరి మధ్యన విభజన రాజకీయాలు కొనసాగడానికి మూలం ఇదిగో ఈ బ్రిటిష్ వారి వారసత్వంగానే కొనసాగుతున్నది. 1936-37 శీతాకాలంలో మొత్తం 11 ప్రావిన్సుల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా జవహర్ లాల్ నెహ్రూయే ఉన్నారు. ప్రావిన్సులకు జరిగే ఎన్నికల్లో పాల్గొనాలని ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ముస్లిం లీగ్ కూడా ముందుకు వచ్చింది. వీటితోపాటు.. కాంగ్రెసేతర, ముస్లిమేతర పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ.. ప్రాంతీయ ప్రభుత్వాలను సంయుక్తంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ముస్లిం లీగ్ మౌఖికంగా ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ముస్లింలీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నాకు హామీ కూడా ఇచ్చారు. ఆ తరువాత మద్రాస్ , సెంట్రల్ ప్రావిన్సులు, బీహార్, ఒరిస్సా, యునైటెడ్ ప్రావిన్స్‌లు, బాంబే ప్రెసిడెన్సీ, అస్సాం, వాయువ్య ఫ్రాంటియర్ ప్రావిన్స్, బెంగాల్, పంజాబ్ , సింధ్ ప్రావిన్సుల్లో ఎన్నికలు జరిగాయి. ముస్లిం రిజర్వేషన్ స్థానాల్లో కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లలో పోటీ చేసింది. 1937లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బొంబాయి, మద్రాస్, సెంట్రల్ ప్రావిన్స్‌లు, యునైటెడ్ ప్రావిన్స్‌లు, నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బీహార్, ఒరిస్సాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్, పంజాబ్, సింధ్ అస్సాం ప్రావిన్సుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. ముస్లిం లీగ్ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి రాలేదు. మొత్తం 1500 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. 758 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 482 ముస్లిం రిజర్వుడు స్థానాల్లో కేవలం 58 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 26 స్థానాల్లో విజయం సాధించింది. అటు ముస్లిం లీగ్ మొత్తం దేశంలో గెలుచుకున్న స్థానాలు కేవలం 109 మాత్రమే. యునైటెడ్ ప్రావిన్సుల్లో 29 స్థానాలను గెలుచుకొన్నది. విచిత్రమేమిటంటే.. ముస్లింలు మైనార్టీలుగా ఉన్న ప్రావిన్సుల్లో లీగ్ మంచి స్థానాలను గెలుచుకొన్నది. పంజాబ్‌లో అది పోటీ చేసిన 7 సీట్లలో 2 మాత్రమే గెలుచుకోగా.. బెంగాల్‌లో 117 సీట్లలో పోటీ చేసి 39 సీట్లను గెలుచుకొన్నది. కానీ ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది.

  1. మద్రాసు ప్రావిన్సులో 74 శాతం సీట్లను కాంగ్రెస్ గెల్చుకొన్నది. ఇక్కడ జస్టిస్ పార్టీకి వచ్చిన సీట్లు కేవలం 21.
  2. సింధ్ ప్రావిన్సులో 60 సీట్లకు గానూ.. 22 సీట్లను సింధ్ యునైటెడ్ పార్టీ గెలుచుకొన్నది. కాంగ్రెస్‌కు 8 సీట్లు దక్కాయి. ముస్లింలు మెజార్టీగా ఉన్న ఈ ప్రావిన్సులో ముస్లిం లీగ్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ప్రావిన్సులో ముస్లింలకు 34 సీట్లు రిజర్వు చేశారు. కానీ వీటిలో ఒక్కటి కూడా లీగ్‌కు దక్కలేదు.
  3. యునైటెడ్ ప్రావిన్సులో 133 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ముస్లింలకు ఈ ప్రావిన్సులో 64 స్థానాలు రిజర్వు చేశారు. కానీ ముస్లిం లీగ్‌కు దక్కింది కేవలం 27 సీట్లు మాత్రమే.
  4. అస్సాంలో 108 సీట్లకు గానూ.. కాంగ్రెస్ 33 స్థానాలను గెలుచుకొని అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా అవతరించింది. అస్సాం వ్యాలీ ముస్లిం పార్టీ నాయకుడు సర్ మహమ్మద్ సదుల్లాకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయింది.
  5. బొంబాయి ప్రావిన్సులో కాంగ్రెస్ సగం సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. కానీ.. చిన్న చిన్న గ్రూపుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  6. పంజాబ్ ప్రావిన్సులో యూనియనిస్టు పార్టీ నేతృత్వంలోని సికందర్ హయత్ ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఖల్సా నేషనల్ బోర్డు, హిందూ ఎలక్షన్ బోర్డు మద్దతునిచ్చాయి.
  7. బెంగాల్‌లో 54 సీట్లతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 36 సీట్లు గెలుచుకున్న కృషక్ ప్రజాపార్టీ ముస్లిం లీగ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. రెండేండ్లు తిరగకుండానే ముస్లిం లీగ్ మద్దతు ఉపసంహరించుకొంది. దీంతో కేపీపీకి కాంగ్రెస్, హిందూ మహాసభ మద్దతునిచ్చాయి.
  8. సెంట్రల్ ప్రావిన్సులతోపాటు బీహార్, ఒరిస్సాలలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ సాధించింది. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సులోనూ కాంగ్రెస్ 50 స్థానాలకు గానూ 19 స్థానాలను గెలుచుకొన్నది. చిన్న చిన్న పార్టీలతో కలిసి ముస్లింలు అధికంగా ఉన్న ఈ ప్రావిన్సులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సమయంలో నెహ్రూ.. ఎన్నికలకు ముందు ముస్లిం లీగ్‌కు ఇచ్చిన హామీని చెత్తబుట్టలో పడేశాడు. ఫలితాలు వచ్చిన తరువాత జిన్నాతో కనీసం మాట్లాడటానికి కూడా నెహ్రూ ఇష్టపడలేదు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నెహ్రూ.. ముస్లిం లీగ్‌తో మాత్రం పొత్తు పెట్టుకోలేదు. ఇది జిన్నాకు, లీగ్ నేతలకు తీవ్రమైన అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించింది. వాస్తవానికి ముస్లింలీగ్ తన బలాన్ని అంచనా వేసుకోవడంలో తప్పటడుగు వేసింది. ఎన్నికలకు ముందే పార్లమెంటరీ బోర్డులను నియమించుకొని దీని ద్వారా ప్రాంతీయ ప్రభుత్వాలను ఏర్పాటులో కాంగ్రెస్‌కు తన అవసరం కచ్చితంగా ఉంటుందని భావించింది. ముస్లిం లీగ్‌కు మంచి ఫలితాలు వస్తాయని.. కాంగ్రెస్ తమపైన ఆధారపడక తప్పదని అనుకొన్నారు. కానీ.. బెంగాల్‌లో మినహా ఎక్కడా ముస్లిం లీగ్‌కు మెరుగైన ఫలితాలు రాలేదు. కాంగ్రెసేతర, ముస్లిం లీగేతర పార్టీలు పలు చోట్ల మంచి ఫలితాలు సాధించాయి. రిజర్వు స్థానాలు కాకుండా జనరల్ స్థానాలన్నింటిలోనూ కాంగ్రెస్ దేశమంతటా భారీ విజయాన్నే సాధించింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రావిన్సుల్లోనూ ముస్లిం లీగ్‌కు ఆశాజనకంగా ఫలితాలు రాలేదు. ఈ ప్రావిన్సుల్లో ప్రాంతీయ పార్టీలు ముస్లిం లీగ్‌ను అధికారం నుంచి దూరంగా ఉంచగలిగాయి. అందుకు కాంగ్రెస్ కూడా ఎంతో దోహదం చేసింది. ఈ పరిణామాలన్నీ ముస్లిం నాయకుల్లో తీవ్ర ఆందోళన కలిగింది. హిందూ మెజారిటీ ఉన్న ప్రావిన్సులను హిందువులు పరిపాలిస్తారు. ముస్లిం మెజార్టీ ఉన్న ప్రావిన్సులు ముస్లిం లీగ్ పాలించదు.. బెంగాల్, పంజాబ్ వంటి ప్రావిన్సుల్లో కూడా ముస్లింలీగ్ ఆధిపత్యంలోకి రాలేదు.  అది కూడా ముస్లిం లీగ్ కాని ఇతర పార్టీలు పాలిస్తాయనే భావన ఆ పార్టీ నాయకుల్లో బాగా బలపడిపోయింది. ఒక్క ప్రావిన్సులో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం ముస్లిం లీగ్‌కు అత్యంత ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఏ విధంగానూ ముస్లిం లీగ్ సహించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం జరగాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఖిలాఫత్ ఉద్యమంతో బ్రిటిష్ పాలకులకు దూరమైన ముస్లింలు.. 1937 ఎన్నికల్లో ఘోర పరాభవంతో తిరిగి దగ్గర కావడం మొదలు పెట్టారు. ఇందుకు అనుకూలంగా పావులు కదపడం ప్రారంభించారు. 1939 సెప్టెంబర్ 3 న రెండో ప్రపంచ యుద్ధంలో భారత్‌ను భాగస్వామిని చేస్తున్నట్టు అప్పటి వైస్రాయ్ లిన్లిత్ గో ప్రకటించాడు. జర్మనీతో యుద్ధం చేయడానికి బ్రిటన్‌తో భారత్ కూడా కలిసి పనిచేస్తుందని ప్రకటించాడు. ఏకపక్షంగా చేసిన ఈ ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఒక వేళ యుద్ధం తరువాత భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటన్ కట్టుబడి ఉంటే సహకరిస్తామని పేర్కొన్నది. కానీ.. ముస్లిం లీగ్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ‘క్లిష్టమైన’ పరిస్థితుల్లో సామ్రాజ్యానికి గౌరవ ప్రదమైన సహకారాన్ని ఇవ్వాలని జిన్నా ముస్లింలకు పిలుపునిచ్చాడు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం సంతోషపడిపోయింది. ముస్లింలకు రక్షణ పెంచాలన్న జిన్నా డిమాండ్‌ను అంగీకరించాడు. అదే సమయంలో కాంగ్రెస్ డిమాండ్లను తిరస్కరించాడు. అదే సమయంలో నెహ్రూకు సోవియట్ యూనియన్,.. అంతర్జాతీయ నాయకుడన్న కిరీటాన్ని తగిలించింది. ఆ ఇమేజిని నిలబెట్టుకోవడం కోసమే ఆయన జీవితమంతా తాపత్రయపడ్డారు. విదేశాంగ విధానం, ఆర్థిక విధానాలను రూపొందించారు. కానీ.. స్వాతంత్ర్యానంతరం వీటిలో ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేకపోయారు. అది వేరే సంగతి. ఇదే సమయంలో బ్రిటన్‌కు ఎలాంటి మద్దతు ఇవ్వరాదని నెహ్రూకు కోమింటర్న్ ద్వారా పరోక్షంగా ఆదేశాలు రావడంతో ఏకపక్షంగా కాంగ్రెస్ తన ప్రభుత్వాలను రద్దు చేసింది. ఈ పరిణామాలు ఊహించని విధంగా ముస్లిం లీగ్‌కు కలిసివచ్చాయి. కాంగ్రెస్ రాజీనామాలను వైస్రాయ్‌తో పాటు జిన్నా కూడా మహదానందం వ్యక్తం చేశారు. ఆ తరువాత డిసెంబర్ 2 న మహమ్మద్ ఆలీ జిన్నా భారతీయ ముస్లింలందరికీ ఒక విజ్ఞప్తిని చేశాడు. 1939 డిసెంబర్ 22వ తేదీని.. కాంగ్రెస్ నుంచి ‘విమోచన దినం’గా జరుపుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చాడు. ‘భారత దేశం అంతటా ఉన్న ముసల్మానులు డిసెంబర్ 22 శుక్రవారం ‘విమోచన దినం’ గా పాటించాలని, ఈ దేశంలో ఎట్టకేలకు ఆగిపోయిన కాంగ్రెస్ పాలన గొప్ప ఉపశమనానికి ప్రతీకగా భావించి కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటున్నా. దేశమంతటా ప్రాంతీయ, జిల్లా స్థాయిల్లో ముస్లిం లీగ్ బహిరంగ సభలు ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా తీర్మానాలను ఆమోదించాలని.. అన్యాయమైన కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి పొందినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రార్థనలు చేయాలి’ అని పిలుపునిచ్చాడు. ప్రభుత్వాల ఏర్పాటులో ముస్లింలీగ్‌ను జవహర్ లాల్ నెహ్రూ మిస్ హ్యాండిల్ చేయడం వల్ల జిన్నా పూర్తిగా కాంగ్రెస్‌కు దూరమైపోయాడు. ఖిలాఫత్ ఉద్యమంతో బ్రిటన్ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టిన ముస్లింలు.. అనూహ్యంగా దగ్గరైపోయారు. ఈ సమయంలో ముస్లింలీగ్ తరపున జిన్నా ఇచ్చిన పిలుపు దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడింది. పెద్ద ఎత్తున బ్రిటిష్ సైన్యంలో ముస్లింల చేరికలు పెరిగాయి. భారత బ్రిటిష్ ఆర్మీలో ముస్లింలీగ్ తన బలాన్ని ఏకంగా 34 శాతానికి పెంచుకొన్నది. ఈ పరిణామం తక్కువ అంచనా వేయలేము. బ్రిటన్  సైన్యంలో ముస్లిం లీగ్ బలపడుతున్న కొద్దీ.. దేశ విభజన వాదం మరింత బలపడుతూ వచ్చింది. సైన్యంలో పట్టు ఉంటే అధికారంపై పట్టు ఎలా ఉంటుందో.. విడిపోయిన పాకిస్తాన్‌లో  75 ఏండ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాల కంటే కూడా సైనిక పాలనే ఎక్కువ కాలం ఉన్నదని ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. సైన్యం ఏ స్థాయిలో ప్రభుత్వంపై తన పట్టును బిగించిందో పాకిస్తాన్‌ను చూస్తేనే అర్థమవుతుంది. సైన్యంలో ముస్లింలీగ్ ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో సహజంగానే పాలకవర్గంపై దాని ప్రభావం బలంగా కనిపించింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ముస్లింలు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ప్రత్యక్షంగా యుద్ధంలో బ్రిటన్ తరఫున పాల్గొన్నారు. దీంతో ముస్లిం లీగ్ పార్టీపై, భారతీయ ముస్లిం నాయకులపై బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. ఈ పరిణామాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా దేశ విభజనకు మరింతగా దారులు పరుస్తూ వచ్చాయి.  ఇక కాంగ్రెస్‌తో కలిసి ఏ ఒక్క ఉద్యమంలోనూ.. ఏ కార్యక్రమంలోనూ పాల్గొన రాదని ముస్లిం లీగ్ నిశ్చయించుకున్న తరువాత కొత్త పంథాను అనుసరించాలని తీర్మానించుకొన్నది.  ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేమని అర్థం కావడంతో ప్రత్యామ్నాయ మార్గంలో ఆధిపత్యాన్ని సాధించాలని నిర్ణయించుకొన్నారు. ఇందుకు వారి ముందు కనిపించి వికల్పం.. రహమత్ అలీ ప్రతిపాదించిన పాకిస్తాన్ ఏర్పాటు. ముస్లింలను ఒక ప్రత్యేక జాతిగా పరిగణించి వారు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం.. ఇందుకు అనుగుణంగానే జిన్నా చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు. హిందువులతో కలిసి ఇక తాము ఉండటం సాధ్యమయ్యేపని కాదని తేల్చి చెప్పాడు. బ్రిటిష్ వాళ్లు ఒప్పుకోవాలంటే.. వాళ్లు తప్పనిసరిగా దిగివచ్చేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగానే సైన్యంపై పట్టు బిగించే పని ప్రారంభించాడు. అదే సమయంలో డైరెక్ట్ యాక్షన్ డే కు పిలుపునిచ్చాడు. దేశ విభజనలో ఇది తుది నిర్ణయాంకంగా మారింది.

(సశేషం)

Exit mobile version