Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-67

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]స్వా[/dropcap]తంత్ర్యం ఇవ్వడానికి ముందు ప్రత్యక్ష కార్యాచరణ దినం పేరుతో జరిగిన హింసాకాండ గురించి ఇంకెంత ప్రస్తావించాల్సి ఉన్నది ఎందుకంటే ఆ పేరుతో జరిగిన హింసాకాండ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రస్తుత పాకిస్తాన్ వైపు జరిగిన హింస గురించి చెప్పాలంటే ఒక మతాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడమన్నదే లక్ష్యంగా సాగింది. రావల్పిండి నుంచి ఆయుధాలు సరఫరా అయ్యేవి. ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేవి. జిహాదీలు ఎంతమందిని హతమారిస్తే.. ఒక్కో తలను లెక్కబెట్టి.. తలల లెక్క ప్రకారం డబ్బులు చెల్లించేవారు. ఎక్కువ తలలను నరికేస్తే.. ఎక్కువ డబ్బులన్నమాట,. ఇంత ఘోరంగా సాగింది. 1946 మార్చి చివరి నాటికి పాకిస్తాన్ ప్రాంతంలో హిందువులు దాదాపుగా లేకుండా పోయారు. బతికినవాళ్లు పంజాబ్, కథువా, ఝీలం సర్గోదా తదితర ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో తలదాచుకొన్నారు.

మార్చి 9-12, 1947.. ఒక భయంకరమైన సన్నివేశానికి సాక్షీభూతం అయిన రోజులు.. ‘రేప్ ఆఫ్ రావల్పిండి’ అని దానికి పేరు. తోహా ఖాల్సా అనే గ్రామం ఇప్పుడు పాకిస్తాన్ లోని పంజాబ్‌లో ఉన్నది. రావల్పిండిలోని ఒక గ్రామం. ఇక్కడ సిక్కుల జనాభా ఎక్కువ. ఈ గ్రామంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరిస్తున్న బాధిత సిక్కుల వీడియోలు ఇప్పటికీ మనకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే చూడవచ్చు. అందుకు సంబంధించిన ఒక లింక్ ఇక్కడ ఇస్తున్నాను చూడవచ్చు. https://youtu.be/PrOLWQwc5c8 ఈ లింక్ లో ప్రీత్ పాల్ సింగ్ అనే వ్యక్తి తన అనుభవాలను వివరించాడు. ఆ రోజు (9వ తేదీన) మొదట ఈ గ్రామాన్ని దాదాపు 250 మందికి పైగా సాయుధ ముస్లింలు చుట్టుముట్టారు దాడి చేశారు.. చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్ద ధ్వంసం ఏమీ జరుగలేదు. ఆ తరువాత వరుసగా 10, 11 తేదీలలో దాడులు చేశారు. దీంతో సిక్కు మహిళలు, పురుషులు, పిల్లలు అంతా వెళ్లి సర్దార్ గులాబ్ సింగ్‌కు చెందిన హవేలీలో సురక్షిత ప్రదేశంలో తలదాచుకొన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ హవేలీని హాస్పిటల్‌గా మార్చింది. 11వ తేదీన దాడులకు వచ్చిన ముస్లింలు.. అక్కడి సిక్కులతో ఒప్పందం చేసుకొన్నారు. మాకు 20 వేల రూపాయలు ఇవ్వండి.. మేము ఇక్కడినుంచి వెళ్లిపోతాం అని అడిగారు. సిక్కులు ఆ మొత్తాన్ని నగల రూపంలో, నగదు రూపంలో వారికి అందించారు. డబ్బులు తీసుకొని వెళ్లిపోయిన వారు.. మళ్లీ 12వ తేదీన పెద్ద ఎత్తున దాడికి తెగబడ్డారు. ‘మమ్మల్ని ఏమీ చేయవద్దు, పిల్లలకు, మహిళలకు ఎటువంటి హాని తలపెట్టవద్దు, మా ఇండ్లను దోచుకొంటే దోచుకొని వెళ్లండి. వాటిని తగులబెట్టవద్దు.. ’ అని కోరినప్పటికీ వారి గోడు వినేవారే లేకుండా పోయారు. ముస్లింలు ఆ ఊళ్లోని అన్ని ఇండ్లమీద పడి దోచుకొన్న తరువాత హవేలీలో ఉన్నవారిని తెగనాడటానికి పూనుకొన్నారు. వృద్దులు, పెద్దవాళ్లైన సిక్కులకు పరిస్థితి అర్థమైంది. ఇంత పెద్ద మూకను ఎదిరించడం, అడ్డుకొని మహిళలను పిల్లలను కాపాడటం కష్టమని వారికి తేలిపోయింది. మగవాళ్లంతా ముస్లింలను వీలైనంత వరకు ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఇక హవేలీలో ఉన్న మహిళలకు పరిస్థితి అర్థమైంది. తమ మగవారు వారిని ఎదిరించి తిరిగి రావడం సాధ్యపడదు. వారంతా హతం కావడం ఖాయం. తాము మిగిలి ఉంటే.. తమపై ముస్లింలు అత్యాచారాలకు ఒడిగడతారు. లేదా.. బలవంతంగా నిఖా చేసుకొంటారు. లేదా.. అత్యంత దారుణంగా చంపుతారు. తాము సిక్కు మహిళలు.. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ శత్రువుకు చిక్కవద్దు అన్న నిర్ణయానికి వచ్చారు. హవేలీలో మాన్ కౌర్ అనే ఆయా ఉండేది. ఆమె పిల్లల బాగోగులు చూసుకొనేది. అక్కడ తమ పరిస్థితిని ముందుగా అర్థం చేసుకొన్నది మాన్ కౌరే. ఆమె హవేలీ పక్కనే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నది. ఆమె వెంటనే అక్కడ ఉన్న మహిళలు, పిల్లలు, కన్నె పిల్లలు అదే బావిలో దూకేశారు. వీరి చర్యను జోహర్ అంటారు. ఇది సతి కాదు. తమ భర్త పోరాటం నుంచి తిరిగిరాడు అని తెలిసినప్పుడు.. శత్రువు చేతికి చిక్కడం కంటే మరణమే శరణ్యమని తలచినప్పుడు ఈ సాహసచర్యకు పూనుకొంటారు. వీరితో బావి పూర్తిగా నిండిపోయింది. కొందరు సిక్కు పురుషులు తమ కృపాణాలతో తమ మహిళలను తామే హతమార్చుకొని తాము ఆత్మహత్య చేసుకొన్నారు. ఆ ఒక్క రోజు దాదాపు 200 మంది సిక్కుల మారణకాండ జరిగింది. ఆ తరువాత వారి ఇండ్లను ధ్వంసం చేశారు. వాటిని దగ్ధం చేశారు. గ్రామంలో ముసల్మానులు తప్ప ఎవరూ మిగల్లేదు.

మొత్తానికి ముందే చెప్పినట్టు మౌంట్ బాటన్ తన సొంత ప్రణాళికను రెండు పక్షాల ముందు ఉంచాడు. దీని వివరాలు మనకు వికీపీడియాలో కూడా లభ్యమవుతాయి. భారత, బ్రిటిష్ పార్లమెంట్ లైబ్రరీలలో వీటి డాక్యుమెంట్లను ఉంచారు. అందులోని కొన్ని అంశాలు ఇవీ..

అందులో ప్రధానమైంది పంజాబ్, బెంగాల్‌ను విడగొట్టాలన్న లక్ష్యం మొదటిదిగా కనిపిస్తుంది. ఈ రెండు ప్రావిన్సులలో కూడా హిందూ, ముస్లింలు, సిక్కులు సమావేశమై ఓటు వేస్తారు.

సింధు బెలూచిస్తాన్‌లు వాళ్ల సొంత నిర్ణయం తీసుకోవాలి. హైదరాబాద్, జునాగడ్ సహా సంస్థానాలన్నీ కూడా తమ సొంత నిర్ణయం తీసుకొని ఏదో ఒక దేశంలో చేరాలి.

నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, అస్సాం లోని సిల్హెట్ జిల్లా పరిస్థితిని ప్రజాభిప్రాయం ద్వారా నిర్ణయించాలి. బెంగాల్ రెండు ముక్కలు అవుతుంది.

వీటన్నింటికీ కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లు అంగీకరించాయి. ఇవాళ మనం జాతిపితగా కొలుస్తున్న గాంధీ ప్రమేయమే లేకుండా పోయింది. కేవలం నెహ్రూ తన ఆధిపత్యంతోనే ఈ వ్యవహారమంతా నడిపించారు. గాంధీని పక్కన పెట్టేశారు. ఆయన మౌన దీక్ష చేపడితే పట్టించుకున్న వారే లేకుండా పోయారు. బ్రిటన్ 1947 ఆగస్టు 14, 15 తేదీలలో స్వాతంత్ర్యాలు ఇచ్చేసింది. కానీ.. రెండు దేశాల మధ్యన సరిహద్దు రేఖను మాత్రం ఆగస్టు 14 నాటికి కానీ, 15 నాటికి కానీ డిసైడ్ చేయనే లేదు. స్వాతంత్ర్యపు జెండాలు ఎగురవేసిన రెండు రోజుల తరువాత సరిహద్దును ప్రకటించారు. ఈ సరిహద్దు రేఖ అప్పటికప్పుడు కొత్తగా వేసిందేమీ కాదు. సోకాల్డ్ నెహ్రూతోనో.. కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించి వేసింది అంతకంటే కాదు. ఈ సరిహద్దు రేఖ అనేది చాలాకాలంగా విన్‌స్టన్ చర్చిల్, జిన్నాల మధ్యన జరిగిన చర్చల్లో భాగంగా నిర్ణయించబడినది. చాలా చాలా ముందుగానే డిసైడ్ అయిన రేఖ ఇది. కాకపోతే ప్రకటించడానికి కొంత డ్రామా ఆడారు. మనవాళ్లు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నంరా బాబూ అని నోరు మూసుకొని మరీ ఇచ్చింది తీసేసుకొన్నారు. జిన్నా చర్చిల్ మధ్య జరిగిన చర్చల వివరాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.. దొరుకుతాయి.. పరిశీలించవచ్చు. ఈ సరిహద్దు రేఖను బ్రిటిష్ న్యాయవాది సిరిల్ రాడ్ క్లిఫ్ నివేదిక ద్వారా రూపొందించారని అధికారికంగా చెప్పినప్పటికీ.. అంతర్గతంగా జిన్నా గీసి పంపించిన రేఖే అది. సింధుకు తూర్పున ఉన్న ఐదు నదుల ప్రాంతం జీలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల మధ్యన ఉన్న ప్రాంతాలను వివాదాస్పదంగా మారాయి. ముస్లింలు, ముస్లిమేతర జనాభా విషయంలో నిర్దారిస్తూ పంజాబ్‌ను రెండు చేశాడు రాడ్ క్లిఫ్. ఆ తరువాత మన దేశంలోని పంజాబ్ రాష్ట్రం మూడు రాష్ట్రాలుగా మారిపోయింది (పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్). ఈ సరిహద్దు రేఖ విషయంలో కొద్ది రోజుల పాటు ఏ దేశంలో ఏ ప్రాంతం ఉన్నదో తెలియని దుర్బర పరిస్థితులు.. అటు బెంగాల్ లోనూ అదే దుర్గతి. భారతదేశంలో ఉన్న ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు.. పాకిస్తాన్‌కు కేటాయించిన ప్రాంతాల్లో భారత జెండాలు ఎగిరాయి. హిందూ మెజార్టీ ఉన్న చిట్టగాంగ్, హిల్ ట్రాక్ట్స్ లను తూర్పు పాకిస్తాన్ లకు ఇచ్చారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ముర్షీదాబాద్, మాట్టా తదితర ప్రాంతాలను భారత్‌కు ఇచ్చారు. చాలా రోజుల పాటు ఏం జరుగుతున్నదో సామాన్యులెవరికీ తెలియదు. కేవలం ఢిల్లీలో ఉన్న నెహ్రూ గారికి తప్ప.

ఇప్పుడు పాకిస్తాన్‌కు పోయిన సింధ్ ప్రాంతంలో సంపన్న మధ్యతరగతి (హైయ్యర్ మిడిల్ క్లాస్).. ప్రజలంతా హిందువులే, హైదరాబాద్, కరాచీ, షికార్పూర్, సుక్కూర్ వంటి నగరాల్లో కూడా అత్యధికంగా ఉన్న జనాభా హిందువులే. అప్పటికి అక్కడ ఉన్న హిందూ సింధీల జనాభా 14 లక్షలని బ్రిటిష్ వారి లెక్కలే చెప్తున్నాయి. కానీ, ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చి వేశారు. ఇవాళ అక్కడ హిందూ అన్న పదమే వినిపించదు.

స్వాతంత్ర్యం వచ్చింది. రెండు దేశాలు ఏర్పడ్డాయి. కానీ ప్రజలకు ఎక్కడికి వెళ్లాలో.. ఏం చేయాలో తెలియని సందిగ్ధత. ఆ దేశం నుంచి ఈ దేశానికి.. ఈ దేశం నుంచి ఆ దేశానికి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. ఎప్పుడైతే సరిహద్దు రేఖను డీమార్క్ చేశారో.. అప్పుడు మారణకాండ మరింత దారుణంగా మారిపోయింది. ప్రజలు మూటాముల్లె సర్దుకొని అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. కానీ.. వారు ఆ ప్రాంతం నుంచి మన ప్రాంతానికి రావడానికి దాదాపు నెల రోజుల పాటు నడిచారంటే ఆశ్చర్యమేస్తుంది. నిజానికి నెల రోజులు నడిచేంత దూరం లేదు. కానీ.. వారిమీద మార్గమధ్యంలో పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలైంది. కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. చిన్న శిశువు అనాథ అయిపోయింది. ఆడపిల్లకు తల్లిదండ్రులు దూరమయ్యారు. భార్యాభర్తలకు సంతానం దూరమైంది. భార్యకు భర్త, భర్తకు భార్య.. అసలు ఇంత భయానకమైన, హేయమైన, పైశాచికమైన రాక్షసత్వాన్ని మించిన హింస మరొకటి ఉండదు. దేశం విడిచి దేశం వస్తున్న వారు ఆహారం దొరక్క అన్నమో రామచంద్రా అని అలమటించిపోయారు. ఆదుకొనేవాడు లేడు.. ఢిల్లీలో ఒకపక్క స్వాతంత్ర్య సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. కానీ.. వాయవ్యభారతం రక్త కాసారంగా మారిపోయింది. శరణార్థులు సరిహద్దు దాటి రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స కోసం వస్తే.. అక్కడ వైద్యులు వీరి పరిస్థితి చూసి దిగ్భ్రమకు లోనయ్యారు. ఒళ్లంతా రక్తం.. శరీరంపై కత్తులతో చీరి.. పాకిస్తాన్ జిందాబాద్, అల్లా హు అక్బర్ అని ఉర్దూలో చెక్కిన దృశ్యాలు.. ఎంత దయనీయం.. ఊహించుకొంటేనే ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం అది. తరువాతి కాలంలో చాలా రికార్డులు మాయమయ్యాయి. చాలా రికార్డులు అసంపూర్ణంగా ఉండిపోయాయి. వాస్తవాలన్నీ రహస్యంగా భూస్థాపితమయ్యాయి. ఆ తరువాత భారతదేశానికి వచ్చేవారిని తీసుకొని రావడానికి రైళ్లను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ నుంచి దాదాపు మూడు నాలుగు వేల మందిని తీసుకొని భారత్‌కు బయలుదేరేవి. వీటిని మార్గమధ్యంలో అడ్డుకొని ఊచకోత కోసేవారు. రైలు మార్గాలు, పట్టాలు రక్తంతో తడిసిపోయాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్షులు ఎంతో మంది ఉన్నారు. ప్రముఖ రచయిత్రి మీనాక్షీ శరణ్, ప్రీత్ పాల్ సింగ్ వంటి వారెందరివో ప్రసంగాలు ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆమె కుటుంబం ఎంతలా ఛిన్నాభిన్నమైందో ఆమె ప్రసంగాలు వింటే అర్థమవుతుంది. అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సరికి ఒక్కరంటే ఒక్క మనిషి బతికి ఉన్నవాడు దిగినట్టు కనిపించదు. రైళ్లన్నీ శవాల కుప్పలతో నిండి ఉండేవి. శవాలను తరలించడం, అంత్యక్రియలు చేయడం, క్లీన్ చేయడంలో ఆర్ఎస్‌ఎస్ సహా అనేక హిందూ సిక్కు సంస్థలు చాలా కష్టపడ్డాయి. దాదాపు అధికారిక లెక్కల ప్రకారమే 1.2 కోట్ల మంది నిర్వాసితులయ్యారు. అనధికారికంగా సుమారు 3.5 కోట్ల మంది నిర్వాసితులైనట్టు అంచనా.. జరిగిన ప్రాణ నష్టం గురించి చెప్పుకొంటే.. ప్రపంచంలో అత్యంత విషాదకరమైన ఊచకోతలివి. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మూడో అతి పెద్ద మారణకాండ ఏదైనా ఉన్నదంటే.. అది భారత విభజన కారణంగా జరిగిన ఊచకోతలే. ఇందులో దాదాపు 20 లక్షల మందికి పైగా నిష్కారణంగా మత పిచ్చికి బలైపోయారు. 22 లక్షల మందికి పైగా ప్రజలు ఏమైపోయారో తెలియదు. వారి జాడే లేకుండా పోయింది. భారత పాకిస్తాన్‌లు వారిని తప్పిపోయిన వారిగా లెక్కల్లో జమచేశాయి. 1955 వరకు మన దేశంలో పౌరసత్వ చట్టం లేకపోవడంతో పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు భారత్ లోకి అటు బెంగాల్ వైపు నుంచి.. ఇటు లాహోర్ వైపు నుంచి కూడా వలస వచ్చారు. ఆ తరువాత చట్టం చేసినప్పటికీ నెహ్రూగారు చనిపోయేంత వరకు కూడా అంటే దాదాపు 1964-65 వరకు కూడా స్వేచ్ఛగా ఈ వలసలు కొనసాగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1973 నాటికి తూర్పు బెంగాల్ నుంచి, అటు పాకిస్తాన్ నుంచి దాదాపు 60 లక్షల మంది హిందువులు భారతదేశానికి వలస వచ్చారు.

ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఇస్లాం అన్నది మతం కంటే.. మారణ హోమం పైనే ఎక్కువగా ఆధారపడింది. మతం అందుకు వేసుకొన్న ముసుగు మాత్రమే. ప్రపంచం అంతా ఆకుపచ్చ రంగుతో నింపేయాలి అన్నదే వాళ్ల ఏకైక లక్ష్యం. మత గ్రంథాన్ని అత్యంత కఠినంగా, డైహార్డ్ గా అనుసరించే మతస్తులు ఈ ప్రపంచంలో ముస్లింలు మాత్రమే ఉన్నారనడంలో సందేహం లేదు. ఇదంతా వాస్తవం. అయినా హిందూ ముస్లిం సమైక్యత, లేక క్రిస్టియన్ సమైక్యత.. ఇవన్నీ ఇంకా మనం అనుకుంటున్నామంటే.. మనం అంతా ఒక ఇల్యూషన్ (చిత్తభ్రమ) లో ఉన్నట్టే లెక్క.

బ్రిటిష్ పాలకులు కానీ, భారతదేశంలోని హిందూ ముస్లిం నాయకులు కానీ.. ఈ దేశాన్ని మతాలను జాతులుగా మార్చారు. ముస్లింలను, హిందువులను రెండు జాతులుగా విభజించారు. ద్విజాతి సిద్ధాంతాన్ని తెరమీదకు తీసుకొని వచ్చారు. రెండు జాతుల పేరుతో ఈ దేశాన్ని ముక్కలు చేశారు. ఈ విభజనను కేవలం హిందూ ముస్లిం కోణంలోనే కాకుండా.. ఇతరత్రా బ్రిటిష్, అమెరికన్ల ప్రయోజనాలపై కూడా దృష్టి సారించి చూడాల్సి ఉన్నది. అమెరికా ప్రయోజనం గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. బ్రిటిష్ ప్రయోజనాలు.. ఆసియాపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు వీలుగా.. ఈ విభజన గీతలు గీయబడ్డాయి. వాయవ్య భారతం నుంచి మిగతా ప్రపంచంతో మనకున్న రాచబాటను బ్రిటిష్ వారు పూర్తిగా మూసివేశారు. అటు వైపు నుంచి ఎప్పటికీ ప్రశాంతత లేకుండా చిచ్చు పెట్టి వెళ్లారు. మనకు మిగతా మూడు వైపులా సముద్రమో, పర్వతాలో ఉన్నాయి. మైదాన ప్రాంతాన్ని మాత్రం కల్లోల బాటగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని సమస్యలకు పునాది పడింది 1947 ఆగస్టు 15న.

మరొక్క మాటలో చెప్పాలంటే అర్ధరాత్రి స్వతంత్రం మనల్ని విజేతలను చేయలేదు. మనం పరాజితులమే అయినాము.

ఈ సమస్యలు, సాంస్కృతిక, మౌలిక అస్తిత్వ వినాశనం గురించి తరువాతి ప్రాజెక్టులో మరింత లోతుగా విశ్లేషణ చేస్తాను. ఇప్పటికి విభజనపై ప్రముఖ కవి ఆచార్య సుప్రసన్నగారి ‘సాంపరాయం’ నుంచి నాలుగు కవితా పంక్తులు పేర్కొని సెలవు తీసుకుంటాను.

~

రాచపుండయి అఖండాన్ని ఖండితం చేసింది మౌఢ్యం
లక్షలాది భూమి పుత్రులు గూళ్లు లేని దిక్కులేని పక్షులై
ఎంత దూరం కదలినా ఎక్కడ ప్రప దొరికేను
ఎవరు విదిల్చేరు పిడికెడు మెతుకులు, దోసెడు నీళ్లు

పెరికివేయగా కాందిశీకులై లక్షల మంది వ్యధార్థులు
క్రోధాన్ని, అవమానాన్ని, అసహ్యాన్ని గొంతులో నిలిపి
బిడ్డలను కోల్పోయి, సంపదలను కోల్పోయి, స్వత్వాన్ని కోల్పోయి
వీధుల్లో, మైదానాల్లో, గుడారాల్లో సంలీనమై

రాచపుండు శస్త్ర చికిత్సకైనా లొంగనే లేదు
నరనరాలా వ్యాధి చేరుతున్నది. చావులను మోస్తూనే ఉన్నది
భిన్నాంగమైనా శేషాంగమైనా రక్షకు నోచుకోలేదు
చరిత్ర చేసిన పాపం వల్ల కణకణమూ విషదిగ్ధమైంది.

కృత్రిమంగా నిర్మించి సరిహద్దులలో కళేబరాల కందకాలు
మంచుకొండల్లో కురుస్తూంది నిరంతరాగ్ని వర్షం
ఎంతవరకు ఈ సంక్షోభం ఎవరి కొరకు ఈ అనువాకం
ప్రాణలతలు చిగురించని మరుభూమి ఈ దేశం

మట్టిని పంచుకున్నా, మనుషుల్ని ముక్కలుగా చీల్చినా
తుదకు నష్టమైంది మానవీయ జీవన సంస్కృతి
జీవన తత్త్వాన్ని సనాతనంగా తీర్చిన పరమార్థ దృక్పథం
ఛిన్నమస్తయైంది. సహస్రాబ్దాల ఆత్మ విశ్వాసం

స్వాతంత్ర్య రథం రక్తపు బురదలో దిగబడిపోయింది
పర ప్రాభవం దూరం నుంచి మనను పరిహసిస్తూనే ఉంది
అక్షతలు వేయడం మరచిన ఆకాశంలోని ఋషిగణం
శాంతి సూక్తం గద్గద కంఠంలోనుంచి వెలువరించలేకున్నది

అర్ధరాత్రి చతుష్షష్ట్యర చక్ర వైజయంతిని
ఎత్తింది మహానుభావుడు కాదు- పరాజితుడు, ప్రకంపితుడు
త్రయస్త్రంశత్కోటి గళాల జయరామంలో అపశ్రుతులు
‘ఆయన’ మాత్రం ఎక్కడో హింసల కారడవిలో ఒక్కడు

తన కళ్ల ముందే తన ప్రతిఫలనం ఖండితమై
ఎదలో దాచుకున్న చిరు దీపానికి స్నేహం కరువై
అశోచ్య శోకం ఎరుగని ఆత్మవేదియైనందున
రాముడు తోడుగా అశరీరుడై సాగిపోతున్నాడు.

~

దేశ విభజన విషవృక్షం ఇప్పటికి ముగిసింది.

(సమాప్తం)

Exit mobile version