(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]మ[/dropcap]హమ్మద్ బిన్ ఖాసిం నాటిన మొక్క 1947 నాటికి వటవృక్షంగా మారిపోయింది. సింధ్ ప్రాంతంలో ఖాసిం సెటిల్ అయిపోయాక ఖలీఫా ఉమయ్యద్ తంత్రం ప్రకారం ఇస్లామిస్టుల దాడులు భారత్‌లోకి క్రమంగా విస్తరించడం ప్రారంభమయ్యాయి. దేబాల్ పోర్ట్, ముల్తాన్, బ్రాహ్మణాబాద్ చిక్కడంతో వాళ్ల ఉత్సాహానికి అంతు లేకుండా పోయింది. ఖాసిం వారసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోసాగారు. చిన్న చిన్న రాజ్యాలను జయించుకుంటూ ముందుకు సాగారు. 724-810 మధ్యన గుర్జరప్రతిహార వంశానికి చెందిన మొదటి నాగభటుడు, చాళుక్య వంశానికి చెందిన రెండో విక్రమాదిత్యుడు, ఇతర చిన్న రాజ్యాలతో అరబ్బు ముస్లింల యుద్ధాలు వరుసగా జరిగాయి. అరబ్బుల యుద్ధాలకు మొదట బ్రేక్ వేసిన వాడు నాగభటుడు. అవంతి (మాళ్వ) రాజు. ఉజ్జయిని రాజధానిగా ప్రస్తుత గుజరాత్, రాజస్థాన్ దాకా ఈయన రాజ్యం విస్తరించి ఉన్నది. గుర్జరులు నాగభటుడి రాజ్యంలోనే ఉన్నారు. దీంతో సింధ్‌ను ఆక్రమించుకొన్న అరబ్బులు మొదట నాగభటుడి నియంత్రణలో ఉన్న మాళ్వ దేశంపైనే దాడికి తెగబడ్డారు. ఇందుకు సంబంధించి నాగభటుడి వారసుడు మిహిర భోజుడి గ్వాలియర్ శాసనంలో వివరాలు మనకు కొంతమేరకు కనిపిస్తాయి. 9వ శతాబ్దానికి చెందిన ముస్లిం చరిత్రకారుడు అల్ బధూరి కూడా ఈ దాడి వివరాలను రికార్డు చేశాడు. అవంతిపై దండయాత్రకు జునాయిద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ ముర్రి నేతృత్వంలో సింధ్ సైనికాధికారి, రాజ ప్రధాన్.. అల్ హకం బిన్ అవానా సైన్యానికి నాయకత్వం వహించి నాగభటపైన యుద్ధానికి తెగబడ్డాడు. కానీ యుద్ధం విజయవంతం కాలేదు. నాగభటుడు అరబ్బు సైన్యాలను చిత్తుగా ఓడించి వేలాది ముస్లిం సైన్యాన్ని మట్టుపెట్టి పారిపోయేలా చేశాడు.
725728 మధ్యన మేవాడ్ రాజు బప్పారావల్ అరబ్బులను తరిమికొట్టిన తీరు చరిత్రాత్మకమైంది. నాగభటుడు అరబ్బులపై యుద్ధానికి వెళ్లినప్పుడు బప్పారావల్ తన సైన్యాన్ని సహాయంగా పంపించాడు. (రమేశ్‌చంద్ర మజుందార్, ఆర్వీ సోమానీ రచనల్లో వివరంగా చదువచ్చు) ఖలీఫా ఉమయ్యద్ కాలంలో ముస్లిం దాడులను ఎదుర్కోవడమే కాకుండా ఇరాన్ దాకా తరిమి తరిమి కొట్టినవాడు బప్పా రావల్. చిత్తోడ్ కోటను ముస్లింల నుంచి విడిపించి రాజ్యానికి స్వేచ్ఛ ప్రసాదించాడు. రాజ్‌పుత్‌ల పౌరుషానికి బప్పా రావల్ అచ్చమైన ప్రతీక. నాగభటుడు పశ్చిమ రాజస్థాన్ నుంచి ముస్లింలను తరిమి కొడితే.. బప్పారావల్ అదే సమయంలో మేవాడ్ నుంచి భారతదేశానికి కనుచూపు మేరలో లేకుండా ఇరాన్ దాకా పలాయనం చిత్తగింపజేశాడు. దారిలో ముస్లింలు అప్పటికే ఆక్రమించుకొన్న అనేక రాజ్యాలను తన స్వాధీనంలోకి తెచ్చుకొన్నాడు. ఆఫ్గనిస్తాన్‌పై దాడి చేసి అక్కడి ముస్లిం కమాండర్ సలీంను హతమార్చి.. రాజ్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. మేవాడ్ తిరిగి వచ్చే దారిలో మళ్లీ ముస్లింలు భారత్‌వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక మిలటరీ పోస్టును ఏర్పాటుచేశాడు. ఒక్కో మిలటరీ పోస్టులో వెయ్యి మంది సాయుధ సైనికులను మోహరించాడు. ఇందులో ఒక మిలటరీ పోస్టు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రావల్పిండి. బప్పారావల్ అనంతరం 1102 వ సంవత్సరం దాకా అంటే దాదాపు 500 ఏండ్ల దాకా ముస్లింలను రాజస్థాన్‌లోకి రాకుండా అడ్డుకోగలిగారు.
723-726 మధ్య కాలంలో కశ్మీర రాజు లలితాదిత్య ముక్తపాదుడి నేతృత్వంలో కర్కోటక వంశ సైన్యం అల్ జునైద్‌ను దారుణంగా ఓడించింది. లలితాదిత్యుడు ఉన్నంత కాలం ముల్తాన్ దాటి కశ్మీరం వైపు ముస్లిం రాజులు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోయారు. లలితాదిత్యుడు అత్యద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు. ఈతని కాలం కశ్మీరానికి స్వర్ణయుగమే. అనంత్‌నాగ్‌లోని మార్తాండ సూర్యదేవాలయం ఈయన కట్టించిందే. అనేక పట్టణాలను నిర్మించాడు. ఉమయ్యద్ ఖాలీఫా సైన్యం లలితాదిత్యుని కనీసం సమీపించలేకపోయాయి. (లలితాదిత్యుడి గురించి మరింత విస్తృత సమాచారం కస్తూరి మురళీకృష్ణ కల్హణ రాజతరంగిణి, నీలమత పురాణం లలో చదువవచ్చు).
731-741 సంవత్సరాల మధ్యన అల్‌హకం సైన్యాన్ని భారతీయ రాజులు విజయవంతంగా తిప్పికొట్టాడు. అందులో నాగభటుడు కూడా ఒకడు. ఒకపక్క నాగభటుడు అరబ్బులను ఓడించిన సమయంలోనే 736వ సంవత్సరంలో గుర్జరరాజు నాలుగో జయభటుడు బారూచులో ముస్లింల దాడిని విజయవంతంగా ఎదుర్కొని జయించాడు. 739వ సంవత్సరంలో గుజరాత్‌లోని నవసరి అతి పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చాళుక్య వంశస్థుడైన రెండో విక్రమాదిత్యుడి సామంతుడు అయిన అవనిజనేశ్వర పులకేశి ముస్లింలను తరిమి తరిమి కొట్టాడు. ఈ యుద్ధంలో పులకేశికి విక్రమాదిత్యుడి మరో సామంతుడు దంతి దుర్గుడు (రాష్ట్ర కూట వంశం) తన సైన్యంతో వచ్చి సహాయ పడ్డాడు. 805వ సంవత్సరంలో రెండో నాగభటుడు అరబ్బులను వణికించాడు. ఏకంగా సింధ్ సరిహద్దుల్లోని అనేక అరబ్ ఔట్‌పోస్టులను ఆక్రమించాడు.
అల్‌హకం హయాంలో అరబ్ సైన్యాలు వరుస యుద్ధాల్లో భారతీయులను ఎదుర్కోలేక తీవ్రంగా బలహీనపడ్డాయి. 737లో ఖలీఫాకు ఉత్తరం రాసి కొంతమంది సైన్యాన్ని పంపించాలని బతిమాలుకొన్నాడు. ఖలీఫా 600 మంది సైనికులను అల్‌హకం దగ్గరకు పంపించాడు. కానీ వారివల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది. రాజ్‌పుత్‌లు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు.. అరబ్బులను భారత్‌లోకి చొరబడకుండా విజయవంతంగా అడ్డుకోవడమే కాకుండా తమ రాజ్యాల్ని సింధ్ దాకా విస్తరించుకొంటూ పోయారు. భారత్‌లోకి ముస్లిం ప్రపంచాన్ని విస్తరించాలన్న ఉమయ్యద్ ఖలీఫా కోరిక అప్పటికైతే తీరకుండా పోయింది. తుర్క్ షాహీ రాజు ఫ్రోమో కూడా అరబ్బులను ఓడించాడు. 740 సంవత్సరంలో ఉత్తర సౌరాష్ట్ర చాళుక్యులతో జరిగిన యుద్ధంలో అల్‌హకం కూడా చనిపోయాడు. అప్పటికే తూర్పు సింధ్ ప్రాంతం తిరిగి భారతీయుల చేతుల్లోకి వచ్చింది.
ముస్లింలపై భారతీయులు పోరాడనే లేదు.. వాళ్లు వస్తుంటే మంగళహారతులిచ్చి స్వాగతించారు అనే రీతిలో చరిత్రను చెప్పుకొంటూ వస్తున్న వారికి ఇవీ ఉదాహరణలు. భారతదేశంలో ఏ ఒక్క భారతీయ రాజు కూడా ముస్లింలకు ఒక్క ఇంచు భూమి కూడా ఇవ్వడానికి ఎంతమాత్రం అంగీకరించలేదు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి.. తన సనాతనమైన భారతీయ ఉనికిని పరిరక్షించుకోవడానికి.. తమ నుదుటన సిందూరాన్ని చెరిగిపోకుండా ఉంచడానికి ఆ మరణాంతం పోరాడుతూనే ఉన్నారు. ప్రాణం పోయేంత వరకూ తరిమి కొట్టారు. 610 సంవత్సరంలో సౌదీ అరేబియాను ఇస్లామీకరణ చేసిన తరువాత.. ముస్లింలు భారత్‌లోకి తొలుత అడుగు పెట్టడానికే వందేండ్లు పట్టింది. దాదాపు 13 సార్లు అనేక రూపాల్లో దాడులకు తెగబడిన తరువాత కానీ సింధ్ వారి చేతుల్లోకి రాలేదు. అంతెందుకు దేబాల్ రేవు పట్టణంపై ఖాసిం దాడి చేసినప్పుడు రాజా దాహిర్‌ను కోవర్ట్ ప్రయోగం ద్వారానే ఓడించగలిగాడు తప్ప ప్రత్యక్ష యుద్ధంలో కానే కాదు. అల్ హజాజ్ దగ్గర పనిచేస్తున్న ఆలీఫా.. రాజా దాహిర్ దగ్గర శరణార్థుడిగా వచ్చి చేరాడు. చాలా కాలం నమ్మకస్తుడిగా ఉన్న తరువాత.. మహమ్మద్ బిన్ ఖాసిం యుద్ధానికి దిగినప్పుడు అతని క్యాంప్‌లోకి జంప్ అయి.. దాహిర్ సైనిక రహస్యాలన్నీ చెప్పి.. దాహిర్‌ను జయించేలా చేశాడు.
భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ.. అరబ్బులు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. కొన్ని ఉదాహరణలు చూడండి..
సంవత్సరం
(కరెంట్ ఎరా) |
అరబ్బుల యుద్ధాలు |
622 | ‘గజ్వా’ ప్రారంభం |
622-629 | పొరుగున ఉన్న యూదుల మీద యుద్ధం |
634-651 | పర్షియాపై యుద్ధం |
632 | సింధ్ సరిహద్దులపై దాడి |
634-712 | సింధ్, ఇతర ప్రాంతాలపై నౌకా దాడులు |
643-870 | హింద్ కాబూల్, జాబూల్ పై దాడులు |
915-1026 | కాబూల్‌లోని హింద్ షాహీల యుద్ధం |
1250-1500 | ఒరియాల యుద్ధం |
1320-1565 | విజయనగర రాజుల యుద్ధం |
1600-1700 | అహోమ్ ల యుద్ధం |
1650-1800 | గోండులు, బుందేలులు, మరాఠాలు, జాట్ల యుద్ధం |
1799-1853 | సిక్కుల యుద్ధం |
1600-1800 | గూర్ఖాలు, కొండ ప్రాంతాల రాజుల యుద్ధం |
దాదాపు 12 వందల సంవత్సరాలకు పైగా భారతీయ రాజులు ముస్లింల దాడులను నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నారు. తిప్పి కొడుతూనే ఉన్నారు. అల్‌హకం మరణానంతరం తూర్పు సింధ్ ప్రాంతంలో ముస్లింల ఉనికి లేకుండా పోయింది. కానీ.. మహమ్మద్ బిన్ ఖాసిం అరాచకానికి మత మార్పిడి అయిన వాళ్లు మాత్రం మతాన్ని పాటిస్తూనే వచ్చారు. అన్ని జాతులను, అన్ని ధర్మాలను సహించాలన్న రూల్‌ను పాటిస్తున్న రాజులు వీటినీ సహించారు. కానీ భవిష్యత్తులో తాము అనుసరించిన ఈ సహనం భారతదేశానికి భయంకరమైన ప్రమాదకారిగా మారుతుందని వారు కలలో కూడా అనుకోలేదు. తూర్పు సింధ్‌లో తమ బలాన్ని బలగాన్ని కోల్పోయినప్పటికీ.. ముస్లింలు.. అడపా దడపా దాడులు కొనసాగిస్తూనే వచ్చారు. పెద్దగా భారత రాజ్యాల్లోకి చొరబడే ప్రయత్నం చేయకపోయినప్పటికీ.. తమ వ్యాపార అవసరాల కోసం ఖటియావార్ రేవుపై దాడులు చేశారు. 753వ సంవత్సరంలో రాష్ట్రకూటుడైన దంతిదుర్గుడు చాళుక్యులను ఎదిరించి స్వతంత్రతను ప్రకటించుకొన్నాడు. ఇదే అదనుగా ముస్లింలు సముద్ర వ్యాపారం పేరుతో దంతిదుర్గుని మిత్రపక్షంగా మారిపోయారు. సేమ్ టు సేమ్ ఆంగ్లేయుడు ఆ తరువాత చేసింది ఇదే. చిన్న సందు దొరికింది.. పెద్దది చేయడంలో ఇంక అసాధ్యమేమున్నది?
(సశేషం)