[box type=’note’ fontsize=’16’] చెన్నైలో 18 నవంబరు 2018 నాడు జరిగిన ‘దేశభక్తి కథలు’ పుస్తక పరిచయ సభ వివరాలు అందిస్తున్నారు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య. [/box]
[dropcap]ఈ [/dropcap]నెల 18వ తేదీన చెన్నైలోని పెరంబూరు తెలుగు సాహితీ సమితి, జనని సాంఘిక సాంస్కృతిక సమితి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక డి.ఆర్.బి.సీ.సీ.సీ. మహోన్నత పాఠశాల ముక్కాల నమ్మాళ్వార్ చెట్టి ఆడిటోరియంలో “దేశభక్తి కథలు” కథాసంకలనం పుస్తక పరిచయ సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి జనని సంస్థ అధ్యక్షురాలు డా.నిర్మలా పళనివేలు అధ్యక్షత వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ జి.ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశిష్ట అతిథిగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు శ్రీ తమ్మినేని బాబు హాజరయ్యారు. పుస్తక సమీక్షకులుగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డా.విస్తాలి శంకరరావు వ్యవహరించారు.
శ్రీమతి నిడమర్తి వసుంధరాదేవి ప్రార్థనతో సభా కార్యక్రమం ప్రారంభమయింది. డా.పి. ఎస్.హరిశాంతి ఆహూతులను పరిచయం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం అతిథులను, సంకలన కర్తలు శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడీహళ్లి మురళీమోహన్‌లను శాలువాలతో సత్కరించారు.
డా.నిర్మలా పళనివేలు తమ అధ్యక్షోపన్యాసం చేస్తూ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అనే మాటను వివరిస్తూ లంకా విజయానంతరం లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన తర్వాత లంకలోని ఐశ్వర్యమూ, వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి, “ఆహా అయోధ్యకన్నా ఐశ్వర్యవంతమైనది….ఇక్కడే ఉండిపోవచ్చు గదా…” అని శ్రీరామునితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా ” జననీ, జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ” అని చెప్పాడని వివరించారు. వాలిని జయించి రాజ్యాన్ని విభీషణునికి అప్పజెప్పినప్పుడు అతడు ఆ రాజ్యాన్ని మీరే ఏలుకోమని రాముడిని అడిగితే నేను కాదు నీవే ఈ రాజ్యాన్ని ఏలుకోవాలి అని చెప్పినట్టు, తన దేశానికి వెళ్ళాలని రాముడు పేర్కొన్నట్టు వివరించారు. దీనిలో దేశభక్తి ఉట్టి పడుతోందని ఆమె పేర్కొన్నారు. గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అని చెప్పిన మాట వాస్తవమని అయితే మట్టిని కూడా ఆరాధించే పవిత్ర దేశం మనదని పేర్కొన్నారు. దేశభక్తిని స్ఫురింపజేస్తున్న దేశభక్తి కథలు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకంలో తనకు ఎక్కువగా నచ్చిన చూడావత్ సింగ్, స్వధర్మే నిధనం శ్రేయః అనే కథలను ఆమె సభాసదులకు వివరించారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీ జి.ఆనంద్ మాట్లాడుతూ నేటి రోజుల్లో దేశభక్తి తగ్గి ఇతర వాటిపై ప్రభావం పెరిగిందని, ఇందువల్ల యువతకు దేశభక్తి చాలా అవసరమన్నారు. ఈ సందర్భంగా ‘ఒక వేణువు వినిపించెను అనురాగగీతిక’ పాటను ఆలపించి సభను రంజింపజేశారు. పెరంబూరు తెలుగు సాహితీ సమితి కార్యదర్శి శ్రీ టి.ఆర్.యస్.శర్మ మాట్లాడుతూ భక్తి వ్యక్తికి సంబంధించిందని, దేశభక్తి సమాజానికి సంబంధించినదని, పుస్తకంలో దేశభక్తితో పాటు దైవభక్తి కూడా ఉండడం సంపాదకుల ఆలోచనా శైలిని స్పష్టం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సంపాదకులను అభినందించారు.
మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డా.విస్తాలి శంకరరావు పుస్తకాన్ని సమీక్షిస్తూ సంపాదకులు కథలను ఎంపిక చేసుకున్న తీరు, వాటిని వర్గీకరించిన విధానం తనకు ఆశ్చర్యాన్ని గురి చేసిందని తెలిపారు. సంకలనంలోని 35 కథల్లో నవ్వే కన్నీళ్లు, గొల్ల రామవ్వ, మదర్సా వంటి కొన్ని కథలను ఎంపిక చేసుకుని వాటిని విశ్లేషించారు. ఈ పుస్తకంపై మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయిస్తామని సభాముఖంగా ప్రకటించారు.
అనంతరం సంపాదకుల పక్షాన శ్రీ కస్తూరి మురళీకృష్ణ తమ స్పందనను తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని తమిళనాట తెలుగు ప్రజలకు పరిచయం చేయడం తమకెంతో ఆనందాన్ని కలుగు జేస్తుందని అన్నారు. దేశభక్తి కథలను సంకలనం చేయడానికి గల నేపథ్యాన్ని సభకు వివరించారు. ప్రస్తుత తెలుగు సాహిత్య ప్రపంచంలో కొందరు విమర్శకులు తమకు నచ్చిన గుప్పెడు మంది రచయితలనే ఉత్తమ రచయితలుగా, వారి కథలనే ఉత్తమ కథలుగా ప్రచారం కల్పిస్తున్నారని, దాని వల్ల తెలుగు పాఠకులు అసలుసిసలైన ఉత్తమ సాహిత్యాన్ని అందుకోలేకపోతున్నారని, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో నెలకొన్న పరిస్థితులే తమను కథా సంకలనాల తయారీకి పురికొల్పాయని అన్నారు. విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కూడా నిరాశాజనకంగా ఉన్నాయని విమర్శించారు. ఇక ప్రస్తుత దేశభక్తి కథల సంకలనం విషయంలో తాము దేశ భక్తిని ఎలా నిర్వచించుకున్నామో వివరిస్తూ దేశమనే భావనలో తమను తాము పూర్తిగా లయమొందించుకోవడమేనని వివరించారు. ప్రాచీన కాలంలో దేశమనే హద్దులు, ఎల్లలు లేవని, రాజులు తమ రాజ్యాలను పరిపాలించుకుంటున్నా ప్రజలు స్వేచ్ఛగా ఎక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళగలిగే వారని, ఆ కాలంలో దేశభక్తి అంటే ధర్మభక్తి అని వాటిని ప్రతిబింబించే నోరినరసింహ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ కథలు ఈ సంకలనంలో ఉన్నాయని వివరించారు. తదనంతర కాలంలో దేశభక్తి భావనలో వచ్చిన మార్పులకు అనుగుణమైన కథలు ఈ సంకలనంలో చోటు చేసుకునాయని, దేశభక్తి కొందరికే, కొన్ని వర్గాలకే చెందిన అంశం కాదని, దానిపై ఎవరికీ కాపీరైట్ హక్కులు లేవని, తాము ఎంపిక చేసుకున్న కథలు వివిధ భావజాలాలకు చెందిన రచయితలు వ్రాసినవని శ్రీ కస్తూరి మురళీకృష్ణ వివరించారు.
శ్రీ మురళీకృష్ణ విశ్వవిద్యాలయాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డా.విస్తాలి శంకరరావు అన్నారు. విశ్వవిద్యాలయాలు తెలుగు సాహిత్యరంగానికి పునర్వైభవాన్ని సాధించి పెట్టిందని వివరించారు. శతాబ్ది చరిత్ర కలిగిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు భాషారచనలకు, తెలుగు పరిశోధనలకు ప్రాధాన్యతనిస్త్సూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందని వివరించారు. దళిత సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, మైనారిటీ సాహిత్యం పరిఢవిల్లడానికి విశ్వవిద్యాలయాలే కారణమని, చెన్నైలోని తెలుగువారు మాతృభాషను ప్రేమించడం వల్ల తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ ఉట్టిపడుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ సభకు పలువురు తెలుగుప్రజలు హాజరయ్యారు. వారిలో శ్రీయుతులు కె.మాలకొండయ్య, పోజుల ముద్దుకృష్ణుడు, చలన చిత్ర నిర్మాత జి.వెంకటరత్నం, రచయిత బొందల నాగేశ్వరరావు, పి.శివయ్య, ఎన్.వి.వి.సారథి, డా.ఎం.చంద్రావళి తదితరులు ఉన్నారు. శ్రీ జి.సాంబశివరావు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.
– గుడిమెట్ల చెన్నయ్య