ఈ కథలన్నీ మంచి కథలే!

0
48

ప్రత్యేకంగా ఒక అంశము తీసుకొని దానిపైన వచ్చిన కథలను ఒక సంకలనంగా తేవడం ఇటీవల జరుగుతుంది. అందులో భాగంగా కస్తూరి మురళీకృష్ణ సంపాదకత్వంలో ‘రైలు కథలు’ ఇటీవల వచ్చింది. అందులో కథలన్నీ రైలు నేపథ్యంలో వచ్చినవే.  ఆ సంకలనం సంచలనం సృష్టించింది. ఆ స్ఫూర్తితో వారు దేశభక్తి నేపథ్యంతో కథలను సేకరించి సంకలనంగా ఆగస్టు 15న విడుదల చేశారు.

ఇందులో 35 కథలున్నాయి. దేశభక్తిని నేపథ్యంగా తీసుకుని రాసిన ఈ కథలన్నీ మంచి కథలే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇందులో నోరి నరసింహ శాస్త్రి నుంచి ఇటీవలి వేంపల్లి గంగాధర్ వరకు రచయితల కథలను సేకరించి సంకలనాన్ని మనకందించారు కస్తూరి మురళీకృష్ణ.

శ్రీ కృష్ణ దేవరాయలు రథం పై వెళుతున్నప్పుడు రథానికి ముందుగా గొడుగును పట్టుకొని ఒక వ్యక్తి పరుగెత్తడం రాజ లాంఛనం. అతడిని గొడుగు పాలుడు అంటారు. అలా ఓ గొడుగు పాలుడు నిర్వర్తించిన విధి నిర్వహణ మనకు ఈ కథలో కనిపిస్తుంది. తిరుమల రామచంద్ర గారు రాసిన ‘హంపి నుండి హరప్పా దాక’లో కూడా ఈ సంఘటన కనిపిస్తుంది.

మన మాజీ ప్రధాని శ్రీ పి.వి నరసింహారావు గారు వ్రాసిన గొల్ల రామవ్వ కథ, నిఖిలేశ్వర్ రాసిన మనిషి మట్టి కథ ఈ సంకలనంలో ఉన్నాయి.

దేశభక్తి అనగానే మనకు సైనికులు గుర్తొస్తారు. అలా సైనికుల నేపథ్యంలో వచ్చిన కథల్లో మంజరి గారు రాసిన ‘సరిహద్దుకు ఆవల’ అనే కథ కూడా ఈ సంకలనంలో చోటు చేసుకుంది. దేశభక్తితో పాటు స్నేహధర్మం, మానవతావాదం, ప్రేమ ఈ కథలో మనం చూడొచ్చు.

ఈ సమాజాన్ని మార్చడానికి విప్లవం కన్నా ప్రేమ గొప్పదని చెప్పే వేద ప్రభాస్ గారి ‘ఎర్ర మేఘం’ కథ మనల్ని ఆలోచింపచేస్తుంది. ఈ కథ వచ్చి 30 ఏళ్ళు గడిచినా ఏ సంపుటిలోను చోటు చేసుకోక పోవడానికి కారణం ఏమిటి? భవిష్యత్తులో జరిగే పరిణామాన్ని, రచయిత క్రాంతదర్శిలా చిత్రించడం తప్పా? మిత్రులారా “ఎర్రమేఘం “కథ చదవండి. కథ చదివాక ఆలోచించండి.

ఇంకా బలివాడ కాంతారావు గారు, ఐతా చంద్రయ్య , కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ మొదలైనవారి కథలు ఇందులో ఉన్నాయి.

ఒక ప్రయోజనం కోసం కస్తూరి మురళీకృష్ణ గారు ఓ యజ్ఞం తలపెట్టారు. కొందరి చేతుల్లో చిక్కిన తెలుగుకథని వెలుగులోకి తెచ్చి మంచి కథలు రాసే వారు కొందరు కాదు, చాలామంది అని నమ్మి, ఒక ఉద్యమంలా కథల సంపుటులు తెస్తున్నారు. దీనికి మనవంతు సహకారం అందిద్దాం.

264 పేజీలతో 35 కథలు ఉన్న ఈ కథా సంకలనం వెల 150 రూపాయలు. సంచిక – సాహితి సంయుక్తంగా ప్రచురించారు.

ఈ పుస్తకం విజయనగరంలో 100 రూపాయిలకే, ఈ దిగువ చిరునామాలో దొరుకుతుంది.

గురజాడ బుక్  హౌజ్, షాపు నెంబరు 1, ఎన్.జి.ఓ. హోమ్, తాలుకా ఆఫీసు రోడ్, విజయనగరం- 2.

– ఎన్.కె.బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here