Site icon Sanchika

ఏది దేశభక్తి?

[dropcap]వ[/dropcap]ర్చస్సు కోసం.. బలం కోసం.. శక్తి కోసం..
ఈ మృతవీరుని హస్తం నుంచి ధనస్సును గ్రహిస్తున్నాం
మీరు.. మేము.. మనం ఈ విశ్వమంతా నిండిన
వైరి చక్రాన్ని అతిక్రమిస్తాం
ఇతణ్ణి మాతృభూమి ఒడిలోకి
అధిక వర్చస్సు ప్రసరింపజేసేందుకు చేరుస్తున్నాం
శిరీష కోమలి ఈ మహిషి ప్రతీకారం జరిగేదాకా
విచ్ఛిత్తి నుంచి రక్షించనీ
పృథివీ.. ఇతణ్ణి బలంగా నొక్కకు
ఊపిరి పీల్చుకోనీ..
సులభంగా.. సుకుమారంగా ప్రవేశించనీ
అవనీ.. తల్లి బిడ్డను పొత్తిళ్లలో
ఒదిగినట్టు ఒదిగించుకో

ఈ దేశంలో దేశభక్తి.. అన్న పదానికి మాతృక ఈ మంత్రం. ఇది నిజంగా మంత్రమే. తన మాతృభూమి కోసం వీరమరణం పొందిన మహావీరుడి మృత శరీరం నుంచి అసాధారణమైన ప్రేరణ పొందిన అపూర్వమైన సందర్భం. మాతృభూమి విముక్తం కోసం వీరుడు పొందిన అమరత్వం.. ప్రతీకారేచ్ఛను రగిలించాడు. తాను అసంపూర్ణంగా విడిచివెళ్లిన కార్యాన్ని ముందుకు తీసుకొని పోవడానికి తన చేతిలోని ధనస్సును సహచర వీరులకు అందిస్తున్నాడు. ఆ వీరులు దుఃఖించడంలేదు. తమ వీరుడి వీరమరణాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. గర్విస్తున్నారు. తమ పై ఆవరించిన వైరి చక్రాన్ని అధిగమించడానికి మరింత ప్రేరణతో శత్రుమూకలపైకి ఉరకలెత్తుతున్నారు. మాతృభూమిపై వారికి ఉన్న భక్తి అలాంటిది. తమకు ఆమే మాతృదేవత. ఋక్కులు చెప్పినట్టు మాతృదేవో భవ అంటే.. వారికి ఈ పుట్టడమే. దీనికోసం చివరి రక్తపు బొట్టును సమర్పణం చేయడానికి ఎంతమాత్రం వెనుకాడరు. ఈ దేశభక్తి ఏ బ్రిటిష్‌ వాళ్లపై స్వాతంత్య్ర పోరాటం సమయంలోనే ఉన్నట్టుండి పుట్టింది కాదు. ఈ మంత్రాన్ని ప్రవచించింది ఋగ్వేదం.. 18 వ మండలం 9, 10, 11 మంత్రాల్లో చెప్పిన సారాంశం.

జాతీయతకు మూలాధారమైన లక్షణాల్లో మాతృభూమి భావన అత్యంత ప్రధానమైంది. అన్ని అభ్యుదయాలకూ ఈ భావనే కీలకం. అందుకే ఈ దేశాన్ని మాతృభూమిగా.. తల్లిగా ఆరాధించి సర్వార్పణ చేయగలగడం ఇక్కడి మట్టి కణకణంలోనూ దాగి ఉన్నది. భారతదేశ ఐక్య భావన అన్నది ముందే చెప్పినట్టు బ్రిటీష్‌ వాళ్ల కాలంలోనే మొదలైందని చాలా మంది అనుకొంటుంటారు. కానీ ఇది అతి విస్తృతమైంది. భారతీయత అన్నది దేశం మీది భక్తిని పెంచింది. ఇక్కడి పవిత్ర స్థలాలు, తీర్థాలు, దేవాలయాలు, దేశమంతటా నిక్షిప్తం చేసుకొని ఆరాధించే విధానం.. మన వ్యక్తిత్వంతో మహత్త్వాన్ని జోడించి దేశీయ చైతన్యాన్ని పాదుగొల్పింది.

ఒక చిన్న ఉదాహరణ.. నిరంతరం తీర్థ యాత్రాటనం చేయాలని మన ప్రాచీనులు పదే పదే చెప్తారు. దీనివల్ల పుణ్యం వస్తుందని చెప్పటం భక్తితో ముడివేయటం అని దాదాపు అంతా భావిస్తారు. కానీ.. తీర్థ యాత్రాటనం చేయడం ద్వారా దేశమంతటితోనూ మనకు ప్రత్యక్షంగా పరిచయం ఏర్పడుతుంది. దీని ద్వారా దేశమంతటితోనూ ఒక ఇంటిగ్రిటీ ఏర్పడుతుంది. మతంతో ప్రమేయం లేకుండా సమస్త భారతదేశంలోనూ సమైక్య భావన ఏర్పడటానికి.. సమస్త దేశాన్ని ఏకరూపంగా భావించడానికి తీర్థయాత్రాటన వంటివి కొంత వరకు దోహదపడి ఉంటాయి. బౌద్ధులు కూడా తమ నిర్మాణాలను దేశమంతటా వెదజల్లి ఒక భావావేశంతో సంఘటితం చేశారు. ఆదిశంకరులు కేరళ మొదలు కాశ్మీరాంతం వరకు పాదయాత్ర చేసి దేశీయ ఐక్య భావనను సుప్రతిష్ఠం చేశారు. పాణిని నుంచి పాళీ గ్రంథాల దాకా భారతీయ భౌగోళిక పరిజ్ఞానాకాశం విసృ్తతంగా విచ్చుకొన్నది. పతంజలి (150 బీసీ) నాటికే భారతీయత విజ్ఞానం విశ్వవ్యాప్తమైంది. వరాహమిహిరుడి బృహత్సంహిత యావద్భారత పరిజ్ఞానాన్ని ప్రకటితం చేసింది.

జాతీయతకు ఒక భౌతిక ప్రాతిపదిక అవసరం. అది లేకపోతే ఆత్మావిష్కారానికి, తన వైశిష్ట్య నిరూపణకు అవకాశం ఉండదు. భారతీయ తత్త్వశాస్త్రం ఆత్మ శరీరాన్ని ధరించి తద్వారా పనిచేస్తుందని చెప్తుంది. తన్ను తాను ఆవిష్కరించుకోవడానికి, అభ్యుదయాన్ని సాధించడానికి ఆత్మకు ఒక సాధనం అవసరం. ఒక జాతి పుట్టి అభివృద్ధి పొందటానికి ముఖ్యమైన ఆధారం మాతృభూమే. మాతృభూమి కేంద్రకంగానే అన్ని అనుబంధాలు, సంప్రదాయాలు, అనుభూతులు, పోగవుతాయి. ఇక్కడ భాష, సాహిత్యము, ప్రాంతీయ సంస్కృతి కేవల ప్రాధాన్యమవుతాయి. భారతదేశం అన్నింటినీ అధిగమించి.. వేల ఏండ్లుగా, తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సంరక్షించుకొంటూ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక జాతిగా ఏర్పడింది. విడదీసే స్వభావం ఉన్న విభిన్నమైన ఆచారాలు, భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు అన్నింటినీ కూడా ‘మనందరిదీ ఒకే మాతృభూమి’ అన్న భావన మనలను ఒక జాతిగా సంఘటిత పరుస్తున్నది. అందుకే బెంగాలీ అయిన బంకీంచంద్రుడు ఆలపించిన వందేమాతరం యావత్‌ జాతికి ఏకమంత్రమై శత్రుమూకల వెన్నులో వణుకు పుట్టించింది.

కానీ దురదృష్టవశాత్తూ.. బ్రిటిష్‌ వాడు ఈ దేశం మీద వచ్చి పడ్డాక.. ఈ భూభాగాన్ని ఏకదేశంగా భావించకుండా చేయడానికి తనదైన ప్రయత్నాన్ని చేశాడు. విచిత్రమేమిటంటే.. బ్రిటిష్‌వాడు సముద్రం చుట్టూ చుట్టొచ్చి.. కలకత్తాలో దుకాణం పెట్టుకొని.. దాని పేరు మాత్రం ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ’ అని పెట్టుకొన్నాడు. అంటే.. తూర్పు భారతమనే కదా అర్థం. వాడు రావడం రావడమే చేసిన పని ఇది. అలాంటివాడు.. ఈ భూభాగాన్ని ఏకదేశం కాదని అంటే.. హాస్యాస్పదం కాక మరేమిటి? ‘భారతాన్ని సాధారణంగా ఒక దేశం అని భావిస్తూ వ్యవహరిస్తున్నారు కానీ, అది ఎంతమాత్రం నిజం కాదు. భారత్‌ నిజంగా అనేక విభిన్న దేశాల సమాహారం. ఐరోపియా భావాలకు అనుగుణంగా భౌతికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఐక్యమైన భారతమెన్నడూ లేదు. మాలాగా భారత్‌ ఏకదేశం ఎన్నడూ కాబోదు..’ అని సర్‌ జాన్‌ స్ట్రాచీ వ్యాఖ్యానించాడు. ఈ విడ్డూరమైన వ్యాఖ్యానాన్ని విన్సెంట్‌ ఏ స్మిత్‌ తీవ్రంగానే ఖండించాడు. ‘సముద్రాలు, పర్వతాలతో పూర్తిగా చుట్టుకొని ఉన్న భారతం ఏక దేశమే. ఆసేతు హిమాచలం ఒక విలక్షణమైన సాంస్కృతిక బంధం పెనవేసుకొని పోయి ఉన్నది. ఈ భూభాగాన్ని అంతటినీ భారతమనే పేరుతోనే పిలువాలి’ అని తేల్చి చెప్పాడు. భారతాన్ని ప్రాంతాలుగా వేర్వేరు రాజులు పరిపాలించవచ్చు. కానీ.. యావత్‌ జాతి యొక్క సాంఘిక జీవన విధానం ఒక్కటే. యావత్‌ భారతాన్ని ఒక్కటిగా ముడివేసింది సంస్కృతం. యావత్‌ భారతాన్ని ఏకత్రితం చేసింది ఏకరూపమైన ఆధ్యాత్మిక జీవన విధానం. యావత్‌ భారతాన్ని ఐక్యంగా ఏక సాంస్కృతిక బంధంతో పెనవేసింది వేదం, పురాణం, ఇతిహాసం.. వీటన్నింటి సమాహారమైన సాంఘిక జీవన విధానం. ఇవన్నీ కలిశాక దీన్ని ఒకే దేశం అనకుండా ఎలా ఉండగలం?

దేశభక్తి అంటే అసలైన నిర్వచనం ఇదే. ఇది ఒక వ్యక్తికో, సంస్థకో సంబంధించిన పేరు కాదు. ఏ వ్యక్తికి గానీ, సంస్థకు కానీ గుత్తసొత్తు కానే కాదు. ఈ పుడమిపై పుట్టిన ప్రతి శిశువు.. తన మాతృభూమి పొత్తిళ్లలో ఒదిగి ఎదిగినవాడే. ఉత్తుంగ హిమశృంగమైన ఆ తల్లి ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటాల్సిన వాడే. ఈ నెలలోని అణువణువూ.. ఈ దేశ సత్‌చరిత్రను చాటిచెప్తుంది. ఇంతటి విసృ్తతమైన భూభాగాన్ని భారతవర్షమని వేదాలే కొలిచాయి. దీనికి ఇండియా అన్న పేరు పెట్టింది విదేశీయులే. వాళ్లు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు మొదట తగిలింది సింధు నది కాబట్టి.. పర్షియన్లు హిందూ అన్నారు. గ్రీకులు ఇండస్‌ అన్నారు. బ్రిటిష్‌వాడు ఇండియా అన్నాడు. ఈ దేశానికి భారతమన్నదే అసలు పేరు. ఏక నామం. ప్రపంచంలో ఏ దేశానికీ లేనివిధంగా ఇంగ్లీష్‌లో ఒక పేరు.. హిందీలో ఒక పేరు.. ఇతర భాషల్లో మరో పేరుతో పిలిచే దేశం ఇదొక్కటే కావడం మన దౌర్భాగ్యం.

ఇవాళ దేశంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దేశభక్తి, సనాతన ధర్మం, జాతీయవాదం అనే పదాలు ఒక పరివారానికి మాత్రమే సంబంధించిన పదాలుగా.. సాధారణ పౌరులు ఆ మాటలు మాట్లాడటమే నిషిద్ధమన్నట్టు తయారైంది. దేశాన్ని నిందించాలి.. ఈ దేశ ప్రాచీన సంస్కృతిని నిందించాలి. మార్గదర్శనం వహించిన మహాపురుషులను నిందించాలి. లేకుంటే.. వీరంతా ఆ పరివారానికి చెందినవారని ముద్రవేయాలి. అంటరానివాళ్లను చేయాలి. జాతీయవాదం అనగానే బ్రాహ్మణీయ భావజాలం అనెయ్యాలి. ధర్మం అనగానే మనువాదులని పేరు పెట్టాలి. రాజ్యాన్ని నిందించాలి. అంబేద్కర్‌ని పూజించాలి. ఆయన నేతృత్వంలో రచించిన రాజ్యాంగాన్ని తిరస్కరించాలి. ఉత్తుత్తిగానైనా అవార్డు వాపసీ అనాలి. లేకుంటే తరువాతి అవార్డులు రావు. చివరకు మాకు పరివారానికి సంబంధం లేదు బాబోయ్‌.. అయినా మేం దేశం గురించి, జాతి గురించి, సంస్కృతి గురించి మాట్లాడి తీరుతాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఈ దశలో ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొంటూ ఒక సంకలనం తెలుగు సాహిత్యంలో వెలువడింది. అది కథల సంకలనం. దేశభక్తి కథల సంకలనం. నిజానికి ఇవాళ తెలుగు సాహిత్య ప్రపంచంలో ఉన్న పోకడల నేపథ్యంలో ఇలాంటి రచనను తీసుకొని రావడం.. దానికి ప్రజాదరణ సాధించడం నిజంగా దుస్సాహసమే అవుతుంది. కానీ.. ప్రముఖ రచయితలు కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్లి మురళీమోహన్‌.. ఈ సంకలనానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 5  విభాగాలుగా విభజించిన ఈ సంకలనంలో ప్రాచీన భారతం నుంచి ఆధునిక భారతం దాకా వివిధ కాలమాన పరిస్థితులపై వచ్చిన కథలతోపాటు కొత్త కథలను కూడా ఇందులో చేర్చారు. చెళ్లపిళ్లవారి గొడుగు పాలునికథ, విశ్వనాథ వారి చామర గ్రాహిణి, పీవీ నరసింహారావు గొల్ల రామవ్వ కథలు ఇందులో చేరడం ఈ సంకలనానికి శోభస్కరమైంది. ఈ కథలన్నింటినీ కట్టిపడేసే దారం ఒక్కటే.. అది భారతమాల. ఈ మాలలో గుచ్చిన పూలు ఇవన్నీ. మాతృదేవత మెడలో హారంగా సమర్పించిన కథా సంకలనం ఇది.. దేశభక్తి ఆత్మావిష్కారం చేసిన ఆధునిక సారస్వతమిది. రాజధర్మాన్ని, కర్తవ్య పరాయణతను విస్తృతంగా చర్చించిన గొడుగుపాలుడు.. రాముడికి వారసుడిగా కనిపిస్తాడు. ఈ దేశంలో తురుష్కుల నుంచి ఆంగ్లేయుల దాకా ప్రతీపశక్తులు ఎదిరించి నిలిచిన రాజులకు ఒక ప్రతీక ఈ కథ. చెళ్లపిళ్లవారి శిష్యుడు విశ్వనాథ వారి చామర గ్రాహిణి.. విదేశీయులను కూడా మెప్పించిన భారతీయ సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిఫలింపజేసిన గొప్ప కథ. ఇక పీవీ గొల్లరామవ్వ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే కదా.. నిజాం పోలీసుల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలను గొల్ల రామవ్వ రక్షించిన తీరును చెప్తుంది. భారతీయుల ఆత్మాభిమానం ఎంత గొప్పదంటే.. మన మహిళలు తమ చీర చెంగును చించి అదే జాతీయ చిహ్నంగా ప్రదర్శించినంత. ఇంతకు మించిన దేశభక్తిని మనం ఎక్కడ చూడగలం..? ఏ దేశంలో చూడగలం? ఈ తరానికి ఈ సంకలనం ప్రేరణ ఇస్తుంది. తన దేశంపై ప్రేమను పెంచుతుంది. తన జాతి చరిత్రపై కోల్పోయిన అభిమానాన్ని తిరిగి పాదుకొల్పుతుంది. ఇలాంటి రచనలు ఇవాల్టి అవసరం.. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక పరిమితులన్నింటికీ ఆవల ఈ దేశభక్తి ఉంటుంది. ఈ ఒక్క భావన ఈ దేశాన్ని మళ్లీ సుసంపన్నం చేస్తుంది. యావత్‌ జాతిని ఏకత్రితం చేస్తుంది. అన్ని సమస్యలకు సమాధానమిస్తుంది. అన్ని సౌభాగ్యాలకు దారిచూపిస్తుంది.

త్వంహి దుర్గా దశప్రహరణ ధారిణీ
కమల కమల దళ విహారిణీ, వాణీ విద్యాదాయినీ
నమామిత్వాం.. నమామి కమలాం.. అమలాం అతులాం
సుజలాం సుఫలాం
మాతరం.. వందేమాతరం

***

దేశభక్తి కథలు
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 264
వెల: 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

Exit mobile version