ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా:
[dropcap]దే[/dropcap]శమంతటా ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ జరుపకుంటున్న తరుణమిది. దేశ పౌరులంతా దేశభక్తి తొణికిసలాడుతుండగా, ప్రధాని మోడీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ నినాదంతో, ప్రతి ముంగిలిలో జాతీయ జెండా రెపరెపలాడుతున్న సందర్భమిది. దేశమంటే మనుషులే కాదు, దేశమంటే మట్టి కూడానూ అని చాటిచెప్పిన కథలెన్నో మన తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. అలాంటే దేశభక్తి కథల పుస్తకం ప్రచురణ కస్తూరి మురళీకృష్ణ గారి సంపాదకత్వంలో 2018 ఆగష్టు 15న జరిగింది. ఇందులో 35 కథలున్నాయి. కథా కాలాన్ని బట్టి 6 వర్గీకరణాలు చేశారు. ప్రాచీన భారతం, మధ్యభారతం, స్వాతంత్ర్య పోరాట భారతం, సైనిక భారతం, ఆధునిక భారతం పేరిట వర్గీకరించారు.
ఈ సంచికలోని కథలన్నింటిలోనూ, ఈ దేశంపై ప్రేమ, భక్తి నిరుపమానంగా కనిపిస్తాయి. మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు గారి కథ ‘గొల్ల రామవ్వ’లో నిజాం రాజుతో పోరాడుతున్న పోలీసుల నుండి స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ల వరకు రక్షించిన వైనం మనలను చకితుల్ని చేస్తుంది.
విదేశీ వస్తు బహిష్కరణ పిలుపునందుకొని ఎందరో కార్యకర్తలు చేస్తున్న ప్రచారంలో ఓ విదేశీ వస్తు మోహంలో ఉన్న ఉన్మత్తుడు అందమయిన ఓ పడచు కార్యకర్తతో ‘ఓ ముద్దు ఇస్తే ఈ విదేశీ వస్తు బహిష్కరణ చేయగలన’ని చెప్పినపుడు ఆమె చెప్పిన సమాధానం ఆ ఉన్మత్తుడి మత్తును దించుతుంది. సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర్య తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. అలా సిపాయిల్లో కూడా అప్పుడు ఆంగ్లేయ అధికార్లను ఎదిరించిన ఓ సిపాయి ‘చిరంజీవి’ కథ సిపాయిల్లో ఆత్మాభిమానం, ధైర్యం మనలను ఆలోచింపజేస్తాయి.
ఉత్తర భాతరదేశంలో నుండి దక్షణ భారతదేశం వరకు పరచుకున్న ఉత్తరమాల – ఓ చిన్నారికి వచ్చిన ఓ చిన్ని కష్టాన్ని ఎలా పంచుకుందో తెలియజేస్తుంది యండమూరి వ్రాసిన ‘నవ్వే కన్నీళ్ళు’ కథ. మానవతావాదం అన్నిటికంటే గొప్పది. దానికి అధికారాలు, ఆంక్షలు ఏమీ అడ్డురావని చెప్పే ఓ మంచి కథ మంజరి రాసిన ‘సరిహద్దు ఆవల’. దేశ సరిహద్దును కూడా దాటి వెళ్ళి క్షతగాత్రుడైన తన సహచరుని రక్షించడం చూస్తుంటే మనలను రోమాంచితులను చేస్తుంది.
విశ్వనాథ సత్యన్నారాయణగారి రచన ‘చామర గ్రాహిణి’ కథలో విదేశీ వనిత మన దేశ ధర్మాన్ని చూసి చకితురాలవుతుంది. తన జీవితమంతా పశ్చాతాపంతో కృంగిపోతుంది. మన హిందు సంస్కృతికి ఈ కథ గొప్ప నమూనాగా నిలుస్తుంది.
భారతీయుల ఆత్మాభిమానం నిరుపమానమయినదిని నిరూపించే మరో కథ. అప్పటికి ఇంకా మన జాతీయ పతాకం తయారుకాబడలేదు. ఇంకా మన దేశం విదేశీ శృంకలాలలో మగ్గుతోంది. అలాంటి ఓ సందర్భంలో జరిగిన ఓ సమ్మేళనంలో జెండా ఎగురవేయవలసి వచ్చింది. మిగతా దేశాల వారంతా వారివారి జెండాలను ఎగురవేస్తున్నారు. అప్పుడు మన దేశ స్త్రీలు చేసిన గొప్ప అద్భుతం తన చీర చెంగును చించి జాతీయ చిహ్నంగా హిందు పతాకాన్ని గర్వంగా ఎగురవేసి అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది ఈ కథ.
ప్రతి ఆగష్టు 15కి జాతీయ పతాకాన్ని ఓ ప్రముఖునిచే ఆవిష్కరణ చేయిస్తాడు తన పాఠశాలలో అతను. అలాంటి ప్రముఖులను వెతిక పట్టుకొంటాడాయన. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీగారి సభలు ఎక్కడ జరిగన తన స్వంత డబ్బులతో జెండాలు కుట్టి సభావేదికను అలంకరించడం కిష్టయ్యకు అలవాటు. అలాంటి కిట్టయ్య జెండాల అలంకరణలోనే కాలం చేశాడు. స్వతంత్ర్య పోరాటాలు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు ఎంతోమంది కిట్టయ్యలా ఊరూ, పేరు లేక అనామకులుగా ఉండిపోయారు. వారికి గుర్తింపునివ్వాలి. కిట్టయ్య త్యాగాన్ని గుర్తించి ఆ స్కూలు యాజమాన్య, చేసిన ఉదాత్తమయిన కార్యాన్ని మనకు చెప్తున్న కథ ‘జెండా’ రచయిత ఎం. వెంకటేశ్వరరావు.
దేశభక్తి కథల సమాహారం మనలను దేశభక్తిపరాయణులుగా, ఉత్తేజితులను చేస్తుంది. ఇందులో గొడుగు పాలుని కథ చెళ్ళపిళ్ళ వారి కథలు గాథలులోనిది. ఇందులో రాజభక్తి, కర్తవ్య నిర్వహణ కనిపిస్తాయి. దేశభక్తి కథల్లో దీనికి స్థానం కల్పించడం మనల్ని ఒకింత ఆలోచింపజేస్తుంది. సంపాదకులు కస్తూరి మురళి కృష్ణ, కోడినహళ్ళి మురళి మోహన్ అభినందనీయులు.
(ఈ సంపుటిలోని కథలు ఆనాటి వారి దేశభక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ కథలలో ప్రథమ బహుమతి దేనికివ్వాలా అని మనం ప్రశ్నించుకుంటే అన్నీ ప్రథమ విజేతలుగా నిలవడమే కాకుండా ఏ కథకాకథ ఒక ప్రత్యేకతను నింపుకున్నాయని చెప్పక తప్పదు. ఇటువంటి దేశభక్తిని ప్రభోదించే కథా సంపుటాలు యువరచయితలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అంతే కాకుండా వారు కూడా ఇటువంటి రచనలు చేయడానికి తోడ్పడతాయి. భవిష్యత్‍లో దేశభక్తి కథాంశాలుగా తమ రచనలు కొనసాగిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కథా సంపుటాలు ప్రతీ గ్రంథాలయంలో ఉంచటం ఎంతైనా అవసరం.)
***
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 264
వెల: 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు