[dropcap]ఆ[/dropcap]గస్టు 15, 2018న కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్ ‘దేశభక్తి కథలు’ అనే సంకలనాన్ని సాహితి ప్రచురణ సంస్థ ద్వారా మన ముందరికి తీసుకుని వచ్చారు. ఇందులో 35 కథలున్నాయి.
ప్రాచీన భారతం, స్వంతంత్ర పోరాట భారతం, సైనిక భారతం, సాంఘిక భారతం, ఆధునిక భారతం – ఈ 6 శీర్షికల క్రింద పలు కథలను మనం చూస్తాం. ఏ భారతం తీసుకున్నా దేశభక్తి అనే అంశంతో అల్లుకున్న కథలను ఒకచోట గుబాళింపజేసే ప్రక్రియ తొలుత వీరి ద్వారానే జరిగినట్టు రూఢీగా చెప్పవచ్చు.
‘భక్తి’ అనునది భారతీయుల సొత్తు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అను మాటలో తల్లిని, జన్మభూమినీ కలిపి చెప్పి ‘మాతృభూమి’ని ప్రాణాల కంటే మిన్నగా భావించే జాతి భరత జాతి. భీష్మ పితామహుడు 11 అక్షౌహిణులకు కౌరవుల తరఫున సేనాధిపత్యం వహిస్తూ సైనికులను ‘బ్రహ్మలోక దీక్ష’ తీసుకోమంటాడు. క్షత్రియుడనేవాడు జ్వరంతో బాధ పడుతూనో, కీళ్ళ నొప్పులు వేధిస్తుంటే మూలుగుతోనో ప్రాణాలు వదలడం భావ్యం కాదు అని సంబోధిస్తాడు. శత్రువులను చీల్చి చెండాడి యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోవటం అనేది బ్రహ్మలోక దీక్ష! అనగా ఆ విధంగా ప్రాణాలు కోల్పోయిన వారికి లభించేది సూటిగా బ్రహ్మలోకం.
భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ”యా ప్రీతిరవివేకానాం విషయేష్వనపాయినీ, త్వామనుస్మరతః సామే హృదయాన్మాప సర్పతు’ అంటాడు – అమృతం, అక్షయం అయిన భక్తి నశ్వరమైన వాటి మీద ఉండెడిది అయినప్పటికీ అది ఈశ్వరుని మీద తరిగిపోకుండా కాపాడుమని వేడుకుంటాడు! అటువంటి విశేషమైన భక్తి యోగాన్ని దేశభక్తి లోకి ప్రసరింప జేసి తరించిన మహనీయులెందరో…
ఈ కథలలో శివాజీ వంటి ప్రసిద్ధులున్నారు, అతి సామాన్యులూ ఉన్నారు. ఉదాత్తమైన చరిత్ర గల వారి ఉదంతాలు పేర్కొంటూ కొన్ని, అసాధారణమైన పరిస్థితులలో సామాన్యులు చూపించిన ఆత్మబలం, ధైర్యం ప్రతిబింబించే ఒకనాటి కాలానికి చెందిన సంఘటనలు కొన్ని, ఇటీవల జరిగిన కార్గిల్ యుద్ధానికి సంబంధించిన అంశాలు మనం చూడవచ్చు.
‘యజ్ఞసమిధ’ కథ భారత స్వాతంత్ర్య సమరాన్ని ఒక యజ్ఞంగా చూపటం విశేషం. పి.వి. నరసింహారావు గారు నిజాం కాలంలో ఒక ముసలి అవ్వ చూపిన చొరవను హృద్యంగా ‘గొల్ల రామవ్వ’ కథలో చిత్రీకరించారు.
‘స్వరాజ్యంలో సురాజ్యాన్ని నిర్మించు’ అని సమర్థ రామదాసు శివాజీకి చెప్పటం ప్రస్తుత దేశకాల పరిస్థితులకు కూడా అన్వయించవచ్చు! ఆ ఖడ్గం ఓటుగా మారి ప్రజలు శివాజీ వంటి వారికి బహుకరిస్తారా, వారు అలా దానిని పవిత్రంగా ఆదరించి సురాజ్యం వైపు ఒక రహదారిని నిర్మిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.
ఈ కథలు ఒక కోవకి చెందినవి కావు. దేశ కాల పరిస్థితులు భిన్నమైనవి. వాటిని రంగు రాళ్ళలా ఏరుకుని వచ్చి ఎంతో శ్రమపడి ఒక చోట చేర్చి భారతమాతకు మాలగా సమర్పించిన సంపాదకులు వాస్తవంగా ఒక అనిర్వచనీయమైన సంపదనే పుస్తక రూపంలో మన ముందుంచారు. ఈ కార్యానికి పూనుకున్నందుకే వీరు ఎన్నో విధాలుగా అభినందనీయులు.
తరాలు మారుతూ ఉండడం సహజం. అనేకమైన అంతరాలు ఏర్పడటం కూడా సహజమే. కానీ బోధనాంశంగా దేశభక్తి, సత్యం, ధర్మం అనేవి కనుమరుగైనప్పుడు ‘అదేమిటి?’ అని పిల్లలు అడుగుతున్న రోజులలో ఇది, ఇది, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనమెవరం? మన ధర్మమేమిటీ? అనేవి ఈ రోజు కాదు, మరో వేయి సంవత్సరాలు గడిచినా మనం చెబుతూనే ఉండాలి, అడుగడుగునా అవి వినిపిస్తూనే ఉండాలి.
సినారె గారు ఒక పాటలో చెప్పినట్లు ‘నీ ధర్మం నీ సంఘం, నీ దేశం నువ్వు మరువద్దు. జాతిని నడిపి, నీతిని నిలిపిన మహనీయులను మరవద్దు.. ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిపిన సంఘం, నీవు నిలిచిన ఈ సంఘం!’ – ఇది మరచిన రోజున మరేది గుర్తున్నా వ్యర్థమే!
ఈ సంకలనంలో కొన్ని కథలు ఎక్కడికో వెనక్కి తీసుకెళ్ళి ఆ కాలపు భాషను, సమకాలీన అంశాల చిత్రీకరణను చూపించటం విశేషం. ఒక సూక్ష్మ బుద్ధి గల విద్యార్థి ఆర్తితో చదివి ఎన్నో విషయాలను – చారిత్రాత్మకమైన వాటికి బేరీజు వేసుకుని తన మేధా శక్తిని పెంచుకోవచ్చు. బయోగ్రఫీలు, ఆత్మకథలు చదివేటప్పుడు ఆనాటి పరిస్థితులను, ఆలోచనా సరళులనూ ఎలా అధ్యయనం చేయగలమో, ఇలా కాలక్రమాన్ని అనుసరించి ఒక అంశం మీద స్పందించిన రచయితల చిత్రీకరణలు చదివినప్పుడు కూడా ‘ఆలోచనా సంపద’ పెరగగలదని చెప్పటంలో సందేహం లేదు.
నాటకీయత అనేది పట్టుకోవాలే గానీ, దానికి కాలపరిమితి ఉండదు. ‘భారతీయుడు’ అనే చిత్రంలో ఒక స్వాతంత్ర్య సమరయోధుడిని వృద్ధుడిని తీసుకువచ్చి అవినీతిపరుడైన కొడుకునే హతమార్చిన ఒక సందర్భం మనం చూస్తాం. ఆ చలన చిత్రం ఎంతో ప్రజాదరణ పొందింది.
సృజన అనేది ఒక ఉదాత్తమైన విషయాన్ని అనుసరించి ఉన్నప్పుడు ఒక ఆకర్షణా, ఒక అద్భుతం అనివార్యంగా ముందుకు వస్తుంది. ఆ ప్రక్రియ చేపట్టిన వీరు అభినందనీయులు!
ఇతర భాషలలో – ముఖ్యంగా హిందీలో దేశభక్తి కథలు విరివిగా లభ్యమవుతాయి. ఒక యాభై హిందీ కథలు ఎంచుకుని ఈ సరళిలో స్వేచ్ఛానువాదం చేసి ప్రచురించగలరని ఆశిస్తున్నాను.
‘దేశభక్తి కథలు’ పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాలలో పాఠ్యపుస్తకంగా చేర్చుకోవటం ప్రభుత్వం వారు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో ప్రథమంగా చేయవలసిన పని!
***
దేశభక్తి కథలు
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 264
వెల: 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు