Site icon Sanchika

దేశమంటే

[dropcap]దే[/dropcap]శమంటే మట్టి కూడా
దేశమంటే మనుషులేనోయ్
మట్టి మాత్రమె కాదు మనకిది
మాతృభూమిగ తలచినారు

దేశమంటే మట్టి కూడా
మట్టిలేనిది మనిషి ఎక్కడ?
పుడమి తల్లిది-నేను పుత్రుడ
వేదవాక్యము వినను లేదా?

దేశమంటే మట్టి కూడా
మట్టి లేనిది తనువు ఎక్కడ?
మట్టినుండే పుట్టినామూ!
మట్టిలోనే గిట్టెదాము!

దేశమంటే మట్టినుండెడి
నదీ నదములు పర్వతమ్ములు
చెట్టుపుట్టను రాయిరప్పను
కణ కణమ్మును పవిత్రమ్మే

దేశమంటే మట్టి కూడా
దేశభక్తియు మట్టియందునె
మట్టికొరకే మహావీరులు
నేలకొరిగిరి చరితలోన

దేశమంటే మట్టి కూడా
దేశమంటే మనుషులేనోయ్
మట్టి నుండే మనిషి వచ్చును
మనిషి మట్టిని పూజించు

వట్టి మనుషుల దేశమా ఇది
రామకృష్ణులు బుద్ధదేవులు
దేవతలచే నిర్మితంబగు
దేశమిదియే అవనిలోన

Exit mobile version