డిజైనర్ బేబీ

22
2

[dropcap]వె[/dropcap]నుక నుండి గట్టిగా హారన్ మోగడంతో ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు అనిల్. అప్పటికి అరగంట అయింది ట్రాఫిక్ జామ్ అయి. అమరావతి హైకోర్టుకు వెళ్లే మూడు రోడ్లు మీడియా వ్యాన్లు, కెమెరాలు, సందర్శకులతో కిక్కిరిసి ఉన్నాయి. ఫలితం… ఈ ట్రాఫిక్ జామ్. ఆ రోజే టెక్సాస్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగి కారులో బయలుదేరాడు అనిల్. అమ్మ ఆరోగ్యం బాగాలేదని, ఎందుకో రెండురోజులనుండీ నిన్ను చూడాలనుందనీ నాన్న ఫోన్ చెయ్యడంతో ఉన్న పళంగా అమరావతికి బయల్దేరాడు. అనుకున్నదే తడవుగా ఫ్లైట్ అయితే దొరికింది గానీ, ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఇంటికెళ్ళడం బాగా ఆలస్యమవుతోంది. ఒక వైపు అమ్మ ఎలా ఉందో అన్న ఆత్రుత, మరోవైపు విసుగు, కుదురుగా ఉండలేక పోతున్నాడు అనిల్.

ఇంతలో రెడ్ సిగ్నల్ పడడంతో మళ్ళీ కారు ఆగడంతో, విండో తీసి పక్కనే బైక్‌పై ఉన్న వ్యక్తిని అడిగాడు ట్రాఫిక్ జామ్‌కి కారణమేంటని. ఈ రోజు ‘అపురూప్’ కేసు విచారణ తీర్పు వెలువడే రోజు అని చెప్పాడు బైక్ పైని వ్యక్తి.

‘అపురూప్’… ఎక్కడో బాగా విన్న పేరు. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనిల్. ఇంతలో గ్రీన్ సిగ్నల్. కారు బయల్దేరింది. రోడ్డుకు అటూ ఇటూ ఫ్లెక్సీలు. అన్నిట్లో అదే పేరు ‘అపురూప్’. కొన్ని అపురూప్ గెలవాలని. మరికొన్ని ఓడాలని. వాటిల్లో ఒక ఫ్లెక్సీ వైపు తదేకంగా చూస్తుండిపోయాడు అనిల్.

***

దాదాపు ఇరవై ఏళ్ళ క్రిందటి మాట. 2028, మార్చి 16. ఏ తెలుగు పత్రిక చూసినా ఒకే హెడ్ లైన్. తొలి తెలుగు డిజైనర్ బేబీ జననం. ఆ న్యూస్ పూర్తి పాఠాన్ని చదవాలని తాను ప్రయత్నిస్తున్నా, అమ్మ చీవాట్లేసి పేపర్ లాగేసుకోవడం అనిల్‌కి ఇంకా గుర్తు. కారణం తనకి పదో తరగతి పరీక్షలు ఆ రోజే మొదలౌతున్నాయ్. కానీ ఆ న్యూస్‌లో ఒక పదం ‘అపురూప్’ అనే పేరు తాటికాయంత అక్షరాల్లో ఉండడం మాత్రం మనసులో ఇంకా చెదిరిపోలేదు.

***

శ్రావణి, భరత్ ఒక ప్రేమ జంట. వారి వారి అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో శ్రావణి న్యూరో సర్జన్ గాను, భరత్ ఆర్కిటెక్ట్ గాను స్థిరపడ్డారు. అమరావతి లోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా పని చేస్తున్న శ్రావణికి, తమ హాస్పిటల్ న్యూరో సైన్స్ విభాగం బిల్డింగ్‌ను డిజైన్ చేయడానికి వచ్చిన టీంలో ఒకరయిన భరత్‌తో పరిచయం అయింది. పలు దఫాలు బిల్డింగ్ పనుల నిమిత్తం కలవడం, మాట్లాడుకోవడం తద్వారా ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చడం… ఇదంతా జరగడానికి రెండేళ్లు పట్టింది. ఇద్దరూ తమ ఇంట్లో పెద్దలను ఒప్పించి తాము అనుకున్న ప్రకారం మంగళగిరి ఎన్నారై కన్వెన్షన్ సెంటర్‍లో పెళ్లి చేసుకున్నారు.

కొంత కాలానికి భరత్ చీఫ్ ఆర్కిటెక్ట్ గాను, శ్రావణి ఎయిమ్స్ హాస్పిటల్ న్యూరో విభాగానికి హెడ్ గాను పదోన్నతి పొందారు. వాళ్లిద్దరూ పిల్లలను కనాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరికీ కలిగిన ఆలోచనే ‘డిజైనర్ బేబీ’. ఇండియాలో అప్పుడప్పుడే మొదలైన ‘డిజైనర్ బేబీ’ సౌకర్యాన్ని అమరావతి ఎయిమ్స్ హాస్పిటల్ లోనూ అందుబాటులోకి తెచ్చారు. శ్రావణి, భరత్ లిద్దరూ హాస్పిటల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలన్నీ తెచ్చుకున్నారు. జాయింట్ డిక్లరేషన్ ఫారం నింపి సంతకం చేసారు. ఇక అసలైంది ఫారం సి. అందులోనే తమకు కావాల్సిన బిడ్డ ఎలా ఉండాలో నిర్ణయించుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అప్పటికి వైద్య శాస్త్ర పరిజ్ఞానానికి సాధ్యమైన పదహారు ఆప్షన్లలో…

ఆపిల్ పండు లాంటి మేని ఛాయ, ఆరడుగులు తగ్గకుండా పొడవు, బ్రౌన్ హెయిర్, గుండ్రటి మొహం, అలుపెరగకుండా పోరాడే తత్త్వం, అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఏ విషయం లోనూ రాజీ లేని తత్త్వం, ఏ విధమైన కుంగుబాటుకూ గురవకుండా ధైర్యంగా ఉండడం, కాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు రాకుండా ఉండడం అనే తొమ్మిది ఆప్షన్స్‌ని ఎంచుకున్నారు భరత్ , శ్రావణి. అందులోని కొన్ని ఆప్షన్స్‌ని ఎంచుకోవడానికి చాలా ఖర్చే అవుతుంది. అయినా, తమ సేవింగ్స్ అంతా ధారపోసి మరీ తమ బేబీని డిజైన్ చేసుకున్నారు.

వాళ్ళు ఎంచుకున్న ఆప్షన్స్‌లో కొన్ని బిడ్డ పుట్టిన వెంటనే కనిపిస్తాయి. మరి కొన్నిటికోసం కొన్నేళ్ల దాకా ఆగాల్సి ఉంటుంది. ఏమైతేనేం తొమ్మిది నెలలు ఓపిక పట్టారు. ఎట్టకేలకు శ్రావణి మార్చి 15, 2028 నాడు పండంటి బాబుకు జన్మనిచ్చింది.

ఫోటో సౌజన్యం: ఇంటర్‍నెట్

అచ్చు వాళ్లనుకున్నట్లుగానే తమ ఇద్దరికీ లేని ఆపిల్ పండు లాంటి రంగుతో, ఒత్తైన బ్రౌన్ హెయిర్‌తో గుండ్రటి మొహంతో, సగటు బిడ్డలకంటే పొడవుగా ఉన్నాడు తమ బిడ్డ. వారి ఆనందానికి అవధులే లేవు. అపురూపంగా తమ కలలకు ప్రతి రూపంగా పుట్టిన బిడ్డకు ‘అపురూప్’ అనే పేరు ముందే నిర్ణయించుకున్నట్టు గానే పెట్టారు.

ఆ రోజు నిజంగా తెలుగు నేల చరిత్రలోనే ఒక అద్భుతమైన రోజు. తొలి తెలుగు డిజైనర్ బేబీ పుట్టాడని పత్రికలన్నీ ప్రచురించాయి. ఆ రోజునుండీ భరత్, శ్రావణి తమ బిడ్డను ఎంతో ముద్దుగా, మురిపెంగా పెంచుతూ వచ్చారు.

బాబుకు మూడేళ్లు కూడా నిండకుండానే రైమ్స్ మొత్తం చక చకా చెప్పేయసాగాడు. నాలుగేళ్లకే, ఆరేళ్ళ కుర్రాడిలో కనిపించే చురుకుదనం, జ్ఞాపక శక్తినీ చూసి మురిసిపోయారు భారత్, శ్రావణి.

తమ స్తోమతకు తగ్గట్లుగానే అమరావతి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు అపురూప్‍ని. తరగతిలో అన్ని సబ్జెక్టుల్లోనూ తనే చురుగ్గా ఉండేవాడు. సహజంగానే టీచర్లందరూ తననే మెచ్చుకోసాగారు. పిల్లలందరూ అపురూప్‌ని ప్రత్యేకంగానే చూసినా ఎవరూ తనతో స్నేహం చెయ్యడానికి ఆసక్తి చూపేవారు కాదు. అందరూ తనని సూపర్ కిడ్ అనీ తనతో మనకెందుకులే అన్నట్లు ఉండడంతో స్నేహితులు లేని లోటు బాగా ఫీలయ్యేవాడు అపురూప్. ఇదే విషయం తల్లిదండ్రులతో చెప్పాడు. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీలైనా, తెలివిలో తనతో సరితూగే వాళ్ళు ఉండరనీ, ఒడ్డూ పొడుగూ తనలా ఉండేవారితో స్నేహం చెయ్యమనీ సలహా ఇచ్చారు. చివరికి ఎలాగో తనలాగే ఎర్రగా, పొడవుగా ఉండే విశ్వాస్‌తో స్నేహం కుదుర్చుకున్నాడు.

***

అపురూప్‌ని ఎలాగైనా అధిగమించాలని టర్మ్ ఎగ్జామ్స్‌లో బాగా కష్టపడి చదివాడు విశ్వాస్. ఎగ్జామ్స్ కూడా బాగా రాశాడు. రిజల్ట్స్ రానే వచ్చాయి. ఫలితం మాత్రం షరా మామూలే. అపురూప్‌దే ఫస్ట్ రాంక్. చాలా దిగాలు పడ్డాడు విశ్వాస్. కానీ ఈసారి టీచర్స్ అందరూ వచ్చి విశ్వాస్‌ని అభినందించారు. ఒక్క మార్కులో ఫస్ట్ రాంక్ మిస్సయినా గట్టి పోటీ ఇచ్చావని చెప్తుంటే విశ్వాస్ ముఖంలో కనిపించిన ఆనందం, ఫస్ట్ రాంక్ వచ్చినందుకు తనను అభినందించినప్పుడు వచ్చిన ఆనందం కన్నా భిన్నంగా ఉంది. ఇదమిత్థంగా ఇదీ అని చెప్పలేక పోయినా ఏదో కోల్పోతున్న భావన మాత్రం అపురూప్ ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

***

ఆ ఏడాది స్కూల్లో బెస్ట్ పేరెంట్స్ పోటీలు జరిగాయి. బెస్ట్ పేరెంట్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తారో చెప్పకపోయినా అందరు పేరెంట్స్‌నీ ఆహ్వానించారు స్కూలు యాజమాన్యం. అందరు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా స్కూలుకు వచ్చ్చారు. కొందరైతే శ్రావణి, భరత్‌లను ముందే అభినందించడం మొదలు పెట్టారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా బెస్ట్ పేరెంట్స్‌ను అనౌన్స్ చేయాల్సిందిగా ముఖ్యఅతిథిని వేదికపైకి ఆహ్వానించారు. అందరిలో ఒకే ఉత్కంఠ. చివరికి బెస్ట్ పేరెంట్స్‌ని అనౌన్స్ చేసారు. వారు భరత్, శ్రావణి కాదు. చాలా మందితో పాటు ఆశ్చర్యపోవడం భరత్, శ్రావణిల వంతయింది. తమ బిడ్డను అందరికంటే ఉన్నతంగా తీర్చిదిద్దిన తమను కాదని వేరొకరిని సెలెక్ట్ చేయడం ఏమిటో అర్థం కాలేదు వారికి. చివరికి నిర్వాహకులు చెప్ప్పిన వివరణ ఏమిటంటే “బిడ్డలలో లేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వారిలో పెంపొందించడం ద్వారా బిడ్డ ఎదుగుదలకు తోడ్పడడం అనే విషయంలో బెస్ట్ పేరెంట్స్‌ని సెలక్ట్ చేసాం” అని.

ఒకింత నిరుత్సాహానికి గురయిన భారత్, శ్రావణి అపురూప్‌ని తీసుకుని ఇంటికి వచ్చారు. తన పేరెంట్స్ ఎందుకు బెస్ట్ కాదో చెప్పమని అడిగిన అపురూప్‌కి ఏం చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు.

***

చూస్తుండగానే బాబుకు పదేళ్లు నిండాయి. అప్పటికి అపురూప్ ఏడో తరగతి పాసయ్యాడు. ప్రభుత్వం నుండి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని పన్నెండేళ్ళకే పదవ తరగతి పరీక్షలు రాయించారు అపురూప్ తల్లి దండ్రులు. మరో ఏడాదికే ఇంటర్ కూడా పూర్తయింది. తనకూ, ఇతర పిల్లలకూ ఎందుకింత వ్యత్యాసముందో అనలైజ్ చెయ్యాలనీ, అందుకు తగిన కోర్సు చెయ్యాలనీ అనుకున్నాడు అపురూప్. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ‘మెడికల్ ఇంజనీరింగ్’లో అడ్మిషన్ ఫారం తెచ్చి అపురూప్‌ని బలవంతంగా అందులో జాయిన్ చేయించారు అతని తల్లిదండ్రులు. ఏమైతేనేం పద్దెనిమిదేళ్లు కూడా నిండకుండానే ఆ కోర్సు కూడా పూర్తి చేశాడు అపురూప్.

అమెరికాలో పద్దెనిమిదేళ్లు నిండితే పిల్లలు స్వతంత్రంగా ఉంటారని తల్లిదండ్రులమీద ఆధారపడకూడదని చట్టాలున్నాయని, స్కూల్లో చిన్నప్పుడు విన్న మాటలు అపురూప్ మదిలో నాటుకున్నాయి. ఇంజనీరింగ్ అయిపోయింది మొదలు అపురూప్ ప్రవర్తనలో మార్పు గమనించారు భారత్, శ్రావణి.

***

ఆ రోజు ఇంజనీరింగ్ పట్టా ప్రదానోత్సవానికి వెళ్లి వచ్చి తన గదిలో ఒంటరిగా ఉండిపోయాడు అపురూప్. మరుసటిరోజు ఎప్పటిలాగే ఎనర్జీ డ్రింక్ తీసుకుని అపురూప్ గదిలోకెళ్ళిన శ్రావణి అక్కడ అపురూప్ కనబడక పోవడంతో విషయం భర్త భరత్‌కి చెప్పింది. ఇందులో ఆదుర్దా పడాల్సిందేమీ లేదని, తను తన భవిష్యత్ నిర్ణయించుకోవడానికి తన ఫ్రెండ్స్‌తో చర్చించడానికి వెళ్ళుండొచ్చని సముదాయించాడు భరత్.

మధ్యాహ్నమైనా అపురూప్ ఇంటికి రాక పోవడంతో భరత్, శ్రావణి చుట్టుపక్కల వారితో విచారించడం మొదలు పెట్టారు. చివరికి ఒకరి ద్వారా తెలిసింది అపురూప్ లాయర్ చక్రధర్ వాళ్ళింట్లోకి వెళ్తుండగా చూశారని. ఈ సారి సముదాయించడం శ్రావణి వంతయింది. శ్రావణి భరత్‌తో అన్నది “అబ్బాయికి పద్దెనిమిది నిండబోతున్నాయి కదా! ఏ డిజైనర్ గర్ల్‌నో వెతుక్కుని ఉంటాడు. ఈ విషయమై లాయర్‌ని కలవడానికి వెళ్ళాడేమో! ఎంతైనా మనం డిజైనర్ బేబీకి తల్లిదండ్రులం కదా? ఆ మాత్రం ఫాస్ట్‌గా ఆలోచించకపోతే ఎలా?”. భార్య అంటున్నది వెటకారమో మరోటో అర్థం కాక తికమక పడ్డాడు.

***

చక్రధర్… భరత్, శ్రావణి లకు ఫామిలీ లాయర్ అలాగే లీగల్ అడ్వైజర్ కూడా.

అపురూప్ చక్రధర్ వాళ్ళింటికి వెళ్లిన విషయం తెలిసిన వెంటనే, భరత్ ఆయనకి కాల్ చేశాడు. విషయం నేరుగా అడక్కుండా అపురూప్ భవిష్యత్తు గురించి చర్చిస్తున్నట్లుగా ప్రస్తావన తీసుకు వచ్చాడు. ఎట్టకేలకు చక్రధర్ విషయం చెప్పాడు. ఇటీవలే పార్లమెంటులో తీసుకువచ్చిన ‘ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అండ్ పేరెంట్స్ ప్రొటెక్షన్ ఆక్ట్, 2047’ గురించి వివరంగా చర్చించాడని. ఆ యాక్టు ప్రకారం పిల్లలకు 18 ఏళ్ళు నిండేవరకు తల్లిదండ్రులదే పూర్తి బాధ్యతగా ఉంటుందనీ, 18 ఏళ్ళు నిండినప్పటి నుండీ పిల్లలకు తల్లిదండ్రుల సంరక్షణ ఒక తప్పనిసరి బాధ్యతగా ఉంటుందనీ, ఈ చట్టం అమలుకు కోర్టులకు పూర్తి అధికారాలుంటాయని, అతిక్రమించిన వారికి కఠినమైన శిక్షలుంటాయని తెలుసుకున్నాడని చెప్పాడు లాయర్ చక్రధర్. మేజర్ అవబోతున్న తమ కొడుకుకు తమపై ఎంత బాధ్యతో అని మురిసిపోయారు భరత్, శ్రావణి.

మరుసటి రోజు అపురూప్ పుట్టిన రోజు. మేజర్ అవ్వబోతున్న తమ కొడుకు 19వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చెయ్యాలనీ , ఏదైనా సర్‌ప్రైజ్ ఇవ్వాలని, రాత్రి పొద్దుపోయేదాకా చర్చించుకున్నారు వాళ్లిద్దరూ. ఆ రోజు రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చిన అపురూప్ మౌనంగా ఉండడంతో మరేం అడక్కుండా ఒంటరిగా వదిలేశారు అతని తల్లిదండ్రులు.

ఉదయాన్నే కాలింగ్ బెల్ మ్రోగే దాకా మెలకువ రాలేదు వాళ్లకి. “శ్రావణీ, ఎవరో కాలింగ్ బెల్ మ్రోగిస్తున్నారు చూడరాదూ?!” మురిపెంగా అడిగాడు భరత్. “ఇంకెవరు, మన అపురూప్‌కి ఎవరో కేక్ పంపుంటారు…” అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది శ్రావణి. అది లాయర్ నోటీసు. ఎవరు పంపారో ఆత్రంగా చూసినా శ్రావణికి కళ్ళు తిరిగినంత పనయింది. అది తమ ముద్దుల కొడుకు అపురూప్ పంపింది. అదేమిటంటే “తన పుట్టుకనీ, బాల్యాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, తన వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించడం వల్ల తాను స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛను కోల్పోయానని, తమ ఇష్టాలకు అనుగుణంగా డిజైన్ చేయించుకున్న తనకు కూడా తన తల్లిదండ్రులను డిజైన్ చేసుకునే స్వేచ్ఛ ఉండాలనీ, అందుకే వారి పేరెంట్‌షిప్ నుండీ విముక్తి ప్రసాదించాలనీ, తనకు ఇష్టం వచ్చినవారిని తన పేరెంట్స్‌గా తీసుకునే సదుపాయం కల్పించాలని” కోర్టులో కేసు వేశాడు అపురూప్.

ఆ రోజు నుండీ అపురూప్ కీ అతని తల్లిదండ్రులకీ మాటలు లేవు.

ఎన్నో వాదప్రతివాదాల తర్వాత నేడు తుది తీర్పు వెలువడనుంది ‘అపురూప్’ కేసులో. అందుకే ఈ మీడియాలో ఇంత గోల…ఈ ట్రాఫిక్ జాం.

***

మరో కుదుపుతో ఈ లోకం లోకి వచ్చాడు అనిల్. ఇల్లు వచ్చింది. గబా గబా కారు దిగి ఇంట్లోకి పరుగు తీశాడు. నాన్న అమ్మ పక్కనే కూర్చుని టీవీ చూస్తున్నాడు. అనిల్‌ని చూసిన అతని తల్లికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎన్నడూ లేని ఉత్సాహంతో తన నుదుటిపై చుంబించింది. అనిల్ వాళ్ళ నాన్న ఎంతో సంతోషించాడు కొడుకుని చూసి. అందరూ టిఫిన్లు చేసి టీవీ ముందు కూర్చున్నారు. ‘అపురూప్’ కేసులో తుది తీర్పు కోసం.

న్యాయ మూర్తి చివరగా తన తీర్పు వెలువరించారు.

“చట్టం ఎప్పుడూ భౌతిక సాక్ష్యాల ఆధారంగానే తీర్పులు ఇస్తుందనీ, ప్రేమ, అనురాగం, కోపం, మానసిక స్వేచ్ఛ లాంటి అనుభూతులకు భౌతిక రూపంలో సాక్ష్యాధారాలు తేవడం అసాధ్యమ”ని చెప్పారు. “న్యాయ శాస్త్ర పరిజ్ఞానానికి అతీతంగా ఉన్న ఈ కేసులో తుది తీర్పు ఇవ్వడానికి తమ న్యాయశాస్త్ర సూత్రాలు సరిపోవనీ, అయినప్పటికీ తనకున్న పరిజ్ఞానంతో ఈ తీర్పు వెలువరిస్తున్నానని” చెపుతూ ‘అపురూప్’ లాంటి డిజైనర్ బేబీలను ఎన్నుకునే స్వేచ్ఛ తల్లిదండ్రులకున్నప్పుడు, ఆ డిజైనర్ బేబీలకు కూడా తమ తల్లిదండ్రులు ఇలానే ఉండాలనే కోరిక ఉండడంలో తప్పు లేదనీ, అయితే ఇది మన కుటుంబ వ్యవస్థకు ముప్పు తెచ్చే ప్రమాదమున్నందున దీన్ని ప్రోత్సహించకపోయినా, ఖండించనూ లేననీ అన్నారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘సమగ్ర పిల్లలు మరియు తల్లిదండ్రుల సంరక్షణ చట్టం, 2047′ నేపథ్యంలో ఈ కేసును ప్రత్యేక విచారణార్హమైనదిగా పరిగణిస్తూ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేస్తున్నాన”ని చెప్పారు. “ఇకపై డిజైనర్ బేబీల విషయంలో వీలయినంత త్వరగా నిర్దుష్ట చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాన”ని చెప్పారు న్యాయమూర్తి.

ఇదంతా విన్న అనిల్, ఈ కేసులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నదానికంటే, మనం అలాగే మన తల్లిదండ్రులూ అందరూ భగవంతుని చేతిలో డిజైనర్ బేబీలమేనని గుర్తించాలని ట్వీట్ చేశాడు. పదవ తరగతి సెకండ్ క్లాసులో పాసైన తనని తన తల్లిదండ్రులు ఎంతలా ప్రోత్సహించారో, ఇంతటి స్థాయికి ఎలా తీసుకు వచ్చారో తల్చుకుంటూ తన తల్లిదండ్రులను చూస్తుండిపోయాడు అనిల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here