“దేవి” : వొక గది లేక బందిఖానా

1
2

[box type=’note’ fontsize=’16’] “దర్శకురాలి షాట్ డివిజన్, ఆయా నటుల గొప్ప నటన వెంటనే స్ఫురించే లఘుచిత్రం” అంటూ ‘దేవి’ షార్ట్ ఫిల్మ్‌ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]వొ[/dropcap]క బలమైన విషయాన్ని పదమూడు నిముషాల్లో తెరకెక్కించాలంటే ఎంత నేర్పు వుండాలి! వొక్క వ్యర్థమైన షాట్ కూడా వుండకూడదు. విషయాన్ని బహుముఖీన దృష్టితో చూసి మన ముందుంచాలి. ఎక్కువగా కదలించకుండానే, మనం ఆలోచించి స్పందించేలా వుండాలి; అంటే మెలోడ్రామాని అదుపులో పెట్టుకుంటూనే ప్రభావవంతంగా వుండాలి. ఈ “దేవి” అనే లఘు చిత్రం ఇవన్నీ చేస్తుంది. ఆ ప్రభావం వెనుక దర్శకురాలి షాట్ డివిజన్, ఆయా నటుల గొప్ప నటన నాకు వెంటనే స్ఫురించాయి.

మొదటి షాట్లోనే సరిగ్గా సిగ్నల్స్ పట్టుకోని టీవీని తడుతూ, రిమోట్ చేత పట్టుకొని మాటలు రాని వో టీనేజీ అమ్మాయి కుస్తీ పడుతుంటుంది. వార్తలు వస్తున్నాయి. ఏదో ఘటనాస్థలిలో లోపలికి అనుమతించలేదని బయటి నుంచే ఆ టీవీ రిపోర్టరు కథనాన్ని చెబుతున్నాడు. దేశాన్ని అట్టుడికించిన నేరం, నేరస్తులకు రాజకీయ నాయకుల రక్షణ జనాలను మరింత కోపోద్రిక్తులు చేసినా, చట్టం కళ్ళు మూసుకునే వుంది అని విలేఖరి చెబుతున్నాడు. ఇంతలో మళ్ళీ సిగ్నల్స్ పోతాయి. కాజొల్ పూజ చేసి అగరొత్తుల పళ్ళేన్ని తీసుకుని గదంతా తిరుగుతుంది. ముగ్గురు వృధ్ధ స్త్రీలు (నీనా కులకర్ణి మరో ఇద్దరు, పేర్లు తెలీదు) పేకాట ఆడుకుంటున్నారు. వాళ్ళ గొంతులో ఉత్సాహం, సొంత రక్షణ కొసం అవసరమైనంత వరకూ స్వార్థం, వెటకారం వగైరా వుంటాయి. (వెటకారం : ఇక్కడ దేవుళ్లు లేరులే, పూజలెందుకు చేస్తావు?). చదువుకుంటూ వున్న మెడిసిన్ విద్యార్థిని శివాని రఘువంశి వీళ్ళ గోలకి విసుక్కుంటుంది, మీ మధ్య కంటే ఆ శవాల మధ్య వుంటేనే ప్రశాంతంగా చదువుకోవచ్చు అని. తొడల పైవరకే దుస్తులు వేసుకుని వున్న, మద్యం తాగుతున్న శృతి హాసన్ ఉక్కగా వున్నది అంటుంది. బుర్ఖా తొడుక్కుని వున్న, కాళ్ళకున్న రోమాలు తొలగిస్తున్న ముక్తా బార్వే అంటుంది: నీకే అంత ఉక్కగా వుంటే నా గురించి ఏం చెప్పమంటావు, నా పరిస్థితి ఉడుకుతున్న కబాబ్ లానే వుంది. ఇతరులకు వలె తన మీద కత్తి తో గాని, రాళ్ళతో గాని ప్రహారం జరగలేదు కాబట్టి తన నొప్పి తక్కువేమీ కాదంటుంది ఇంగ్లీషు చదువులు చదివిన నేహా ధూపియా. ఇంతలో కాలింగ్ బెల్లు మోగుతుంది. అందరిలోనూ కలకలం. ఒకరితో మరొకరు వాదించుకుంటారు, గొడవ పడతారు. ముందే ఇరుకుగా వుంది, ఇంకెవ్వరినీ రానివ్వొద్దు, తలుపే తీయవద్దు అంటారు. మనం ఇక్కడికి వచ్చిన క్షణాలు గుర్తు తెచ్చుకోండి, నేనైతే తలుపు తీస్తాను అంటుంది కాజోల్. లోపలికి వచ్చిన మనిషిని చూసి అందరి నోళ్ళూ పడిపోతాయి. అందరి కళ్ళల్లో బాధ.

కథ వాళ్ళ సంభాషణతో సగం నడిస్తే, కెమెరా తన షాట్ డివిజన్, camera angles తో కొంత, సంగీతంతో కొంతా కథను నడుస్తుంది. ఆ సంభాషణలను సశక్తంగా పలకడం, సరైన హావభావాల ద్వారా ఆ నటులు కథను బలంగా చెబుతారు. అది బందిఖానా నా? గదా? బందిఖానా అయితే వారినలా కట్టిపడేసినది ఎవరు/ఏమిటి? సంభాషణలతో కొంత అర్థమవుతుంది; కాని రెండోసారి చూడండి మరింత rawగా అనిపిస్తుంది. ప్రియాంక బెనర్జీ దర్శకత్వం బాగుంది. ఆమె పై “ఫోర్” అనే లఘు చిత్రాన్ని కాపీ కొట్టిన అభియోగం వుంది. నేను అది కూడా చూశాను. దీని కంటే నిడివి తక్కువ, అయిదారు నిముషాలు; కాని మూల కథావిషయం వొకటే. కాపీనో కాదో కాని, ఇది ఇంకా రక్త మాంసాలున్న స్క్రీన్ ప్లే. చివరి షాట్ చూడండి. అప్పటి దాకా ఆ స్త్రీలను క్లోజప్ గాని, మిడ్ లాంగ్ గాని తీసుకుని వొక్కొక్కరిని; కొన్ని సార్లు ఇద్దరు ముగ్గురిని వొక ఫ్రేం లో చూపించి, చివరికి వచ్చేసరికి ఆ మూలనున్న స్త్రీనుంచి అందరూ వొకే ఫ్రమె లో వొదిగేలాగా తలుపు దగ్గరి కెమెరా రిట్రాక్ట్ అవుతుంది. కెమెరా (సవితా సింఘ్) భాష గమనించడానికైనా మరోసారి చూడతగ్గది. పదో నిముషం నుంచి మొదలయ్యే సంగీతం (యష్ సహాయ్) కొంత కథ చెబుతుంది. దాని ముందు వున్న సంగీతపరమైన నిశ్శబ్దానికి ఊతాన్నిస్తూ, అంతే బలంగా.

ఇది మనం దృష్టి పెట్టాల్సిన చిత్రం, ఆలోచించాల్సిన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here