దేవుడి భయం

0
2

[dropcap]దే[/dropcap]వుడి భయం అంటే దేవుడి వలన భయం కాదండి, ఇది దేవుని యొక్క భయం. ‘దేవుడికి భయం ఏంటండీ చోద్యం కాకపోతే ఆయన అభయ కారకుడు కదా’ అని మీ సందేహం.

నిజమే – కానీ,

పాలకడలిలో శేషతల్పం మీద శయనించిన శ్రీవారి పాదాలు ఒత్తుతూ ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవికి అయ్యవారి మొహంలో ఆందోళన ఏదో ఉన్నట్లు కనిపించింది, “ఏమిటి స్వామీ, మీ ముఖారవిందంలో ఏవో భయం ఛాయలు కనిపిస్తున్నాయి మళ్లీ ఏ గజేంద్రుడైనా ఆపదలో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నాడా?” అని అడిగింది.

“ఇంకా అలాంటిదేం లేదు, భక్తుడు సుబ్బారావుకి అలాంటిదే వచ్చేలా ఉంది – అదిగో అవలోకించు” అంటూ భూమి వైపు చూపించాడు.

ఇప్పటికి నాలుగు సంవత్సరాల ముందు

పూజగదిలో దేవుడి ఫోటోకి ఎదురుగా కూర్చుని, పక్కనే ఒక బుట్ట నిండా పూలు పెట్టుకుని, ఒక చేతిలో మంత్రాల పుస్తకం పట్టుకుని మంత్రాలు వల్లిస్తూ, మధ్యమధ్యలో దేవుడి ఫోటో పైకి పూలు విసురుతున్నాడు సుబ్బారావు.

“ఏం కోరి సుబ్బారావు ఈ పూజలు చేస్తున్నాడు స్వామీ?” అడిగింది లక్ష్మీదేవి శ్రీవారిని.

“పూజ అయ్యాక అతడే చెప్తాడు విను” అన్నారు స్వామి వారు.

నైవేద్యం అయ్యాక మంత్రాలు పూర్తి చేసి మంగళ హారతి ఇస్తూ, “స్వామీ, నా పూజలన్నీ గైకొని నాకు పదోన్నతిని ప్రసాదించండి” అని వేడుకున్నాడు సుబ్బారావు.

“మీరు భక్తసులభుడు అని బాగానే గ్రహించినట్లున్నాడు, పూజే కాదు, నైవేద్యం కూడా ఘనంగానే పెట్టాడు. ఇంతకీ అతని కోరిక తీరుస్తున్నారా?”

శ్రీదేవి ప్రశ్నకు శ్రీవారు జవాబు ఏం చెప్పలేదు.

‘ఈ సస్పెన్స్ ఏమిటో చూద్దాం’ అనుకుంది అమ్మవారు.

ఆ ఏడు సుబ్బారావుకి పదోన్నతి రాలేదు.

లక్ష్మీదేవి పతి దేవుడి వైపు చురచురా చూసింది, ‘ఇదేం బాగోలేదు’ అన్నట్లు.

మరుసటి సంవత్సరం

సుబ్బారావు శ్రీవారి గుడిలో ప్రదక్షిణలు ప్రారంభించాడు. అక్కడి అయ్యవారి చేత ఆలయంలో జరిగే పూజలన్నీ చేయించడం మొదలు పెట్టాడు. కోరిక అదే – పూజలే కొత్తవి.

“స్వామీ, ఈ ఏడాదైనా సుబ్బారావు కోర్కె……” శ్రీలక్ష్మి మాట పూర్తయ్యేలోపే, “చూడు ఇంకా ఏమేమి చేస్తాడో” అన్నాడు శేషశయనుడు.

గుడిలో పూజ పూర్తయ్యాక సుబ్బారావు స్వామి వారికి సాష్టాంగపడి, ‘ఈసారి గనక నాకు పదోన్నతి వస్తే నీకు తలనీలాలు సమర్పించి వంద కొబ్బరికాయలు కొట్టడమో, వంద పొర్లు దండాలు పెట్టడమో చేస్తాను స్వామీ, ప్రమోషన్ వచ్చాక మొదటి జీతం కూడా నీ హుండీలో వేస్తాను’ అని మనసులో అనుకున్నాడు.

ఆ మాటలు శ్రీవారితో పాటు శ్రీమహాలక్ష్మి కూడా విన్నది, “ఇంకేం స్వామీ, ఇలాంటి భక్తుణ్ణి మీరు ఉపేక్షించడం నాకు నచ్చలా, మీరు అతడి నుంచి ఇంకా ఏం ఆశిస్తున్నారు?” అంటూ అడిగింది.

“ఏం ఆశిస్తున్నానా…?” అంటూ ఎదురు ప్రశ్న వేసి చిద్విలాసంతో శ్రీదేవి వైపు చూశారు తప్ప ఇంకేం మాట్లాడలేదు శ్రీవారు.

‘ఈ సస్పెన్స్ ఇంకెన్నాళ్లు?’ అనుకుంది అమ్మవారు.

ఆ యేడూ సుబ్బారావుకి ప్రమోషన్ రాలేదు.

గత సంవత్సరం

సుబ్బారావు జోస్యారావుతో జాతక చక్రం గీయించి పదోన్నతికి పరిష్కారాలు సూచించమన్నాడు. జోస్యారావు సుబ్బారావు జాతక చక్రం తిప్పి తిప్పి చూసి నాలుగు వేళ్ళకు (చేతివి) నాలుగు ఉంగరాలు సూచించి చెప్పాడు, “మీరు ప్రమోషన్ వస్తే స్వామివారికి అది చేస్తాను ఇది చేస్తాను అని మొక్కు కోవడం కాదు, అవేవో ముందుగానే తీర్చి మీ కోర్కె కోరడం సబబు, అప్పుడది తప్పక తీరుతుంది.”

సుబ్బారావుకి ఇదేదో సహేతుకంగా అనిపించింది, ‘చిన్నపిల్లలకి ఆశపెట్టి పనులు చేయించుకున్నట్టు స్వామి వారితో మాట్లాడటం తప్పు, ఇవ్వాలనుకున్నదేదో ముందే ఇచ్చేస్తే, తర్వాత బాధ్యత ఆయనదే అవుతుంది కదా!’ అనుకుంటూ, ముందుగా వేళ్లకు ఉంగరాలు చేయించేశాడు. తరువాత తలనీలాలు ఇచ్చేశాడు, మళ్ళీ గుడికి వెళ్లి ఒక జీతం హుండీలో వేసి, పొర్లుదండాలు ప్రారంభించాడు.

అతడి కష్టం అమ్మవారిని కదిలించింది, ఎంతైనా అమ్మ మనసు కదా!

“మీరు అతడికి న్యాయం చెయ్యడం లేదు, చూడండి మిమ్మల్ని నమ్ముకుని ఏమేమి చేస్తున్నాడో, మీకు కనికరం కలగడం లేదు. అతడు వేరే మనుషులతో లాబీలు చేసి పక్కదారుల్లో ప్రమోషన్ పొందాలనుకోవడం లేదుగా?” అని అడిగింది.

“అలా చేస్తే వాడు పాప జీవనుడు అవుతాడు కానీ, ప్రాప్త జీవనుడు కాలేడు. అప్పుడు వాడి భక్తీ, పూజలూ కూడా వృథా అవుతాయి. ”

“మరి అయితే ఈసారి సుబ్బారావు పదోన్నతి ఖాయం అనుకుంటా?” అన్న అమ్మవారి మాటలకు మళ్లీ స్వామివారి చిద్విలాసమే జవాబు అయ్యింది.

ఏడాది గడిచిపోయింది సుబ్బారావు ఎప్పటి సుబ్బారావు లాగే ఉన్నాడు.

ఈ సంవత్సరం (ప్రస్తుతం)

రోగం కుదరకపోతే పేషంటు డాక్టర్ని మార్చినట్టు ఈసారి సుబ్బారావు జోస్యారావుని విడిచిపెట్టి పేరున్న పెద్ద స్వామీజీని కలిశాడు, “ఏం చేస్తే ప్రమోషన్ వస్తుందో చెప్పండీ” అంటూ.

“దేవుడికి నిత్యం ధూపదీపనైవేద్యాలు చేస్తూనే నలభై రోజుల కఠిన ఉపవాస దీక్ష చేస్తే కోరిక తీరుతుంది నాయనా” అని చెప్పారు స్వామీజీ.

మంచి రోజు చూసుకుని సుబ్బారావు దీక్ష ప్రారంభించాడు. కానీ రెండు రోజులు గడిచేసరికి కళ్ళు బైర్లు కమ్మ సాగాయి. చుట్టూ నిత్యం నోరూరించే పదార్థాలు కనిపిస్తూ ఉన్నా వాటి ఆకర్షణలో పడకుండా పట్టుదలగా దీక్ష కొనసాగించాడు. నాలుగు రోజులు గడిచేసరికి ఒంట్లోని శక్తి మొత్తం ఆవిరై లేవలేని స్థితికి చేరుకోసాగాడు, అయినా దీక్షను ఏమాత్రం సడలించలేదు. ఇంట్లో వాళ్ళందరూ అతడి స్థితిని గమనించి దీక్ష విరమించమనీ, ఆహారం తీసుకోకపోతే అసలు మనిషే మాయమైపోయే ప్రమాదం ఉందనీ హెచ్చరించారు. అయినా సుబ్బారావు లొంగలేదు.

అప్పటికి పది రోజులు గడిచాయి. సుబ్బారావు చాలా నీరసించి పోయాడు. అతడి మొహంలో భక్తి కన్నా బింకమూ పట్టుదల కన్నా మొండితనమూ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అప్పుడు కనబడింది అమ్మవారికి అయ్యవారి మొహంలో ఆందోళన, “ఏం చేయబోతున్నారు స్వామీ?” అని అడిగింది.

అయ్యవారు ఏ జవాబూ చెప్పకుండా అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బారావు కల లోకి వెళ్లి, “ఈ ఉపవాస దీక్ష విరమించి, ఆహారాన్ని స్వీకరించి, దేహాన్ని కాపాడుకో” అని చెప్పారు.

“అయితే నా కోరిక తీరుస్తావా?” అడిగాడు సుబ్బారావు.

‘శ్రీవారికి ఇక సుబ్బారావు కోరిక తీర్చక తప్పదు’ అనుకుంది ఇదంతా చూస్తున్న శ్రీలక్ష్మి.

“కార్యసాధనకు చేయవలసింది పూజలూ వ్రతాలూ కాదు నాయనా, నా యందు మనస్సు నుంచి ఆ కార్యానికి సంబంధించిన వ్యవహారాలు చెయ్యాలి, అప్పుడు దాని ఫలం ఏదైతే అది వస్తుంది” శ్రీవారు చెప్పారు.

“ఈ సంగతి చెప్పడానికా స్వామీ మీరు నా దగ్గరకు వచ్చింది? మరి ఈ పూజలూ వ్రతాలూ ఎట్సెట్రా ఎట్సెట్రా దేనికి?” సుబ్బారావు డౌటు.

“అవన్నీ మీరు క్రమశిక్షణతో ఉంటూ ఆనందంగా ఉండడానికి జరుపుకోవాల్సిన వేడుకలు మాత్రమే” అని అంతర్ధానమయిపోయారు.

“ఈ మాత్రం చెప్పడానికి సుబ్బారావు దగ్గరికి మీరే వెళ్లడం ఎందుకో?” వెటకారంగా అడిగింది అమ్మవారు.

“ఎందుకంటే…. ఇటువంటి పనులతో రేపు వాడు ఏ రోగం పాలో అయితే దాన్ని బాగు చెయ్యవలసిన బాధ్యత నా మీదే పడుతుందనీ, వాడు దానికోసం కూడా నన్నే పీడిస్తాడనీ భయం”.

శ్రీవారి జవాబుతో శ్రీలక్ష్మి, “అదా మీ భయం!” అంటూ ముక్కున వేలేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here