Site icon Sanchika

దేవుడి చిరునామా

[box type=’note’ fontsize=’16’] కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ రచన  ‘దేవుడి చిరునామా’  రేడియో నాటికలు ఎలా రాస్తారో తెలుసుకోదల్చిన వారికి పరిశీలనాత్మక రచన. [/box]

ఇతివృత్తం:

దేవుడి గురించి ప్రముఖ మతాల నిర్వచనాలు దాదాపు ఒక్కటే. కానీ ఎవరి మతాన్ని వారు గొప్పగా భావిస్తారు. ఇతర మతాల వారితో ఘర్షణలు పడుతుంటారు. భారతీయ ధర్మం దేవుడు ‘అంతర్యామి’గా అందరిలో ఉన్నాడంటుంది. కానీ, కులమతాల అడ్డుగోడలతో, అనైక్యతతో బాధపడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో దైవం మానుషరూపంలో వచ్చి సంభాషిస్తే భిన్నమతాల వారి స్పందనలు ఎలా ఉంటాయి?

‘దేవుడి చిరునామా’ ఏమిటో నాటకాంతంలో తెలుస్తుంది. కనువిప్పు కలిగించి అసలు సత్యాన్ని ఆవిష్కరించే సామాజిక ప్రయోజన నాటిక ఇది.

పాత్రలు  పరిచయం

  1. దేవుడు – మనిషి రూపంలో భగవంతుడు
  2. భారతి –  దేశమాతకు ప్రతీక
  3. తులసీరామ్ – హిందూ భక్తుడు
  4. అక్బర్ – ముస్లిమ్
  5. అబ్రహం – క్రిస్టియన్
  6. దివాకర్ – హేతువాది, నాస్తికుడు

***

(దూరంగా గుడి గంటలు మ్రోగుతాయి – కాస్త విరామం తర్వాత మసీదు మైకులో ‘అల్లా హో అక్బర్’ – తర్వాత చర్చి గంటలు, మ్యూజిక్)
తులసీరామ్: (పెద్దగా) హరోంహర.. హర హర హర మహదేవ్.. జై భోలేనాథ్‌కీ.. (కోరస్‌గా జై…) భక్తుజనులారా! ఈ రోజు మహా శివరాత్రి, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఉపవాసం ఉన్న వారి గత పాపాలన్నీ నశించిపోతాయి (ఢమరుకధ్వని, శంఖానాదం).
దేవుడు: (మారు రూపంలో) పూజారి గారూ… అయ్యా తులసీరామ్ గారూ!
తులసీ: (అహంకారంతో) ఎవరు నువ్వు?
దేవుడు: బిచ్చగాడిని బాబూ…
తులసీ: బిచ్చగాడిని గుళ్లోకెవరు రానిచ్చారు? ఎవర్రా అక్కడ? ఈ ముష్టివాడిని మెడపట్టి బయటకు గెంటండి. ఊ..
దేవుడు: ఆగండాగండి బాబూ!శివరాత్రి రోజన పాపం చెయ్యకండి. మీ శివుడు కూడా నాలాంటి బిచ్చగాడే కదా? ఆదిభిక్షువు అంటారట కద? నాకు వాడికీ తేడా ఏముంది?
తులసీ: (కోపం) ఏమిటి? నీకూ శివుడికీ తేడా లేదా? తాగి వచ్చావా? కోతులన్నీ అంజనేయుడు కానట్టే, అడుకునే వాళ్లంతా పరమ శివులు కాలేరు. వెళ్లు వెళ్లు..
దేవుడు: అలాగే వెళ్ళిపోతాను. ఆకలితో అలమటిస్తున్నాను. ఆ నైవేద్యంలోంచి రెండు పళ్ళు పెట్టండి పూజారి గారూ! ఆ శివుడెలాగూ తినడు. ఈ శివుడి ఆకలి తీర్చండి బాబూ.. మీకు పుణ్యం ఉంటుంది. మీకు చేతులు జోడిస్తున్నాను.
తులసీ: ఛీ ఫో.. చెప్పేది నీకు కాదూ? సిగ్గు లేకుండా దేవుడి నైవేద్యం పెట్టమంటావా?
దేవుడు: ఆకలికి సిగ్గుండదు బాబూ.. కడుపునిండేదాక కష్టాలు తప్పువుకదా? అయినా ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపాలని మీ శాస్త్రాల్లో లేదా?
తులసీ: ఓహో! నీకు శాస్త్రాలు కూడా తెలుసున్నమాట? శివరాత్రి రోజున ఉపోషం ఉండాలి. అది తెలియదా?
దేవుడు: (నవ్వి) ఉపోషం కాదు పూజారి గారూ! ఉపవాసం… ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా ఉండటం.
తులసీ: ఇప్పుడు మేం దేవుడికి సమీపంగా లేమా?
దేవుడు: ఉన్నారు! కానీ ఉండాల్సిన విధంగా లేరు.
తులసీ: (వ్యంగ్యం) ఏమిటో ఆ విధానం..
దేవుడు: “యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం” గా ఉండాలి. మనసు, మాట, పనులు శివారాధనతో ముడిపడి ఉండాలి.
తులసీ: అలాగే ఉన్నాయిగా?!
దేవుడు: అని మీరనుకోవడం కాదు. శివుడనుకోవాలి..
తులసీ: ఏ శివుడు? నువ్వా? ఆ శివలింగమా?
దేవుడు: (నవ్వి) శివుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో లింగదేహంతో ఉన్నాడని లింగపురాణం చెప్పట్లేదా?
తులసీ: ఓహో! నువ్వు పురాణాలు కూడా చదివావన్నమాట? భేష్.. నీ పాండిత్యానికి సంతసించాం గానీ.. ఇక నీ దారి చూసుకో.. ఇక్కడ నీకేమీ దొరకదు.. ఫో ఫో..
దేవుడు: (స్వగతం) శివా! ఎవరు శాశ్వతం? అందరూ నీ శ్మశానవాసానికి చేరవలసినవారే.. ఊపిరి ఉన్నంతకాలం, శరీరపటుత్వం తగ్గనంత కాలం అహంకారిస్తారు.. పద శివా పద.. ఇక్కడ భక్తులున్నారు. భక్తి లేదు. శివుడున్నాడు. శుభం లేదు. వెళదాం పద..

********విరామ సంగీతం**********

(మసీదు దగ్గర అక్బర్ – దేవుడు సంబాషణ)
అక్బర్: (తనలో) అలహందు లిల్లాహీ.. యా అల్లా…
దేవుడు: సలామా లేకుం అక్బర్ సాహిబ్..
అక్బర్: ఆలేకుమ్ సలామ్.. ఎవరు మీరు?
దేవుడు: నా పేరు శివుడు…
అక్బర్: ఓ..కాఫీర్.. మసీదు కెందుకొచ్చినావు.
దేవుడు: మసీదు అంటే అల్లా గృహమే కద అక్బర్‌గారూ?
అక్బర్: అవునూ? అయితే?
దేవుడు: తిరిగి తిరిగి అలిసిపోయాను. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.
అక్బర్: అంటే.. నీ కాళ్లు నేను పిసకాలా?!
దేవుడు: లేదు నవాబుగారూ.. బయట బాగా చలిగా ఉంది. ఈ రాత్రి మసీదులో పడుకోవటానికి అనుమతించండి.
అక్బర్: అరే పాగల్! మసీదు అంటే ధర్మసత్రం అనుకున్నావా? మీ హిందూ సత్రాలుంటాయి. వెళ్ళి పడుకో.. నేను ధ్యానం చేసుకుంటున్నాను.. విసిగించక వెళ్ళు.
దేవుడు: (నవ్వి) ధ్యానం చెయ్యటం లేదు మీరు!
అర్బర్: (కోపం) ధ్యానం చేయ్యటం లేదా? చేతిలో జపమాల కనిపించడం లాదా?
దేవుడు: (నవ్వుతు) చేతిలో జపమాల ఉంది. మనసులో అల్లా లేడు. మీ ఆలోచనలన్నీ మీ ఇంటి దగ్గర మీ మనమడి మీద ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్తాడేమో.. ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటున్నారో లేదోనని భయపడుతున్నారు..
అక్బర్: (ఆశ్చర్యం) యా అల్లా ! మీరు గొప్ప ‘అవులియా’ మాదిరి వున్నారు. నన్ను క్షమించండి. మీరు చెప్పింది నిజమే.. రండి.. మా ఇంటికి వెళ్దాం.. అక్కడ మీకు అన్ని ఏర్పాట్లూ చేస్తాము.
దేవుడు: అవసరం లేదు అక్బర్ భాయ్! మా లాంటి కాఫీర్లకు మీలాంటి వాళ్ళు మర్యాదలు చేస్తే మీ ముస్లిం సోదరులు ఊరుకోరు.
అక్బర్: అవన్నీ నేను చూసుకుంటాను.. మీరు దయచేసి నాతో రండి…
దేవుడు: దయచేసి నన్ను బలవంతం చేయ్యకండి నవాబుగారూ.. నేను మీరన్నట్టు కాఫిర్‌నే. మనుషుల శరీరాలలోనే విగ్రహాలను చూస్తూ, వాటిలో అల్లాని వెతుక్కుంటాను. ఆవిధంగా నేను విగ్రహారాధకుణి..
అక్బర్: ఆహ్.. ఎంత గొప్పగా చెప్పారు? దేహాలను విగ్రహాలుగా చూస్తున్నారా? వాటిలో అల్లాను వెతుక్కుంటున్నారా? అద్బుతం.. మహాద్భుతం.. ఇంత కన్న గొప్ప ఆరాధన ఇంకేం వుంటుంది? నిజంగా మీరు మహాత్ములు.
దేవుడు: ప్రపంచంలో అల్లాను నమ్మేవాళ్లంతా మహాత్ములే.. అల్లా ఒక్కడే శాశ్వతం.. అల్లానే మాలిక్. అందరి ప్రభువు అల్లానే. సిరి సంపదలు, హోదా.. ఎవర్నీ ప్రభువులుగా చెయ్యలేవు. ఏ ప్రభువూ అల్లా కన్నా గొప్పవాడు కాడు. అల్లా విధేయుడంటే మంచి పనులు చేసేవాడు. బీదవారిని ఆదుకునేవాడు. అందరినీ ప్రేమించేవాడు.
అక్బర్: మీ మాటలు నిండా అమృతం ఉంది.
దేవుడు: మంచి మాటలకు మరణం ఉండదు. అందుకే అవి అమృతం. మంచి మాటను నమ్మి అనుసరించే వాడు మరణించినా అల్లా కరుణకి పాత్రుడవుతాడు. ఈ విషయం గుర్తుంచుకో అక్బర్ భాయి.. మేం వెళ్ళొస్తాం.
అక్బర్: (తన్మయం) యా అల్లా.. అలహందు లిల్లాహీ..

 *********** విరామ సంగీతం************

(చర్చి దగ్గర అబ్రహం – దేవుడు సంభాషణ)
దేవుడు: అబ్రహంగారూ! మీకు శుభమగు గాక.. మీ కుటుంబములో అందరూ క్షేమముగా ఉందురుగాక..
అబ్రహం: నేనే పాస్టరుని! నాకు ఆశీస్సులిస్తున్న నువ్వెవరు జీవుడా..
దేవుడు: ప్రతి జీవుడిలో దేవుండుంటాడని నమ్మే వాడిని. జీవుడే దేవుడవాలని కోరుకునేవాడిని. నా పేరు శివుడు!
అబ్రహం: ఓహో.. నువ్వు హిందూ బిచ్చగాడివా?
దేవుడు: బిచ్చగాడి క్కూడా మతం ఉంటుందా పాస్టరుగారూ?
అబ్రహం: ఎందుకుండదు? వాడు మనిషేగా? మనుషులందరికీ మతాలుంటాయి..
దేవుడు: ఓహో.. మనుషులందరికీ మతాలుంటాయి. కానీ, జంతువులకుండవు! రక్షించారు. వాటిక్కూడా మతాలు అంటగడితే ప్రపంచం ఏమైపోయేదో? ఒక మతం గేదే ఇంకో మతం వారికి పాలిచ్చేది కాదేమో. ఒక మతం కుక్క ఇంకో మతం వారి ఇంటికి కాపలాకాసేది కాదేమో..
అబ్రహం: పరిహాసాలు చాలు –  ఎందుకొచ్చావో చెప్పు.. ఇవాళ బీదలకు బట్టలు పంచే కార్యక్రమానికి వెళ్ళాలి.
దేవుడు: నేనూ బీదవాణ్ణే.. నాక్కూడా ఏవన్నా బట్టలు ఇవ్వండి..
అబ్రహం: నువ్వు హిందూ బిచ్చగాడివి. మా మతం పుచ్చుకో.. నీకేం కావాలన్నా ఇస్తాము.
దేవుడు: అంటే మతం మారటానికి లంచం ఇస్తారా?
అబ్రహం: ఇది లంచం కాదు. ప్రభువు ప్రసాదం.
దేవుడు: ఎవరా ప్రభువు?
అబ్రహం: జీసస్..
దేవుడు: కానీ జీసస్ నేను దేవుని కుమారుడనని చెప్పాకున్నాడే.
అబ్రహం: ప్రభువైన యెహోవా కుమారుడు ప్రభువు కాడా? మహారాజు కుమారుడు యువరాజు కాడా?
దేవుడు: ఓహో.. అంటే జీసస్ యువ ప్రభువన్నమాట. బావుంది బావుంది. కానీ, ప్రభువు మాటల్ని ప్రజలు పాటించాలి కదా? మీరు పాటిస్తున్నారా?
అబ్రహం: ఎందుకు పాటించటం లేదు?
దేవుడు: మీ ప్రభువు కరుణామయిడు. దయాసాగరుడు. ఆర్తులను అక్కున జేర్చుకోవాలని బోధించాడు. మీరు మీ మతం వాళ్ళకే సాయం చెయ్యాలని మీ యువ ప్రభువు ఆదేశించినట్లు మాట్లాడుతున్నారేమిటి?
అబ్రహం: మనుషులు పాపులు. వారు జీసస్‌ని ఆశయించి అనుసరిస్తే పవిత్రులవుతారు. అలాంటి వారికి సాయం చెయ్యడంలో తప్పేమిటి?
దేవుడు: కానీ జీసస్ పాపుల్ని కూడా ఆదరించమన్నాడే..
అబ్రహం: అవును ఆదరించమన్నాడు. ఎందుకు ఆదరించమన్నాడు? వారిలో పరివర్తన తెచ్చి పుణ్య జీవులుగా మార్చడానికి. మతం మారకుండా అదెలా సాధ్యం?
దేవుడు: మారాల్సింది మతం కాదు. అభిమతం. అందరినీ సమదృష్టితో చూడడమే అన్ని మతాల అభిమతం. మనిషి పుట్టినప్పుడు మతం లేదు. మతం పుట్టిన తర్వాత మనిషిగా బ్రతకటం లేదు. మానవత్వం మాయమైపోతోంది. మతం పేరుతో మనుషుల్ని విడదీశాక, సమాజంలో శాంతి ఎలా ఉంటుంది? అశాంతితో చేసే ప్రార్థనలు దైవానికెలా చేరతాయి?
అబ్రహం: మా ప్రార్థనలు  మా దైవానికి బాగానే చేరతాయిలే. నీ దైవం సంగతి చూసుకో..
దేవుడు: (నవ్వి) మీ దైవం మా దైవం.. మనిషికో దైవం! దేవుడేమన్నా ఆట వస్తువా అందరూ తలోకటి కొనుకుని వినోదించడానికి? సోదరా అబ్రహం.. నిన్ను చూసి జాలిపడుతున్నాను. పవిత్రమైన మతాన్ని రాజకీయ పార్టీలాగా చూడకు. ఎక్కువ ఓట్లు వస్తే పార్టీ గెలుస్తుందేమో గానీ, ఎక్కువ మనసుల్ని గెలిస్తేనే మతం నిలుస్తుంది. మతం  కన్నా మానవత్వం ముఖ్యం.. ఆలోచించు.. (నిష్క్రమిస్తు) ఆలోచించు.

*************** విరామ సంగీతం*****************

(నాస్తికుడు దివాకర్ – దేవుడు సంభాషణ)

దేవుడు: (తనలో) డాక్టర్ దివాకర్. హేతువాది. (పెద్దగా నవ్వుతాడు)
దివాకర్: (వస్తూ) ఏయ్.. ఎవరయ్యా నువ్వు?  ఎందుకాలా పిచ్చివాడిలా నవ్వుతున్నావు?
దేవుడు: ఇంటి బయట మీ బోర్డు చూస్తే నవ్వొచ్చింది..
దివాకర్: ఇందులో నవ్వాల్సిన దేముంది.
దేవుడు: ఎవరైనా డిగ్రీ రాసుకుంటారు. మీరేమిటి హేతువాది అని బోర్డు రాయించుకున్నారు?
దివాకర్: ఓహ్ అదా? నాకు హేతువాదం అంటే ప్రాణం. అందుకే అలా రాయించాను.
దేవుడు: హేతువాదాన్నే చార్వాక సిద్థాంతం అంటారు. మీరు ఎప్పుడైనా చదివారా?
దివాకర్: నాకు తెలియకపోతేనేగా చదివేది?
దేవుడు: అంటే.. మీరు ఎవరన్నా గురువు దగ్గర నేర్చుకున్నారా?
దివాకర్: హేతువాదంలో నేనే గురువుని. నాకెందరో శిష్యులున్నారు.
దేవుడు: మీరు దేంట్లో డాక్టరు? వైద్యమా, హేతువాదమా?
దివాకర్: రెండింటిలోనూ!
దేవుడు: అంటే మీ కత్తికి రెండు వైపులా పదును ఉందన్న మాట.. (నవ్వి) ఒక్క విషయం చెప్పండి.
దివాకర్: ఒక్కటేం కర్మ! మీరెన్ని విషయాలన్నా అడగండి, టక్ టక్ చెప్పేస్తాను.
దేవుడు: మీరు దేవుణ్ణి నమ్ముతారా?
దివాకర్: అస్సలు నమ్మను..
దేవుడు: అంటే నాస్తికులన్నమాట?
దివాకర్: నిస్సందేహంగా.
దేవుడు: మీ ఇంట్లో అందరూ నాస్తికులేనా?
దివాకర్: పరమ అస్తికులు!
దేవుడు: మరి మీరెలా నాస్తికులయారు?
దివాకర్: మొదట నేనూ ఆస్తికుణ్ణే. గుడికి వెళ్ళేవాణ్ణి. పూజలు చేయించేవాణ్ణి. కానీ, అప్పట్లో నాలో అనేక అనుమానాలు కలిగేవి.
దేవుడు: ఏమిటవి?
దివాకర్: రాయిని దేవుడనుకోవడమేమిటి?
దేవుడు: గుళ్లో ఉండేది శిల్పం కదా? అది రాయి ఎలా అవుతుంది?
దివాకర్: అదే.. శిల్పంగా చెక్కిన రాయి! అదెలా దేవుడవుతుంది? కోరికలు ఎలా తీరుస్తుంది?
దేవుడు: అంటే – గుడి కెళ్ళే వారి కెలాంటి కోరికలూ తీరడం లేదా?
దివాకర్: మిగతా వాళ్లు సంగతి నాకెందుకు ? నేను కోరుకున్నదేమీ తీరలేదు.
దేవుడు: ఏమి కోరుకున్నావ్?
దివాకర్: నా తండ్రి తాగుడికి బానిస. రోజూ మా అమ్మని చావగొట్టేవాడు. ఆమె బాధ చూడలేక, ఏదన్నా యాక్సిడెంట్‌లో ఆయన్ని చంపెయ్యమని కోరాను. ఆయన చావలేదు. మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నాకు వెంటనే దేవుడి మీద కోపం వచ్చింది. గుడికి వెళ్ళడం మానేశాను.
దేవుడు: ఈ ఒక్క కారణంతో నాస్తికుడివైపోయావా?
దివాకర్: లేదు! దేవుడికి మూడు ఛాన్సులిచ్చాను.
దేవుడు: ఏమిటా ఛాన్సులు?
దివాకర్: ఒకటి ఇందాక చెప్పేశాను.
దేవుడు: మిగతా రెండు?
దివాకర్: నేను ప్రేమించిన అమ్మయికి క్యాన్సరు వచ్చింది. తగ్గించమని ప్రార్థించాను. దేవుడు పట్టించుకోలేదు. ఆమె చచ్చిపోయింది. ఇది నా నమ్మకం మీద రెండో దెబ్బ..
దేవుడు: మూడో దెబ్బ ఏమిటి?
దివాకర్: నాకు తరగని ధనం కోరాను.
దేవుడు: ఎందుకో?!
దివాకర్: ఈ ప్రపంచంలో ఆకలి చావుల్లేకుండా చెయ్యాలని నా కోరిక. మా ఇంటి ఎదురుగా ఓ బిచ్చగాడు ఆకలితో చచ్చిపోయాడు..
దేవుడు: నువ్వు వాడిని కాపాడొచ్చుగా?
దివాకర్: వాడొక ఆస్తిక మూర్ఖుడు. అన్నిటికీ దేవుడే ఉన్నడనే వాడు. ఎప్పుడూ వాడి స్మరణలోనే ఉండేవాడు.
దేవుడు: వాడి పేరు పిచ్చయ్య కదూ?
దివాకర్: అరే! వాడి పేరు నీకెలా తెలుసు.
దేవుడు: (నవ్వి) తెలుసు! ఎలా తెలుసని అడక్కు, (నిట్టూర్చి) అంటే నువ్వు మూడు దెబ్బలు తిని దేవుణ్ణి వదిలేశావన్న మాట?
దివాకర్: సరిగా కాపురం చెయ్యకపోతే పెళ్ళాన్నే వదిలేశాను. దేవుడో లెక్కా?!
దేవుడు: బావుంది! చీకటిలో చిరువెలుగైనా ఉండాలి. జీవితంలో ఒక మనిషయినా తోడుండాలి అంటారు. దేవుణ్ణి మనిషినీ ఎవర్నీ నమ్మకపోతే నీ జీవితం అశాంతిగా లేదా?
దివాకర్: అసలు దేవుణ్ణి నమ్మితేనే అశాంతి! అడిగిందల్లా ఇస్తాడని గుడ్డినమ్మకంతో కొబ్బరి కాయలు కొట్టి, పాలాభిషేకాలు చేసి, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి… ఆల్ నాన్సెన్స్. టైమ్ వేస్టు.. నిజం చెప్పు. దేవుడిని భక్తితో ఎవరన్నా పూజ చేస్తున్నరా? లేదు. భయంతో చేసున్నారు.. దట్సిట్..
దేవుడు: (నవ్వుతాడు)
దివాకర్: నవ్వకు.. నువ్వలా నవ్వితే నాకు మెంటల్ వస్తుంది. నన్ను హేళన చేస్తే భరించలేను.
దేవుడు: నేను ఒక భక్తుణ్ణి ఆకలిగా ఉంది. దైవప్రసాదంగా రెండు పళ్లిమ్మన్నాను. తిట్టి తరిమేశాడు. మరొక ఆలయంలో తలదాచుకునేందుకు చోటిమ్మనాను. కుదరదనేశాడు. మరొక దైవసేవకుణ్ణి ఒక గుడ్డ ఇమ్మన్నాను. వాళ్ల దేవుణ్ణి నమ్మితేనే ఇస్తానన్నాడు. ఇప్పుడు చెప్పు తోటి మనిషికి సాయం చెయ్యని వారికి దేవుడు అడిగిందల్లా ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి.
దివాకర్: ఏమి ఇవ్వనప్పుడు పూజలెందుకు, భజనలెందుకు?
దేవుడు: అవన్నీ చెయ్యమని దేవుడు అడిగాడా?
దివాకర్: అడక్కపోతే ఈ ఆస్తిక సన్నాసులు ఎందుకు చేస్తున్నట్టు?
దేవుడు: స్వార్థం! దేవుణ్ణి పొగిడి, భజలను చేసి, బాకాలు ఊది, కాకాలు పట్టటం కేవలం తమ స్వార్థం కోసం.
దివాకర్: భక్తిలో కూడా స్వార్థం ఉంటే ఎలా? స్వార్థం వదిలేస్తేనే కదా భక్తి?
దేవుడు: ఆ సంగతి వాళ్ళకి తెసిస్తే కదా?
దివాకర్: ఈ భక్తి గోల నా కిష్టం ఉండదు. అందుకే నాస్తికుణ్ణై హాయిగా ఉన్నాను. దేవుడికైనా కాస్త ఆలోచన ఉండక్కర్లా? పూజలు, పునస్కారాలు, భజనలు, ప్రార్థనలు.. క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైమ్. ఎంత సమయం వృథా అయిపోతోంది. ఆ సమయాన్ని సామాజిక ప్రయోజనానికి దేశాభివృద్ధికి ఉపయోగించవచ్చు కదా?
దేవుడు: కరక్టే. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు సవ్యంగా చేస్తే చాలు.. మిగతావన్నీ అనవసరం.
దివాకర్: ఈ దేశంలో ప్రతివాడూ కర్మసిద్ధాంతాన్ని పట్టుకు వేళ్లాడతాడు. కృషి జోలికి పోడు. యాంత్రికంగా జీవిస్తాడు. ఆయన దానికీ కాని దానికీ కర్మ కారణంగా ఎందుకు చెప్పటం? విదేశాల్లో ఎవరూ ఇలా అనుకోరు. ఒళ్లు దాచుకోకుండా శ్రమిస్తారు. అందుకే అవి సంపన్న దేశాలు.
దేవుడు: ఇప్పుడు ఆ విదేశాల వాళ్లే ఇక్కడి కొచ్చి మన పూజలు, భజనలు చేస్తున్నారు. దాని మాటేమిటి?
దివాకర్: మన దేశంలో నూటికి తొంభైతొమ్మిది మంది విదేశీ నాగరికత అనుకరిస్తున్నారు. తల్లి భాషను మాట్లాడరు. మన సంప్రదాయ దుస్తులు ధరించరు. మరి, దీని మాటేమిటి?
దేవుడు: నిజమే శతాబ్దాల బానిసత్వం నుండీ దేశానికి స్వతంత్ర్యం లభించినా, దేహానికి, మనసుకి భావ బానిసత్వం అంటి పెట్టుకునే ఉంది. ఇది బాగా జీర్ణించుకు పోయి ఉంది. ఈ దేశ దౌర్భాగ్యం అది.
దివాకర్: ఇక్కడ ఎవరి మతం గురించి వారు గొప్పగా చెప్పుకుంటారు. ఇతర మతాల వాళ్లని తొక్కేద్దామనో, నాశనం చేద్దామనో నినాదాలు ఇస్తారు. దేశంకన్నా మతం గొప్పది కాదని గుర్తించరు.
దేవుడు: మతాలన్నీ దైవ మార్గాలుగా ఉండాలి. ద్వేష మార్గాలుగా ఉండకూడదు. మానవ సమాజంలో మత సామరస్యానికి బదులు మత సమరాలు జరుగుతున్నాయి. అందరి దేవుడూ ఒక్కడే అయినప్పుడు పరస్పర వినాశకర పథకాలు ఎందుకు. దాడులు, దహనాలు, దేశ ద్రోహాలు.. వీటిని దేవుడు ఎప్పుడూ అంగీకరించడు.
దివాకర్: అసలు దేవుడు ఏమి ఆశిస్తున్నాడో ఎలా జీవించమంటున్నాడో ఎవరికీ అవగాహన లేదు. చాలా మంది దేవుణ్ణి వ్యాపార వస్తువు చేసేస్తున్నారు. ప్రజల మూఢనమ్మకాలతో ఆడుకుంటున్నారు. స్వయంప్రకటిత దేవుళ్లు ఎక్కువైపోయారు. వాళ్లు చేసేవన్నీ అనైతిక సంఘ విద్రోహ కార్యాకలాపాలే. ఈ మనుషులంతా మేకలు, గొర్రెలతో సమానం. మోసాలు బయట పడుతున్నా మళ్లీ మళ్లీ మోసపోతుంటారు. దొంగ దేవుళ్లని వదలరు.
దేవుడు: దేవుడి గురించి విపరీత వ్యాఖ్యానాలు చేస్తారు. ఇతర మతాల దేవుళ్లని హేళనలు చేస్తారు. అవమానాలు చేస్తారు. మతం మారినంతలో పూర్వ మతాన్ని కించపరచాలా? దుశ్చర్యలతో వాళ్లని రెచ్చగొట్టాలా?
దివాకర్: మతాలకీ, రాజకీయ పార్టీలకీ తేడా ఉండటం లేదు. సంఖ్యాబలం, ఓట్ల బలమే కీలకంగా భావిస్తున్నారు. రాజకీయులు నాటకీయంగా అన్ని మతాల వాళ్ళనీ ఆలింగనం చేసుకుంటారు. వాళ్లకి వరాల ఆశలు చూపుతూ, ఓట్లు దండుకునేందుకు పోటీలు పడతారు. అవసరమైతే అంగడిలో సరకులా ఓట్లు కొనేస్తారు.
దేవుడు: వాళ్లది అధికార వ్యామోహం. రాజకీయంలో మతం ఉండదు. అధికారసాధనే అభిమతంగా ఉంటుంది. అధికారం లేకపోతే జీవితమే వ్యర్థమనిపిస్తుంది. అందుకే, దేనికైనా తెగించి అధికారం సాధిస్తారు. దుర్యోధనుడి కాలం నుండీ ఇది అమలులో ఉన్నదే!
దివాకర్: నేను పరమ నాస్తికుణ్ణి. రామయణ, మహాభారతాలు నమ్మను.
దేవుడు: నమ్మకపోతే వచ్చిన నష్టం లేదు. కానీ, వాటి మీద విపరీత వ్యాఖ్యానాలు హేళనలు, చేసి, నమ్మేవారికి శత్రువు కావొద్దు. ఎందుకంటే..
దివాకర్: ఎందుకో నాకు తెలుసు! నాస్తికుల్ని, హేతువాదుల్ని బ్రతకనివ్వరు. వెంటాడి వేటాడి చంపేస్తారు. నన్నూ చంపేస్తారు. అందుకే నా భావాల్ని ప్రచారం చెయ్యను.
దేవుడు: అసలు ప్రచారం కోసం ఆరాటం దేనికి? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కర్రలతో ఆత్మరక్షణ చేసుకోవాలి గానీ, కొట్టి చంపాలనుకోకూడదు.
దివాకర్: మతహత్యలు, హత్యా రాజకీయాల్లాంటివి. మతాన్ని కాపాడుకోవాలనుకుంటారు. మానవత్వాన్ని మర్చిపోతారు. దేశం నుండీ అన్నీ పొందుతారు. దేశభక్తి గురించి హేళనగా మాట్లాడుతారు. వహ్వా భారతీయుడా! నీకు నువ్వేసాటి.
(అంతలో మూడు మతాల వాళ్ళు గాయలతో వైద్యానికి వస్తారు)
తులసీరామ్: (బాధగా) రక్షించండి డాక్టరుగారూ..
అక్బర్: నన్ను కూడా రక్షించండి హకీమ్‌గారు
అబ్రహం: అయ్యా.. నన్ను కూడా.. రక్తం కారిపోతోంది రక్షించండి.
దివాకర్: ఏమైంది మీ ముగ్గురికీ? ఆ గాయాలేమిటి? బట్టల నిండా ఆ రక్తమేమిటి?
దేవుడు: కన్పిస్తునే ఉందిగా! ముగ్గురూ మతకొట్లాటకి దిగి గాయాలపాలైనారు. అవునా?
ముగ్గురు: అవును (విడివిడిగా అంటారు)
దేవుడు: దెబ్బలు తింటేగానీ ముఢనమ్మకాల దెయ్యం పారిపోలేదా?
దివాకర్: అందుకే ఈ దేవుడిగోల వదిలేసి నాలాగా నాస్తికుడిగా మారిపోండి.
దేవుడు: ముందు వాళ్ల గాయాలకి వైద్యం చెయ్యేండి.
దివాకర్: శరీరగాయాలకి నేను వైద్యం చేస్తాను. మత పిచ్చికి ఎవరు వైద్యం చేస్తారు?
దేవుడు: వాళ్ల గాయాలే పాఠాలు చెబుతాయి! చెప్పండి. మళ్ళీ కొట్లాడుకుంటారా?
ముగ్గరు: (విడివిడిగా) లేదు లేదు లేదు…
దేవుడు: బాధలో దేవుడు గుర్తొస్తాడు. మరణబాధలో మరీ గుర్తొస్తాడు. అవునా?
ముగ్గురు: (విడివిడిగా) అవును అవును అవును! డాక్టర్‌గారూ.. ముందు మాకు వైద్యం చేసి బ్రతికించండి!
దివాకర్: కంగారు పడకండి. నేను ఆ పనిలోనే ఉన్నాను. గాయం అవటానికి క్షణం చాలు. అది తగ్గటానికి రోజులు పడుతుంది. తప్పు కూడా అలాంటిదే! ఒక తప్పు వల్ల కలిగే నష్టాల్ని ఎప్పటికీ సరి చెయ్యలేకపోవచ్చు.
దేవుడు: మనిషికి మరణం శాశ్వత నష్టం. మరణించేలోగా మంచి పనులు చెయ్యాలి.
తులసీ: ఓ.. నువ్వు.. శివరాత్రి రోజున గుడికొచ్చావుకదు?
అక్బర్: మసీదులో చోటు అడిగింది నువ్వేకదు?
అబ్రహం: బట్టలిమ్మని కోరింది..
దేవుడు: నేనే.. నేనే.. నేనే.. మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాను. నిజానికి నాకేమీ అవసరం లేదు. నాకెలాంటి కోరికలూ లేవు. అందరూ బావుండాలి. ఈ ప్రపంచం సృష్టి ఆరంభంలో ఎలా ఉందో ఎప్పటికీ అలాగే ఉండాలని ఆకాంక్షిస్తాను.
తులసీ: అంటే.. నువ్వు దేవుడివా!?
దేవుడు: ఆత్మవత్ సర్వభూతాని! ఈ సృష్టిలో అంతర్యామిగా దేవుడు లేని చోటేలేదు. ప్రహ్లాదుడేమన్నాడో గుర్తు చేసుకోండి. ఇందుగల డందులేడను సందేహము వలదు – దేవుడు మీలోనూ ఉన్నాడు. కానీ, మీరు దేవుణ్ణి దాచేసి దెయ్యంలా బ్రతుకుతున్నారు. దెయ్యం ఉన్న చోట దేవుడుండడు.
అక్బర్: దేవుడుకి రూపం ఉండదుకదా?
దేవుడు: దేవుడికి రూపం లేదు. నిజమే! కానీ, ఇప్పుడు నీ శరీరమే నీ రూపం అనుకుంటున్నావ్. అది కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు నువ్వెవరు? ఎక్కడుంటావు?
అబ్రహం: నువ్వు దేవుడివయితే ఏదన్నా మహిమ చూపించు.. అప్పుడు నమ్ముతాము..
దేవుడు: చూస్తుంటే దేవుడ్ని కూడా ఆధార్‌ కార్డు అడిగేట్టున్నావ్! దేవుడికి తనని తాను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వు మనసుతో చూస్తే, సృష్టిలో అనుక్షణం దేవుని మహిమ ఆవిష్కృతమౌతునే ఉంది. దేవుడు గారడీవాడు కాదు. కనికట్టు చెయ్యడానికి. కనువిప్పు మాత్రమే చేస్తాడు.
తులసీ: అర్థమైంది! నువ్వీ నాస్తిక డాక్టరుతో చేరి మాకు నీతి బోధలు చేస్తున్నావు. నాస్తికులంటే నీకు ఇష్టం.
దేవుడు: నిజమే! దేవుడు ఆస్తికుల కంటే నాస్తికులనే ఇష్టపడతాడు.
తులసీ: ఎందుకని?
దేవుడు: ఆస్తికుల్లాగా నాస్తికులు కోరికల జాబితాతో ఇబ్బంది పెట్టరు. ఆస్తికులు పువ్వుకో కోరిక చెబుతూ పూజ చేస్తారు.
తులసీ: నాస్తికులు తిట్టిన తిట్టు తిట్టకుండా దేవుణ్ణి తిడతారు. అది బావుందా?
దేవుడు: (నవ్వి) దేవుడికి తిట్టు కొత్తకాదు. అలాగేనా తనని తలుచుకుంటున్నాడు కదా అనుకునే అల్పసంతోషి.
(అంతలో భారతి ప్రవేశం)
భారతి: (అపసోపాలు పడుతు, ఆయాసంగా) మహాదేవా! ఇక్కడున్నావా నువ్వు? వెతుక్కోలేక అవస్థ పడుతున్నాను (అలుపు తీర్చుకుంటూ) ష్.. అమ్మయ్య.. వచ్చేశాను.
తులసీ: ఎవరీ ముసలావిడ? అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు కనబడుతోంది.
భారతి: నా సంపదనంతా దోచుకుంటే బాధతో ముసలిదాన్ని అవనా? ఆరోగ్యం పాడు కాదూ?
అక్బర్: ఎవరు దోచుకున్నారు? ఏదా సంపద?
భారతి: వనసీమలు, ఖనిజ సంపదలు, వనస్పతులు, ఓషదులు ఒక్కటేమిటి… అందినదల్లా దోచుకుంటునే ఉన్నారు. పరాయి దేశాలకి తెగనమ్ముకుంటునే ఉన్నారు. పక్షుల్నీ, జంతువుల్నీ బతకనిస్తునారట్రా.. మీ ఆకలి తగలెయ్యా.. ఎంత పంటలిస్తున్నాను.. ఎన్ని ఫలాలు ఇస్తున్నాను. అవి చాలవా? అమాయక ప్రాణుల్ని చంపి తింటే గానీ తృప్తి తీరదా? మనిషి రూపంలో ఉన్న పిశాచాలు, శివయ్యా! ఇహ నేను భరించలేను. నీ మూడో కన్ను తెరిచి అంతా భస్మీపటలం చేసెయ్యి. కొత్త సృష్టి చెయ్యి.. అప్పుడు గానీ నా వేదన తీరదు..
అబ్రహం: చూస్తుంటే పిచ్చిది లాగా ఉంది..
దేవుడు: ఆమె పిచ్చిది కాదు. అలా అనుకున్న వాళ్లే పిచ్చి వాళ్లు.
తులసీ: మరి అలా మాట్లాడుతుందేమిటి?
దేవుడు: తప్పేం మాట్లాడింది?
అక్బర్: ఆమె చెప్పిందాంట్లో ఒక్కటీ మేం చెయ్యలేదే!
దేవుడు: మీరు చెయ్యకపోవచ్చు. చేస్తున్న వాళ్లంతా మనుషులేగా?
అబ్రహం: నువ్వు మనిషివేగా!?
దేవుడు: (నవ్వి) కాదు..
తులసీ: కాదా?! మరి దేవుడివా?
దేవుడు: చెప్పాగా.. మనందరం దేవుళ్లమే. మీరు మీలోని దేవుణ్ణి దాచేసుకున్నారు. నేనలా చెయ్యలేదు.
దివాకర్: అదేమిటో కాస్త అర్థమయేలా చెప్పు మహాత్మా.. నేను వీళ్ళకి వైద్యం పూర్తి చేశాను.
దేవుడు: ఉత్తముల లక్షణాలన్నీ దైవత్వానికి సంబంధించినవే. క్రూరవిధానాలన్నీ రాక్షసత్వానికి చెందినవే. సృష్టికి, ప్రపంచానికి మేలు చెయ్యడానికే మానవ జన్మ లభించింది. మనిషి దైవత్వానికి, మానవత్వానికి మధ్యేమార్గంలో ఉంటాడు. తన జన్మసార్థకం చేసుకుంటే దైవత్వాన్ని పొందుతాడు. లేకపోతే, రాక్షసంగా ప్రవర్తించి నరకం పాలవుతాడు.
దివాకర్: నేను నరకాన్ని నమ్మను. అదంతా కట్టు కథ. బూటకం. దానికెలాంటి రుజువులూ లేవు.
దేవుడు: అన్నింటికీ రుజువులుండవు! సైనేడ్ విషం రుచి తెలుసుకునేందుకు ఒక శాస్త్రజ్ఞుడు నాలిక మీద రాసుకుని ‘S’ అని రాసి చనిపోయాట్ట. అది Sweet కావొచ్చు. Slat కావొచ్చు. Sour కావొచ్చు. సత్యం తెలుసుకోవాలి. కానీ, ప్రమాదకరమైన ప్రయోగాలు చేయకుడదు.
తులసీ: ఇంతకీ ఈ ముసలావిడి ఎవరు? ఈవిడ గోల ఏమిటి?
దేవుడు: ఈవిడ భూమాత లాంటిది. ప్రకృతికి తల్లి. సృష్టికి అపకారం చెయ్యకుండా జీవించమంటోంది. కాయల కోసం కొమ్మలు నరకటం దేనికి?
అబ్రహం: ఓ.. అదా?! అయితే సరే..
అక్బర్: ఈమె ఆవేదనలో అర్థం ఉంది. మనిషి మనిషికే శత్రువు అవుతున్నాడు. అపారనష్టం కలిగించే అణుబాంబులతో బెదిరిస్తున్నాడు. ప్రపంచానికి పాలకుడవాలని ఆరాటపడుతున్నాడు. అలా అనుకున్న అలెగ్జాండర్, హిట్లర్ మట్టిలో కలిసిపోయారు. అల్లా ఒక్కడే శాశ్వతం. అందరి జీవితాలూ మూణ్ణాల ముచ్చట్లే..
అబ్రహం: నిజమే అక్బర్ భాయి.. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. పరలోక ప్రభువు కృప కోసం మంచి పనులు చెయ్యాలి.
తులసీ: దైవం మానుషరూపేణ అన్నట్టు నువ్వు నిజంగా దేవుడివో కావో తెలియదు, కానీ, మతమౌఢ్యంతో అహంకరిస్తున్న మా కళ్లు తెరిపించావు! నిజమే. దేవుడు గుళ్ళో కాదు. ప్రతి మనిషి గుండెలో ఉంటాడు. అదే దేవుడి చిరునామా..
దివాకర్: అమ్మా భారతీ! పేరుకి తగినట్టు నువ్వు దేశమాతలాగానే ఉన్నావు. నేను దేవుణ్ణి, దెయ్యాల్ని నమ్మను. కానీ ప్రకృతిని నమ్ముతాను. నువ్వు చెప్పిన వన్నీ అక్షరసత్యాలు. ఉండటానికి ఇల్లు ఇస్తే, పొగరెక్కి ఇల్లు తగలబెట్టినట్టు, ప్రకృతిని మనిషి నాశనం చేస్తున్నాడు. ఇది వెంటనే అరికట్టాలి. అందుకు ఉద్యమించాలి. ఇది అందరి తక్షణ కర్తవ్యం.
భారతి: (సంతోషం) మీ మాటలు వింటుంటే, నా మీద అమృతవర్షం కురుస్తున్నట్టు ఉంది. భవిష్యత్తు బంగారు కొండలా మెరిసిపోతోంది. నేను ఆ రోజులు ఊహించుకుంటున్నాను. ఆనందంతో పరవశించిపోతున్నాను. మీరు ఏ కులమైతేనేం.. ఏ మతమైతేనేం.. అందరూ నా బిడ్డలే.. నా బిడ్డలే.. ఈ ప్రకృతి సంపద అంతా మానవాళి ఉమ్మడి ఆస్తి. దీనిని రక్షించి రాబోయే తరాలకి అందించండి. ఇదే నా ప్రార్థన..
దివాకర్: అలాగనకమ్మా! అలాగనకు. నువ్వు మాకు తల్లి లాంటిదానివి. ఆజ్ఞాపించు.
దేవుడు: చాలా సంతోషంగా ఉంది మిత్రులారా! మీ అందరితో నేను ఆశించిన మార్పు వచ్చింది. మీలోంచి దెయ్యాలు పారిపోయాయి. ఇప్పుడు మీలో దేవుడు అంతర్యామిగా వెలిగిపోతున్నాడు. ఆ దైవత్వాన్ని అలాగే కాపాడుకోండి. భావితరాలకు ఈ భావన దీపం నుండీ దీపం వెలిగించినట్టు అందించండి. అప్పుడు ఇక్కడే స్వర్గం ఆవిష్కృతమౌతుంది.
దివాకర్: ఇదుగో సోదరా! మళ్ళీ నువ్వు స్వర్గ నరకాల భ్రమలు పెట్టకు. భూలోకం సుఖ సంతోషాలతో ఉండాలి. మనిషి దేవుడు కాకపోయినా ఫర్వాలేదు. దెయ్యం కాకూడదు. అదే మనందరి ఆకాంక్ష కావాలి. సరేనా? ఏమంటారు అబ్రహంగారూ?
అబ్రహం: సరే బ్రదర్.. అలాగే కానీ..
దేవుడు: ఇక నేను వెళ్లొస్తాను. పద తల్లీ… వెళదాం..
తులసీ: మళ్ళీ మనం కలుసుకునే అవకాశం ఉందా?
దేవుడు: అవసరం తీరిపోయిందిగా? ఇక అవకాశాల కోసం ఎదురుచూట్టం దేనికి?
అక్బర్: అలా కాదు భాయి! మళ్లీ మమ్మల్ని సైతాన్ పట్టుకుంటే ఎలా?
దేవుడు: అందరూ ఐకమత్యంగా, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండండి. సైతాను మీ జోలికి ఎన్నడు రాడు.
అబ్రహం: భైబిల్‌లో మాటలే మీరు చెబుతున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది.
దేవుడు: భగవద్గీత, బైబుల్, ఖురాన్, గురుగ్రంథ్‌సాహిబ్ అన్నీ దేవుడి పలుకులే. అన్నిటినీ గౌరవించండి. అందరినీ ప్రేమించండి. అందరికీ సేవలు చెయ్యండి. ఎవరినీ ద్వేషించకండి. ఇదే మన నిజమైన ఆస్తి.
తులసీ: కనీసం మీ చిరునామా చెప్పండి..
దేవుడు: దేవుడి చిరునామాలోనే నేను ఉంటాను. అది మీ హృదయమే..
తులసీ: అంటే.. మీరే దేవుడా?!
(దేవుడు, భారతి నవ్వులు… fade out)
(గంభీరంగా)
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతిః
(దీనిని ఘంటసాల గారి భగవద్గీత ముగింపు నుండి తీసుకోవచ్చు)

Exit mobile version