[dropcap]క[/dropcap]థ, కథానిక, గల్పిక, చిట్టికథ, పొట్టి కథ, కార్డు కథ – ఇలా మన తెలుగు కథ బహురూపాల్లో మనకు దర్శన మిస్తున్నది. రూపం ఏదైనా, ‘పాఠకుడు ఎక్కడా ఆపకుండా చివరి వరకూ సులువుగా చదివించగలిగేది, మంచి కథ’ అని మన పెద్దలు చెబుతుంటారు. కథ రాయడం యెంత కష్టమో అంత సులభం కూడా!
అయితే అది మన పట్టులోనికి వచ్చినప్పుడు మాత్రమే అది సులభ సాధ్యం. కథ రాయడం రావాలంటే, పాతతరం కథలతోపాటు, ఆధునిక రచయితల కథలు అనేకం చదివితే తప్ప, వివిధ రచయితల రచనా విధానం జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప, మనకంటూ ఒక ప్రత్యేక శైలి అలవాటు పడదు. ‘నేను ఏమీ చదవకుండానే రాయగలను’ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అనుభవజ్ఞులైన కథల ముందు ఇవి యిట్టే తేలిపోతాయి. అందుచేత, కథ రాసినా, కవిత్వం రాసినా, ఇతరుల రచనలు చదవడం, వాటిని విశ్లేషించుకోవడం తప్పనిసరి.
కథలు రాయడం మొదలు పెట్టిన వర్ధమాన కథా రచయితల కథా నేపథ్యం ఎక్కువగా ‘ప్రేమ’ అనే అంశం మీదనే గురిపెట్ట బడుతుంది. తాము అనుభవించినదో, చూచినదో, ఇతరులు చెప్పగా విన్నదో, అంశాన్ని వస్తువుగా తీసుకుని పుష్కలంగా ప్రేమ కథలు రాసేస్తుంటారు. సమాజంలో ఎదురయ్యే అనేక ఇతర అంశాలకు స్పందించరు. జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు కదా! కష్టాలు, సుఖాలు, ఆటుపోట్లు, ఎత్తు పల్లాలు, ఎదురీతలు, ఇలా ఇంకా చాలా ఉంటాయి.
అలా భిన్నమైన కథా వస్తువులను ఎన్నుకుని, మంచి మంచి కథలతో పాఠకుడికి జీవితంలోని భిన్న పార్శ్వాలను చూపించి మెప్పించగల కథా రచయితలు ఎందరో మనకున్నారు. అదుగో అలాంటి చేయి తిరిగిన కథా రచయితల్లో, శ్రీ కొల్లూరి సోమ శంకర్ ఒకరు. ఈయన రాసిన కథలతో ‘దేవుడికి సాయం’ అనే కథా సంపుటి, 2014 లో మొదట ‘ఇ. బుక్’ గా వచ్చి, 2018లో ప్రధమ ముద్రణ అందుబాటులోనికి వచ్చింది. ఈ కథా సంపుటిలో మొత్తం పదహారు కథలున్నాయి. ఈ కథా సంపుటికి ప్రముఖ కథా రచయిత, సమీక్షకులు, విమర్శకులు,శ్రీ విహారి గారి ముందుమాట ప్రత్యేక ఆభరణం అని చెప్పాలి.
శ్రీ కొల్లూరి సోమశంకర్ గారి కథా సంపుటి (దేవుడి సాయం) లోని కథలన్నీ, సమాజాన్ని నిశితంగా పరిశీలించే వారికి బాగా అర్థం అవుతాయి. ప్రతి వారికీ ఎక్కడో ఒక చోట ఏదో రూపంలో ఈ సంఘటనలు, సన్నివేశాలూ వారి జీవిత కాలంలో ఎదురుకాక మానవు. రచయిత పరిశీలనా శక్తి, స్పందించే విధానం అర్థం కాక మానవు.
ఒక రచయిత తన మొదటి కథ ఒక పత్రికలో అచ్చయిన సందర్భంలో, ఆయన సంతోషం మరుక్షణంలో ఎన్ని ఇబ్బందులు తెచ్చి, చికాకు కలిగించిందో రచయిత అనేక ఉదాహారణలతో చెప్పిన విధానం పాఠకుడిని చక చకా ముందుకి నడిపించి తరువాత ఏమవుతుందన్న ఉత్సుకతను కలుగ జేస్తుంది. వర్ధమాన కథా రచయితలకు, సీనియర్ కథా రచయితలకు ఇది తప్పక అనుభవం అయి ఉంటుంది.
చదువుకుంటున్న ఆడపిల్లలు తమ భవిష్యత్తు కోసం అవగాహన లేని నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందో చెబుతూ, వారిలో మార్పుతెచ్చే సన్నివేశం కల్పించి మనసు మార్చుకునేలా అల్లిన కథ ఒకటి ఇందులో వుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో, పెద్ద చేప చిన్న చేపలను మింగేసినట్టు, చిన్న చిన్న కోట్లు (దుకాణాలు) మాయమై, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవతరించి, సాధారణ వ్యాపారస్థుడి పొట్ట కొడుతున్న విధానం గురించి రాసిన కథ ఆలోచనాపరులకు హృదయం ద్రవించేలా చేస్తుంది.
కుటుంబ భవిష్యత్తు కోసం, అహర్నిశలూ కష్టపడే భర్త తనకోసం కొద్దీ సమయం కూడా కేటాయించడం లేదని మానసికంగా క్రుంగిపోతున్న భార్య, తనను,తన కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం లేదనే అపోహతో సతమతమై పోతున్న భర్త తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా ఒక్కటయ్యారో తెలిపే కథ కూడా ఇందులో వుంది.
బస్సులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు ప్రయాణికులు, మధ్యలో బస్సు ఆగినప్పుడు, తమకు కావలసిన వస్తువులు కొనుక్కోవలసి వచ్చినప్పుడు, షాపు వాళ్ళు వస్తువులను ఎం.ఆర్.పి. రేటుకు అమ్మడం లేదనే కోపంతో వస్తువులు కొనకుండా బస్సులో చర్చ చేస్తున్నప్పుడు వెలుగు లోనికి వచ్చిన వారి బలహీనతలను తరువాతి కాలంలో ఎలా తగ్గించు కున్నారో,ఇందులో ఒక కథ చెబుతుంది.
‘స్థాయి భేదాలున్నా, అభద్రతనిండిన కాంట్రాక్టు బ్రతుకులు మనవి! మనుగడ కోసం జరిపే పోరాటంలో అందరూ కూలీలే!’ అని ప్రబోధించే కథ ఒకటి ఈ కథా సంపుటిలో చోటు చేసుకుంది. ఇది నిరుద్యోగులుగా వున్న యువతీ యువకులు ఉద్యోగ వేటలో వున్నవారు, కొత్తగా ఉద్యోగంలో చేరినవారు తప్పక చదవాలి.
నిజ జీవితంలో మనకు కనిపించే మరిన్ని జీవన సత్యాలకు సంబందించిన కథల సమాహారం కొల్లూరి వారి కథా సంకలనం ‘దేవుడికి సాయం’. ఇందులో కొన్ని కథలు చదువుతున్నప్పుడు, రచయితకు, రచనా వ్యాసంగంతో పాటు సినిమాల పట్ల, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉన్నట్లు అర్థమవుతుంది. రచయిత సీరియస్‌గా తీసుకోకుంటే, ఇక్కడ ఒక విషయం తప్పక చెప్పాలి. కథలకు పేర్లు (శీర్షిక) పెట్టే విషయంలో అంత శ్రద్ధ తీసుకోలేదేమో అనిపిస్తుంది. ఆణిముత్యాలు వంటి కథలకు పేర్లు అతిసాధారణంగా కనిపిస్తున్నాయి. అయితే కథలు ఎంచుకోవడానికి, ఆసక్తిగా చదవడానికి, పాఠకుడికి ఇదేమీ అడ్డు కాదని నా నమ్మకం. కథా సాహిత్యం పట్ల అభిరుచి వున్నవారు, కథలు రాసే ప్రయత్నంలో వున్న రచయితలూ, వర్ధమాన కథా రచయితలూ, తప్పక కొని చదవాల్సిన కథా సంపుటి ఇది. కథా రచనలోనూ, కథల అనువాద ప్రక్రియలోనూ శరవేగంగా ముందుకు దూసుకు పోతున్న కథా రచయిత శ్రీ కొల్లూరి సోమశంకర్ అభినందనీయులు.
***
రచయిత: కొల్లూరి సోమ శంకర్
పుటలు: 105
వెల: ₹ 80/- మాత్రమే
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ 9000413413
రచయిత 9948464365
somasankar@gmail.com