Site icon Sanchika

నిరాడంబరమైన కథల సంపుటి “దేవుడికి సాయం”

కొల్లూరి సోమశంకర్ ఈ ఏడాది మొదట్లో వెలువరించిన కథల సంపుటి “దేవుడికి సాయం” పాఠకులను ఆకట్టుకుంటుంది. దీనిలో 16 కథలున్నాయి. మన చుట్టూ కనిపించే సమాజం ఇతని కథలలోని ముడిసరుకు.

ఈ కథలలో 8 కథలు ఆత్మాశ్రయపద్ధతిలో ప్రథమపురుషలో నడుస్తాయి. కొల్లూరి సోమశంకర్ కథలలో మనకు నిరాడంబరత కనిపిస్తుంది. పాత్రలు సాత్వికంగా ఉంటాయి. ఆదర్శాలను వల్లెవేసేవిగా కాకుండా వాటిని  ఆచరించేవిగా ఉంటాయి ఇతని కథలలోని పాత్రలు. ఇతని కథలకు చకచకా చదివించే గుణం ఉంది. ఇతని కథలన్నీ ఏదో ఒక సందేశాన్ని అంతర్లీనంగా పాఠకులకు తెలియజేస్తాయి.

ఎదుటి వాడికి సహాయం చేసే అవకాశం లభించినప్పుడు అతడు బిచ్చగాడైనా, భగవంతుడైనా ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అని ఈ సంపుటికి శీర్షికగా పెట్టిన కథ వివరిస్తుంది. బాహ్యసౌందర్యం కంటే మానసిక సౌందర్యం ముఖ్యమని ఒక కథ చాటితే, అందానికి సరియైన నిర్వచనం దయ, నిస్వార్థం, త్యాగం అని ఒక కథ, బాహ్య స్వరూపాన్ని బట్టి మనుష్యులను అంచనా వేయడం తప్పనీ మరో కథ తెలియజేస్తాయి. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని ఒక కథ తెలిపితే, మరొక కథలో కలిసి కూర్చుని మాట్లాడడం ద్వారా అనేక అపోహలు తొలగి పోతాయని తెలుస్తుంది. హస్తకళలు, కుటీరపరిశ్రమలను ప్రోత్సాహించాల్సిన అవసరాన్ని ఒక కథ చెబితే, మన భారతీయ సమాజంలో అడుగంటిన కుటుంబ విలువలు పునరుద్ధరించాల్సిన అవసరాన్ని మరో కథ చాటుతుంది.

ఇతని కథలలో చర్చలు కూడా ఉంటాయి. మోడలింగ్, ఫ్యాషన్ షో రంగాలలోని సాధకబాధకాలు, పర్యావరణ సమస్యలు, ప్లాస్టిక్ వాడకం, రియల్ ఎస్టేట్ వల్ల రైతులు నష్టపోవడం, టెక్నాలజీ దుర్వినియోగం, మార్కెట్ మాయాజాలంలో చిన్న చిన్న వ్యాపారులు మరుగునపడిపోవడం, అవుట్‌సోర్సింగ్ వల్ల ఉద్యోగ భద్రతకు వాటిల్లిన ముప్పు, బస్టాండులు మొదలైన చోట్ల ఎం.ఆర్.పి. కంటే ఎక్కువ ధరకు వస్తువులు అమ్మడం వంటి అనేక విషయాలను ఈ కథలు చర్చిస్తాయి. కేవలం చర్చించడమే కాకుండా చర్చల ఫలితాలను ఆయా కథలలోని పాత్రలు ఆచరణలో పెడతాయి.

ఉదాహరణకు ఒక కథలో ఇద్దరూ వారి వారి బలహీనతలకు కారణాలను చర్చించి వారి బలహీనతలను అధిగమించడానికి ఒకరికొకరు ఇచ్చిన సలహాలను పాటించడానికి ప్రయత్నిస్తారు. మరో కథలో రియల్ ఎస్టేట్ బూం వల్ల నష్టపోయిన రైతు తన వంటి రైతులు మోసపోకుండా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాన్ని గుర్తించిన ఒక మహిళ తన కూతురుకు ఏటికొప్పాక లక్క బొమ్మలను కొనిస్తుంది.

ఇతని శైలి సాదాసీదాగా అనిపించినా అక్కడక్కడ వ్యంగ్యం, హాస్యం తొణికిసలాడుతుంది. టెలీమార్కెటింగ్ వాళ్లు ప్రజలకు పెట్టే ఇబ్బందిని ఒక కథలో హాస్యంగా వివరించాడు. స్మార్ట్ ఫోన్లకు బానిసలైన వారిపై ఒక కథలో వ్యంగ్యాస్త్రాన్ని విసురుతాడు.

మొత్తం మీద హాయిగా చదివించే లక్షణమున్న ఈ పుస్తకం ధర 80 రూపాయలు మాత్రమే. “దేవుడికి సాయం” పుస్తకం హైదరాబాద్ కాచీగుడా లోని నవోదయ బుక్ హౌస్ లోనూ, విజయవాడ ‘సాహితీమిత్రుల’ వద్ద లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

Exit mobile version