Site icon Sanchika

దేవుడు చేసిన పెళ్ళి

[శ్రీ సి.యస్.జి కృష్ణమాచార్యులు రచించిన ‘దేవుడు చేసిన పెళ్ళి’ అనే కథ అందిస్తున్నాము.]

[dropcap]“ము[/dropcap]రళీ! నీ పెళ్ళి గురించి అమ్మ బెంగ పెట్టుకుంది. నీవొక నిర్ణయం తీసుకునే టై వచ్చింది” అని మురళికి అతని తండ్రి తెగేసి చెప్పాడు. “బంధువుల ద్వారా, మాట్రిమోనిల ద్వారా నేను సంబంధాలు తేవడం, వాటిని నువ్వు కాదనడం.. ఇలా ఎంతకాలం” అని ఆయన విసుక్కున్నాడు. మురళి తల్లిని చూస్తే, జాలివేస్తుంది. ఆమె మ్రొక్కని దేవుడు లేడు, కలవని జ్యోతిష్కుడు లేడు అనడం కొంత అతిశయోక్తిగా అనిపించినా, ఆవిడ ప్రయత్నాలను చూస్తే, అలా అనబుద్ధి వేస్తుంది.

మంచి ఉద్యోగం, సంపాదన, చూడచక్కని పర్సనాలిటీ వున్న కొడుకు, ఇరవై యెనిమిదేళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోకుండా తిరగడం, ఆ తల్లి తండ్రులకు రుచించడంలేదు. ఇంకా ఆలస్యం చేస్తే, ముదురు బెండకాయలా మిగిలిపోతావు, త్వరగా యెవరో ఒకరిని పెళ్ళాడి కాపురం వెలగబెట్టమని, మొదట బుజ్జగింపుగా చెప్పిన వాళ్ళే, ఈ మధ్య కాలంలో విసుగ్గా చెప్తున్నారు.

మురళి పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. “నీకు నచ్చిన పిల్లని నువ్వే యెంచుకో” అని తల్లి దండ్రులు స్వేచ్చనిచ్చినా, అతడు సరైన అమ్మాయిని నిర్ణయించుకోలేక పోతున్నాడు. అమ్మాయిల వేట మొదలుపెట్టినప్పుడు అతనికి ఒక ప్రగాఢ విశ్వాసముండేది. “గూగుల్‌లో ఉద్యోగం. నాలుగు లక్షల జీతం, అందగాడిని, ఏ ఆడపిల్ల ‘నో’ చెప్పే అవకాశం లేదు” అని తన ముఖాన్ని అద్దంలో చూసుకుని మురిసి పోయేవాడు. తీరా చూస్తే, వాస్తవ ప్రపంచం అతని ఊహలకందని విధంగా వుంది.

“ఏమిటిరా ఇది? ఆడపిల్లలు అంతులేని స్వేచ్ఛతో సాగిపోతున్నారు. పెళ్ళి వద్దు, ఉద్యోగం ముద్దు అంటూ పెళ్ళిళ్ళు వాయిదా వేస్తున్నారు. రకరకాల యాప్స్ ద్వారా తాత్కాలిక తోడు సంపాదించుకుని ముచ్చట్లాడుతున్నారు” అని సహ బ్రహ్మచారి దగ్గర వాపోయాడు. అతని సలహా పై, తనతో పనిచేసే ఆడపిల్లలను, యాప్స్ ద్వారా పరిచయమైన అమ్మాయిలను చాలా మందినే కలిసాడు. కొద్దిమందితో కాఫీ త్రాగాడు. కొద్ది మందితో పబ్బుల్లో డాన్స్ చేసాడు. మరి కొద్దిమందితో డేటింగ్ చేసాడు. అంతకన్న ముందుకు పోలేక కొందరిని వదులుకున్నాడు. వెరసి ఒంటరిగా మిగిలిపోయాడు. విదేశీయుల్లా, స్వేచ్ఛగా తిరిగే ఈ పిల్లలని చేసుకునే బదులు, ఒక విదేశీ అమ్మాయినే చేసుకుంటే యెలా వుంటుంది? అన్న ఆలోచనలో పడిపోయాడు.

మురళి తల్లి మాత్రం, పట్టువిడవని విక్రమార్కుడిలా, తన వంతు ప్రయత్నాలు చేస్తూనే వుంది. ఒకరోజు ఆమె స్నేహితురాలు ఫోన్ చేసి కుంభకోణంలో కల్యాణ సుందరేశ్వరునికి, పూజ చేస్తే, పెళ్ళి వెంటనే అయిపోతుందని చెప్పింది. ఆ విషయం వెంటనే ఆమె కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది. తల్లి మనసు నొప్పించడం ఇష్టం లేని మురళి, “అలాగేనమ్మా! ఈ నెల చివరి వారంలో వెళ్దాము” అని తన అంగీకారం తెలిపాడు. నిజానికి మురళికి దేవుడి మహిమలపైన నమ్మకం లేదు. చిన్నతనంలో, “నాన్నా! ఆంజనేయస్వామి గుడికివెళ్ళి ప్రదక్షిణలు చేసి, దణ్ణం పెట్టుకో. ఆయన నీ కోరికలు తీరుస్తాడు” అని తల్లి చెప్పిన మాటలు చాలా సందర్భాలలో ఫలించకపోవడం దానికి కారణం. ఆ దేవుడే పెళ్ళిళ్ళు చేస్తే, ఈ మేట్రిమోనీలెందుకు, పేరయ్యలెందుకని అతననుకుంటూండగా ఫోన్ రింగయ్యింది. మురళి మేనత్త కొడుకు రవి నుంచి ఫోన్.

రవి మేనత్త వసుంధర పాండిచెర్రీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆమె భర్త రాజేష్ ప్రభుత్వ సెక్రెటేరియట్‌లో ఆఫీసర్. రవి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మురళి, రవిల మధ్య బంధుత్వంతోపాటు బలమైన స్నేహముంది. కుశలప్రశ్నల తరువాత రవి “ఆఫీస్ పనిమీద ఇండియా వస్తున్నాను. ఎల్లుండి మంగళవారం పాండీ వచ్చి శుక్రవారం రాత్రి తిరిగి వెళ్ళిపోతా. నువ్వుఆ టైములో పాండీలో వుండేలా రా!” అని హుకుం జారీ చేసాడు.

“థాంక్ గాడ్! రిలాక్సవడానికి మంచి అవకాశం” అని మురళి సంబరపడ్డాడు.

***

మురళికి రవి వున్న నాలుగు రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. రవి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోదామనుకున్నా, “ఇంటినుండే ఆఫీస్ పని చేసుకోవచ్చుకదా, ఒక వారం వుండి వెళ్ళు” అని వసుంధర బలవంతపెట్టడంతో ఆగిపోయాడు.

మరునాడు వుదయం అతను బీచ్ రోడ్‌లో జాగింగ్ చేసి వచ్చేటప్పటికి వసుంధర, రాజేష్ హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ త్రాగుతున్నారు. మురళిని చూసి, రాజేష్ “రావోయి జాగింగ్ అయ్యిందా!” అని ఆహ్వానించాడు.

మురళి ఆయన ప్రక్కనే కూర్చుని, “ఈ రోజు మీకు సెలవేనా!” అని అడిగాడు.

“ఆయనకు, శనివారం, ఆదివారం అని వుండదు. ఎప్పుడూ అఫీసే” అని నవ్వింది వసుంధర.

ఇంతలో పనిమనిషి లక్ష్మి వచ్చి మురళికి కాఫీ అందిస్తూ, “బాబూ! నేనోమాట చెప్తాను, కోప్పడవుకదా!” అని వినయంగా అడిగింది.

“మా మురళి అలా కోప్పడే మనిషి కాదు గాని, విషయమేమిటో చెప్పు” అంది వసుంధర.

లక్ష్మి చెప్పింది. “సుమారు మనింటికో ఇరవై కిలోమీటర్లుంటుంది, గుట్ట ఆంజనేయస్వామి గుడి. అ స్వామికి మొక్కితే పెళ్ళిళ్ళయి పోతున్నాయని చెప్తున్నారు. ఒక శనివారం నాడు గుడికి వెళ్ళి, త్వరలో పెళ్ళి కావాలని అనుకుంటూ స్వామికి పూజ చేసి, ఒక కొబ్బరికాయ కొట్టి, పదకొండు ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత, ప్రసాదం తినాలి. అలాగే తర్వాతి మంగళవారం, శనివారం చేయాలి. అంతే, గారంటీగా పెళ్ళయిపోతుంది. ఒకోసారి మొదటి దర్శనానికే పెళ్ళయిపోయిన వాళ్ళున్నారు.”

ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, లక్ష్మి చెప్పిన మాటలు విని వసుంధర మురళి వైపు చూస్తూ, “మీ అమ్మకు ఆంజనేయస్వామి అంటే యెంతో నమ్మకం. అందుకే విచిత్రంగా ఆ స్వామి విషయం మనకి తెలిసింది. నువ్వు తప్పకుండా వెళ్ళిరా!” అంది.

“ఇలాంటివి నమ్మను నేను. నువ్వు కూడా యేంటి అత్తా! ఏదో యాదృచ్ఛికంగా ఒకరిద్దరికి పెళ్ళయ్యుంటుంది”.

మురళి మాటలకడ్డు తగులుతూ, “నీక్కూడా అలా జరగవచ్చేమో? నువ్వు తప్పకుండా వెళ్లి రా. మీ అమ్మ కోరిక నెరవేరుతుంది” అని రాజేష్ వెళ్ళిపోయాడు.

“లక్ష్మిని కనుక్కున్నాను. గుడి సాయత్రం అయిదు గంటలకు తెరుస్తారు. కొంత దూరం గతుకుల రోడ్డు. నా కారు తీసుకెడతావా?” అడిగింది వసుంధర.

అనిష్టంగా ముఖం పెట్టి, వసుంధర వైపు చూస్తూ, “వద్దు. బైక్ మీద వెడతాను” అని బదులిచ్చాడు మురళి.

***

సాయత్రం అయిదు గంటలకు మురళి ఆంజనేయ స్వామి గుట్ట చేరాడు. అక్కడ వున్నదుకాణంలో పూజా సామగ్రిని తీసుకుని మెట్ల దోవలో గుట్టపైకి చేరుకున్నాడు. గుడి తలుపులింకా తెరవలేదు. ఎదురుగా వున్న మెట్ల మీద కూర్చుని వున్న లక్ష్మి దగ్గరకు వెళ్ళాడు. మురళిని చూడగానే లక్ష్మి లేచి నిలబడి, “ఇవాళ యెందుకో పూజారి గారింకా రాలేదు” అని అక్కడే కూర్చుని వున్న యువతిని పరిచయం చేసింది. ఆమె పేరు శిరీష. తండ్రి బ్యాంక్ మేనేజర్. తల్లి గృహిణి. ఆ అమ్మాయికి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి కానీ, కుదరడం లేదని లక్ష్మి తన వెంటబెట్టుకుని వచ్చింది. పది నిమిషాలు భారంగా గడిచాయి. ఇంతలో లక్ష్మికి ఫోన్ వచ్చింది.

ఫోన్ మాట్ల్లాడిన లక్ష్మి గాభరాగా మురళి దగ్గరకు వచ్చి,”బాబూ! నేను అర్జంటుగా వెళ్ళాలి. నా ఆడబడుచుకు నొప్పులు మొదలయ్యాయి. నేను దగ్గర లేనంటే నా మొగుడు చంపేస్తాడు. కాస్త ఈ అమ్మాయిని వాళ్ళింటికి తీసుకు వెళ్ళు. లేటయితే బస్సులు తేలికగా దొరకవు” అని చెప్పి పరుగున వెళ్ళిపోయింది. ఒక తెలియని యువతి బాధ్యత, తన నెత్తిన పెట్టి లక్ష్మి అలా వెళ్ళిపోవడం, మురళికి కోపం తెప్పించింది. ఒక నిమిషం లక్ష్మి వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయాడు.

ఈ హఠాత్పరిణామం వల్ల మురళికి యెదురైన ఇబ్బందిని అర్థం చేసుకున్నశిరీష, “మురళి గారు, సారీ! లక్ష్మి అలా చెప్పి వుండకూడదు. నేను పూజైన వెంటనే బస్సులో వెళ్ళిపోతాను. నా గురించి మిమ్మల్ని యిబ్బంది పెట్టడం సమంజసం కాదు” అని మురళికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.

ఆమె ఆత్మాభిమానాన్ని అర్ధం చేసుకున్న మురళి “భలేవారే! అనుకోని అవసరం వచ్చి వెళ్ళింది గాని, లేకుంటే అలా వెళ్ళేదా!” అని విషయాన్ని తేలిక చేసాడు.

“అవునండి! మా ఇంట్లో చాలకాలం నించి పని చేస్తోంది. అందుకే అమ్మ తనతో పంపించింది”.

“మీరు వేరే ఆలోచన పెట్టుకోకండి. నేనే డ్రాప్ చేస్తాను.” అని అనునయంగా చెప్పాడు మురళి.

“అలాగేనండి! మీరు నన్ను నీవు అనవచ్చు!” అంది శిరీష

కాసేపు మౌనంగా వుండిపోయారిద్దరూ. ఆ తర్వాత శిరీషే మాట కలిపింది. పాండిచెర్రీలో పెరిగిపోతున్న మద్యం, గంజాయి అమ్మకాల వల్ల టూరిజం, రాష్త్ర ఆదాయం పెరుగుతున్నాయి కానీ యువత పాడైపోతున్నారన్న ప్రస్తావన తెచ్చింది. వారిద్దరూ ఆ విషయం చర్చించిన మీదట ఐటీ రంగములో అకస్మాత్తు తొలగింపులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విభిన్నాంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇంతలో పూజారి గారు వచ్చారు. పూజ ముగించుకుని యిద్దరూ ప్రదక్షిణాలు చేసి మంటపంలో కూర్చున్నారు. మురళి కొబ్బరి కాయ కొట్టి, ఒక ముక్క శిరీషకిచ్చి తనొకటి తిన్నాడు.

“ఒక రెండు నిమిషాలు ధ్యానం చేస్తూ మీ కోరిక మరొకసారి దేవునికి చెప్పండి” అని కనులు మూసుకుంది శిరీష.

ధ్యానంలోవున్న ఆమెను చూస్తూ ఆమె సహజ సౌందర్యానికి, స్నేహ స్వభావానికి, విషయ పరిజ్ణానానికి, మురళి ముగ్ధుడయ్యాడు. ఇన్నిలక్షణాలు ఇంతవరకు తను డేట్ చేసిన అమ్మాయిలలో ఎవరికైనా వుంటే, తను వదిలిపెట్టే వాడా? కానయితే, వాళ్ళకి లక్షల్లో సంపాదన వుంది. పబ్ డాన్సులు, వీకెండ్ టూర్లు, విదేశీ విహారాలు వంటి నాగరిక జీవితముంది. ఇలా ఆలోచిస్తున్న అతనితో శిరీష నవ్వుతూ యిలా అంది.

“మీరు మీ అమ్మగారి బలవంతం మీద వచ్చారు కదూ! మిమ్మల్ని చూస్తూనే అనుకున్నాను. అందం, మంచి వుద్యోగం, వున్న మీకు ఇంతవరకు పెళ్ళి కాలేదంటే, ఆశ్చర్యమే! మీరు డేటింగులు చేయలేదా?”

“చేయకపోవడమేం? కానీ నా గురించిన మీ అంచనా తప్పు. అమ్మాయిలే నన్ను వద్దనుకున్నారు. కొన్ని అనుభవాలైతే ఇప్పటికి నవ్వు తెప్పిస్తాయి.”

“నిజమా! అభ్యంతరం లేక పోతే చెప్పండి”

“చీకటి పడుతోంది. మనం బయలు దేరుదామా?”

అనుభవాల గురించిన తన ప్రశ్న దాటవేశాడని గ్రహించిన ఆమె “ఆ! అమ్మ కంగారు పడుతుంది. వెళ్దాం!” అని లేచి నిలబడింది. ఇద్దరూ గుట్ట దిగారు.

“మీకు బైక్ అలవాటేనా! గతుకులుంటాయి. మొహమాటం లేకుండా నన్ను పట్టుకోండి” అని మురళి బైక్ స్టార్ట్ చేశాడు. వీలైనంత జాగ్రత్తగా మురళి బండి నడిపి, ఆమెను ఇంటి దగ్గర దింపాడు. మురళిని తల్లికి పరిచయం చేసింది శిరీష. “పిల్ల బయటికి వెడితే తిరిగి ఇల్లు చేరే వరకు భయమే. నీకు చాలా థాంక్స్” అని ఆమె తన కృతజ్ఞత తెలియ చేసింది.

సాగనంపడానికి బయటికి వచ్చిన శిరీష నడిగాడు మురళి.

“ఇందాక నా డేటింగ్ అనుభవాలడిగారు. నన్నుఆట పట్టించడానికే కదా!”

“అయ్యో! మహానుభావా! మీరెంతో స్నేహంగా వున్నారని చనువు తీసుకున్నాను. నాకయితే డేటింగ్ అనుభవాలేమీ లేవు. లేకుంటే ముందుగా నేనే చెప్పేదాన్ని” అంది శిరీష చేతులు జోడించి నమస్కరిస్తూ.

అప్రయత్నంగా మురళి ఆమె చేతులు పట్టుకుని, విడదీసి సరసంగా, “అలాగయితే మిత్రమా! ఫోన్ నంబరివ్వు, ఈ రాత్రి ఫోన్లో చెప్తా” అన్నాడు. అలాగే అని శిరీష్ తన నంబర్ ఇచ్చి, అతని నంబర్ తీసుకుంది.

***

గుడికి వెళ్ళి వచ్చిన మేనల్లుడిని వసుంధర అభినందించింది. రాత్రి పది గంటలవరకు ఆగి అప్పుడు శిరీషకు వీడియో కాల్ చేసాడు. శిరీష వెంటనే బదులిచ్చింది.

“శిరీషా, ముందు ఇది చెప్పు. నీ పెళ్ళి యెందుకు కావడం లేదు?”

మనసులో వున్న బాధను దాచి పెట్టి, నవ్వుతూ చెప్పింది శిరీష,

“నాన్న సంపాదన కుటుంబ పోషణకి సరిపోతుంది. మొన్న కరోనా మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసింది. వరుసగా తాతయ్య, నాయనమ్మ చనిపోయారు. ఇరవై లక్షలకు పైగా ఖర్చయ్యింది. నాన్న సేవింగ్స్ యాభై లక్షల దాకా వుంది. మా కులంలో మంచి సంబంధం అంటే కట్నాలు, లాంఛనాలకే కనీసం యాభై లక్షలు కావాలి. పెళ్ళికి ఇల్లు తనఖా పెట్టాల్సిందే. వేరే కులమంటే సంప్రదాయం, ఆహారపు అలవాట్లు తేడా వస్తాయని నాన్న భయం. వచ్చే యేడాదికి నా చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు అయిపోతుంది. నా సంపాదనతో నా పెళ్ళి నేనే చేసుకుంటానంటే, మా నాన్న వినడు. ఇది నా కథ. ఇంక మీ అనుభవాలు చెప్పండి”.

మురళి సరదాగా అభినయం జోడించి తన అనుభవాలు చెప్పాడు.

“శాంపిలుగా రెండు సంఘటనలు చెప్తాను, నీకు మా మగవాళ్ళ కష్టాలు అర్ధమవడానికి. మొదట సరిత. మా ఆఫీసే. నెలకు రెండు లక్షల జీతం. ఒక నెల రోజులు రెస్టారెంట్లు, పార్కులలో కలిసి ఒకరి నొకరం తెలుసుకొన్నాం. ఇంకేముందనుకొని, నేను పెళ్ళి అన్నాను, ఆమె ఒక యేడాది సహజీవనం అంది. ఆ తర్వాత, పెళ్ళే గదా అన్నాను. చెప్పలేను అంది. వద్దనుకున్నాను. ఇంకో అమ్మాయి సుజన. యాప్ ద్వారా పరిచయం. రెస్టారెంట్ లో కలిసాం. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో వచ్చింది. అతడిని పరిచయం చేస్తూ వీడు నన్నొదిలి వుండలేడు. కానీ వీడితో పెళ్ళి యిష్టం లేదని ముద్దుగా చెప్పింది. జారుకున్నాను.

అలా, నాకు నచ్చిన అమ్మాయిలకు పెళ్ళి అంటే ఇష్టం లేకపోవడం, లేదా వేరే వాళ్ళు నచ్చడం వల్ల.. ఒక అయోమయంలో వున్నాను”.

చిరునవ్వులొలికిస్తూ విన్న శిరీష. “మీరు ఈ కాలానికి సరిపడరని అర్ధమవుతోంది” అంది

“ఏమో! ఒకోసారి వెస్టెర్న్ కల్చర్ వున్న అమ్మాయిని చేసుకునే బదులు, అమెరికా వెళ్ళి బ్లాండీని చేసుకుంటే మేలనిపిస్తోంది. అదీ ప్రస్తుత ఆలోచన.” అన్నాడు మురళి.

“శుభం! జై హనుమాన్! అనుకోండి. సముద్రాలు దాటిస్తాడు”, యెంతో ఉల్లాసంగా అంది శిరీష. తన మాటలు ఆసక్తిగా వింటూ, ప్రోత్సాహరంగా మాట్లాడే శిరీష పట్ల మురళిలో సన్నిహిత భావం కలిగింది.

“రేపు ఆదివారం బీచ్ టూరిస్టులతో హడావుడిగా బాగుంటుంది. వస్తావా!” అడిగాడు మురళి.

“డేటింగా!” చిలిపిగా నవ్వింది శిరీష.

“కాదు మీటింగ్. సాయంత్రం అయిదు గంటలకు” అని ఫోన్ కట్ చేసాడు మురళి. ‘భలే వాడే!’ అనుకుంటూ శిరీష నిద్రపోయింది.

***

సాయంత్రం అయిదు గంటలకు బీచ్‌లో కలిసారిద్దరూ. “రావనుకున్నాను” అన్నాడు మురళి. “మీరు మా పాండీ అతిథులు. ఎలా నొప్పిస్తాను” అని నవ్వింది శిరీష.

ఇద్దరి మధ్య సంభాషణ యెన్నో విషయాలపై ఆసక్తికరంగా సాగింది. కొద్దిమంది మహిళల స్వేచ్ఛను చూసి అందరూ అభివృద్ది చెందారని చెప్పడం హస్యాస్పదమని వాదించింది శిరీష,

“నేను త్వరలో సంపాదిస్తాను. నాకు సంగీతం, చిత్రలేఖనం ద్వారా కూడా సంపాదించుకునే శక్తి వుంది. అయినా నా మధ్యతరగతి కుటుంబం ధైర్యంగా నాకు స్వేచ్ఛనివ్వలేక పోతోంది. నాలాంటి వారెందరో. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి”. అని ఆకాశంవైపు చేతులు జోడించి నమస్కరించింది.

ఆమెనలా చూసిన మురళికి అతని తల్లి గుర్తుకు వచ్చింది. స్త్రీలు ఎక్కువగా దేవుడిని నమ్ముతారని అనుకున్నాడు. ఇంటికి వచ్చాక కూడా చాలసేపు అతని మదిలో శిరీష, ఆమె భావాలు కదలాడాయి. హఠాత్తుగా అతనికి తన తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి.

“పెళ్ళికి కావలసినది అందచందాలు, ఆస్తులు కాదు. నిన్నే తన ప్రపంచం అనుకునే మనసు. ఇంటిని చక్కదిద్దుకునే నేర్పు. స్నేహితులని, బంధువులని ఆదరించే స్నేహస్వభావం”.

***

మరునాడు శిరీషకి ఫోన్ చేయాలన్నకోరికను నిగ్రహించుకున్న మురళి, మంగళవారం ఉదయమే శిరీషకు ఫోన్ చేసి గుడి ప్రోగ్రాం గురించి అడిగాడు.

నిన్ననే, అనుకోకుండా నాకు పెళ్ళి సంబంధం కుదిరింది. ఆబ్బాయికి రెండు లక్షల జీతం. బెంగళూరులో ఒక ఫ్లాట్ వుంది. సంబంధం కావాలనుకుంటే రెండు షరతులకు ఒప్పుకోవాలి. ఇల్లు అబ్బాయి పేర రాయాలి, అమ్మాయి వర్జిన్ టెస్ట్ చేసుకోవాలి.” శిరీష గొంతులో బాధ.

“అన్యాయం. నీకు కోపం రాలేదా! ఎలా ఒప్పుకున్నావు?” కోపంగా అడిగాడు.

“చెప్పాను కదా! స్వేచ్ఛ లేదని. వరసగా డబ్బుకోసం సంబంధాలు తప్పిపోతూంటే నాన్న మనసెలా వుంటుంది. ఆత్మాభిమానంతో నేను ఒప్పుకోలేదంటే, నేను కన్యను కానేమోనని మా వాళ్ళకే అనుమానం రావచ్చు.” అని కొంచెం సేపాగి, చెప్పింది, “అవమానంగా వుంది. సముద్రంలో దూకి చచ్చిపోవాలనుంది.” శిరీష యేడుస్తున్నశబ్దం.

మురళి మనసులో అగ్నిపర్వతం బద్దలైంది. ఫోన్ కట్ చేసి, గబగబా బైక్ మీద శిరీష యిల్లు చేరాడు. అతని రాకను చూసి శిరీష తల్లి నివ్వెరపోతూ శిరీష మేడ మీద వుందని చేయి చూపింది.

నిశ్శబ్దంగా శిరీష గదిలోకి ప్రవేశించాడు మురళి. టేబుల్ మీద తలవాల్చి కన్నీళ్ళు పెడుతున్న ఆమెను చూసి కదిలిపోయాడు. ఎదురుగా ఆమె గీసిన ఒక చిత్రం. అందులో వేణువుకి అభివాదం చేస్తూ ఒక సౌందర్యవతి. అది చూసాక, అతను జంకు విడిచి “శిరీషా” అని ప్రేమగా పిలిచాడు. అతడిని చూసి ఆమె ఆశ్చర్య పోయింది.

ఆ చిత్రం వైపు చూపిస్తూ అది నేను, నువ్వేనా అన్నట్టు సైగల ద్వారా అడిగాడు. ఆమె సిగ్గుతో అవునని తలదించుకొంది. మురళి అనందంగా ఆమె వైపు చేతులు చాచి “నా జీతం నాలుగు లక్షలు. నాకు, నా అమ్మానాన్నకు, నువ్వు తప్ప, ఏమీ అక్కర్లేదు, నీ స్వేచ్ఛకెవ్వరూ అడ్డు రారు. ఇష్టమైతే నన్ను పెళ్ళి చేసుకో” అని అడిగాడు. తండ్రిని గురించిన ఆలోచనతో, ఒక్క క్షణం సందేహించిన ఆమె, కోరుకున్న వ్యక్తి పిలుపుతో, స్వేచ్ఛానురాగాలతో అతని కౌగిట చేరింది.

మురళి ప్రేమ పెళ్ళికి మూలం ఆంజనేయస్వామి పూజ అన్న విషయం అతని తల్లికి, మేనత్తకు, ఆనందం కలిగించింది. అదే విషయం చెప్పి, శిరీష తండ్రిని పెళ్ళికి ఒప్పించి, వివాహం అంగరంగ వైభోగంగా జరిపించారు. లక్ష్మి విజయోత్సాహానికి అంతు లేదు. నాటి నుంచి దేవుడు చేసిన పెళ్ళిగా మురళి – శిరీషల వివాహం బంధుమిత్రుల సంభాషణలలో చోటు చేసుకుంది.

Exit mobile version