Site icon Sanchika

దేవుడు దాక్కున్నాడు

[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘దేవుడు దాక్కున్నాడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]గు[/dropcap]డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు
గంట కొట్టి లెంపలేసుకుంటారు
సుప్రభాతం పాడి నిద్ర లేపుతారు
కోరికల చిట్టా విప్పి చూపిస్తారు

అరటి పండు కొబ్బరి చిప్ప నాకిచ్చి
భూములు బంగారం అడుగుతారు
పులిహోర పొంగలి నైవేద్యం పెట్టి
మంత్రి పదవి కావాలని కోరుతారు

నోములు వ్రతాలు చేస్తుంటారు
నెత్తిన నీరు పోసి అభిషేకిస్తారు
అంతు లేని సంపద‌ అడుగుతారు
ఇవ్వక పోతే నేను లేను అంటారు..

కష్టాలన్నీ మంచివాళ్ళకే అంటారు
దుష్టులు హాయిగున్నారని వాపోతారు
కళ్ళు మూసుకున్నావా అని నిలదీస్తారు
రూపాయి దానం చేసి కోటి కోరతారు

కొండల్లో కోనల్లో ఎక్కడ దాక్కున్నా
కనిపెట్టి గుడి కట్టి పడేస్తారు
మానవత్వం ప్రేమ దాక్షిణ్యం
కావాలని ఎవరూ అడగరు

మనుషుల మధ్య మసలలేక
భయం భయంగా ఉంది ఎందుకో
అందుకే దాక్కున్నాను నేను..
ఇది దగా పడ్డ దేవుడి స్వగతం..!

Exit mobile version