[dropcap]ఏం,[/dropcap] ఆడవాళ్ళ కుండకూడదా భక్తి?
ఏ దేవుడు చెప్పాడు వాళ్ళను
మందిరాల్లోకి ప్రవేశించకుండా చేయమని?
నిరాకారుడైన పరమాత్మకు
స్త్రీ పురుష భేదం ఉందనుకోవడం
పరాకాష్ట మత ఛాందసానికి!
‘అపవిత్రులయినా, పవిత్రులైనా
ఎటువంటి స్థితిలో ఉన్నా
ఎవరయితే ఆ భగవంతుని
ప్రేమగా స్మరిస్తారో, వారు
బయట, లోపల, కూడా పరిశుద్ధులే!’
అని మన వేద మంత్రాలే ఘోషిస్తున్నాయి
మాంస నివేదన చేసిన తిన్నడినీ
పన్నగ కంఠుడు చేశాడు మన్నన!
నీ మనసు కావాలి దేవునికి, శరీరం కాదు!
స్త్రీని సగభాగంగా, సగర్వంగా ధరించి
అర్ధనారీశ్వర తత్త్వాన్ని చాటిన శివుడూ
శ్రీని తన గుండెల మీద పెట్టుకున్న కేశవుడూ
వనితల సమతను వాసి కెక్కించారు
పాశ్చాత్యులైతే వారిని ‘మెరుగైన సగాల’న్నారు
ఎక్కడ నారీమణులు గౌరవించబడతారో
అక్కడ సమస్త దేవతలూ కొలువుంటారని
మన ఆర్ష ధర్మం ప్రవచించింది!
హరిహరులు కలిసి వెలసిన ఆ
శబరిబల దొరకు ఉంటుందా
అసలు అతివలంటే వివక్ష!
శతాబ్దాల నాటి అంధవిశ్వాసాలను
ఎంత కాలం కొనసాగిస్తారిలా?
మేలుకోండి అన్ని మతాల పెద్దలు
స్వస్తి చెప్పండి ఈ భక్తి వివక్షకు
ఆడవాళ్లు కూడా ఆయన వాళ్లే అని
గ్రహించండి! కరగించండి
కరడు గట్టిన మీ ఛాందస హృదయాలను
ఇప్పుడున్న వివక్షలు చాలవా?
బూజు పట్టిన, కాలం చెల్లిన మత సిద్ధాంతాలను
తీసి పారేయండి అవతలకి!
భక్తిలో నూతన కోణాన్నావిష్కరించిన
ఓ సర్వోన్నత న్యాయస్థానమా! నీకు జోహార్!
ఇలాగే గడ్డిపెట్టు అన్ని మతాల్లోని అవకతవకలకు
అన్ని విధాల స్త్రీల పట్ల వివక్షకు
చరమ గీతాన్నాలపించే నవ వ్యవస్థకు
స్వాగతమిచ్చే గళాలు ఒక్కటిగా నినదించాలి!