Site icon Sanchika

దేవుని సొంత దేశం కేరళ యాత్రానుభవాలు-2

[2022 సెప్టెంబరు నెలలో కేరళ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]ప[/dropcap]డుకుంటూ ఉండగా డ్రైవర్ ఫోన్.

“సార్! సారీ! డిస్టర్బ్ చేశానా?”

“లేదు లే చెప్పు”

“రేపు 7 గంటల కల్లా మనం బయలుదేరితే మంచిది సార్. కాంప్లిమెంటరీ బ్రేక్‍ఫాస్ట్ ఎనిమిదిన్నరకి గాని రాదు. మనం రేపు చెక్ అవుట్ చేసి ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తిరిపల్లి వాటర్‌ఫాల్స్‌కి వెళ్ళాలి, అక్కడ మూడు గంటలు పడుతుంది. అది చూసుకొని సాయంత్రానికి మున్నార్ చేరుకోవాలి. కాబట్టి దారిలో ఎక్కడైనా బ్రేక్‍ఫాస్ట్ చేస్తే మనకు టైం కలిసి వస్తుంది సార్! ఫ్రీ కదా ఎందుకు వదిలేయాలనుకుంటూ మీ ఇష్టం” అన్నాడు.

మా యోగా కూడా సురేష్‍తో ఏకీభవించాడు.

“సరే సురేష్, అలాగే చేద్దాం” అన్నాను.

***

మర్నాడు ఉదయం ఏడుంబావుకు రూము చెక్ అవుట్ చేసి, బయలుదేరాం. అక్కడికి దాదాపు రెండు గంటల ప్రయాణంలో అత్తిరిపల్లి జలపాతాలున్నాయట. బాహుబలి వన్ సినిమా షూటింగ్ అక్కడే తీశారని సురేష్ చెప్పాడు. సినిమా తీస్తే గాని ఆ జలపాతానికి ప్రాముఖ్యత ఉండదా?

దారిలో ఒక హోటల్ దగ్గర ఆపాడు. దాని పేరు విచిత్రంగా ఉంది. ‘బెల్లీఫుల్ కేఫ్’ అట. ఇడ్లీ, సాంబారు, చట్నీ, సింగిల్ పూరీ తిన్నాము. నాట్ సో బ్యాడ్!

వాటర్‍ఫాల్‍కు కొద్ది దూరం ముందే ఒక చోటికి వెళ్ళాము. కారు బయట ఆపి, దాదాపు అర కిలోమీటరు లోపలికి నడిచాము. ప్రకృతి విశ్వరూపాన్ని అక్కడ చూశాము. ఆకాశన్నంటే కొండలు, వాటి నిండా దట్టంగా పెరిగిన చెట్లు. చల్లగా హాయిగా గాలి.

దాదాపు వంద అడుగుల క్రింద జలపాతం ఉంది. విశాలంగా, నురగలు కక్కుతూ దూకుతూంది. క్రిందకి దిగి దానివరకు వెళ్ళడానికి మెట్లు, రైలింగ్ ఉన్నాయి. మెల్లగా దిగి వెళ్ళాము. రెండు కళ్ళు చాలా లేదు. అదే అత్తిరిపల్లి వాటర్‍ఫాల్ అనుకున్నాము. అది కాదట. దూరంగా ఒక మూడు వందల అడుగుల పొడవున్న వేలాడే (సస్పెన్షన్) వంతెన కనబడింది. దాని మీద నుంచి క్రిందకి చూస్తే చాలా బాగుంటుందన్నాడు మా రథసారథి.

Hanging Bridge ఆరడుగుల వెడల్పు ఉంది. జలపాతం వెడల్పు ఎంత ఉందో అదీ అంత ఉంది. క్రింద ఏ సపోర్టు లేదు. రెందు వైపులా చివర మాత్రమే దానికి హోల్డ్ ఉంది. నడుస్తూంటే చిన్న కదులుతోంది. బ్రిడ్జి మధ్యకు వెళ్ళాము. క్రిందకి చూస్తే అద్భుతం! కాసేపు చూసేసరికి కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. ఫోటోలు వీడియోలు తీసుకున్నాము.

 

ఆ వంతెనను ‘Thumboormuzhi’ Hanging Bridge అని అంటారు. అక్కడ ‘బటర్‍ఫ్లై గార్డెన్’ అన్న బోర్డు ఉంది దగ్గరలో. రకరకాల జాతుల సీతాకోకచిలుకల బొమ్మలు, వాటి శాస్త్రీయ నామాలు వివరంగా రాసి ఉన్నాయి. కానీ గార్డెన్‍లో ఒక్క సీతాకోకచిలుక ఉంటే ఒట్టు! అదేమని అక్కడున్న అతనిని అడిగాడు మా మిత్రుడు. వాటి సీజన్ అయిపోయిందట.

బయటకి వచ్చి కారులో కొంత దూరం ప్రయాణించాము. ఒక చోట ఆపి, ఒక కొండ చూపాడు. ఎక్కి వెళ్ళడానికి ఫారెస్ట్ ట్రాక్ ఉంది. మెట్లు కాదు, నడక దారే. రాళ్ళు పరిచి ఉన్నాయి. అక్కడక్కడా విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు వేశారు. జలపాతం కొండ దిగువన ఉందట. రోడ్ మీద నుంచి దాదాపు 800 మీటర్లు దూరమట.

500 మీటర్లు ఎక్కింతర్వాత, ట్రాక్ దిగువకు వెళ్ళసాగింది. పూర్తిగా దిగి వెళ్ళాము. చుట్టూ దట్టమైన అడవి పచ్చదనాన్ని కక్కుతూ ఉంది. యాభై మీటర్ల దూరంలో అబ్బురపడే దృశ్యం! అదే అత్తిరిపల్లి జలపాతం!

దాని హోరు రోడ్డు వరకూ వినిపించింది. ఇక్కడ మరీ ఎక్కువగా ఉంది. అక్కడ ఒక బోర్డు పెట్టారు. ‘ఊపిరి సలపనివ్వని (breath taking) అత్తిరిపల్లి జలపాతానికి స్వాగతం. గుండె జబ్బులు కలవారు జలపాతానికి దగ్గరగా వెళ్ళకండి. రైలింగ్ దాటి వెళితే వెయ్యి రూపాయలు జరిమానా.’

యాభై మీటర్లు ఇంకా దిగి జలపాతం దగ్గరికి చేరుకున్నాం. ఆ హోరులో ఒకరి మాటలు ఒకరికి వినిపించడం లేదు. అనంతమైన జలరాశి అమిత వేగంతో వంద అడుగుల వెడల్పున తన నీటిని క్రిందకు వదులుతోంది. నీరు పడుతున్న చోట మళ్ళీ ఉవ్వెత్తున లేస్తోంది. తెల్లని స్వచ్ఛమైన నురగ. నీటి తుంపరలు పొగమంచులా ఆ ప్రాంతాన్నంతా కమ్ముకున్నాయి. భగవంతుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో కళ్ళారా చూసే అదృష్టం పట్టింది మాకు!

దాదాపు అరగంట అక్కడ గడిపాము. ఫోటోలు, వీడియోలు మాములే. మమ్మల్నిద్దర్నీ నిలబెట్టి ఫోటోలు తీశాడు సురేష్.

దారిలో అతన్ని అడిగాము “బాహుబలిలో చూపించినట్లు లేదే?” అని.

“అందులో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ సార్. దాంట్లోకి వెళ్ళి షూట్ చేయాలంటే ప్రభాస్‍కు రెండో సినిమా ఉండదు మరి!” అని నవ్వాడతను.

బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాం చిన్న పిల్లల లాగా. ఎందుకో మనసంతా తేలిగ్గా అయిపోయింది. మళ్ళీ యవ్వనం వచ్చినట్లుంది.

మా వాడు “షుగరేమో!” అని గొణుగుతుంటే, “తినరా పరవాలేదు! విజయమో, వీర స్వర్గమో ఈ టూర్‍లో తేలిపోవాలి” అన్నాను. వాడు నవ్వాడు!

అక్కడి నుంచి ‘మున్నార్’కు దాదాపు దాదాపు నాలుగు గంటల ప్రయాణం. దారి అంతా ప్రమాదకరమైన మలుపులతో కూడిన ఘాట్ రోడ్. 130 కిలోమీటర్లు ఉంటుంది దూరం. చుట్టూ కొండలు, లోయలు, క్యానొపీ (canopy)లు. సమున్నతంగా ఎదిగి క్రింద ఉన్న చెట్లకు గొడుగుగా ఉండే వృక్షాల పై కప్పులను క్యానొపీ అంటారని గూగుల్ తల్లిని అడిగితే చెప్పింది. వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. చలిగా లేదు. ఎండ కాస్తుంది కానీ, దాంట్లో అస్సలు తీవ్రత లేదు. కారు కిటికీలు తెరుచుకుని, కళ్ళు విప్పార్చుకొని ప్రకృతి అందాలను వీక్షించాము. వాటర్‌ఫాల్‌కు కొంత దూరంలో కేరల హైడ్రో ఎలెక్ట్రికల్ ప్రాజెక్టు కనబడింది. మున్నార్ వరకు నయనానందమే. మధ్యలో అక్కడక్కడా సెలయేర్లు, బుజ్జి జలపాతాలు లెక్కలేనన్ని కనబడ్డాయి.

మున్నార్ చేరేసరికి రాత్రి ఏడు దాటింది. కొండల్లో గుట్టల్లో పెద్ద పెద్ద భవనాలు! వాటిల్లోని లైట్ల కాంతిలో మున్నార్ మనోహరంగా ఉంది. ‘ఇండ్రిజో స్పైస్ కంట్రీ’ అనే రిసార్ట్‌లో మాకు రూమ్ బుక్ చేసి ఉన్నారు. రాత్రి డిన్నర్ వారి రెస్టారెంటులోనే పెడతామన్నారు. ప్రీగా కాదండోయ్.

ఎ.సి. సంగతి దేవుడెరుగు, ఫ్యాను కూడా అవసరం లేదక్కడ. మందంగా ఉన్న కంఫర్టర్స్ ఇచ్చారు కప్పుకోటానికి. మర్నాడు ఉదయం బ్రేక్‍ఫాస్ట్ ఇక్కడే చేసి ఎనిమిదింబావుకు మున్నార్ సైట్‍ సీయింగ్‍కు వెళదామని చెప్పి వెళ్ళిపోయాడు డ్రైవర్.

బాత్‍రూంలో పొగలు కక్కే వేడి నీళ్ళు వస్తున్నాయి సోలార్ గీజర్ నుంచి. బడలిక తీరేలా హాయిగా స్నానం చేసి, పంచెలు కట్టుకున్నాము. ఎనిమిదిన్నరకు ఒక బాయ్ వచ్చి ఆర్డరు తీసుకుని వెళ్లాడు. రూంకే సర్వ్ చేస్తానంటే వద్దన్నాము. రెస్టారెంట్‍కే వస్తామని చెప్పాము. తొమ్మిదికి ఫోన్ వచ్చింది, “డిన్నర్ రడీ, రండి” అని.

వేడి వేడిగా రోటీల్, గోబీ మసాలా వచ్చాయి. రోటీలు పొరలు పొరలుగా బాగున్నాయి. ఒక వెదురుబుట్టలో తెచ్చాడు. చెరో రెండు రోటీలు తిన్నాము. కూర ఎక్కువ స్పైసీగా లేదు. తర్వాత చిన్న డిష్‍లో ప్లెయిన్ రైస్, పెరుగు, నిమ్మకాయ ఊరగాయ. బాస్మతి రైస్ అది. మొత్తం మూడు వందల పది రూపాయలయ్యింది. బాగానే ఉందిలే అనుకున్నాం.

“రేపు ఉదయం 7 గంటలకు కాఫీ దొరుకుతుందా?” అని అడిగాము. ఫిల్టర్ కాఫీ ఉండదనీ, ‘బ్రూ’ కాఫీ కావాలంటే తెచ్చి ఇస్తామనీ చెప్పాడు. కాంప్లిమెంటరీ బ్రేక్‍ఫాస్ట్ తరువాత ‘టీ’ ఉంటుందట.

హాయిగా నిద్ర పట్టింది. ఉదయం ఆరున్నరకు లేచి ముఖాలు కడుక్కునేసరికి ఒక కెటిల్‍లో వేడి వేడి కాఫీ వచ్చింది. చక్కెర వెయ్యలేదు. పక్కన చిన్న కప్పులో తెచ్చాడు. మాకెందుకది?

స్నానాలు చేసి రడీ అయ్యాం. రెస్టారెంట్‌కు వెళ్ళి బ్రేక్‍ఫాస్ట్ చేశాం. టూరిస్టులతో సందడిగా ఉంది. బఫే సిస్టమ్. తాగే నీరు వేడిగా ఉంది. కేరళలో ఏ హోటల్‍కి వెళ్ళినా వేడి నీరే ఇస్తారు. మాకు అంత ఆరోగ్య సూత్రాల పట్టింపు లేదు కాబట్టి నార్మల్ కూలింగ్ మినరల్ వాటర్ బాటిల్ తెప్పించుకున్నాము.

ఇడ్లీ, చట్నీ, సాంబారు, పూరీ, కూర్మా, ఉడికించిన గుడ్లు, బ్రెడ్, బటర్, జామ్, టోస్టర్ వరుసగా ఉన్నాయి. ఒక చివర టీ క్యాన్. పూరీలు త్రిభుజాకారంలో ఉండడమ్ విశేషం. రూపం ఏదైనా దేవుడొక్కడే అన్నట్లు షేప్ ఏదైనా, తిండి ఒక్కటే కదా! సాంబారు అద్భుతంగా ఉంది. పూరీ కూర్మా కూడా ఓ.కె.

సరిగ్గా ఎనిమిదింబావుకు పార్థసారథి ఫోన్ చేశాడు. అదేనండి, డ్రైవరు. మున్నార్ లోని వందల ఎకరాలలో వ్యాపించిన టీ ఎస్టేట్స్ గుండా వెళ్ళసాగాము. పచ్చి టీ ఆకులు, వెనుక బుట్టలు కట్టుకుని ఆడవాళ్ళు తుంచుతున్నారు. పచ్చి తేయాకు వాసన చాలా బాగుంది.

ఒక చోట ఆపి చెప్పాడు సురేష్. అక్కడ ‘జీప్ సఫారీ బుకింగ్’ అని బోర్డు ఉంది. చిన్న ఆఫీసు ఉంది.

“సార్! కార్లు వెళ్ళలేని కొండడారుల్లో, ఫారెస్ట్ ట్రాక్స్‌లో ఎన్నో జలపాతాలు, వ్యూ స్పాట్‍లు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే ఒక జీపు ఇస్తారు. దాదాపు రెండు మూడు గంటల పాటు అన్నీ తిప్పి చూపిస్తారు. తప్పక చూడాల్సిన చోట్లు సార్” అన్నాడు.

నేను టూర్ మేనేజర్ జిజోకు ఫోన్ చేశాను. అంత కొండ ప్రాంతమైనా నెట్‍వర్క్ బాగా వస్తూంది. “ఈ జీప్ సఫారీ సంగతి మాకు చెప్పేలేదేం భాయ్?” అనడిగాను.

“అలాంటివి మీరు సొంతంగా చూడాల్సిందే సార్! అవసరం లేదంటే కారు వెళ్ళే పరిధిలోవి మేం ఎలాగూ చూపిస్తాము” అన్నాడు. అదేదో చూడాల్సిందే అనుకున్నాము.

“ఫోన్ ఆఫీసులో ఉన్న అతనికి ఇవ్వండి సార్! మామూలుగా అయితే ట్రిప్‍కు నాలుగువేల వరకూ తీసుకుంటారు. మీరు మూడు వేలు ఇవ్వండి చాలు. నేను చెబుతాను” అన్నాడు జిజో.

ఆఫీసు అతను జిజోతో మాట్లాడి ‘రణవీర’ అనే అతన్ని మాతో పంపాడు. డబ్బు తిరిగి వచ్చిం తర్వాత ఇమ్మన్నాడు. ప్రొఫెషనల్ ఎథిక్స్!

జీపు దృఢంగా ఉంది. టైర్లు పెద్దవి. కూర్చొని సీటు బెల్టులు కట్టుకున్నాము. ఇక ప్రారంభమయింది పరమాద్భుత, ఆశ్చర్యకరమైన ప్రయాణం. ఎక్కడా ప్యారాపెట్ వాల్స్ గాని, రెయిలింగ్స్ కాని లేవు. మహా అయితే ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్నాయి ఆ అడవి, కొండ దారులు. ఎంత వర్షం వచ్చినా బురద కాకుండా రాళ్ళు పరిచారు. కొన్ని చోట్ల రోడ్డు ఎంత ‘స్టీప్’గా ఉందంటే, భయమేసింది. ఊపిరి బిగపట్టుకుని చూస్తుంటే, రణవీరుడు నవ్వుతూ చెప్పాడు ఇలా –

“రిలాక్స్‌డ్‌గా ఉండండి సార్! నా డ్రైవింగ్‍ను చూడడం మానేసి చుట్టూ చూడండి. నాకు ఇరవై రెండేళ్ళ అనుభవం ఈ వృత్తిలో”. అప్పుడు ధైర్యం వచ్చింది. ‘శ్రీ నారాయణపుర’ అనే చోట ఆపాడు. అక్కడ రిపిల్ వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. పొన్ముడి డాం ఉంది. వాటర్‍ఫాల్ చాలా పెద్దది. దాని మీద ‘పొన్ముడి’ సస్పెన్షన్ బ్రిడ్డ్ ఉంది. అది చాలా పురాతనమైనది. తెలుస్తూనే ఉంది. అది కట్టి రెండు వందల ఏళ్ళయిందని చెప్పాడు మా రణవీరుడు. పొన్ముడి డాం ద్వారా జలవిద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రం చూశాము. పెద్ద పెద్ద పైపు లైనును ఆ కొండలలో ఎలా వేశారో?

తర్వాత దారి వెంట మిరియాల చెట్ల ప్లాంటేషన్లు, ఏలకుల ప్లాంటేషన్లు ఉన్నాయి. మిరియాలను కాలీ మిర్చీ అంటారు. తర్వాత రబ్బరు ప్లాంటేషన్లు చూశాము. రబ్బరు చెట్ల కాండం దిగువున గాటు పెట్టి, రబ్బరు ద్రవాన్ని కంటెయినర్లలో పడేలా అమర్చారు. అది చిక్కని పాలలా తెల్లగా ఉంది. టైర్లు తయారు చేసే రబ్బరు మొదటి రకమట. చెప్పులు, ఇతర రబ్బరు ప్రాడక్ట్సు తయారయ్యేది రెండో రకమట.

అక్కడి నుంచి ‘టైటానిక్ పాయింట్’ అన్న చోటికి చేరుకున్నాము. అక్కడి నుంచి హిల్ అండ్ ఫారెస్ట్ వ్యూ అద్భుతం. అక్కడ రోప్ వే ఉంది. కేవలం ఒక సీటు మీద కూర్చుని, తీగ మీదుగా అటు వైపుకు వెళ్ళి రావొచ్చు. క్రింద వేయి అడుగుల లోయ! ఇద్దరు యువజంట చేతులు పట్టుకుని రెండు సీట్లలో విడి విడిగా, కులాసాగా నవ్వుకొంటూ వెళ్ళి తెరిగి వచ్చారు. ఏదీ లెక్క చేయని, భయం వేయని వయసది! నోరు తెరుచుకొని వారు గాలిలో తీగకు వేలాడుతూ వెళ్ళడం చూశాం. మా కంత సీన్ లేదుగా! టికెట్ మనిషికి మూడు వందలట! పోనప్పుడు ఎంతయితే ఏం?

అక్కడ కూడా విస్తృతంగా టీ తోటలు పెంచారు. అతి దగ్గరగా వాటిని చూసి ఆనందించాము. అక్కడి నుంచి జీప్ సఫారిలో చివరి మజిలీ అయిన నడుకణి పర్వతాగ్రానికి చేరాము. మున్నార్ లోనే అత్యంత ఎత్తైన ప్రదేశమట అది. సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగున ఉంది. పైన మాత్రం కొండ చదునుగా ఉండి, నాలుగయిదు జీపులు రివర్స్ చేసుకునేందుకు అనువుగా ఉంది. మా రణవీరుడు ఫోన్లో మాట్లాడుతూ (అఫ్‍కోర్సు హాండ్స్ ఫ్రీ యే అనుకోండి) కొండ అంచుకు వెళ్ళాడు. అక్కడ నుంచి రివర్స్ చేశాడు. మేం గాభరా పడ్డాం. ఎందుకంటే కేవలం మూడడుగుల దూరంలోనే ఉంది అగాధమైన లోయ!

తిరుగు ప్రయాణంలో చెప్పాడతను. తనకు ట్రిప్‍కు ఐదు వందలు ఇస్తారనీ, జీతం అంటూ ఏమీ ఉండదనీ; పీక్ సీజన్‍లో ఐతే రోజుకు రెండు ట్రిప్పులు దొరుకుతాయనీ; అన్‍సీజన్‍లో ఏవీ దొరకవని చెప్పాడు. టూరిస్టులకు అద్భుత అనుభూతులను అందించే ఇలాంటి వారి జీవితం లోనూ వెతలు!

దారిలో కట్టెల మోపులు మోస్తూ, ఆవులు కాస్తూ, ఎంతో బీదగా ఉండేవారు కనబడ్డారు. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’లో కూడా పేదరికం!

పదకొండున్నరకు బుకింగ్ ఆఫీసు దగ్గరకు చేర్చాడు క్షేమంగా. అతనికి రెండు వందలిచ్చాను టిప్‍గా. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మూడు వేలు ఆఫీసు వారికి గూగుల్ పే చేశాను.

(ఇంకా ఉంది)

Exit mobile version