దెయ్యం వదిలింది-1

0
3

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘The Exorcism of the Ghost’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. ఇది మొదటి భాగం.]

[dropcap]ప[/dropcap]ద్మకి మూడేళ్ళ వయసులో దెయ్యంతో పరిచయమైంది.. ఖచ్చితమైన వయసు ఆమెకి సరిగ్గా గుర్తులేదు కానీ దెయ్యమనే పదాన్ని మొదటిసారిగా వింది. చలికాలంలో చర్మం మీద పడే గీతలను చూపిస్తూ ‘దెయ్యం బరుకులు’ అని తన బంధువొకామె అనడం వింది పద్మ. దెయ్యమంటే ఏంటి, అదెలా ఆమెను గీరగలిగిందని అడిగింది. అప్పటికి కానీ ఆ చుట్టానికి తన తప్పు అర్థం కాలేదు. నాలిక కరుచుకుని, “నిజానికి వాటిని ‘గాలి గీతలు’ అంటారు. ఇవి చలికాలంలో చర్మంపై ఏర్పడుతాయి. వీటినే కొందరు ‘దెయ్యం బరుకులు’ అని అంటారు” అని చెప్పింది. ఆ రోజుల్లో కాస్మొటిక్స్.. నేటిలా.. ఇంకా మన డ్రెస్సింగ్ టేబుల్స్‌ని ముంచెత్తలేదు. చర్మం పొడిబారటంపై అవగాహన చాలా తక్కువ. కొందరు శరీరానికి కొబ్బరినూనె రాసేవాళ్లు (కొందరేమో, అలా చేస్తే, శరీరం మీద వెంట్రుకలెక్కువవుతాయని భయపడేవారు); కాస్త డబ్బున్న వాళ్ళు వాజలిన్ జెల్లీ వంటివి వాడేవారు. ఎటువంటి సువాసనా లేకపోవడం వల్లా, జిడ్డు వల్లా చాలామంది పిల్లలు తమ శరీరాలపై నూనె రాయించుకునేవారు కాదు. ఫలితంగా చలికాలంలో వాళ్ళ శరీరాలపై తెల్లని చారలు ఏర్పడేవి. జనాలకి ఈ విషయంలో పెద్దగా అవగాహన లేక, ఈ చారలకు కారణం కనపడని గాలో లేదా దెయ్యమో అని భావించేవారు.

చురుకైన అమ్మాయి కావడంతో – నిజం నిర్ధారించుకోవటానికి పద్మకి ఎక్కువ సమయం పట్టలేదు. దెయ్యానికి, గాలికి ఏదో సంబంధం ఉందని తలచింది. గాలి గట్టిగా వీస్తూ, ఈలలు వేస్తూ ఉంటే, ఏదో ఒక భయంకరమైన అదృశ్య జీవి తనకీ, తన కుటుంబానికి హాని కలిగించడానికి బయలుదేరిందని ఆమె భయపడేది. ట్రాన్సిస్టర్‌లో – ఏవైనా భయం గొల్పే పాటలు (హాంటెడ్ సాంగ్స్) విన్నా లేదా వర్షంలో ఏదైనా విషాద గీతం మధ్యలో వింటున్నప్పుడు మధ్యలో వచ్చే భీతి కల్గించే చిన్న శబ్దాలు విన్నా తన భయం మరింత బలపడేది.

ఇప్పుడు పద్మకు దెయ్యం ఉందని ‘ఖచ్చితంగా’ తెలిసిపోవడంతో సహజంగానే చీకట్లో ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్లాలంటేనే భయపడేది. ఆమె చిన్ననాటి రోజుల్లో విద్యుచ్ఛక్తి చాలా అరుదు. వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉన్నప్పటికీ, విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా ఉండేవి, పైగా సమయం/సందర్భం లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండేది. తాను ఒక గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు కరెంటు పోతే ఏమవుతుందో అని ఆలోచించింది పద్మ.

***

పద్మకి సరిగ్గా ఈ ఆలోచన వచ్చినప్పుడే కరెంట్ పోయింది. “అమ్మా, అమ్మా! స్టడీ రూమ్‍లో నేనొక్కదాన్నే ఉన్నాను. భయంగా ఉంది. నువ్వు ఇక్కడికి రావా” అంటూ అరిచింది. అంతలో ఆ చీకట్లో ఏదో తెల్లగా మెరిసింది.. అదేంటో అర్థమవడానికి ఓ క్షణం పట్టింది పద్మకి.. ఆఁ.. మీరు సరిగ్గానే ఊహించారు.. అది దెయ్యమే – ఓ కంకాళం రూపంలో ఉంది! అది అస్థిపంజరమేనా అని నిర్ధారించుకోవాలనుకుంది పద్మ. స్కూల్లో ఓ సీనియర్ బయాలజీ పుస్తకంలో తాను చూసిన అస్థిపంజరం బొమ్మని గుర్తు చేసుకుంది (ఓ రోజు ఆ సీనియర్ పుస్తకాల సంచీలోంచి బయాలజీ పుస్తకం కిందపడిపోయింది. అస్థిపంజరం ఉన్న పేజీ యాదృచ్ఛికంగా తెరచుకుంది. దాన్ని తీసిన పద్మకి అస్థిపంజరం కనబడింది.. ఆ విధంగా పద్మ అస్థిపంజరం గురించి తెలుసుకుంది.. ఐతే పుర్రె మాత్రం ముందే తెలుసు.. ఎలాగంటారా? ఇంట్లో కాళీమాత ఫోటోలో అమ్మవారి మెడలో పుర్రెల దండ ఉంటుందిగా!). ఆమె అంచనా నిజమైంది. దెయ్యం నుంచి తప్పించుకోవాలనుకుంది. తలుపు వైపు పరిగెత్తింది. ఆమె మనసు గ్రహించినట్టుగా, అస్థిపంజరం వెళ్ళి గుమ్మానికి అడ్డం నిలబడి – పద్మని మింగేయడానికా అన్నట్టు చేతులు చాపింది.

“అమ్మా!” అంటూ తల్లి ‘శక్తి’ని కేకేసింది పద్మ. అలా అరవడం జీవితంలో అదే ఆఖరిసారి అని అనుకుంది. ఇంతలో అమ్మ చెయ్యి ఆమె భుజాన్ని నెమ్మదిగా నిమిరింది. స్పృహలోకి వచ్చిన పద్మ అమ్మని హత్తుకుని గట్టిగా ఏడ్చింది.

***

తన ఊహల్లోని దెయ్యాలు సరిపోవన్నట్లుగా, పద్మ చుట్టాలు, మిత్రులు – దెయ్యాలున్నాయని ఆమెని నమ్మించడానికి చూశారు. ఆదివారం నాడు తలస్నానం చేసి తెల్లబట్టలు వేసుకుని జుట్టు విరబోసుకుని, చింత చెట్టుకి ఉయ్యాల ఊగిన ఓ అమ్మాయికి దెయ్యం పట్టిందని ఒకరోజున పద్మకి ఆమె అత్త చెప్పింది. ఇప్పుడు పద్మ దగ్గర మరింత సమాచారం ఉంది. దాంతో, ఆదివారం నాడు తలస్నానం చేయకూడదనీ, చేసినా ఆ రోజు తెల్లబట్టలు వేసుకోకూడనీ, లేదా భయంకరమైన ప్రాణికి నివాసంగా ఉన్న చింతచెట్టు కింద ఊయలూగకుండా ఉండడం తెలివైన పని అని అనుకుంది. ఈ సమాచారం ఇచ్చిన అత్త – పుకార్లు పుట్టించడంలో నిష్ణాతురాలు! కానీ ఏడేళ్ల పద్మ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది.

***

తెలుపు రంగుకీ, దెయ్యానికి మధ్య ఉన్న సంబంధం పద్మ నేస్తం హరిణి చెప్పిన ఓ కథ వల్ల నిరూపితమైంది. “ఓ ఊర్లో పదహారేళ్ల వయసున్న విజయ్ అనే యువకుడు ఉండేవాడు. దుబారాగా ఖర్చుపెట్టేవాడు, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఏడు సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోవడంతో, వృద్ధురాలైన అమ్మమ్మ అతన్ని పెంచింది. గారం మప్పడంతో, దురలవాట్లు అబ్బాయి. తన వ్యససాలకు డబ్బు ఇవ్వమని విజయ్ తరచూ అమ్మమ్మను వేధించేవాడు. మనవడి మీద అతి ప్రేమతో, ఆమె వాడు అడిగినంత డబ్బు ఇచ్చేది. కొంతకాలానికి, వాడు పెట్టే వృథా ఖర్చులకు డబ్బు మిగల్లేదు. దాంతో ఆమె ఒక బంగారు ఉంగరం తప్ప, తన మిగతా నగలని అమ్మేసింది. ఆ ఉంగరంపై లక్ష్మీదేవి బొమ్మ ఉంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం – పెళ్ళికి ముందు జరిగిన నిశ్చితార్థంలో ఆ ఉంగరాన్ని ఆమె భర్త ఆమె వేలికి తొడిగాడు. విజయ్ దృష్టి ఆ ఉంగరంపై పడింది. దాన్ని సొంతం చేసుకోవడానికి లేదా బామ్మే దాన్ని అమ్మేలా చేయడానికి విజయ్ ఎంతగానో ప్రయత్నించాడు. ఎన్ని ఎత్తులు వేసినా అవేవీ ఫలించలేదు. చివరికి, అమ్మమ్మ – మనవడి పెంపకంలో తన తప్పుని గ్రహించింది, దారితప్పిన మనవడిపై దిగులుతో మరణించింది. ఆమె ఉంగరాన్ని దొంగిలించడానికి విజయ్‌కి ఇప్పుడు అవకాశం దొరికింది. ఉంగరాన్ని బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా, అది ఊడి రాలేదు. అతనిలో దురాశ పెరిగిపోయింది. ఆమె ఉంగరపు వేలును నరికి, ఆ ‘ముసలామె’ బతికుండగా ఇవ్వడానికి నిరాకరించిన ఉంగరాన్ని ఎట్టకేలకు దక్కించుకున్నాడు. ఆ రాత్రి, తెల్లని దుస్తులు ధరించిన ఒక స్త్రీ అతనికి కనిపించి, యోగక్షేమాలను అడిగింది. ఆమె చేతులకి తొమ్మిది వేళ్లు ఉండడం, ఒక చేతికి ఉంగరపు వేలు లేకపోవడం స్పష్టంగా కనిపించడం విజయ్ గమనించాడు. కుతూహలంతో ఆ లేని వేలి గురించి ఆమెని అడిగాడు. వెంటనే ఆమె విజయ్‌పైకి దూసుకెళ్లి, ‘నా వేలు నీ దగ్గరే ఉంది!’ అని అరిచింది.”

కథలో నాటకీయ ప్రభావం కలిగించడానికి, హరిణి తన ముఖాన్ని పద్మకి దగ్గరగా జరిపి అరిచింది. దాంతో పద్మ కెవ్వుమని భయంతో అరిచింది. మిగతా పిల్లలందరూ వీళ్ళ చుట్టూ చేరారు. విషయం క్లాస్ టీచర్‌కి చెప్పారు, ఏం జరిగిందో ఆరా తీసి, అలాంటి కథలను చెప్పకూడదని హరిణికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

***

ఓసారి ఇంట్లో ఏదో వేడుక జరిగింది. మధ్యాహ్నం భోజనాలయ్యాకా, ఆడవాళ్ళంతా కబుర్లలో పడ్డారు. అప్పుడు పద్మ వయసు పదేళ్ళు, పెద్దవాళ్ళ మధ్యన, ‘శక్తి’ని అతుక్కుని కూర్చుని వాళ్ళ ముచ్చట్లు వింటోంది. ఒకావిడ తన చిన్ననాటి భయానక కథను గుర్తుచేసుకుంది. అది వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి ఒక ‘దెయ్యాల మేడ’ కథ. కరెంటు లేని రోజులవి. ఆ ఊర్లో ఒక ధనికుడు రెండంతస్తుల భవనం నిర్మించాడు. ధనవంతుడు కాబట్టి, ఇంటి పనులను చూసుకోవడానికి కొందరు సేవకులను పెట్టుకున్నాడు. ఒకరోజు, ఆయన వ్యాపార నిమిత్తం వేరే ఊరు వెళ్ళాల్సివచ్చింది. అప్పుడతని భార్య అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. అందువల్ల ఆమె పనిమనిషి పుల్లమ్మను తనకి సహాయంగా ఇంట్లోనే ఉండమని అడిగింది. ఆ రాత్రి – వ్యాపారి భార్య మంచినీళ్ళు కావాలని పుల్లమ్మను నిద్ర లేపింది. పుల్లమ్మ బెడ్‌రూమ్‌లోంచి మరో గదిలోకి వెడుతుండగా, హరికేన్ లాంతరు ప్రకాశాన్ని పెంచమని ఆమె పుల్లమ్మతో అంది. ఇంతలో ఓ గులాబీరంగు వస్తువేదో వచ్చి ఆమె ముందు పడింది, అది లాంతరు కాంతిని పెంచే ప్రకాశాన్ని పెంచడానికి వాడే మీట! ఆ గులాబీ రంగు మీటని చూసి ఆమె విస్తుబోయింది. అది లేకుండా పుల్లమ్మ లాంతరు కాంతిని ఎలా పెంచుతుందా అనుకుంది, తన నాలుకతో లాంతరు కాంతిని పెంచుతున్న పుల్లమ్మ కనబడింది. అంతే ఆమె జ్వరం పోయింది, ఆ స్థానంలో తీవ్రమైన భయం చోటు చేసుకుంది. మరుసటి రోజు ఉదయం భర్త తిరిగి వచ్చేవరకు ఆమె బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఆ మర్నాడు చీకటి పడకముందే రహస్యంగా వాళ్ళు ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. పుల్లమ్మ దెయ్యం విషయం త్వరగా వ్యాపించింది, ఆ ఇల్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు; కాలక్రమేణా, దానికి ‘దెయ్యాల మేడ’ అని పేరు వచ్చింది.

***

అడల్ట్స్ ఓన్లీ స్పూకీ సినిమాగా పేరొందిన ‘ది ఎక్సార్సిస్ట్’ ఎట్టకేలకు విశాఖపట్నంలో విడుదలై సంచలనం సృష్టించింది. పద్దెనిమిదేళ్ళు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వాళ్ళే ఆ సినిమా చూడాలని తల్లిదండ్రులు చెప్పడంతో, పద్మ దానిని చూడలేదు. దెయ్యాల గురించి ‘ఆలోచించటానికి’ కూడా ఆమె సిద్ధంగా లేదు. అంత పిరికిది పద్మ!

***

పద్మ వాళ్ళుండేది ఓ స్వతంత్ర సంస్థ వారి నివాస సముదాయంలో. ఒక శనివారం మధ్యాహ్నం అక్కడ బాగా సందడిగా ఉంది. గత కొన్నేళ్ళుగా ప్రసిద్ధికెక్కిన దెయ్యం సినిమా ‘దేవుడే గెలిచాడు’ స్థానిక స్టాఫ్ క్లబ్‌లో ఆ రోజు సాయంత్రం  ప్రదర్శించబడుతోంది. పద్మ కుటుంబంలోని పెద్దవాళ్ళు ఆమెను క్లబ్‌కి వెళ్ళకుండా ఆపడానికి చూశారు. కానీ సినిమా చూడాలనే పట్టుదలతో పద్మ అద్భుతమైన ధైర్యం కనబరిచింది. అయితే సినిమాలో దేవుడు దెయ్యంపై గెలిచినా, పద్మలో వివేకం కలగలేదు, పైగా మరింత పిరికిగా మారింది. దెయ్యం గురించి ఆమె చూసినది – భీతిగొలిపే ఓ గది మూలలో ఆకారం లేని తెల్లటి పొగ; ఇక, దెయ్యం గురించి విన్నది కోరస్ గుంపు హమ్మింగ్. అంతే, తెలుపు రంగు, ఆకారహీనత, ఇంకా హమ్మింగ్, వెంటాడే కోరస్ సంగీతం ఉంటే దెయ్యమేననీ గట్టిగా నమ్మసాగింది పద్మ.

***

పద్మ టీనేజ్ లోకి వచ్చింది. చీకట్లో తిరగాలంటే ఇంకా భయపడుతూనే ఉంది, కానీ స్నేహితురాలు లలితని ఆదర్శంగా తీసుకుని – రాత్రి వేళల్లో తరచూ కరెంటు కోతలు ఉన్న సమయంలో ఇంట్లోనే తిరిగేంత ధైర్యం తెచ్చుకుంది.

ఒకరోజు స్కూల్‌లో, ఆమె క్లాస్‌మేట్, అనిత – కావాలంటే దెయ్యాన్ని అందరూ చూడవచ్చని ప్రకటించింది. తన పిరికి స్వభావం వల్ల అలాంటి చర్చలకు పద్మ దూరంగా ఉంటుంది, కానీ ఆమెలో ఉత్సుకత కలిగింది. అనిత సీటు దగ్గరికి వెళ్ళలేదు, కానీ, అనిత చెప్తున్న మాటలన్నీ చాలా జాగ్రత్తగా వింది: “చేయాల్సింది తేలికైన పనే! రాత్రి పూట కరెంట్ లేని సమయంలో, మీ తల మీద ముదురు రంగు దుప్పటి కప్పుకుని, కొవ్వొత్తి వెలిగించి, అద్దం ముందుకు వెళ్లి మిమ్మల్ని మీరు చూసుకోండి!”

అనిత ప్రకటన గురించి పద్మ బాగా ఆలోచించింది – ముదురు రంగు దుప్పటి అంటే – దెయ్యం గురించిన తన నమ్మకానికి విరుద్ధంగా ఉంది – చీకట్లో దెయ్యాలు తెల్లటి దుస్తులు ధరిస్తాయని పద్మ నమ్ముతోంది! ఇక ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించాలనుకోలేదు.

ఆ రోజు సాయంత్రం కరెంటు కోత సమయం. అప్పటికే ఆమె ఇంటి వరండాలో కుర్చీలు వేసి ఉన్నాయి. కరెంట్ తీసేసే సమయం ముందే తెలిసినందున, పద్మ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు భాగంలోని ఖాళీ స్థలంలో కుర్చీలు వేసుకుని, చల్లగాలికి కూర్చుంటారు. అలాంటి రాత్రులలో చంద్రుడిని, నక్షత్రాలను చూడటం మరొక కాలక్షేపం. ఇంట్లోకి ప్రవేశించే ఎవరికైనా వెలుగు కోసం డైనింగ్ టేబుల్‌కు ఒక మూలన తక్కువగా వెలిగించిన లాంతరుని ఉంచుతారు.

అది వేసవికాలం, చీకటి పడింది. ఎందుకో, ఆకాశం మేఘావృతమైంది. అమావాస్య దగ్గరపడుతోంది. ఆకాశంలో చంద్రుడు గాని, నక్షత్రాలు గాని కనబడలేదు. పద్మ వాళ్ళ తాతగారు సీతారామ్ తన విద్యార్థి రోజులలో జరిగిన చిన్న సంఘటనని చెప్తున్నారు. ఇంతలో, పోర్టికోలో ఏదో పాకుతూండడం గమనించింది శక్తి. అంతా ఆందోళనకు గురయ్యారు. వాళ్ళ చేతిలోని టార్చ్ లైట్ తగినంతగా వెలగలేదు. అందుకని, అప్పుడే మంచినీళ్ళు తాగేందుకు లోపలికి వెళ్ళిన పద్మని పిలిచింది శక్తి.

“పద్మా, మాస్టర్ బెడ్‌రూమ్‌కి వెళ్లు. ఎడమ కిటికీ కుడి మూలలో కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఉన్నాయి. కొవ్వొత్తి వెలిగించి తీసుకురా” అంది.

“మధ్యలో కొవ్వొత్తి ఆరిపోతే ఎలా? స్పేర్ బ్యాటరీలు వెతకనా?” లోపలి నుంచి పద్మ అడిగింది.

“వద్దు, ఇక్కడ ఏదో పాకుతోంది. కొవ్వొత్తిని వెలిగించి, త్వరగా రా, జాగ్రత్తగా తీసుకురా!” చెప్పింది శక్తి.

పద్మ మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి దూసుకెళ్లి, ఎడమవైపున్న కిటికీ కుడి మూలలో ఉన్న కొవ్వొత్తి, అగ్గిపెట్టె తీసుకుంది. కొవ్వొత్తిని వెలిగించి, బయటకు నడవబోయింది.

ఇంతలో ఆమె కుడి కన్ను మూలలో ఏదో ప్రకాశవంతమైన కాంతి కిరణం వెలువడింది. దానిని పరిశీలించడానికి కొద్దిసేపు ఆగిపోయింది పద్మ. ఆమె ముఖం క్రింద ప్రకాశవంతమైన కాంతితో ఓ భయానక జీవి భయంకరంగా కనబడింది.

అంతే, భయంతో వణుకుతూ సహాయం కోసం కేకలు వేసింది పద్మ. ఆశ్చర్యపోయిన పెద్దవాళ్ళు – పోర్టికోలో పాకుతూ, గగుర్పాటు కలిగించిన జీవిని తాత్కాలికంగా మరచిపోయి – గబగబా లోపలికి పరుగెత్తారు.

మాస్టర్ బెడ్‌రూమ్‌కి చేరుకునేసరికి, అప్పుడే కరెంట్ వచ్చింది. విద్యుత్ దీపాల వెలుగులో, ఫ్యాన్ గాలికి ఆరిపోయిన కొవ్వొత్తిని చేతిలో పట్టుకుని, డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడిన పద్మ కనిపించింది! ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి పద్మకీ, వాళ్ళకీ ఎక్కువ సమయం పట్టలేదు. పద్మ నిజంగానే అద్దంలోకి చూసింది, అది ఆమె కుడి కన్ను మూలలో ఉన్న కొవ్వొత్తి కాంతిని ప్రతిబింబించింది – పద్మ తనను తాను కొత్త ‘కాంతి’లో చూసుకుంది. వెంటనే పొద్దున అనిత చెప్పిన ‘దెయ్యాన్ని చూడవచ్చు’ అనే మాటలు గుర్తొచ్చాయి. ఉదయం అనిత చెప్పిన మాటలకీ, అనుకోకుండా జరిగిన ఈ ఘటనకీ ముడిపెట్టి పద్మ భయభ్రాంతులకు గురయ్యిందనే విషయం స్పష్టం. తనలో ఉన్న దెయ్యాన్ని వదిలించుకోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోలేని చిన్నతనం పద్మది!

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here