Site icon Sanchika

దెయ్యం వదిలింది-2

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘The Exorcism of the Ghost’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. ఇది రెండవ భాగం. మొదటి భాగం ఇక్కడ.]

[dropcap]ప[/dropcap]ద్మ వయసు ఇరవైలలోకి వచ్చింది. ఓ సమీప బంధువు చనిపోవడంతో వాళ్ళింటో విషాదం నెలకొంది. అంటే వాళ్ళ కుటుంబానికి మృత్యువు పరిచయం లేదని కాదు, కానీ చనిపోయిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా అది వాళ్ళ సొంత గ్రామం నుంచి వచ్చి, ఇక్కడ స్థిరపడిన వాళ్ళల్లో మొట్టమొదటి ఆత్మహత్య! అతిగా ఖర్చుపెట్టేవాడు, ఆ చనిపోయిన కుర్రాడు; తద్వారా అమ్మానాన్నలకు చెడ్డపేరు తెచ్చిపెట్టాడు. నాన్న పేరు చెప్పి – మార్కెట్‍లోని ఎన్నో విలువైన వస్తువులను అరువు మీద కొనుక్కుని, బిల్లులు నాన్న చెల్లిస్తాడనని చెప్పి – దుబారాలకి మరిగాడు. విలాసాలను తగ్గించుకోమని అమ్మానాన్నలు గట్టిగా హెచ్చరించారు. అయితే ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నది పశ్చాత్తాపంతో కాదు, వృద్ధులైన తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడానికే. నదిలోంచి అతని శవాన్ని వెలికితీసినప్పుడు – అతని జేబులో ప్లాస్టిక్ కవర్ లో ఉంచిన ఓ ఉత్తరం దొరికింది. అందులో – తనని బలవన్మణారనికి పాల్పడేలా చేసింది తల్లిదండ్రులేననీ, అందుకని, అమ్మానాన్నలనీ, వాళ్ళకి మద్దతునిచ్చిన వాళ్ళనీ తను దెయ్యమై వెంటాడుతానని రాసి మరీ పోయాడు. అతను చనిపోయిన బాధకి అదనంగా, ఈ ‘వెంటాడడం’ గురించి దిగులుపడింది పద్మ. తన భయాల గురించి తల్లి శక్తికి చెబితే, “భయం లేదు పద్మా, ఆత్మహత్య చేసుకున్నవాళ్ళంతా – ఎవరో ఒకర్ని వెంటాడితే, చీకటి పడ్డాక, రోడ్లన్నీ నిండిపోయి – వాహనాలకి కూడా దారి ఉండదు” అంటూ నవ్వేసింది. పద్మ మనసు కుదుట పడింది.

***

పద్మ ఉద్యోగంలో చేరింది. ఒకసారి కొందరు సహోద్యోగులతో కలిసి హిమాలయ ప్రాంతాలకు తాను  ఫీల్డ్ ట్రిప్‍కి వెళ్ళింది. ఆ బృందంలో తను కాకుండా ముగ్గురు స్త్రీలు, నలుగురు పురుషులు ఉన్నారు. మగవాళ్ళలో అందరికంటే చిన్నవాడైన యువకుడు, చిలిపిగా ఉంటూ, ప్రాక్టికల్స్ జోక్స్ వేసేవాడు. అతను వీటిని భవాని అనే యువతిపై ప్రయోగించాడు. ఓ సాయంత్రం సంధ్య వేళ, ఆ ఎనిమిది మంది అడవిలోని ఒక గెస్ట్ హౌస్‌లో డైనింగ్ టేబుల్‌కి అటూ ఇటూ కూర్చుని టీ తాగుతూ, మరుసటి రోజు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఉన్నట్టుండి అక్కడ ఒక్కసారిగా చలి ఎక్కువైంది. వాళ్ళందరూ శరీరం పై నుంచి కింది దాకా ఉన్ని దుస్తులు వేసుకున్నారు; వాళ్ళంతా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ సమయం లేనప్పుడు ధరించగలిగే అదనపు వెచ్చని దుస్తులు కూడా తెచ్చుకున్నారు, ఒక్క భవాని తప్ప. తన ఉన్నిదుస్తులను భవాని తన గదిలో మరచిపోయి వచ్చింది. ఆమె తన గదికి బయలుదేరబోతుండగా, బృందంలోని చిన్నవాడైన మహావీర్, “జాగ్రత్త భవానీ! ఈ గెస్ట్ హౌస్ కేర్‌టేకర్‌తో నేను భద్రత గురించి మాట్లాడాను. రాత్రిపూట చిరుతపులులు ఈ ప్రదేశంలో తిరుగుతాయని చెప్పాడు. మరో విషయం, జాగ్రత్తగా విను, ఈ గెస్ట్ హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న మహిళ దెయ్యమై ఒక గదిలో ఉన్నవాళ్ళని వెంటాడుతుందట” అన్నాడు. “అది ఏ గది?” అడిగింది భవాని. “కుడివైపు రెండో గది అది” అని బదులిచ్చాడు మహావీర్. అంతే, భవాని ఒక్కసారిగా కేకపెట్టింది. దాంతో – తమ ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్న పద్మ, మిగిలిన సహోద్యోగులు ఆమై వైపు తిరిగారు. “లేదు, నేను ఆ గదికి వెళ్లను, అక్కడ పడుకోను” అంటూ, “ఎవరైనా నా గది తీసుకుని, వాళ్ళది నాకిస్తారా?” అని అడిగింది భవాని. పద్మ – మహావీర్ కొంటె ముఖం చూసి – ఇది అతని చిలిపి చేష్ట అని గ్రహించింది, కానీ నవ్వలేకపోయింది. ఎందుకంతే, ఆమెకి కూడా దెయ్యమంటే భయం పూర్తిగా పోలేదు. సరదాకైనా, మహావీర్ ఒక స్త్రీని ఆటపట్టించడం వల్ల పద్మ లోని ఫెమినిస్ట్ బయటకొచ్చింది. పైగా, తాను నాయకురాలిగా శిక్షణ పొందుతున్నానని; ఇలాంటి చిలిపి చేష్టలనే ఎదుర్కోలేకపోతే, జీవితంలో మరింత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోలేనని భావించింది పద్మ. వెంటనే భవాని దగ్గరకు వెళ్లి, “భయపడకు నేను నీతో పాటు నీ గదికి వస్తాను. ఈ ప్రపంచంలో దయ్యాలు లేవు – అవి ఊహాత్మకమైనవి, అంతే. ఊహాత్మకమైన వాటికి ఉనికి ఉండదు. నీ గదిలో దెయ్యం దాక్కుని ఉందని ఇప్పటికీ అనిపిస్తే, దానిని మనం ఎదుర్కుందాం, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం దానికి ఉందో లేదో చూద్దాం!” అని అంది.

భవానికి ధైర్యంగా అనిపించింది. గదిని మార్చుకోవాలనే ఆలోచనను విరమించుకుంది; మిగిలిన పది రోజులలో దెయ్యం గురించి మాట్లాడలేదామె.

***

ఓరోజు హాస్టల్ మెస్‍లో బల్ల మీద మధ్యాహ్నం పూట లంచ్ కోసం ఎదురుచూస్తోంది పద్మ. అప్రయత్నంగా ఆమె మనసులో ఓ పాట మెదిలింది. దాన్ని పాడుకుంటూ.. కొంత భాగం పైకే పాడింది.

“ఏనాడో ఆరింది నా వెలుగు.. నీ దరికే నా పరుగు

ఆనాడే కోరాను నీ మనసు.. నీ వరమే నన్నడుగూ

మోహినీ పిశాచి నా చెలిలే.. శాకినీ విషూచి నా సఖిలే..”

పూర్తిగా పాడకముందే తెలుగు తెలిసిన ‘శెట్టి’ అనే సహోద్యోగి – “ఏంటి పద్మా, నీకీ రోజు ఏమైంది? మామూలుగా అయితే చక్కని పాటలు పాడుతావు. ఇప్పుడేంటీ భయపెట్టే పాట పాడుతున్నావ్? ఏదైనా సమస్య ఉంటే, మాతో చర్చించు; అంతేకానీ ఇలాంటి ‘నిరాశ’ కలిగించే పాటలొద్దు” అన్నాడు కోపంగా.

పద్మ హాయిగా నవ్వేసింది. “థాంక్స్ శెట్టీ, దెయ్యం పాటలు పాడటం కష్టమనే నాకు తెలుసు. కానీ వాటిలోని నైరాశ్య భావన గురించి తెలియదు. అయినా దెయ్యాలు సినిమాల్లోనే ఉంటాయి, నిజ జీవితంలో కాదు” అంది.

దెయ్యాన్ని (లోపలి దెయ్యాన్ని) వదిలించుకునే క్రమంలో, త్వరలో తనకో పరీక్ష ఎదురవబోతోందని అప్పుడామెకు తెలియదు.

ఒకరోజు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు అరుణ్ అనే కొలీగ్ – ఝాన్సీ, లక్ష్మీ అనే ఇతర కొలీగ్‍లతో మాట్లాడడం, వాళ్ళిదరి ముఖాల్లో ఏదో భయం కదలాడడం పద్మ గమనించింది. ఇంతలో – విజయగర్వంలో వెలిగిపోతున్న ముఖంతో అరుణ్ – పద్మ దగ్గరకు వచ్చాడు.

“పద్మగారూ, మీరు లేడీస్ వింగ్‌లోని రూమ్ నంబర్ 106లో ఉంటారు, కదా?” అని అడిగాడు. పద్మ తల ఊపింది.

“మీ బాటిల్ నింపుకోవడానికి రాత్రిపూట వాటర్ కూలర్ దగ్గరికి వస్తారా?”

పద్మ మళ్ళీ తలూపింది.

“అయితే మీకో విషయం చెప్పాలి. మధ్యరాత్రిళ్ళు బయటకు రావద్దు. లేడీస్ వింగ్‌లోని రూమ్ నంబర్ 106 హాంటెడ్ ప్లేస్. ఒక లేడీ ట్రైనీ దెయ్యం అక్కడే తిరుగుతుందని అంటారు. నేను మీ శ్రేయోభిలాషిని కాబట్టి హెచ్చరించడానికి వచ్చాను” అన్నాడు అరుణ్.

పద్మ నివ్వెరపోయింది. ఉన్నతమైన బాధ్యతాయుతమైన స్థానానికి చేరుకోవడానికి స్వయంగా శిక్షణ పొందిన ఓ కొలీగ్ ట్రైనీ ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తించగలడు? క్షణాల్లో తేరుకున్న పద్మ, దెబ్బకి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంది.

“థాంక్స్ అరుణ్! ఒక భయానక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నిన్న, అర్ధరాత్రి, నేను నా బాటిల్ నింపుకోడానికి వాటర్ కూలర్ దగ్గరికి వెళ్ళాను. కొంచెం దూరంలో ఒక బలిష్టమైన తెల్లని ప్రాణి నన్నే చూస్తూండడటాన్ని గమనించాను!” అంది.

అరుణ్ రెచ్చిపోయాడు. “నేను చెప్పాను కదా పద్మాజీ! భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ పద్మ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న టేబుల్ వద్ద నుండి కదలబోయాడు. కానీ చేయి ఊపుతూ, ఆగమని సైగ చేసింది పద్మ. “నేనింకా పూర్తి చేయలేదు అరుణ్! కాస్త ఆగండి. మీరు నా శ్రేయోభిలాషి, కదా?” అంది. ఇక వినడం తప్ప అరుణ్‍కి మరో మార్గం లేకపోయింది. కానీ అతనికే మాత్రం ఆసక్తి లేనట్టు అతని ముఖమే చెబుతోంది.

“మొదట భయపడి రాయిలా నిల్చుండిపోయాను. కానీ, అది దెయ్యం కాదని తేలిపోయింది” అంటూ పద్మ కొనసాగించింది. అరుణ్‌కి కోపం వచ్చింది. ‘దెయ్యం కాకపోతే, ఈ కథలతో ఈవిడ నన్నెందుకు విసిగిస్తోంది?’ అనుకున్నాడు. “దెయ్యం కాదా? అలాంటప్పుడు అది ఎలా అంత భయంకరంగా ఉంది?” అని అడిగాడు.

‘ఆ జీవి మగది. నిశితంగా పరిశీలిస్తే, దానిలో మీ పోలికలు చాలా ఉన్నాయి. మీరే అనుకుని నా భయమంతా పోగొట్టుకున్నాను. నిజానికి, మీ పేరును రెండుసార్లు.. కాదు కాదు – మూడుసార్లు పిలిచాను. మీరు నా నుండి పారిపోతున్నారని గమనించాను. మర్యాదస్థులు కాబట్టి, మీరు నన్ను పలకరిస్తారని అనుకున్నా, కానీ మీరు వెళ్లిపోయారు. పైగా ఆ రాత్రివేళ మీరు ధరించిన తెల్ల దుస్తులను బట్టి, నేను ఓ దేవతని చూసి ఉండవచ్చని భావించకుండా, అనవసరంగా భయపడ్డాను!” అంది.

అరుణ్ ముఖంలో రంగులు మారాయి. తన అల్లరి బయటపడిపోయినట్టు గ్రహించాడు. అక్కడ్నించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడూ ఇతరులపై ఇలాంటి చిలిపి చేష్టలని ప్రయత్నించలేదు.

***

భారతదేశంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక ట్రైనింగ్ అకాడమీలో మకర సంక్రాంతి రోజున ఈ ఘటన జరిగింది. చాలా మంది ట్రైనీలు ఇళ్ళు చాలా దూరంలో ఉన్నాయి, కాబట్టి వాళ్ళంతా సెలవులకి ఊర్లు వెళ్లారు; కొద్దిమంది మాత్రమే మిగిలారు. తెలుగు మాట్లాడే ముగ్గురు ట్రైనీలు హాస్టల్‌లో అందుబాటులో ఉన్న కేబుల్ కనెక్షన్‌లో చూడగలిగే ఏకైక తెలుగు ఛానెల్‌లో వచ్చే ప్రోగ్రామ్‍లు చూడాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 9.30 గంటలకు సినిమా మొదలైననప్పుడు, వాళ్ళు నిరాశ చెందారు. అదో దెయ్యం సినిమా! ‘దీన్ని చూడడానికి ఇంతసేపు ఎదురుచూశామా?’ అనుకుంటూ ఇద్దరు ఆడవాళ్ళు బయలుదేరడానికి లేచారు. తోటి మగ ట్రైనీ, “పద్మా, మీరు మీ గదికి తిరిగి వెళ్లడం మంచిది. లేకపోతే, మీరు మామిడి చెట్టును దాటుతున్నప్పుడు, ఏదైనా దెయ్యం మిమ్మల్ని ఆవహించవచ్చు!” అంటూ, తనని తాను అభినందించుకుంటున్నట్లుగా నవ్వాడు. దెయ్యాల పేరుతో మహిళలను భయపెట్టాలనే మగవాళ్ళ ఈ మనస్థితి గురించి పద్మకి ఇప్పటికే బాగా తెలుసు. “రేపు ఉదయం క్యాంపస్‌లో వచ్చే వార్త – మీరు మూర్ఛపోవడం గురించి” అంటూ తిప్పికొట్టింది పద్మ. అతను అవాక్కయ్యాడు. ఎలాగో తెలుసుకోవాలనుకున్నాడు. “నేను నా గదికి తిరిగి వెళుతున్నాను, నన్ను భయపెట్టడానికి మామిడి చెట్టు కొమ్మపై ‘దెయ్యం’ వేషంలో కూర్చున్నది మీరే అని నాకు తెలిసిపోయింది. నేను దానిని ఊహించి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను. నా ప్రతిస్పందనని మీరు ఊహించలేదు కాబట్టి మీరు బ్యాలెన్స్ కోల్పోయి, చెట్టు మీద నుంచి కిందపడి స్పృహ కోల్పోయారు” అంది పద్మ. “అమ్మ తల్లోయ్! నా చేష్టలు మీపై ప్రయోగించకపోవడమే మంచిది” అతను అనడంతో, ముగ్గురూ హాయిగా నవ్వుకున్నారు.

***

ఓ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ఫీల్డ్ యూనిట్‌కి రిపోర్ట్ చేసింది పద్మ. తన గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమెకు ఒక వింత అనుభూతి కలిగింది. కలోనియల్ స్టైల్ ఫర్నీచర్, మంగుళూరు టైల్ పైకప్పు ఉన్న పెద్ద గది అది. ఆకాశం మేఘావృతమై ఉంది, గాలికి ముదురు రంగు తెరలు మెల్లగా కదులుతున్నాయి. ఒక్కసారిగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లోని దెయ్యం పాటలన్నీ వరుసగా గుర్తుచేసుకుంది పద్మ. తనలో తానే నవ్వుకుంది – ‘ఉనికి లేనిది’ విషయంలో తనకెంతో ‘అనుభవం’ ఉన్నందున, చింతించాల్సిన అవసరం లేదామెకు.

నిజంగా దెయ్యం ఉంటే, అది పద్మ రూపంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవలసి ఉంటుంది!

(సమాప్తం)

మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

Exit mobile version