ధడక్: వో ప్రేమ గీతిక

0
2

[box type=’note’ fontsize=’16’] “వొక అందమైన ప్రేమ చిత్రంగా ఇది బాగున్నట్టే. కాని దీని మూలమైన “సైరాట్” సాధించినదానితో పోలిస్తే మాత్రం చాలా నిరాశగా వుంటుంది” అంటూ “ధడక్” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]హం[/dropcap]ప్టీ శర్మా కీ దుల్‌హనియా, బద్రీనాథ్ కీ దుల్‌హనియా లాంటి చిత్రాలు తీసిన శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఇప్పుడు వచ్చిన చిత్రం “ధడక్” అంటే హృదయస్పందన లేదా గుండెచప్పుడు. వ్యాపార మూసలో తీసిన చిత్రాలైనా కాస్త ఆకర్షణీయంగా వుండి, ఆలోచించేలా చేస్తాయి ఇతని చిత్రాలు. అదనంగా ఈ చిత్రం దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి ని తొలిసారిగా పరిచయం చేస్తుంది. హీరో ఇషాన్ ఖట్టర్ కు ఇది తొలి బాలివుడ్ చిత్రం, మొత్తం మీద రెండవ చిత్రం. ఇరాన్ దర్శకుడు మజిది మజిది తీసిన “బియాండ్ ద క్లౌడ్స్” అన్నచిత్రంతోనే తన సత్తా చాటుకున్న ఇతను రాజేష్ ఖట్టర్-నీలిమా అజీం ల కొడుకు, షాహిద్ కపూర్ కి వరసకు తమ్ముడు. ఇద్దరూ రాజస్థానీ పోలిన హిందీలో బాగా మాట్లాడారు. ఇక పోతే రెండేళ్ళక్రితం మరాఠీ లో వచ్చిన “సైరాట్” చిత్రానికి రీమేక్ ఇది. సైరాట్ యెన్నడూ లేనంతగా హిట్ అయ్యి దేశం మొత్తం దాని పేరు మారు మ్రోగి పోయింది.
కథ అందమైన ప్రేమ కథ. కొత్తగానైతే యేమీ లేదు, కాని చూస్తున్నంత సేపూ బాగుంటుంది. మధుకర్ భాగ్లా (ఇషాన్ ఖట్టర్) క్లుప్తంగా మధు, పార్థవి (జాహ్నవి కపూర్) కలిసి చదువుకుంటున్న విద్యార్థులు. ఇద్దరి మధ్యా కులపు, ఆర్థిక అంతరాలున్నా కూడా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. పార్థవి తండ్రి రాచరికపు వంశానికి చెందినవాడు, ఐదు నక్షత్రాల హోటెల్ అధినేత, ప్రస్తుతం రాజకీయ నాయకుడు కూడా. మధు తండ్రి వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి, వొక ధాబా నడుపుతుంటాడు. వీళ్ళ ప్రేమ గురించి తెలిసిన మరుక్షణమే కొడుక్కి నచ్చచెబుతాడు వాళ్ళు పై కులం వాళ్ళు, మీ ప్రేమ వల్ల అనార్థాలు ముంచుకొస్తాయి, నువ్వు ఆమెకు దూరంగా వుంటానని నా మీద వొట్టేసి చెప్పాలని బలవంత పెట్టి మరీ మాట తీసుకుంటాడు. కానీ దాస్తే దాగేదీ, ఆపితే ఆగేది కాదు కదా ప్రేమ. అది వికసిస్తూనే వుంటుంది. పార్థవి తండ్రికి ఈ విషయం తెలిసినపుడు అబ్బాయి మీద తన కూతురుని లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టించి, పోలీసులు మధుని, అతని స్నేహితులనీ కుళ్ళ బొడిచి, లాకప్పులో వేసేలా చేస్తాడు. ఇది తెలిసిన పార్థవి పోలీసుల ముందు వచ్చి అదంతా అబధ్ధమని చెప్పి వాళ్ళను విడిపించి, నాటకీయంగా అతనితో లేచిపోతుంది. ఆ తర్వాత ఆ జంట సమాజానికి యెదురొడ్డి, అవాంతరాలన్ని చేదించి తమ ప్రేమను యెలా కాపాడుకుంటారూ అన్నది మిగతా కథ.
జాహ్నవి నటన బాగుంది. ఆమె మంచి నటిగా యెదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇషాన్ ఖట్టర్ ముందే తన అభినయ కౌశలాన్ని నిరూపించుకున్నవాడు. ఆశుతోష్ రాణా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా, కళ్ళు, వాచికం ద్వారా క్రూరత్వమంతా ప్రదర్శించాడు. గుర్తుందిపోయేలా. ముఖ్యంగా చెప్పుకోతగ్గది అజయ్ అతుల్ ల సంగీతం. సైరాట్ లో కూడా సంగీతమిచ్చింది వీళ్ళే. అందులోవే రెండు బాణీలను యథాతథంగా వాడి, మిగతావి కొత్తగా కట్టారు. జాన్ స్టీవర్ట్ కూడా మూడ్ కు తగ్గట్టుగా నేపథ్య సంగీతం అందించాడు. అమితాభ్ భట్టాచార్య కూడా పాటలు బాగా వ్రాశాడు. విష్ణు రావు చాయాగ్రహణం ఉదైపుర్ అందాలను బాగా పట్టుకుంది.
వొక అందమైన ప్రేమ చిత్రంగా ఇది బాగున్నట్టే. కాని దీని మూలమైన “సైరాట్” సాధించినదానితో పోలిస్తే మాత్రం చాలా నిరాశగా వుంటుంది. అదేమో వో పల్లె లో, యెలాంటి దృశ్యపరమైన డైవర్షన్లు లేకుండా కేవలం ఆ పాత్రల చిత్రీకరణ, నటన, కథ మీదే ఫోకసుంటుంది. ఇదేమో దాన్నే చాలా అందంగా జలతారు మేలి ముసుగు కప్పి మన ముందు వుంచారు. కులాల కారణంగా ఆ ప్రేమకు వొప్పుదల వుండదు, కాని కుల ప్రసక్తి వొకటో రెండో సార్లు వస్తుంది, అంతే. ఆర్థికంగా కూడా మధు కుటుంబం బాగానే వుంటుంది. హీరో మిత్రులిద్దరు కేవలం సపోర్ట్‌గా పెట్టారే కాని ఆ కులాల అంతరాలకు అద్దం పట్టేలా లేవు పాత్రలు. వొకడు స్టీరియోటైప్ పొట్టివాని పాత్ర, మరొకడు అంతే స్టీరియోటైపు పాత్ర. అదే సైరాట్ లో హీరో స్నేహితుడు వొకడు టైర్లకు పంక్చర్లు వేసే ముస్లిం యువకుడు అయితే, మరొకడు వెనుకబడ్డ కులానికి చెందిన వో వికలాంగుడు. మొత్తం ఆ milieu అంతా వాళ్ళేంటి, సమాజం లో వాళ్ళ స్థానం యేమిటి అన్నీ స్పష్టంగా చూపిస్తుంది. అడుగడుగునా వివక్ష కనబడుతుంది. నాయికా నాయకులు లేచిపోయాక నాయకుని కుటుంబం వూరొదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇతరులకు కూడా ప్రోత్సాహం ఇచ్చినందుకు కష్టాలు యెదుర్కోవాల్సివస్తుంది. వాళ్ళు లేచి పోయి హైదరాబాదుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మురికి వాడలలో వుండడం అవన్నీ చాలా సహజంగా చూపాడు నాగరాజ్ మంజులె. ఇక్కడ అదంతా దాచేసి, లేదా చెరిపేసి ఉదైపుర్ అందమైన ప్రదేశాల్లో అందమైన పాటగా సాగినట్టు చూపించాడు. మనం ఈ రోజుల్లో కూడా కుల వివక్షలు, దాని కారణంగా పీడిత కులాల వారిని “అగ్ర” కులాలవారు రకరకాలుగా అత్యాచారాలు చేయడం, చంపించి వేయడం లాంటి వార్తలు చూస్తూనే వున్నాము. సైరాట్ లో చూపించినంత నగ్నంగా, పదునుగా ఇందులో లేనే లేదు. అసలు ఆ సినెమా కు ప్రాణమైన విషయాన్నే ఇందులో glossy గా చూపించి నిరాశపరిచారు.
ఇది చూశాక సైరాట్ ఇంతకుమునుపు కంటే యెక్కువ నచ్చుతుంది. పల్లె వాతావరణంలో కొత్త నటీనటులతో వొక అమాయకమైన ప్రేమ ను, కులాల వైషమ్యాల నేపథ్యంలో తీయడం యెలాంటి సవాలో మరింతగా అర్థమవుతుంది. మీలో యెవరన్నా సైరాట్ చూసి వుండకపోతే అది తప్పకుండా చూడండి, దీనితో పాటే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here