[dropcap]ఏ[/dropcap] అదృశ్య మునీశ్వరుడు పెట్టిన శాపమో!
మృత్యుభయంతో ముక్కూ , నోరూ మూసుకుని
ఏకాంత కారాగార వాసుడై దీన ముద్ర దాల్చి
భూమిపై ఎగరలేని దిగులు పిట్టలా మనిషి
కాలుష్యకొక్కెంతో ఓజోన్ పొరను తెంపిన వీరంగం
పచ్చని ప్రకృతిని ధ్వంసం చేస్తూ చేసిన విహారం
దండనగా ఏ న్యాయ స్థానం రాసిందో ఈ శిక్షా స్మృతి
జీవన భృతి కోల్పోయి గృహ ఖైదీలైన దుస్థితి
నేల తల్లికి ప్రణమిల్లి భూనాశనానికి చెప్పిస్వస్తి
ప్రకృతిని ప్రతిశాపమిమ్మని చెయ్యాలి విజ్ఞప్తి
అప్పటి వరకూ రాదేమో శాప విమోచన క్షణం
అందాకా ఎల్లరికీ తప్పదిక స్వీయ రక్షణ కవచం
రూపం లేని కరోనా మానవకోటి నొక్కటిగా కలిపింది
ప్రజనందరినీ సమర్ధ సైన్యం చేసి యుద్ధంలో నిలిపింది
బేలతనపు జాతి గుండె గుహలో వెలగాలొక ధైర్య దీపం
అదే నేడు మనందరి ఆత్మనిర్భర ఐక్యతా సంకేతం