[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘ధైర్యమే సంపద!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఏ[/dropcap] సంపదలున్నవని సీతాకోక చిలుక..
రంగు, హంగు రెక్కలతో ఎగురుతోంది?..
పూవున గ్రోలిన చిరు మకరందం తప్ప!
ఏమున్నదని నెమలి మెరుపులీను
పింఛాలతో పురి విప్పి నాట్యమాడుతుంది?
వాన మబ్బులు ఇచ్చే ప్రేరణ తప్ప!
ఏ గనులున్నాయని రాయంచ
తేట తెల్లని వర్ణ నిధియై నీట కులుకుతోంది?
నీల్లనీ, పాలని వేరు చేయగలిగే విచక్షణా జ్ఞానం తప్ప!
ఏ మరకత నిధులున్నాయని రాచిలుక
హరిత వర్ణ రంజితమై అలరారుతోంది?
తను ముక్కున కరచిన పచ్చని ఫలము తప్ప!
ఏం సాధన చేసిందని కోయిల
అంత మధురంగా పాడగలుగుతోంది?
కాకి గూటిలో పొదగబడ్డప్పటి సంఘర్షణ తప్ప!
ఏది తనకు సాధ్యం కాదని మనిషి
నిరంతరం నిరాశా, నిస్పృహలతో,
ఎన్నో ఉన్నా, ఏదో లేదన్న భావనతో సతమతమవుతున్నాడు?