ధనాభిరామం – పుస్తక పరిచయం

0
42

తెలంగాణ ప్రాచీన కల్పిత కావ్యం ‘ధనాభిరామం’ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాము.

***

“తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యం ఎంతో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయిందని పదే పదే చెప్పాల్సి వస్తున్నది. అట్లాంటి మరొక సందర్భం ‘ధనాభిరామం’. నూతనకవి సూరన దీని కర్త. ఇది తొలి కల్పిత ప్రబంధమని ఆలేటి మోహనరెడ్డి చాల ఏండ్ల కిందట నిరూపించినాడు. తొలి కల్పిత ప్రబంధంగా ప్రసిద్ధికెక్కిన ‘కళాపూర్ణోదయం’ కంటే ఇది చాలా ముందుదని అది 16వ శతాబ్దిది కాగా ఇది 15వ శతాబ్దిదని ఆయన నిరూపించినాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. 2009లో “ముంగిలి” (తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర) లో ఈ కవి పద్యాలను వేసి మోహనరెడ్డిగారి నిరూపణను తిరిగి గుర్తు చేయడమైంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు.

1950లో ముద్రితమైన ఈ కావ్యాన్ని తిరిగి ముద్రించి ప్రచారంలో పెడ్తేనన్న పట్టించుకుంటారన్న ఆశతో ఇప్పుడు ప్రచురిస్తున్నం” అని ‘విస్మరణకు గురైన తొలి కల్పిత ప్రబంధం’లో డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

***

“పురాణ ఇతిహాసాదులల్లో గానీ, చరిత్రలోగానీ, లోకంలో పరంపరగా చెప్పుకొనే కథలుగా గానీ, లేనట్టి ఇతివృత్తం కలవై, ప్రసిద్ధమైన లేదా కల్పితమైన పాత్రలు కల్గి, తాను దర్శించిన ఒకానొక ధర్మాన్ని లేక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికై రాసినట్టి కల్పిత కథగల్గిన కావ్యాలను కల్పిత కావ్యాలంటరని నిర్వచించుకోవచ్చు. కాబట్టి ధనాభిరామ కావ్యం కల్పిత కావ్యమే. తెలుగులో దీనికంటే ముందుగా కల్పిత కావ్యం ఉన్నట్లు ఆధారాలు లభించలేదు కాబట్టి, దీన్నే తెలుగు సాహిత్యంలో మొదటి కల్పిత కావ్యంగా గుర్తించినం, ఇలాంటి నూతన ప్రక్రియకు ఆరంభకుడు కావటంవల్లనూ, కొత్త కొత్త విషయాలపై ఆశుకవితలవంటివి చెప్పటంవల్లనూ ఈతనికి నూతనకవి- అనే బిరుదం వచ్చి ఉంటుంది. ధనాన్ని ఆర్జించటానికి మిత్రులు, బంధువులు, దయాదాక్షిణ్యాలు వీటన్నింటికీ దూరమయితమనీ, లోకంలోని సమస్తదుర్గుణాలు ధనార్జనాపరునిలో ఉంటయనీ, ధనం పాపస్వరూపమనీ మన్మథపాత్రచే పలికించిండు” అని డా. ఆలేటి మోహన్ రెడ్డి ‘నా మాట’లో వ్యాఖ్యానించారు.

***

“ఈ గ్రంథము దాక్షారామభీమేశ్వరునికి గృతి. ఇందలికథ గతానుగతికమగు ప్రబంధకథగాక, మానవజీవితముతో సంబంధించినది. మనుష్యునకు రూపము ధనము రెండును నావశ్యకములే యని యిది నిరూపించు.. కథ సారాంశమిది “రూపము హెచ్చని మన్మథుడును, ధనము హెచ్చని కుబేరుడును వాదించి, దాక్షారామక్షేత్రమున దమ వాదన నెగ్గించుకొనుటకు వచ్చిరి. అచట రూపము వల్ల మన్మథుడు స్వాధీనపఱచుకొన్న స్త్రీని ధనము వల్ల కుబేరుడు స్వాధీనపఱచుకొనెను. అంత మన్మథుడు భీమేశ్వరుని బ్రార్థింపగా నాతడు ప్రత్యక్షమై మానవులకు ధనము, రూపము రెండునూ నావశ్యకములే అని సమాధానపఱచి, వారి వాదమును మాన్పెను. “కావున నీ కృతి కేవలసాంఘిక వృత్తమునకు సంబంధించిన ప్రబంధమనియు నిట్టి గ్రంథములు మన భాషావాఙ్మయములో కొలదిగా మాత్రమే యున్నవనియు, నిదియే యీ ప్రబంధప్రాశస్త్యమనియు నెఱుగ దగియున్నది” అని పీఠికలో వావిళ్ళ వేంకటేశ్వరులు వ్యాఖ్యానించారు.

***

ధనాభిరామం
(తొలి కల్పిత కావ్యం)
రచన: నూతనకవి సూరన
ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు
పుటలు: 95, వెల: ₹ 60/-
ప్రతులకు:
1. తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 500010. ఫోన్: 9849220321
2. అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here