Site icon Sanchika

ధరిత్రి

[జి.ఎస్.ఎస్. కళ్యాణి గారు రచించిన ‘ధరిత్రి’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]తె[/dropcap]ల్లవారుతూ ఉండగా, తమ ఊరి పొలిమేరలవైపుకి బైకు మీద బయలుదేరాడు మహీధర. లేలేత సూర్యకిరణాలు ప్రకృతిని పలకరిస్తున్న వేళ, చల్లని గాలి మేనికి హాయిగా తాకుతోంది. ఎవరి మనసైనా ఆనందంతో నిండే ప్రశాంతమైన ఆ సమయంలో మహీధర మనసు రెట్టింపు ఆనందంతో ఉరకలు వేస్తోంది. అందుకు కారణం ఆ ముందు రోజు మహీధర నిర్మించబోయే ఏడంతస్తుల భవన నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగి, ఉన్నతాధికారులనుండీ ఆమోదముద్ర లభించింది. ఆ భవనంవల్ల తాను సంపాదించబోయే డబ్బును తలుచుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగాడు మహీధర. అలా కొద్దిదూరం ప్రయాణించిన మహీధర, నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడినుండి మరి కొంచెం దూరం వెడితే కానీ మహీధర అనుకుంటున్న ప్రదేశం రాదు. వేసవికాలం కావడంతో ఎండ వేడిమి మెల్లిగా పెరుగుతోంది.

మహీధరకు దాహం వేస్తూ ఉండటంతో బైకును ఆపి చుట్టూ కలియ చూశాడు. దూరంగా ఒక చిన్న టీ కొట్టు కనపడింది. ఆ టీకొట్టు వైపుకి తన బండిని పోనిచ్చాడు మహీధర. టీకొట్టు వ్యాపారి కుర్చీలో కూర్చుని రేడియో వింటున్నాడు. అతడిని దగ్గర ఒక బాటిల్ నీళ్ళనూ, ఒక రొట్టెనూ కొన్నాడు మహీధర. రొట్టె తిని తన ప్రయాణం కొనసాగిస్తే మధ్యాహ్నం వరకూ ఆకలి వెయ్యదని అనుకుంటూ, ఆ కొట్టు పక్కనే ఉన్న బల్ల దగ్గర కూర్చుని మహీధర రొట్టెను తినడం ప్రారంభించాడు. అంతలో మహీధరకు బిగ్గరగా ఒక మహిళ ఏడుపు వినపడటంతో ఉలిక్కిపడి ఆ ఏడుపు వినపడిన వైపుకి తల తిప్పి చూశాడు మహీధర. అక్కడ నిరుపేదలా కనపడుతున్న ఒక మహిళ, నేలపై పడి ఉన్న ఎండుటాకులను ఏరి, వాటితో తన కడుపును కప్పే ప్రయత్నం చేస్తూ ఏడుస్తోంది. నిమిషాలు గడుస్తున్నా ఆ మహిళ ఏడుపు ఆపలేదు.

హృదయవిదారకంగా వినపడుతున్న ఆ ఏడుపును భరించలేకపోయిన మహీధర, రొట్టెను పక్కన పెట్టి, ఆ మహిళను దగ్గరకు వెళ్లి, “ఎవరమ్మా నువ్వూ? ఏమైందీ? ఎందుకేడుస్తున్నావూ?”, అని అడిగాడు.

“దాహం! దాహం!”, అంది ఆ మహిళ.

“ఇదిగో! ఈ నీళ్లు తాగు!”, అంటూ తన చేతిలోని నీళ్ల బాటిల్‌ను మహిళకు అందించాడు మహీధర. ఆమె ఆ నీళ్లను గటగటా తాగేసింది.

ఆ మహిళ గర్భవతి అని గ్రహించిన మహీధర, “అమ్మా! ఆ నీడలో నాతో కూర్చుందువుగాని రా!”, అంటూ ఆ మహిళని అక్కడున్న రేకుల షెడ్డు కిందికి తీసుకొచ్చి, “ఇప్పుడు చెప్పమ్మా! ఎవరు నువ్వూ? నీకొచ్చిన కష్టమేమిటీ?”, అని అడిగాడు మహీధర.

“నా పేరు ధరిత్రి. నా కష్టాల గురించి ఏం చెప్పమంటావు నాయనా! చూశావుగా! నేను గర్భిణిని. ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను. అందరి తల్లులలాగే నేను కూడా నా కడుపులోని బిడ్డలకు ఆహారాన్ని అందించి వారికి ఏ కష్టం రాకుండా చూస్తున్నాను. కానీ వాళ్ళు బాగా అల్లరి నేర్చారు. వాళ్ళు నా కడుపులో చేస్తున్న పనులవల్ల నాకు తాపం విపరీతంగా పెరిగిపోతోంది! నా నరాలలో రక్తప్రసరణను భంగం వాటిల్లుతోంది! నా దేహాన్ని ఆశ్రయించి ఉన్న ఇతర జీవులకు ఊపిరాడక అవి ఉక్కిరిబిక్కిరైపోతుంటే ఆ బాధ నన్ను నిలువునా దహించివేస్తోంది. పచ్చటి ఆకులు మాత్రమే నాకు చల్లదనాన్ని ఇవ్వగలవు. చెట్లు లేనిచోట ఆకులెక్కడివీ?! భూమి మీద చెట్లు కనుమరుగైపోతుంటే నాకు దిక్కుతోచట్లేదు! నాకేదన్నా జరిగితే మహాప్రళయమే!”, అంటూ తన ఆవేదనను వెళ్లగక్కింది ధరిత్రి.

ఆ మాటలు విన్న మహీధర, ధరిత్రికి మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకుంటూ, “అమ్మా! నువ్వు భలే చిత్రంగా మాట్లాడుతున్నావే! ఇంతకీ నీ కడుపులో ఒకరికంటే ఎక్కువమంది పిల్లలున్నారా?”, అని అడిగాడు ఆశ్చర్యంగా.

“అవును నాయనా! నా గర్భంలో బోలెడుమంది ఉన్నారు! వారి గురించే నా దిగులంతా!”, అంది ధరిత్రి.

గర్భంలో అంతమంది పిల్లలుండటం అసాధ్యమని తెలిసిన మహీధర చిరునవ్వు నవ్వి, “సరేలే అమ్మా! కంగారు పడకు! నీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందిలే! ఇంతకీ నీవాళ్ళెక్కడుంటారూ?”, అని అడిగాడు.

“ఈ ఊరంతా నావాళ్ళే నాయనా! కానీ నేను వాళ్లకి పరాయిదాన్ని! నా గురించి వాళ్ళు ఏమాత్రం ఆలోచించినా, ఇవాళ నాకీ పరిస్థితి వచ్చేది కాదు!”, అంది ధరిత్రి కన్నీరు కారుస్తూ.

మహీధరకు ధరిత్రిని చూస్తూ ఉంటే ఎందుకో ఆమెపై విపరీతమైన జాలి కలుగుతోంది. తన పిల్లలపై ధరిత్రి చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు, మహీధర మనసును కదిలిస్తున్నాయి. ధరిత్రి రూపం ఎలా ఉన్నా ఆమె చూపులు మాత్రం కరుణతో నిండి ఉన్నాయి.

ధరిత్రికి తనకు తోచిన సహాయం చెయ్యాలని అనుకున్న మహీధర, “అమ్మా! బాధ పడకు! నీవాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. నేను వెళ్లి వాళ్ళను కలుస్తాను. వాళ్ళ బాధ్యతను వాళ్లకు గుర్తు చేస్తాను. నీ కష్టం తీర్చేందుకు ప్రయత్నిస్తాను”, అన్నాడు.

“ఊళ్ళో ఎవరి ఇల్లయితే పచ్చటి మొక్కలతో కళకళలాడుతోందో ఆ ఇల్లే నా ఇల్లు!”, ఆయాసపడుతూ చెప్పింది ధరిత్రి.

మహీధర ఒక్క క్షణం ఆలోచించి, టీ కొట్టుకు వెళ్లి మరొక రొట్టెను కొని, అది ధరిత్రికి ఇస్తూ, “ఇంద! ఈ రొట్టెను తింటూ ఇక్కడే ఉండమ్మా! నేను ఇప్పుడే మన ఊళ్లోకి వెళ్లి, మీవాళ్ళను ఎలాగైనా వెతికి పట్టుకుని, వాళ్ళను ఇక్కడికి తీసుకొస్తాను. అంతవరకూ నువ్వు ఏమాత్రం కంగారుపడకుండా కాస్త విశ్రాంతి తీసుకో!”, అని చెప్పి తన బైకు మీద ఊరికి బయలుదేరాడు.

అలా బయలుదేరిన మహీధర తమ ఊరికి చేరుకుని, అక్కడ ఒక్కొక్క ఇంటినీ పరిశీలనగా చూస్తూ ముందుకు సాగాడు. ఆశ్చర్యం! ఆ ఊళ్లో తను నివాసం ఉంటున్న ఇంటితో సహా అన్ని ఇళ్ళూ రాజభవనాలను తలపిస్తున్నప్పటికీ, వాటి ఆవరణలో ఒక్క చెట్టు కూడా లేదు. సరికదా ఆ ఇళ్ల పరిసరప్రాంతాల్లో కనీసం గడ్డిపోచయినా కనపడలేదు మహీధరకు! అంతవరకూ తాను ఎన్నడూ గమనించని ఆ విషయం మహీధరకు ఆశ్చర్యాన్నీ, ఆందోళననూ కలిగించింది. రోజురోజుకూ మితిమీరిపోతున్న తాపానికి అసలు కారణం పచ్చని మొక్కలు లేకపోవడమే అని అనుకుంటూ తమ ఊరిపొలిమేరకు చేరుకున్నాడు మహీధర. అప్పటికి సమయం మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. పొద్దుటినుండీ ఎండలో తిరగటంవల్ల మహీధర బాగా అలిసిపోయాడు.

‘ఇక ధరిత్రి వాళ్ళ ఇల్లు వెతకడం నావల్ల కాదు! కానీ ఆమెకు ఏదో ఒక సమాధానం చెప్పకపోతే దుఃఖంతో ఆమె ప్రాణానికి ముప్పువాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి నేను ఏదో ఒక ఉపాయంతో ధరిత్రిని కాపాడాలి. ఓ భగవంతుడా! నువ్వే నాకు మార్గం చూపించు!’, అని అనుకుంటూ మహీధర ధరిత్రి వద్దకు బయలుదేరాడు. కాస్త దూరం వెళ్ళగానే మహీధరకు ఒక పూరి గుడిసె కనపడింది. ఆ గుడిసెకు చుట్టూ పచ్చటి మొక్కలు ఉన్నాయి! వాటిలో కొన్ని పూల మొక్కలూ, కొన్ని పళ్ళ మొక్కలూనూ. గుడిసెకు ఇరు వైపులా రెండు పచ్చటి చెట్లు కూడా ఉన్నాయి. ఆ మొక్కలకు పాదులు చేస్తూ, నీళ్లు పోస్తూ ఒక వ్యక్తి కనపడ్డాడు మహీధరకు. మహీధర గబగబా ఆ గుడిసెవైపుకు తన బైకును పోనిచ్చాడు. బైకు చప్పుడు విని తలెత్తి మహీధరవంక చూశాడు ఆ వ్యక్తి.

మహీధర ఆ వ్యక్తిని చూస్తూ, “అరె! శివయ్య తాతా! నువ్వా?! ఈ గుడిసె నీదా?”, అంటూ ఆశ్చర్యంగా అడిగాడు.

“అవును బాబూ నేనే! ఈ గుడిసె నాదే!”, చెప్పాడు శివయ్య.

“అదేమిటి తాతా? ఊళ్ళో నీకొక భవనం ఉండేది కదా? అది వదిలేసి ఇక్కడికెప్పుడొచ్చావ్?”, అడిగాడు మహీధర.

“నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలవుతోంది. నీళ్లు లేక గత రెండేళ్లగా నా వ్యవసాయం బాగా సాగట్లేదు. నీకావిషయం తెలుసే ఉంటుంది. దాంతో నేను చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితికి చేరుకున్నా! నాకెందుకిలా జరిగిందీ అని ఆలోచనలో పడ్డా. అప్పుడు అర్ధమయ్యింది నేను చేస్తున్న తప్పేంటో! మనకు ఈ భూమాత తల్లి. ఆ పుడమితల్లి మనం హాయిగా బతకడానికి కావలసినవన్నీ ఇస్తుంది. కానీ మనం ఆవిడను అస్సలు పట్టించుకోకుండా, చెట్లన్నీ కొట్టిపడేసి, అద్దాల భవనాలు నిర్మించి మన ఊరిని స్వర్గం చేస్తున్నామని అనుకుంటూ ఎడారిని చేసేసుకున్నాం! మనం చేసిన పని వల్ల పక్షులలాంటి ఎన్నో జీవాలు అంతరించిపోతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. చెరువులూ, నదులూ ఎండిపోతున్నాయి. నీళ్లు లేక పంటలు సరిగ్గా పండట్లేదు. ఇక తరువాత వచ్చేది కరువుకాటకాలేగా! ఇంత జరుగుతున్నా మనం కళ్ళు తెరవట్లేదు. అభివృద్ధి పేరుతో సహజ వనరులను సైతం పాడుచేసుకుంటున్న గొప్పవాళ్ళం మరి! ఈ పరిస్థితులు మారాలంటే మనుషుల్లో మంచి మార్పు రావాలి. అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి. నేనా ముసలివాడిని! పైగా ఇప్పుడొక పేద రైతుని! నేను చెప్తే నా మాట ఎవరైనా వింటారా బాబూ? వినరు కదా?! అందుకే భూమాతను రక్షించుకోవటానికి నా చేతిలో ఉన్న పని నేను చెయ్యడం మొదలుపెట్టాను. ఈ స్థలం నాదే. ఇక్కడ కొన్ని మొక్కలు పెంచుతున్నాను. అవి నాకు చల్లదనాన్నీ, స్వచ్ఛమైన గాలినీ ఇస్తున్నాయి. తియ్యటి పళ్ళను ఇచ్చి నా ఆకలిని కూడా తీరుస్తున్నాయి! ఈ పచ్చటి మొక్కలను చూస్తే ఆ భూమి తల్లి చల్లగా నవ్వుతున్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది బాబూ. ప్రకృతి నన్ను ప్రేమించినంతగా మనుషులు ప్రేమించలేరేమో! అందుకే ఈ చెట్ల నీడలో, నేలతల్లి ఒడిలో ఇక్కడే నా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను”, అన్నాడు శివయ్య.

“నీ మాటల్లో నిజం ఉంది తాతా! ఇంతకీ నీకొక విషయం చెప్పాలి. నీకు ధరిత్రి తెలుసా?”, అడిగాడు మహీధర.

“తెలియదే!”, చెప్పాడు శివయ్య.

మహీధర ధరిత్రి గురించి శివయ్యకు చెప్పి, “మన ఊళ్ళో ధరిత్రి చెప్పినట్లుగా పచ్చటి చెట్లతో కళకళలాడుతున్న ఇల్లు నీదొక్కటే తాతా! ఒక పని చేద్దాం. నువ్వు నాతో వస్తే నీకు ధరిత్రిని చూపిస్తాను. అప్పుడు నువ్వు ఆమెను గుర్తుపట్టగలవేమో!”, అని శివయ్యను తన బైకు మీద ఎక్కించుకుని ధరిత్రి ఉన్న ప్రదేశానికి వచ్చాడు మహీధర. ఆశ్చర్యం! అక్కడ మునుపున్న టీకొట్టు కానీ, రేకుల షెడ్డు కానీ, ధరిత్రి కానీ కనిపించలేదు మహీధరకు.

“ఏమిటిదీ? అంతా అయోమయంగా ఉందే!! తాతా! కొద్దిసేపటి క్రితం నేను ఇక్కడి టీకొట్టులో రొట్టె కొన్నాను. ఇక్కడి రేకుల షెడ్డు కింద ధరిత్రిని కూర్చోబెట్టాను. ఆమె నిండు గర్భిణి. కదిలే స్థితిలో లేదు! అయినా, చల్లదనం కోసం ధరిత్రి ఎటైనా వెళ్లి ఉండచ్చు. కానీ టీకొట్టూ, రేకుల షెడ్డూ.. ఇప్పుడు ఇక్కడ అవేవీ లేవేంటీ? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను!”, అన్నాడు మహీధర తనకు పట్టిన చెమటలను తుడుచుకుంటూ.

శివయ్య కొద్దిగా ఆలోచించి, “బాబూ! నువ్వు చెప్పిన వివరాలనుబట్టి చూస్తే నీకు కనపడినది సాక్షాత్తూ ఆ భూమాతే అని నాకు అనిపిస్తోంది. ఆవిడ కడుపులో బోలెడు మంది ఉన్నారంటే ఆ ఉన్నది మనమే కావచ్చు! వాతావరణ కాలుష్యంవల్ల భూమి నానాటికీ వేడెక్కి పోతోంది. అది చల్లారాలంటే చెట్లూ, వాటికున్న ఆకులే కదా కావాలీ! అందుకే ఆమె ఆకులను తన కడుపు చుట్టూ పెట్టుకుంది. ఇక నరాల్లోని రక్తప్రసరణ అంటే నదులలోని నీటి ప్రవాహం కావచ్చు. నదులు సృష్టిలోని అన్ని ప్రాణులకూ జీవనాధారం. ఆ నదులు ఎండిపోతే ఏదో ఒకరకంగా వాటిని పునరుద్ధరించాలిగానీ ఆ స్థలాన్ని ఇతర అవసరాలకూ, భవన నిర్మాణాలకు వాడుకోవడం తప్పు. అలా చేయడంవల్ల నీరు ఆ స్థానంలో మళ్ళీ ప్రవహించేందుకు అడ్డంకి ఏర్పడుతుంది. అంటే ధరిత్రి చెప్పినట్లు ప్రసరణను భంగం ఏర్పడుతుంది!”, అని ఒక్క క్షణం ఆగాడు.

శివయ్య మాటలు విన్న మహీధర నిశ్చేష్టుడయ్యాడు.

“నిజమే తాతా! నేను ఏడంతస్తుల భవనం కట్టడానికని కొన్న స్థలంలో ఒకప్పుడు నది ఉండేదిట! కట్టబోయే భవనంవల్ల నేను సంపాదించే కోట్ల రూపాయల గురించి ఆలోచించానే తప్ప నా మనుగడకు ఆధారమైన నది గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు! ఛ! నేను ఎంత స్వార్థపరుడినీ?! ఇప్పుడు నాక్కుడా ధరిత్రి మాటలన్నీ ఎంతో అర్థవంతంగా అనిపిస్తున్నాయి. సందేహం లేదు తాతా! నాకు బుద్ధి చెప్పడానికి వచ్చింది నన్ను ఓర్పుతో భరిస్తున్న ఆ ధరణీమాతే!! ఆవిడ సహనం నశిస్తే వచ్చేది మహాప్రళయమే! ఇంత జరిగాక కూడా నాకు బుద్ధి రాకపోతే అసలు నేను మనిషినే కాను!”, అన్నాడు మహీధర పశ్చాత్తాపంతో చెమ్మగిల్లిన తన కళ్ళను తుడుచుకుంటూ.

అప్పుడు శివయ్య ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ, “చూశావా బాబూ! ఆ పుడమితల్లి ప్రేమ ఎంత గొప్పదో! నీ కళ్ళు తెరిపించేందుకు ఆవిడే వచ్చి ఈ లీలను చూపించి ఉంటుంది! ధన్యుడివయ్యావు!”, అంటూ మహీధరను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు.

 “తాతా! చూస్తూ ఉండు! ఎంత కష్టమైనా సరే! నా జీవితమంతా ధారపోసయినా సరే! నేను కొన్న స్థలంలో ఒకప్పుడు ప్రవహించిన ఆ నది తిరిగి ఆ స్థలంలో ప్రవహించేటట్టు చేస్తాను! మన ఊరు పచ్చని చెట్లతో కళకళలాడేందుకు నావంతు కృషిని నేను చేస్తాను. భూమాతకు నేను కష్టం కలిగించని బిడ్డనని నిరూపించుకుంటాను!” , అన్నాడు మహీధర.

మహీధర మాటల్లో ఆత్మవిశ్వాసాన్నీ, పట్టుదలనూ గమనించిన శివయ్య అతడి భుజం తడుతూ, “నీది లోకానికి మేలును చేసే సత్సంకల్పం బాబూ! నువ్వు తలపెడుతున్న ఈ మంచి పని దిగ్విజయంగా పూర్తి కావడానికి నాకు తోచిన సహాయం నేను కూడా చేస్తాను. నీకు కావలసిన మొక్కలను నేను సరఫరా చెయ్యగలను!”, అన్నాడు.

“అలాగే తాతా! నీ అనుభవం నాకు తప్పకుండా ఉపయోగపడుతుంది. పద! పని మొదలుపెడదాం!”, అంటూ మహీధర వంగి తన కుడి చేత్తో భూమిని తాకుతూ భూమాతకు నమస్కరించి, శివయ్యను తన బైకుపై ఎక్కించుకుని, కార్యోన్ముఖుడై తమ ఊరివైపుకి వేగంగా వెళ్ళిపోయాడు.

Exit mobile version