ధర్మపురి – కొండగట్టు – దర్శనం

0
2

[ఇటీవల ధర్మపురి నృసింహాలయం, కొండగట్టు అంజన్న గుడి దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

ధర్మపురి నృసింహస్వామి ఆలయ దర్శనం:

[dropcap]క[/dropcap]రీంనగర్, భవానీ సాహిత్యవేదిక అధ్వర్యంలో, డా. వైరాగ్యం ప్రభాకర్ గారు రచించిన ‘రామాయణంలో ధర్మవచనములు- సూక్తాలు’ అన్న గ్రంధావిష్కరణ సభలో ప్రధాన వక్తగా ప్రసంగించడం కోసం, నన్ను ఆహ్వానించారు వైరాగ్యంవారు. ఏ సభకు వెళ్లినా ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం నాకు అలవాటు. 13వ తేదీ కార్యక్రమం అయితే 12 ఉదయాన్నే బయలుదేరాను ఎం.జి.బి.ఎస్.లో ఉ 5.40 ని॥ జగిత్యాల ధర్మపురి సూపర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను.

మధ్యలో సిద్దిపేటకు ముందు, కొమరవెల్లి దాటిన తర్వాత టిఫిన్ కోసం ఒకచోట ఆపారు. వేడి వేడి పూరీలు వేస్తున్నారక్కడ. చిన్నచిన్నవి, 4 ఒక ప్లేట్. చాలా బాగున్నాయి. ఆ హోటలు పేరు ‘ఈట్ రైట్’ అట! సృజనాత్మకంగా లేదూ!

అది మామూలు ఎక్స్‌ప్రెస్. సిద్దిపేట ఊర్లోకి వెళ్లింది. జగిత్యాలకు 12 గంటలకు చేరాను. “ధర్మపురిలో లాడ్జిలు అంతగా ఉండకపోవచ్చు అన్నగారు, మీరు జగిత్యాల లోనే బసచేయండి. మీ కోసం ‘ఎల్.జి.రామ్ రెసిడెన్సీ’ లో రూమ్ చెప్పి ఉంచాను” అని నా తమ్ముడు వైరాగ్యం ప్రభాకర్ ఫోన్ చేసి ఉన్నాడు.

జగిత్యాల కొత్త బస్టాండుకి ‘కూతవేటు’ దూరంలోనే ఉందా లాడ్జ్. చిరుజల్లులు పడుతున్నాయి అక్కడ. వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదంగా ఉంది.

“ఎ.సి.యా, నాన్ ఎసియా సార్?” అనడిగాడు రిసెప్షన్ ఉన్న అబ్బాయి.

“చల్లగా ఉంది కదా, నాన్ ఎ.సి. సరిపోతుంది రా చిన్నా” అన్నా.

రెండే ఫ్లోర్స్. మొదటి ఫ్లోర్‌లో నా గది. బాగుంది. ఎనిమిది వందలు అద్దె. ఎ.సి. ఐతై 1600/- అట. అనవసరం కదా!

బాత్రూంలో వేడి వేడి నీరు వస్తూ ఉంది. చక్కగా స్నానం చేసి, పంచె, షర్టుతో క్రిందికి వెళ్లాను.

“దగ్గరలో మంచి భోజనం ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగితే, “వెజ్జా? నాన్ వెజ్జా సార్?” అన్నాడు.

“ప్యూర్ వెజ్” అన్నా.

తర్వాత నాకనిపించింది ‘ప్యూర్ కాని వెజ్ కూడా ఉంటుందా?’ అని. నవ్వుకున్నా.

“దగ్గరలో ‘హిమబిందు మెస్’ అని ఉందండి. అక్కడ బాగుంటుంది భోజనం” అని చెప్పారు. వెళ్ళాను.

భోజనం అంత బాగులేదు కాని నాట్ బ్యాడ్. రూమ్‌కి వచ్చి హాయిగా పడుకోని నిద్రపోయాను. సాయంత్రం 4 గంటలకు లేచి, బస్టాండుకు వెళ్ళాను. బస్టాండు ఎదురుగా ‘కరీమ్ టీ అంగడి’ కనబడింది. కరీమ్ భాయ్ దగ్గర శర్కర రహిత, గాఢ తేనీరు గ్రహించాను. అదేనండీ, షుగర్ లెస్, స్ట్రాంగ్, టీ! అందుకే గ్రాంథికం వద్దన్నారు గిడుగువారు.

మంచిర్యాల వెళ్ళే ఆర్డినరీ బస్ రెడీగా ఉంది. అది ధర్మపురి మీదుగా వెళుతుంది. ఎక్కి కూర్చున్నాను. నాకెందుకో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటేనే ఇష్టం, 33 కిలోమీటర్లకు ఛార్జ్ 30 రూపాయలు. 45 నిమిషాల్లో దింపాడు.

ఒక ఆటో మాట్లాడుకొని ముందు గోదావరి నది వద్దకు వెళ్ళాను. నదిలో నీళ్లే లేవు! మెట్లన్నీ దిగి వెళితే 300 మీటర్ల దూరంలో చిన్న పాయ పారుతూ ఉందంతే! దూరం నుంచే ఆ నదీమతల్లికి నమస్కరించాను. అక్కడ నుంచి, తెలుగు రాష్ట్రాలలోని అత్యంత ప్రసిద్ధమైన నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి నరసింహ దేవస్థానం చేరుకున్నాను.

అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. రెండు ముఖ ద్వారాలున్నాయి. ఒకటి వేంకటేశ్వరుని గుడికి, రెండవది నరసింహుని గుడికి. రెండు ద్వారాల మధ్యన కళాత్మకమైన ప్రాకారాన్ని ఆనుకుని, నల్ల రాతితో చేయబడిన ‘శేషప్పకవి’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

భూషణవికాస! శ్రీధర్మపురి నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అన్న మకుటంతో, మహానీయుడు శేషప్పకవి, స్వామివారి మీద శతకం వ్రాశారు. అన్ని సీసపద్యాలు! చాలా ప్రసిద్ధి చెందిన శతకం అది. ఆయన పాదాలకు ప్రణమిల్లి, లోపలికి ప్రవేశించాను.

ముఖమంటపం లోకి వెళ్ళే ముందు, ముఖద్వారం పక్కనే యమధర్మరాజు ఆలయం ఉంది. గదను ధరించి పెద్ద పెద్ద మీసాలతో, ఎర్రని కనులలో, సమవర్తి, పరేతరాట్, యమరాజు అక్కడ వెలసిఉన్నాడు. గది ముందు ‘గండా దీపం’ వెలుగుతూన్నది. 10 రూపాయలు ఇస్తే నూనె ఇస్తారు. ఆ కుందులో పోస్తే ‘యమగండం’ నుంచి తప్పించు కోవచ్చునని, అకాలమృత్యువు బారిన పడకుండా ఉండగలమని అక్కడి పూజారి గారు చెప్పారు.

‘నిత్యం సన్నిహితో మృత్యుః’, ‘జాతస్య హి ధృవో మృత్యుః’ – అన్న సూక్తులు గుర్తొచ్చాయి నాకు. యములవారికి నమస్కరించుకొన్నాను. అంతటి వాటిని కూడ మన సినిమాల వాళ్ళు చౌకబారు హాస్యానికి గురిచేశారు. ఐ పిటీ దెమ్!

ఐనా, ‘మృత్యుమృత్యుర్నమామ్యహం’ అని నా స్వామి మూల మంత్రం లోనే ఉంది. మృత్యువుకే మృత్యువు నా నరసింహ విభుడు. నాకెందుకు భయం? కుడి వైపు ఉపాలయంలో నిలువెత్తు, ఎనిమిది అడుగుల ఆంజనేయస్వామి వారు ముకుళితహస్తుడై కొలువు తీరారు.

‘మారుతిం నమత రాక్షసాంతకమ్’ అనుకొంటూ ఆయనకు నమస్కరించి లోనికి వెళ్ళాను. ప్రధాన దేవాలయం చుట్టూ పొడవైన మంటపాలున్నాయి. అక్కడక్కడ వేదపఠనం చేసే పీఠాలున్నాయి. ఆలయం లోపల అత్యంత పురాతనమైన స్తంభాలు! నల్లరాతివి. 50 రూపాయల టికెట్ కొన్నాను, అర్చన చేయిద్దామని. భక్తులు చాలా తక్కువగా ఉన్నారు.

సర్వాలంకార భూషితుడై, వెండికోరలు, ఎర్రని నాలుక ముందుకు చాచి, ఐనా శాంత గంభీరుడైన ధర్మపురి నరసింహ పరబ్రహ్మను దర్శించి, పులకాంకితుడనైనాను. పక్కనే అమ్మవారు. కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతుండగా స్వామిని ఇలా ప్రార్ధించాను:

‘శ్రీమన్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాదివృశ్చిక-జలాగ్ని-భుజఙ్గ-రోగ క్లేశవ్యయామ
హరయే గురవే నమస్తే’

చాలా సేపు స్వామినే చూడగలిగే భాగ్యం వచ్చింది నాకు. అర్చన అక్కడ చేయరట. బయటకు వెళ్లే దారిలో ఒక అర్చకస్వామి, పెద్ద పళ్లెంలో అక్షంతల మీద, స్వామివారి తిరునామములను పెట్టుకుని కూర్చున్నాడు. గోత్రనామాలతో వాటికే అర్చన చేశాడు. అక్షింతలు ప్రసాదంగా ఇచ్చాడు.

బయటికి వచ్చి మూడు ప్రదక్షిణాలు చేశాను ప్రధానాలయం చుట్టూ. నాలుగో వైపులా నాలుగు దీర్ఘ మంటపాలు. అవి ఇటీవల పునరుద్ధరించినట్లున్నారు. వాటిల్లో పురాతనత్వం లేదు. ఒకచోట భుజగశయనుడైన శ్రీమహవిష్ణువు. ఆయనకు పాదసంవాహనం చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఉన్న పెద్ద (10×6) తైలవర్ణ చిత్రం సజీవంగా ఉంది.

మరొక చోట ఆశీర్వాద మంటపం. ధ్వజస్తంభం పక్కనే స్వామివారి శేషవాహనం.

ఒక చోట అద్దాల మంటపం ఉంది. అక్కడ స్వామి వారి ‘ఊయల’ నయన మనోహరంగా అలంకరించారు. ‘ఊంజల సేవ’ దానిలో చేస్తారు కాబోలు! ఊయల చుట్టూ నిలువెత్తు అద్దాలు బిగించారు. నాలుగు వైపులా ఉయ్యాల కనబడుతూ కనువిందు చేస్తున్నది. దానికి ప్రవేశ రుసుము 10 రూపాయలు. కానీ నాకు అవసరం లేదనిపించింది. ఎందుకంటే గుమ్మం నుండి అంతా కనబడింది!

ప్రధానాలయం ఎడమ వైపు ఇంకో బయటి దారి ఉంది. అక్కడ స్వామివారి కల్యాణమండపం, పక్కనే ప్రసాదాల విక్రయశాల ఉన్నాయి. లడ్డు, సిర, పులిహోర. ఒక లడ్డు కొనుక్కున్నాను. “స్వామీ, ‘సిర’ అంటే ఏమిటి?” అని అనడిగాను.

“కేసరిహల్వా నాయనా!” అన్నాడాయన. నాకప్పడు గుర్తొచ్చింది. కర్నాటక, ముఖ్యంగా హుబ్లీ, బెంగుళూరు లాంటి నగరాల్లో ఉదయాన్నే టిఫిన్ కంటే ముందు దాన్ని తింటారు, ఉత్తరాది వారి లాగా! పులిహర, సిర, కేవలం ఉదయం మాత్రమేనట. పక్కన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. రుక్మిణీ సత్యభామా సమేతుడైన కృష్ణస్వామి మనోహరంగా ఉన్నాడు. బయట ఒక స్వామి పెద్ద బేసిన్‌లో పులిహార పెట్టుకొని, చిన్న విస్తరాకు దొప్పల్లో అందరికీ ప్రసాదం పెడుతున్నాడు. ఆ ప్రసాదాన్ని స్వీకరించాను. దాని రుచి ఎప్పటివలెనే మధురం, అమోఘం. మధురం ఉంటే తియ్యనిదని అర్థం తీసుకోకండేం! తర్వాత వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాను. అన్నీ పెద్ద గుడులే.

చివరకి ‘పాతగుడి’ అని పిలువబడే ‘ఉగ్రనరసింహ స్వామి’ ఆలయం లోకి వెళ్ళాను. నా అదృష్టం! స్వామివారి నిజరూప దర్శనం అయింది. అంటే నిరాలంకారుడుగా! కనీసం తులసిమాలలు కూడా లేవు. స్వామి పేరే అది గాని, ఆయన ఉగ్రంగా లేడు.

‘సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం’ అన్న శ్లోకాన్ని మల్హర్ రాగంలో ఆలపించాను. నేను రాస్తున్న ‘శ్రీ లక్ష్మీ నృసింహమాహత్మ్యము’ అన్న ప్రబంధము నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలా చూడమని స్వామిని ప్రార్థించాను.

అర్చకస్వామి నాతో ఇలా చెప్పారు – “స్వామివారి ప్రధాన వదనం క్రింద, చుట్టూ, ఐదు ముఖాలుంటాయి, ‘పంచవక్త్రములు’. నరహరిని ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. ఆలయంలోని ముఖ మంటపంలో ఒక మూల ‘సాన బండ’ ఉంది. స్వామివారి కోసం గంధం చెక్కలు దాని మీద అరగదీసేవారట. అది రాతిది. వృత్తాకారంగా, మూడుగుల వ్యాసంతో ఉంది. మనం మనసులోని కోరికను స్వామికి తెలుపుకొని నాణేన్ని దానిమీద నిలువుగా ఉంచితే, అది నిలబడితే. మన కోరిక సిద్ధిస్తుందట.

కొందరు అక్కడ కూర్చొని ప్రయత్నిస్తున్నారు. నేనూ పెట్టి చూశాను. కాని నా నాణెం నిలబడదే! స్వామితో నా అనుబంధం వేరు. ఇంతలో ఒక ఆరేళ్ల పిల్లవాడు వచ్చి, “తాతా! నేను పెడతా” అన్నాడు. నాణెం ఇచ్చాను. ఆశ్చర్యం! ఒక్కసారికే నాణెం నిలబడింది!

ఆలయం బయట, ఆవరణలో అంతా, సిమెంటు బెంచీలు వేసి ఉన్నాయి. అక్కడక్కడ ‘జల ప్రసాదం’ పేరిట మంచి నీటి ఫిల్టర్స్ ఉన్నాయి. స్తంభాలకు శేషప్పకవి శతక పద్యాలను ఫ్రేమ్ చేసి కొన్ని చోట్ల తగిలించారు. అక్కడ ఉన్న ఒకపద్యం చదివాను, బిలహారిలో.

సీ.
బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని
మరణకాలము నందు మఱుతునేమొ!
ఆ వేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ గప్పగాఁ భ్రమచేత
గంపముద్భవముంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచు
బిలుతునో, శ్రమచేతఁ బిలువలేనొ!
తే.గీ.
నాఁటికిప్పుడె భక్తి నీ నామ భజన
తలఁచెదను జెవిని నిడవయ్య ధైర్యముగను
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార!నరసింహ! దురితదూర!

~

తర్వాత నా కావ్యము లోని ఆశ్వాసాంత పద్యములను స్వామివారికి వినిపించాలనిపించింది. ద్వితీయాశ్వాసము చివర నేను రాసిన పద్యాలను పాడుకొన్నాను.

మత్తకోకిల:

దీన బాంధవ! ముక్తి సాధన! తీరుతెన్నుల జూపపే!
గాన తన్మయ! జ్ఞానపారమ! కర్మ బంధము బాపవే
మానసంబున నిన్ను నిల్పిన మా వెతల్ సమయింపవే
ధ్యాన నిర్జిత! భక్త పోషణ! దారుణాఘములార్పవే!

అంబురుహ వృత్తము:

ఆవల నీవల నంతయు గాచెడి ఆర్త బంధు! పరాత్పరా!
నీవలనన్ సకలంబును నిల్చును నీవే దిక్కు నిరంజనా
కావుము దేవతలందరి నీ దయ కార్యకారణ హేతువై
చావుయె లేని వరంబును బొందిన శత్రుదున్ముము మృత్యువై.

~

ఉగ్రనరసింహాలయ అర్చకస్వామి వచ్చి నా దగ్గర కూర్చున్నాడు.

“అయ్యా! మీరు ముందు పాడింది మా శేషప్పగారి పద్యం, అది ప్రసిద్ధం. మరి ఈ పద్యాలు? చాలా బాగున్నాయి. వృత్తాలు వైవిధ్యంగా ఉన్నాయి” అన్నాడు.

“ధన్యోస్మి! ఇవి నేను రాస్తున్న ‘శ్రీలక్ష్మీనృసింహమాహాత్మ్యము’ లోనివండీ! అశ్వాసాంత పద్యాలు!” అన్నాను.

భక్తులెవ్వరూ లేరు. అర్చకస్వామి విశ్రాంతిగా నాతో మాట్లాడసాగాడు.

“ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యాన్ని మీ నోట వినాలనుంది స్వామి!” అన్నాను.

“అవశ్యం! ‘లక్ష్మీనృసింహ! మమదేహి! కరావలమ్బమ్’ అని ప్రారంభించాడా సంతత నరసింహ సన్నిధానువర్తి. ఆయిన పేరు కిళాంబి నరసింహాచార్యులట.

“ఈ క్షేత్రానికి సహస్ర వర్షములపైనే చరిత్ర ఉంది. పది, పదకొండు శతాబ్దాల కాలంలో దీనిని ధర్మపురమని పిలిచేవారు. గోదావరీనదీ తీరాన ఉన్న నృసింహ క్షేత్రమిది. నది ఇక్కడ దక్షిణ వాహిని. శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు ఈ స్వామిని కొలిచి తరించారు. క్రీ.శ. 1309లో అల్లాఉద్దీన్ ఖిల్జీ ధర్మపురి ఆలయాలపై దాడి చేసి నాశనం చేశాడని చరిత్ర.

స్వామి, అంటే మూల విరాట్టు, స్వయంభూ సాలగ్రామ విగ్రహం. పద్మాసనుడై, కోరమీసాలతో, వజ్రదంష్ట్రలతో, రక్త జిహ్వుడై దర్శనమిస్తాడు. స్కాందపురాణంలో ధర్మపురి క్షేత్రమహత్యాన్ని వర్ణించారు. ధర్మవర్మ అనే రాజు, స్వామి వారి దయవల్ల, అల్పాయుష్కుడైన కుమారుని చిరంజీవిగా చేసుకొన్నాడు. ధర్మయాగం చేసి, ఈ ఊరిని ధర్మపురి అనే పేర రాజధానిగా చేసుకొని పరిపాలించినాడని ఐతిహ్యం.

ధర్మపురి ప్రధాన దేవాలయం పక్కనే మసీదు ఉంటుంది. దాని పక్క రామలింగేశ్వరాలయం. యమధర్మరాజు స్వామి వారిని దర్శించుకొనేవాడట. ఆయనకు ఆలయం కేవలం ఇక్కడ మాత్రమే కనబడుతుంది.”

అర్చకస్వామికి పాదాభివందనం చేసి వచ్చేశాను. మళ్లీ ఆర్డినరీ బస్‌లో జగిత్యాల చేరుకొన్నాను. రాత్రి 8.30 నిమిషాలు ఐంది. నందిని ఉడిపి రెస్టారెంట్‌లో సింగిల్ ఇడ్లీ, ఆనియన్ రవ్వ దోస తిన్నాను. మజ్జిగ తాగాను. రూంకి వెళ్లి పడుకున్నాను.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ దర్శనం:

మర్నాడుదయం 7 గంటలకు రూం ఖాళీ చేసి, కరీం భాయ్ టీ తాగి కరీంనగర్ ఆర్డినరీ బస్ ఎక్కాను. కొండగట్టు దగ్గర దిగాను. కేవలం 15 కి.మీ. దూరమే. 20 నిమిషాలు ప్రయాణం. అక్కడ నుంచి షేర్ వ్యాన్ లున్నాయి కొండ మీదికి. ఒక్కొక్కరికి 30 రూపాయలు. ఘాట్ రోడ్డుకు ఇరువైపుల పచ్చని కొండలు. 3 కి.మీ. కూడా లేదు. పార్కింగ్ నుండి పైకి నడచి వెళ్లాలి. మెట్లు లేవు కాని కొండ అంచున స్లోప్ ఉంది. పైకి చేరుకున్నాను. బ్యాగ్ అక్కడి లాకర్‍లో పెట్టి దర్శనానికి వెళ్లాను.

చాలా పెద్ద గుడి. కొండగట్టు అంజన్న అంటారు స్వామిని. మహామహిమాన్వితుడు. భక్తులు పెద్దగా లేరు.

ధర్మదర్శనం క్యూలో నిలబడ్డాను. అరగంట లోపే అంజన్న దర్శనం అయింది. సిందూరవర్ణంలో, రామభక్త హనుమాన్ వెలిగిపోతున్నాడు. స్వామిని ఇలా ప్రార్థించాను:

‘ఆంజనేయం మహావీరం జానకీ శోకనాశనం
కపీశ మక్షహంతారం వందే లంకా భయంకరం’
‘గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసాం
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్’

ఆలయంలో రెండు స్తంభాల మధ్యన ఉన్న అడ్డ పట్టెకు బిగించిన పెద్ద గంటను చూశాను.

క్షేత్రం నిండా స్వామివారు కోతుల రూపంతో తిరుగుతూ, ప్రమత్తంగా ఉన్న భక్తుల చేతులలోవి లాక్కొని పోతున్నారు.

బయట శతాబ్దాల వయసుగల ఒక మర్రి చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది. అభివృద్ధి పేరిట దానిని తొలగించని అధికారులకు అభినందనలు (మనసులో) తెలిపాను. కాసేపు ఆ చెట్టు కింద వితర్దిక పైన కూర్చున్నాను. ఎంత చల్లగా, హాయిగా ఉంది! వెయ్యి ఏ.సి.ల పెట్టు కదా చెట్టు!

కొండగట్టు మల్యాల మండలం, జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామం ఉంది. కరీంనగర్ – జగిత్యాల హైవే మీద దిగాలి. అన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా అక్కడ ఆపుతారు. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం కొండగట్టు అంజన్న గుడి.

3 శతాబ్దాల క్రిందట. ఒక ఆవులు కాచుకునే ఆయన ఈ ఆలయాన్ని ఈ కొండ మీద కట్టాడని జానపద చరిత్ర చెబుతోంది. 160 సంవత్సరాల క్రిందట కృష్ణారావు దేశముఖ్ అనే జవిందారు దీనిని పునరుద్ధరించి అభివృద్ధి చేశారట. ప్రధానాలయంలో వెంకటేశ్వరస్వామి వారున్నారు. 40 రోజులు ఆంజనేయ స్వామికి మండల దీక్ష చేస్తే, సంతానం కలుగుతుంది, మానసిక రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం! విశ్వాసమే కదా భక్తికి మూలం!

షేర్ వ్యాన్ (టాటా ఏస్ మ్యాజిక్) లో క్రిందికి చేరుకున్నాను. అక్కడ కరీంనగర్ ఆర్డినరీ బస్ ఎక్కి 10 గంటల కల్లా పుస్తకావిష్కరణ జరిగే వాగీశ్వరీ డిగ్రీ కళాశాలకు చేరుకున్నాను. గీతా భవన్ సర్కిల్‍లో దిగేశాను. కొండగట్టు లోనే, ఒక పాక హోటల్లో, పొగలు కక్కే టమోటా బాత్ తిన్నా.

సభలో నా ప్రసంగం, సన్మానం బాగా జరిగాయి. ఒంటిగంటకు గీతాభవన్‍లో పెరుగు వడ, వెజిటబుల్ కిచిడీ తిని జుబిలీ బస్ స్టేషన్‌కు వెళ్ళే నాన్ స్టాప్ ఎక్కాను. కేవలం 3 గంటలలో JBS లో దింపాడు. అక్కడ నుండి, 290వ నం సిటీ బస్‍లో మా వనస్థలిపురం చేరాను. 7 గంటలకు ఇంట్లో ఉన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here