ధర్నా

5
2

[dropcap]వం[/dropcap]ట్లోని రక్తాన్ని అప్పుచ్చుకున్న కళ్ళు
ఎర్రెర్రగా ఆవేశంగా చూస్తున్నాయి
పిడికిళ్ళుగా మారిన చేతులు
ఎగిరెగిరి ఆకాశాన్ని గుద్దేస్తున్నాయి
గుమిగూడిన గొంతులు అంతలా నోళ్ళుతెరిచి
దిక్కులు పిక్కటిల్లిపోయేలా అరుస్తున్నాయి
ఏదో నశించాలంటూ, ఏవేవో కావాలంటూ…

బిలబిలలాడుతూ దిగిన ఖాకీత్వం
అదుపులో ఉండమంది
క్రమశిక్షణగా నడుచుకోమంది
శాంతిపాఠం చక్కగా వల్లెవేయమంది
చిర్రెత్తిన పిడికిళ్ళూ,
కాలే కడుపులూ, అరుస్తోన్న నోళ్ళూ
కాదూ కూడదంటూ కయ్యానికి దిగగానే
కసురుకుంటున్న ఆ అధికారం
దూరదూరంగా నెట్టేయడం మొదలెట్టింది

చెల్లా చెదురైన చేతులు విసురుగా
చెరోకొన్ని రాళ్ళను రవాణా చేసేస్తే
నిశ్చలంగా ఉన్న లాఠీలకు ప్రాణం వచ్చింది
బిగించిన పిడికిళ్ళ పైన దాడిచేశాయి
అరిచే గొంతులపైనా విరుచుకపడ్డాయి
పూనకం వచ్చినట్టు ఊగిపోతూ
కనిపించిన ప్రతి ఒంటినీ
కసిగా రక్తం కారేలా ముద్దెట్టుకున్నాయి

బుసబుసా పొంగుతోన్న రక్తం
సురక్షితంగా కూచున్న కెమెరా కంటిలోకి దూకేసింది
ఫ్లాష్ న్యూసులో ఫ్లాష్ అవుతూ
టీవీ స్క్రీన్ మీద ధారగా చిక్కగా కారిపోతోంది

కాగితం మీద కలియతిరుగుతున్న పెన్ను
కళ్ళారా చూస్తున్న ఈ కర్కశత్వ కథనాన్ని
గుసగుసగా చెప్పేస్తూ
ఎరుపురంగు మరింత చిక్కగా వేసుకోమంటోంది
రేపటి దినపత్రిక మొదటిపేజీని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here