[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ధోరణి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]లవాటైన రుచి మాటలదే
నేనరెరిగిన జిహ్వ ద్వైదీ చాపల్యం
వహ్వా!వాహ్ భేష్ అనిపించే భావం శిల్పం క్షణభంగురం
వెదజల్లబడిన వేడి సెగల విత్తులు
మెల్లగ పైకెగబాకి
అస్తిత్వ బావుటా కూల్చే స్వప్పం
అస్థిర ప్రదక్షిణలో నేలపై
నాలుక వదిలే భావోద్వేగం ఎల్లల్లేనిదే
స్పర్శ జ్ఞానం గొంతు నాలుకదైతే
ఆత్మస్తుతి పరనింద చాణక్యం
తీగలు తెగిన వీణదే గదా!
జిత్తుల మిన్నాగు బుసలు
పేలికలైన నింగి పెయ్యి దిగంబరమే
నాలుకలు రెండూ
భస్మాసుర చేతులై దహించే
దృశమే మన కనుల ముందర
కొత్తగాదిది ఈ మట్టి గుండెకు
రంగు రుచి వాసన కలిసిన
అందమైన అబధ్ధాల కలయిక
నిరాధారమైన క్షేత్రంలో పేలే
చదరంగ తరంగ నాలుక మాటలు
రంగులపే కొత్త రంగు రుచి
సామాజిక రుగ్మతల దారి
ఉన్మాద అవ్యవస్థల సమాజం
పీల్చేది అర్ధ ఊపిరి
బతుకనేర్చిన ఐంద్రజాలం
ధాత్రి ఆవరించిన మాయాజాలం
ఒక ప్రపంచంలో ఒకే మనిషి నీడలు
తతిమ్మ జనమంతా
ఒక నింగి ఒక నేల నడుమ
గాలిపాటైన మిణుకు మిణుకు దీపాలే!
గజిబిగి మాటల ధోరణి మూన్నాళ్ళే
మారని ఆలోచనల తలాపున
ఎక్కడైనా ఎప్పుడైనా
చరిత్ర రాసిన అక్షరమే జీవించు
చరిత్ర రాయని శిలాక్షరమై