[box type=’note’ fontsize=’16’] “సినెమా చూశాక మనం కూడా పొగమంచులోంచి వెలుగులోకి వచ్చినట్టు ఫీల్ అవుతాము” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ధుంధ్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఈ[/dropcap] వారం హాల్లో ఏ సినెమా చూడలేదు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఏదన్నా చూద్దామని కూర్చున్నా. జావూఁ కహాఁ బతా అయ్ దిల్ వున్నది. ఆ పాట నాకిష్టం. చూద్దామని కూర్చున్నా. దాదాపు ఇరవై నిముషాల పాటు ఆ జంట ముంబై లోని మరీన్ డ్రైవ్ పక్కన నడుస్తూ చర్చించుకుంటారు. ఇదెక్కడి గోఅలరా బాబూ, అనిపించింది. రివ్యూ కి సినెమా అంటే చర్చ కాదు అన్న శీర్షిక కూడా మనసులో ఖాయం చేసేశాను. ఆ చర్చ తెగదే. గంట అయిపోయింది. ఇక నెమ్మదిగా పోర్న్ లాంటిది మొదలైంది. వొక పెద్ద నమస్కారం పెట్టి అక్కదితో కట్టేశా.
ఇప్పుడేం చెయ్యాలి? ఈ మధ్య లఘు చిత్రాలు బాగా తీస్తున్నారు. వెతికితే “ధుంధ్” కనబడింది. నా చిన్నప్పటి జ్ఞాపకం “ధుంధ్”. జీనత్ అమాన్ ది. బాగుంటుంది. ఇది కూడా బాగుండొచ్చు అనిపించి చూశా. అందులో ఆ జంట నడిచినంత సేపట్లో వో లఘు చిత్రం లో కథతా లాగించేశాడు. ఆ దర్శకుడు ఇలాంటి వాళ్ళ దగ్గర అప్రంటీస్ చేస్తే సినెమా ప్రాథమిక విషయాలన్నా అర్థమవుతాయి.
1948-1958 ల కాలంలో ఫిరోజ్పుర్ అన్న భారత-పాకిస్తాన్ సరిహద్దులోని వో పల్లెలో జరిగే కథ. 1958 లో వో పగలు : సంతోక్ సింఘ్ (విపిన్ శర్మ) లేచి, స్నానం చేసి పూజాపాఠాలు కూడా ముగిస్తాడు. కొడుకు హర్మీత్ (షారిబ్ హాష్మి) రాత్రి తాగి పడుకున్న మనిషి ఇంకా లేవలేదు. మనవడు అతన్ని నిద్ర లేపుతున్నాడు. కోడలు మనవరాలికి జడ వేసి పెడుతున్నది. నీ కూటురు పెద్దదవుతోంది, నువ్వీ తాగుడు మానెయ్యిక అంటాడు సంతోక్ కొడుకుతో. పాలు ఇవ్వడానికి వచ్చిన కోడలు అతనితో అంటుంది, కూతురు పెద్దదైపోయింది, తనకి చదువుకోవడానికి ప్రత్యేకమైన గది కావాలంటుందీ అని. మీ అత్తగారి గది ఖాళీనే కదా, తీసుకోమను అంటాడు. వొకసారి అందులో సామాను చూడండి, ముఖ్యమైనవి వుంటే తీసి అట్టే పెట్టుకోవచ్చు అంటుంది కోడలు.
ఆ రోజు మధ్యాహ్నం మందు సీసా బల్ల మీద వుంచి, వొక బల్ల మీద సంతోక్ కూచుంటాడు. కొడుకుని పిలిపించి ఇద్దరికీ మందు పోయమంటాడు. సంతోక్ కి ఇది మొదటిసారి. తన తాగుడు మానిపించడానికి ఇదంతా చేస్తున్నారేమో అనుకుంటాడు కొడుకు. నెమ్మది గా మాటలు కలుస్తాయి. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. నీకు గుర్తుందా, ఫలానా వారి పెళ్ళిలో నువ్వూ నీ తమ్ముడు బల్జీత్ ఎంత ఆనందంగా డాన్స్ చేశారో. ఆ రోజు బల్జీత్ ఎంత నవ్వాడని! అంటాడు. గుర్తున్నదని తల వూపుతాడు కొడుకు. 1947 లో దేశ విభజన అయిన తర్వాత కూడా చాన్నాళ్ళ పాటు హిందూ ముస్లింల మధ్య అల్లర్లు జరిగేవి. 1948 లో వొక రాత్రి సంతోక్ తన ముస్లిం మిత్రుడు అతని ఇద్దరు వయసులో వున్న కూతుళకీ తన ఇంట శరణమిస్తాడు. వూళ్ళో వున్న వో ఉన్మాది అర్ధరాత్రి తలుపు తట్టి వివరం అడుగుతాడు. ఇప్పుడు కాదు, నువ్వు రేపు పగటి పూట రా, నా ఇంత్లోకొచ్చి చూసుకుందువుగాని అంటాడు సంతోక్. పెద్దాయన మాటకు గౌరవమిచ్చి వెళ్ళి పోతారు వాళ్ళు. మర్నాడు చీకటి వుండగానే ఆ ముస్లిం కుటుంబాన్ని సరిహద్దు దాటించాలని కొడుకులకు పురమాయించి తానూ బయలుదేరుతాడు. దట్టంగా వున్న పొగమంచులో దారిని గుర్తు పట్టడం అలవాటే అంటాడు. ఈ కథనం అంతా ముందుకీ వెనక్కీ జరుగుతూ చెప్పబడింది. సంతోక్ తన జేబులోంచి వో రివాల్వర్ తీసి దాంట్లో వొక్కటే తూటా పెడతాడు. మొదటి వంతుగా తను కాల్చుకుంటాడు. ఆ జాగాలో తూటా వుండదు. రెండవ సారి కొడుకు వంతు. అప్పుడూ తూటా వుండదు. ఇదంతా ఎందుకు నాన్నా, నేనిక తాగుడు మానేస్తాను ప్రమాణం అంటాడు కొడుకు. కాదు మీ అమ్మ గదిలో సామాను సర్దుతుంటే పదేళ్ళ క్రితం సరిహద్దు అవతలనుంచి వచ్చిన లేఖ నా చేతికి వచ్చింది. ఇన్నేళ్ళూ మీ అమ్మకు నిజం తెలుసు. నేను తెలుసుకోవడం అవసరం అనిపించి అలానే వుంచింది అంటాడు సంతోక్. కొడుకు తల దించుకుంటాడు. ఆ తర్వాత కథ మీరు ఆ లఘు చిత్రంలోనే చూడండి.
సుదీప్ కఁవల్ దర్శకుడు. ఇతని గురించి నేను వినలేదు. కాని ఈ చిత్రం చూస్తే ప్రతిభాశాలి అని అర్థమవుతుంది. కథ కూడా తనే వ్రాసుకున్నాడు. నటీ నటులందరూ చక్కగా చేశారు. మలయ్ ప్రకాశ్ చాయాగ్రహణం, లారెన్ బక్టర్ సంగీతమూ చాలా బాగున్నాయి. సినెమా మూడ్ ను చక్కగా పట్టిస్తాయి అవి. సినెమా చూశాక మనం కూడా పొగమంచులోంచి వెలుగులోకి వచ్చినట్టు ఫీల్ అవుతాము. ఆ పాత్రల లాగే మనం కూడా అనుకుంటాం : అవును అప్పుడు మనం ఎందుకలా?
Spoiler alert పొగమంచు పూర్తిగా వీడలేదు. దాదాపు సరిహద్దు దగ్గరికి వచ్చేశారు వాళ్ళు. ఈ నది వొడ్డు వెంట వెళ్ళండి, ఇక భయం లేదంటాడు సంతోక్. చూస్తే తమతో వచ్చిన కొడుకు, స్నేహితుని కూతురూ లేరు. ఏమై వుంటుంది? ఎవరన్నా వీళ్ళ మీద దాడి చేసి వుంటారా? అసలే వూళ్ళో వాళ్ళకి తన మీద అనుమానంగా వుంది, ముస్లింలకు శరణమిచ్చినట్టు. చిన్న కొడుకును వెళ్ళి చూడమంటాడు, చేతికి రివాల్వర్ ఇచ్చి. తమ్ముడుకి తన అన్న ఆ అమ్మాయిని రేప్ చేస్తూ కనబడతాడు. ఆమెను వదిలెయ్యి అంటాడు. సమస్యే లేదు, ఈ ముస్లింలు మనవాళ్ళను ఎలా చిత్రహింసలు పెట్టారో నేను మరచిపోలేదంటాడు అన్న. అన్నా తమ్ముళ్ళు పెనుగులాడుతుంటే రివాల్వర్ పేలి తమ్ముడు చనిపోతాడు. ఆ శబ్దం విని వచ్చిన సంతోక్ స్థాణువైపోతాడు. అతని ఊహ రాత్రి తమ ఇంట వచ్చి సోదా చేస్తామన్నవాళ్ళలో వొకరు ఇది చేసి వుండాలని. అన్న మాట్లాడడు. ఇప్పుడు పదేళ్ళ నాటి ఆ వుత్తరం అతని కళ్ళు తెరిపించాయి; మానవత్వం జీవించనివ్వదు. అందుకే ఈ ఏర్పాటు. కొడుకు అప్పటినుంచీ సిగ్గుతో, పశ్చాత్తాపంతో చెప్పలేకా, మింగలేకా తాగుడుకి బానిసవుతాడు. తన కారణంగా తమ్ముడు పోయాడు. ఇప్పుడు తండ్రి పోతే తను తనని క్షమించగలడా? నా తప్పుకి నువ్వెందు శిక్ష పడాలి నాన్నా అంటాడు. తప్పు నువ్వొక్కడివే చెయ్యలేదు, నేను కూడా. నేను వాళ్ళని అనుమానించి…..! అయితే బగ్గాను చంపింది మీరా అంటాడు కొదుకు. మనం అప్పుడు ఎందుకలా.. గొణుక్కుంటూ అంటాడు కొడుకు. కెమెరా బయటకు వస్తుంది. ఆ ఇంటిలోపలినుంచి వో పిస్తోలు పేలిన శబ్దం.