[dropcap]ఆ[/dropcap]ధ్యాత్మిక జీవితంలో ధ్యానమునకు అత్యుంత ప్రముఖమైన పాత్ర వుంది. ధ్యానం చేయకుండా ఆధ్యాతిక జీవితంలో ఒక మెట్టు ముందుకు అసాధ్యం అన్నది పలువురు ఆధ్యాత్మిక గురువుల నిశ్చితాభిప్రాయం.
ధ్యానం మనస్సుకు విశ్రాంతతనిస్తుంది. ధ్యానం ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. హైబీపీతో బాధపడేవారు ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. భావోద్వేగాలు, భయం, కోపాన్ని నియంత్రించే ఒక భాగం మెదడులో ఉందని నివేదిక చెబుతోంది. ఒక వ్యక్తి ధ్యానం చేసినప్పుడు ఈ భాగం చురుగ్గా ఉంటుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడిని నుంచి దూరమై ప్రశాతంగా ఉండేలా చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ధ్యానం అనెడిది కోట్లాదిమందికి ఒక సాధనగా మారింది. మన మెదడు సానుకూలంగా మనం పూర్తి ఆరోగ్యంగా జీవిత చరమాంకం వరకు మంచంలో పడకుండా ఆఖరి వరకు ఆరోగ్యంగా ఉండగల అద్భుత శక్తిని శ్వాస మీద ధ్యాస ధ్యాన ప్రక్రియ ద్వారా పొందవచ్చును.
ధ్యానం అన్నది ఒక గుణం. అదొక చర్య కాదు. మీరు మీ శరీరాన్ని, మనస్సును, భావోద్వేగాలను, శక్తులను ఒక పరిపక్వ స్థాయికి తీసికొని వెళితే ధ్యానం అదే జరుగుతుంది. అది నేలను సారవంతం చేయడం వంటిది అని సద్గురు జగ్గీవాసుదేవ్ చెబుతుంటారు.
ధ్యాన సాధన అనేది అంతర్గత కార్యకలాపం. దానిని సాధన చేయడానికి మన బాహ్య జీవితంలో మార్పులు చేయవలసిన అవసరం లేదు. మనం ఏ ప్రత్యేక మతాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు, నిర్దిష్ట సమూహంలో సభ్యుడిగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రత్యేక దుస్తులు ధరించాలి లేదా నిర్దిష్ట జీవనశైలిని నడిపించాల్సిన అవసరం లేదు. ధ్యానం ఒక ఆలోచనకు కట్టుబడి ఉంటుంది. ఆ ఒక్క ఆలోచన ఇతర ఆలోచనలను దూరంగా ఉంచుతుంది; మనస్సు యొక్క పరధ్యానం దాని బలహీనతకు సంకేతం; నిరంతర ధ్యానం ద్వారా అది బలాన్ని పొందుతుంది అని శ్రీ రమణ మహర్షి ధ్యానం యొక్క ప్రాశస్త్యాన్ని చక్కగా తెలియజేసారు.
ప్రతి ఉదయం 4.30 గంటలకు నిద్ర లేచి 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం ఎంతో మంచిది. ఈ సమయాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు. మహర్షులు, ఋషులు, యోగులు, సాధు సత్పురుషులు, సాధకులు అంతా ఆ సమయంలోనే ధ్యానం చేస్తుంటారు. వాతావరణమంతా ఆ పవిత్ర ప్రకంపనలతో ప్రశాంతంగా ఉంటుంది. మనకు తెలియకుండానే వారి సహాయం మనకు అందుతుంది. మన ఆద్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. అట్లే ఒక అరగంట ధ్యానం చేయడం కోసం మిగతా రోజులో వుండే ఇరవై మూడున్నర గంటల సన్నాహం అవసరం అని స్వామి వివేకానందుడు అంటారు. అంటే మిగతా సమయంలో సాత్వికత అలవర్చుకోవడం, ప్రశాంత జీవనం అవలంబించడం అత్యావశ్యకం.
ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రతిరోజు ఒక అరగంటైనా చదివి, అలా చదివిన విషయం మీద ధ్యానం చేయడం సాధనకు ఎంతో ఉపకరిస్తుంది.
జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన విధానం అవలంబించడం ఎంతో అవసరం. ముఖ్యంగా వృథా ప్రసంగాలలో తలదూర్చగూడదు. అది మన చేతనను దిగజారుస్తుంది. వీలైనంత వరకు మాటలు తగ్గించి మౌనం పాటించాలి. అంతర్మౌనం మరింత అవసరం.