[dropcap]బెం[/dropcap]గ ఏదో చీకటిలా చుట్టుకుంటోంది.
నువ్వులేని చప్పుడులో
ఆరుబయట రాత్రిని చూస్తాను.
లెక్కలేని తనమేదో సమయాన్ని
తీగెలా చుట్టుకుంటున్నప్పుడు
ఆకాశంవంక నక్షత్రాలవంక చూస్తాను.
ఇక నువ్వు లేవని
నీ మాట వినలేని దూరం
చెప్పకనే చెబుతుంది.
దిగులుకళ్ళు ఊరికే వర్షిస్తాయప్పుడు.
అయినా నువ్వు మార్మ్రోగుతున్న ధ్వని
ఇంత నిశ్శబ్దాన్నీ
ఇంత రాత్రినీ
ఇంత చీకటినీ
చెదరగొడతునే ఉంటుంది.
తలచుకుని కుమిలి
దుఃఖ్ఖోద్వేగ క్షణాలను మోయడమంతా
ఒక మామూలులోకి జరిగాక
మరే ఇతర ప్రత్యేకతా
ఈ కథంతటి సమయంలోకీ చొరబడదు.
అలా వెళ్ళి నువ్వు మిగిల్చిన
గాయమంతలోనూ
నువ్వే ఉన్నావు.
ఏ కొంచం కాంతీ నువ్వై
కటిక చీకటీ నువ్వే అయి
నిజం సాగిలబడి
దిగులుగా నవ్వుతుండడం
నువ్వు చూడలేవు కదా!.