Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు -1

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]ది[/dropcap]లీప్ కుమార్ మరణించిన తరువాత వారిపై ప్రత్యేక వ్యాసాలు వస్తాయేమో అని ఎదురు చూసాను. కాని నేను ఊహించిన స్థాయిలో దిలీప్ కుమార్‌పై ఎక్కడా విస్తృతమైన సమాచారం రాలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆయన సినిమాలు చూసినవారు, దిలీప్ కుమార్ లోని నటనను ఆస్వాదించిన ఆ తరం ఇప్పుడు లేదు. ఉన్నవారు దిలీప్ పేరు విని ఉంటారు కాని అతని సినిమాలు చూసే ఓపిక ఉన్నవారు కాదు. ఏదో మొక్కుబడిగా లెజండ్ అంటూ రాసారు కాని నేను చదివిన వ్యాసాలలో వారి సినిమాలపై నిజమైన అవగాహనతో వచ్చిన రచనలు నాకు కనిపించలేదు. దిలీప్ సినిమాలలో నా కిష్టమైనవి, నేను చూడలేకపోయినవి అన్ని కలుపుకుని ఒక 40 లిస్ట్ చేసాను. ప్రతి రోజు ఒక సినిమాను వరుసగా పరిచయం చేయాలని నా ఉద్దేశం. దిలీప్ కుమార్ గురించి తెలుసుకోవాలనుకున్న వారికి ఈ పరిచయాలు ఉపయోగం కావచ్చు. నా పద్ధతిలో వారికి నేనిస్తున్న నివాళి ఇది.

దిలీప్‌కుమార్ కా జాదు – FOOTPATH

ఫుట్‌పాత్ 1953లో వచ్చిన సినిమా. దిలీప్ కుమార్ అంటే నాకు మొదట గుర్తు కొచ్చే సినిమా ఇది. ఇందులో తలత్ మహ్మూద్ పాట “షామే గమ్ కీ కసం” అనే చరణంతో ఉంటుంది. దిలీప్ కుమార్ పేరు తల్చుకుంటే నాకు గుర్తుకు వచ్చే పాట ఇది. ఈ పాటలో దిలీప్ మొహమే నాలో ఎప్పటీకీ గుర్తుండిపోయే చిత్రం. కారణం తెలీదు. ఎప్పుడో చూసిన సినిమా అయినా పాట మాత్రం ప్రతి షాట్ గుర్తుండిపోయింది. ఈ సినిమాలో దిలీప్ సరసన నాయికగా మీనాకుమారి నటించింది. అప్పుడే బాలనటి స్థాయి నుండి నటిగా ఎదుగుతున్న సమయం కావచ్చు చాలా చిన్నగా కనిపిస్తారు ఆవిడ ఈ సినిమాలో.

నోషు ఒక పత్రికాఫీసులో జర్నలిస్టుగా పని చేస్తూ ఉంటాడు. నాలుగు నెలల నుండి జీతం రాదు. అతన్ని పెంచిన అన్న బానీ ఒక స్కూలు టిచర్. అతని భార్యకు నోషు అంటే పడదు. డబ్బు మనిషి. భర్తని కూడా సాధిస్తూ ఉంటుంది. తమ్ముడంటే ఆ అన్నకు ప్రాణం. పేదరికంతో విసిగిపోయిన నోషు అన్న స్కూలు డబ్బు నుంచి వెయ్యి రూపాయలు తీసుకుని బ్లాక్ మార్కెటింగ్ మొదలెడతాడు. తమ్ముడు కోసం అధికారులకు తెలియకుండా డబ్బు పట్టుకొస్తాడు బానీ. అది తెలిసి అధికారులు డబ్బు అడిగినప్పుడు వారిని కొంత గడువు అడుగుతాడు బానీ.

బ్లాక్ మార్కెటింగ్‌లో ఐదు రెట్లు డబ్బు సంపాదించి అన్నకు డబ్బు తిరిగి ఇస్తాడు నోషు. తనకు రావలసిన వెయ్యి తీసుకుని స్కూలులో కట్టేస్తాడు బాని. కాని నోషు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నాడని తెలిసి అతని డబ్బు స్వీకరించడు. తమ్ముడిని దారి మార్చుకుంటే తప్ప తన దగ్గరకు రావద్దని చెబుతాడు. అతని మీద దొంగతనం నేరం మోపి ఉద్యోగం నుండి తీసేస్తారు. భార్య అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇంటి అద్దె కట్టలేక బస్తీలో పశువుల కోట్టం దగ్గర చిన్న గదిలో ఉంటాడు బానీ. కాని తమ్ముడి సంపాదన స్వీకరించడు. అక్రమ సంపాదన కన్నా ఆకలితో చావడం మేలని వాదిస్తాడు.

నోషు అదే వీధిలో మాల అనే పేద యువతిని ప్రేమిస్తాడు. కాని నోషు అవినీతి సంపాదన గురించి తెలిసి ఆమె కూడా అతన్ని దూరంగా ఉంచుతుంది. నోషు బ్లాక్ మార్కెటింగ్ లోనే చాలా సంపాదిస్తాడు. కాని ఎవరూ లేని ఒంటరి అవుతాడు. తృప్తి ఉండదు జీవితంలో. పైగా తాను చేసుంది తప్పనే ఆలోచన నిత్యం అతనిలో రగులుతూ ఉంటుంది. చివరకు బ్లాక్ మార్కెటింగ్‌లో మందులు దాచిపెట్టిన కారణంగా, మందులు లేక నోషు అన్న మరణిస్తాడు. నోషులో పశ్చాత్తాపం బయలు దేరుతుంది. బ్లాక్ మార్కెటింగ్ రహస్యాలను పత్రిక ద్వారా బైట పెట్టి పోలీసులకు లొంగిపోతాడు.

దిలీప్ కుమార్ మన దేశంలో మొదటి మెథడ్ యాక్టర్. పాత్రకు అనుగుణంగా తనను తాను మార్చుకునే నటుడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ స్టైల్ చాలా వినూత్నంగా ఉంటుంది. లో-పిచ్ స్వరంలో భావాలను మాట సహాయంతో అతను పలికించే తీరు అతని నటనకు ఒక గాంభీర్యాన్ని హుందాతనాన్ని తీసుకువస్తుంది. ఒక్క కుడి చేతిని తప్ప పెద్దగా శరీరాన్ని కదిలించకుండా కేవలం కళ్ళతో, గొంతుతో, నవరసాలను పలికించడంలో దిట్ట ఆయన. పుట్‌పాత్ సినిమాలో కూడా అతనిలోని ఆలోచనను, విషాదాన్ని, అసహాయతను కేవలం తన డైలాగ్ మాడ్యులేషన్ ద్వారా చూపిస్తారు ఆయన. దిలీప్ నటన గొప్పతనం అదే. చాలా ఈజ్‌గా కేవలం మాటల ద్వారా ఒక సీరియస్ మూడ్ లోకి ఆడియన్స్‌ను తీసుకువెళతాడు కాబట్టే ట్రాజెడి కింగ్ అన్న నామం అతనికే సార్ధకమయింది. ముఖ్యంగా తలత్ గొంతులో వచ్చే పాట..

“आंख वीरान है दिल परेशान है, देख जा किस तरह आज तन्हा है हम”

అంటూ సాగుతుంది. ఈ పాట లో దిలీప్‌ని చూడాల్సిందే. ఇంకే నటుడికీ ఆ విషాదాన్ని అలా చూపించడం రాదని ఒప్పుకుంటారు. (ఈ పద్దతి సంజీవ్ కుమార్‌లో చూస్తాం తరువాత. కాని ఆయన బాణీ వేరు)

సినిమాలో మిగతా పాటలన్నీ ఆషా భోంస్లే పాడారు. “పియా ఆజా రే” అన్న పాట ఇప్పుడు ఎక్కడా వినిపించదు కాని, ఆషా ఆ పాటను చాలా బాగా పాడారు. ఖయ్యాం సంగీతం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సినిమాకు కథ రాసి దర్శకత్వం వహించింది జియా సర్హాది. ఒక క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమా ఇది.

Exit mobile version