Site icon Sanchika

ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 16 – సంగ్‌దిల్‌

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

ఇంగ్లీషు నవల జేన్ ఐర్‌కు హిందీ రూపాంతరం సంగ్‌దిల్‌

[dropcap]‘త[/dropcap]రానా’ సినిమా తరువాత దిలీప్ కుమార్ మధుబాలల జోడీ జనాన్ని బాగా ఆకర్షించింది. దాని తరువాత అటువంటి స్థాయిలోనే మరో సినిమా తీయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ‘సంగ్‌దిల్‌’.  సంగ్దిల్ అంటే రాతిగుండె….కఠినమైన హృదయం… ఇంగ్లీషు సాహిత్యంలో గొప్ప ప్రేమ నవలగా పేరు గాంచిన ‘జేన్ అయిర్’ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ నవల చార్లోటే బ్రోంటే 1847లో రాసారు. అప్పటి నుండి ఇది ఎందరినో అలరించిన కథ. ప్రపంచంలో ఎన్నో భాషాలలో చాలా ప్రేమ కథలకు స్ఫూర్తి ఇచ్చిన నవల ఇది. ఈ నవలలో రచయిత్రి శైలి చాలా గొప్పగా ఉంటుంది. దీన్ని కొంచెం మార్చి ఇలా సినిమాగా తీసుకు వచ్చారు దర్శకులు అర్.సి. తల్వార్ గారు. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే రామానంద్ సాగర్ అందించారు. ఈయనే తరువాత టెలివిజన్‌లో రామాయణ్ సీరియల్ తీసి చాలా పేరు సంపాదించారు. కాని ‘సంగ్‌దిల్‌’ సినిమాగా మాత్రం అంతగా నచ్చదు నవల చదివిన వారికి.

ఇంగ్లీషు నవలలో జేన్ ఒక కుటుంబ సంరక్షణలో ఉండి ఆ ఇంటి వ్యక్తుల క్రూరత్వాన్ని భరిస్తూ పెరుగుతుంది. కొంత పెద్దదయ్యాక ఆ యింటి యజమానురాలు  ఆమెను వదిలించుకోవడానికి ఒక ఆడపిల్లల హాస్టల్‌లో బలవంతంగా చేరుస్తుంది. అక్కడ ఆమె పరిచయాలు, ఆమె పెరిగిన విధానం, జీవితం నేర్పిన పాఠాలు ఇవన్నీ ఆమె వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కష్టపడి చదువుకుంటుంది. తరువాత స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఉద్యోగ వేట మొదలెడుతుంది. పేపర్‌లో ఒక ప్రకటన చూసి చాలా దూరపు ప్రాంతంలో ఒక ఎస్టేట్‌లో నివసించే ఒక చిన్న పిల్లకు గవర్నెస్‌గా వెళుతుంది. ఆ యింటి యజమాని, ఆ చిన్ని పిల్ల సంరక్షుడు ఎడ్వర్డ్ రోచెస్టర్ ఒక విలాస పురుషుడు. ఒక నాట్యగత్తె కూతురయిన ఆ పాపను అతను పెంచుకుంటాడు. ఆ పాప అతని కూతురే అని కూడా నౌకరులు అనుకుంటూ ఉంటారు. కాని అతను అవివాహితుడు. చాలా మంది ఆడపిల్లలతో చనువుగా ఉంటాడు. జీవితం పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి కనపరుస్తూ ఉంటాడు. జేన్ వయసులో ఎడ్వర్డ్ కన్నా చాలా చిన్నది. కాని వారి మధ్య ప్రేమ చిగురించడం, తరువాత ఎడ్వర్డ్ గతం, మతి స్థిమితం లేని అతని భార్య గురించి తెలియడం, ఆమెతో అతని కష్టాలు. భార్య ఉండగా మరో వివాహానికి ఒప్పుకోని చర్చ్ పెద్దలు, వీటన్నిటి మధ్య అతన్ని వదిలి జేన్ మరో ఊరు వెళ్ళి టీచర్‌గా పనికి చేరుతుంది. అక్కడ ఒకతను ఆమెను వివాహం చేసుకోవాలనుకోవడం, ఆమెకు కొంత ఆస్తి అనుకోకుండా కలిసి రావడం, అన్ని వదులుకుని ఎడ్వర్డ్ కోసం ఆమె తిరిగి రావడం, అతని భార్య మరణించిందని, అతను కళ్ళు పోగొట్టుకుని ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ఆమె అతన్ని కోరి వివాహం చేసుకోవడం, ఇలా సాగుతుంది కథ. జేన్ అయిర్‌లో ఈ ప్రేమికుల వేదన వారి మధ్య సంభాషణలు, వారి బంధాన్ని రచయిత్రి చాలా గొప్పగా వర్ణిస్తారు.

సంగ్‌దిల్‌ సినిమా దగ్గరకు వస్తే కమల, శంకర్ ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు. కమలను శంకర్ తండ్రి ఆమె తల్లి తండ్రులు చనిపోతే తన ఇంటికి తీసుకువస్తాడు. కాని శంకర్ తల్లి ఆమెను చాలా కష్టాలు పెడుతుంది. శంకర్‌తో ఆమె స్నేహం తప్పించాలని బలవంతంగా ఆమెను హాస్టల్‌కు పంపిస్తుంది. కాని కమల దారిలో తప్పించుకుని కొందరు ఆడ సాధువులను కలుసుకుంటుంది. వారి మధ్య తాను ఒక యోగినిలా పెరుగుతుంది. సంగ్‌దిల్ సినిమాలో గమనించాల్సిన అంశం ఏమిటంటే హీరొ పేరు శంకర్. కమల యోగిని అయినప్పుడు ఆమె తన జీవితాన్ని అంకితం చేసిన దేవుడు శంకరుడు. ఈ సినిమా మొత్తంలో శివుడు అన్న పేరు వాడరు. శంకర్ అన్న పేరే వాడతారు. అంటే, నాయిక ధ్యానించేది శంకరుడినే అన్నమాట.   ఆమె ధ్యానించేది హీరో శంకర్‌నే అన్న అర్ధం వస్తుంది.  ఈ యోగినులు నగరం వచ్చినప్పుడు ఆ ఊరి ధనవంతుని ఇంట్లో అతిథులుగా దిగుతారు. ఆ యింటి యజమాని శంకర్. శంకర్ విలాస జీవితం, అతని ఒంటరితనం అన్ని గమనించి అతన్ని గుర్తుపట్టిన కమల బాధపడుతుంది. శంకర్ కూడా ఆమెను గుర్తు పడతాడు. ఆమెను ప్రేమిస్తాడు. యోగినులు కూడా కమల ప్రేమను ఆమోదించి ఆమెని అక్కడే వదిలి వెళ్ళిపోతారు.

కమలను వివాహం చేసుకుంటున్న సమయంలో శంకర్‌కి వివాహం అయ్యిందని అతనికి భార్య ఉందని ఆమెకు తాను సోదరుడినని ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు శంకర్ ఇంటి పైన ఒక గదిలో ఉంచిన తన పిచ్చి భార్యను అందరికి చూపిస్తాడు. తన తల్లి డబ్బు కోసం ఆమెనిచ్చి వివాహం చేసిందని, తన జీవితంలో తాను ప్రేమించింది కమలనని ఆమెతో కలిసి జీవించడానికి, తన జీవితానికి నిజమైన తోడు కోసం తను తపిస్తున్నానని శంకర్ చెబుతాడు. కాని తనకు అతని వివాహం గురించి ముందే చెప్పలేదని కమల అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాని మళ్ళీ తిరిగి వచ్చి కాలిపోయిన ఆ ఇంటిని, మరణించిన అతని భార్య గురించి తెలుసుకుని కళ్ళు పోగొట్టుకున్న శంకర్‌ను చూసి అతనితో కలిసి జీవించడానికి ఒప్పుకుంటుంది.

సినిమాగా ఈ కథకు అంత న్యాయం జరగలేదు. కమలను యోగినిగా చూపించడం పెద్దగా కథకు సరిపోలేదు. సినిమా అప్పట్లో బాగా ఆడినా ఒరిజినల్ నవలతో పరిచయం ఉన్నవారికి సినిమా నచ్చదు. దిలీప్ కుమార్ నటన మాత్రం ఈ సినిమా లోని తప్పులను బాలెన్స్ చేస్తుంది. బలమైన స్క్రిప్ట్ లేకపోయినా ఆర్టిస్ట్ లోని టాలెంట్ కథకు ఎంత సహాయపడుతుందో ఈ సినిమా చూసి తెల్సుకోవచ్చు. అన్నిటికన్నా పరిగణలోకి తీసుకోవలసింది సజ్జద్ హుసైన్ సంగీతం. సజ్జద్ హుసైన్ గొప్ప మ్యూజిక్ కంపోజర్. కాని అతనికి సినీ రంగంలో ఎవరితో పెద్దగా సత్సంబంధాలు లేవు. గొప్ప మాండొలిన్ కళాకరుడిగా అతనికి చాలా పేరున్నా ఎవరినీ లెక్కచేయని అతని ప్రవర్తన కారణంగా అతనికి ఎక్కువ సినిమాలు సంగీత దర్శకుడిగా దొరకలేదు. అయినా 22,000 పాటలకు వాయిద్య సహకారం అందించిన ఖ్యాతి అతనిది. తాను సంగీత దర్శకత్వం వహించి నూర్జహాన్ పాడిన పాటలకి ఆమె భర్త షౌకత్ హుసైన్ రిజ్వి మొత్తం ఆమెకే క్రెడిట్ ఇచ్చారని తెలిసి నూర్జహాన్‌తో మళ్ళీ ఎప్పుడు పని చేయనని నిర్ణయించుకున్నారు ఆయన. ఇలా చాలా మంది పెద్దవారిని విమర్శించి వదులుకున్నారు. అతని నోటికి చాలా మంది భయపడేవారట. ముక్కు సూటిగా ఉండడం, ఎక్కడా ఎవరికీ లొంగక తన బాణీలోనే పని చెయాలనుకోవడం వలన సజ్జద్ హుసైన్‌తో పని చేయడం కష్టం అన్న పేరు సంపాదించుకున్నారు. లతా మంగేష్కర్ చాలా ఇష్టపడి, పాడడానికి భయపడిన సంగీత దర్శకులు కూడా ఆయనే. సంగ్‌దిల్‌ సినిమా సమయంలో దిలీప్ కుమార్‌తో కూడా గొడవ పడ్డారట ఆయన. చాలా మందితో ఇలాంటి గొడవల కారణంగా ఆయన పెద్దగా సంగీత దర్శకత్వం చేయకపోయినా, ఆయన పాటలను చాలా గౌరవంగా ఆసక్తిగా వినేవారు ఆయన మిత్రులు, శత్రువులు కూడా.

సంగ్‌దిల్‌లో ‘యె హవా యె రాత్ యె చాందినీ’ అనే ఒక అద్భుతమైన పాట ఉంది. ఈ పాట ఈ రోజుకీ హిందీ భాషలో వచ్చిన గొప్ప సినీ గీతంగా విశ్లేషకులు తప్పకుండా గుర్తు చేస్తారు. తలత్ మెహమూద్ పాడిన ఈ పాట అప్పట్లో ఎంత మంది సంగీత దర్శకులను అలరించిందంటే, ఈ పాటనే ఆఖరీ దావ్ అనే సినిమాలో ‘తుఝే క్యా సునావు మై దిల్ రుబా’ అనే పాటగా కాపీ కొట్టారు మదన్ మోహన్. ఒక కార్యక్రమంలో మదన్ మోహన్‌ని చూసి కోపంగా నీడలు కూడా ఇలా ఎదురవుతాయే అని వ్యంగ్యంగా సజ్జద్ హుసైన్   అంటే, దానికి మదన్ మోహన్ బాధపడకపోగా నేను కాపీ కొట్టడానికి మీ కన్నా గొప్ప సంగీతజ్ఞులు నాకు దొరకలేదు అని సమాధానం ఇచ్చారట. సజ్జద్ తన మాట ధోరణితో ఎంత కటువుగా ప్రవర్తించినా అతని ప్రతిభను అందరూ అంతగా గౌరవించేవారని ఎన్నో సంఘటనలు చెబుతారు. పదిహేను పైగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్‌లో నిష్ణాతుడు సజ్జద్ హుసేన్. సంగ్‌దిల్‌ ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమా.

ఈ సినిమాలో ఎనిమిది పాటలుంటాయి. పాటలు రాసింది రాజేంద్ర కిషన్. ‘ధర్తి సె దూర్ గోరె, బాదలోకె పార్ ఆజా” ఎంత హాయిగా ఉండే పాటంటే ఇది ఒక సారి వింటే తనివి తీరదు. ‘దిల్ మే సమా గయె సజన్’ అనే పాట తలత్ లతలు పాడారు. ఇది వింటే సాజిద్ స్టైల్ తెలుస్తుంది. ఆయన గాయకులు పెద్ద గొంతుతో పాడితే ఇష్టపడేవారు కాదట. వాయిద్యాలకు గాయకుల గొంతుకు సమానమైన ప్రాముఖ్యత ఇచ్చేవారట. ‘కహా హో కహా మెరే’ అనే మరో విషాద పాటలో కూడా ఇది గమనిస్తాం.

దిలీప్ కుమార్ సినిమాలన్నిటిలో వ్యక్తిగతంగా నాకు సంగ్‌దిల్‌ పెద్దగా నచ్చకపోయినా దిలీప్ కుమార్ నటనను మాత్రం మర్చిపోలేం. మతి చలించిన భార్యతో వేగలేక, కనిపించిన ప్రతి స్త్రీతో దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఆ స్త్రీలు తన డబ్బు కోసం తన చుట్టూ తిరుగుతున్నారని తెలిసి  అసహ్యంతో దగ్గరవుతున్న శంకర్ బాడీ లాంగ్వేజ్ చూడాలి. అదే వ్యక్తి కమల దగ్గరకు వచ్చాక ప్రదర్శించే సున్నితత్వం, గొంతులో మార్దవం మరోలా ఉంటుంది. ధనికుడిగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నా, చుట్టూ అందమైన ఆడవాళ్ళున్నా వారితో స్నేహంగా ఉన్నా మనసుకు నచ్చే చెలి కోసం అతను వెతుక్కోవడం, ఆమె దొరికాక ఆమెకు పూర్తిగా లొంగిపోవాలని కోరుకోవడం, ఒక పురుషుడిలో ఇన్ని షేడ్స్ వెంట వెంటనే దిలీప్ చూపించగలిగారు. కమలను దగ్గర తీసుకునే పద్ధతి, భార్య ఎదురుగా అతని ప్రవర్తన, మోహినీతో ఉన్నప్పుడు దిలీప్ కుమార్ బాడీ లాంగ్వేజ్ అతని మనసును బయట పెడతాయి.  శంకర్ మోహినితో రొమాంటిక్ సంభాషణ జరిపేటప్పుడు దిలీప్ కుమార్ సంభాషణలను పలికే విధానం, అతని కళ్ళల్లో కదిలేభావాన్ని గమనిస్తే, దిలీప్ కుమార్ అతగొప్ప నటుడెందుకయ్యాడో తెలుస్తుంది. అతని పెదవులు ప్రేమ సంభాషణలను పలుకుతూంటాయి. కానీ, వింటున్న ప్రేక్షకుడికి, అది ప్రేమకాదు, నటన అని తెలుస్తుoటుంది. ఎందుకంటే, దిలీప్ కుమార్ కళ్ళల్లో ఒకరకమయిన, అపనమ్మకం, ఎలాంటి భావనలులేని ఒక శూన్యపు దృష్టి కనిపిస్తూంటుంది. అతనికి మోహిని మీద ఎలాంటి గౌరవం లేదన్న భావన కలుగుతుంది. కు ఇది చక్కని ఉదాహరణ. అదే కమలతో రొమాంటిక్ దృశ్యాలలో కళ్ళు చిలికించే పవిత్ర ప్రెమభావనను గమనిస్తే, నాలిక చివరినుంచి వచ్చేమాటలకు, హృదయలోతుల్లోంచి ఉబికి వచ్చే భావనలకు నడుమ తేడాను దిలీప్ కుమార్ నటన స్పష్టంగా చూపిస్తుంది.  ఆరంభంలో కమలతో కఠినంగా, అవమానకరంగా ప్రవర్తించే దిలీప్ , కమలను చూసి, నువ్వు చాలా అందంగా వున్నావు, అందమంటే నాకు అసహ్యం అని సంభాషణ పలికే విధానామూ, అత్యద్భుతంగా వుంటాయి. అతని కళ్ళు అందాన్ని మెచ్చుకుంటూంటాయి. పెదవులు విమర్శిస్తూంటాయి.  దిలీప్ కుమార్ గది మండుతూన్న అతను పడుకునివుంటే, కమల అతడిని నిద్రలేపి రక్షిస్తుంది. అప్పుడు ఆమెకి కృతజ్ఞతలు చెప్పటం ఎంత వ్యంగ్యంగా అనిపిస్తుందంటే, ఆ పాత్ర వ్యక్తిత్వం తెలుస్తుంది. సంగ్‌దిల్ అనే పదానికి దృశ్యంలో అర్ధం కనిపిస్తుంది.  ఆ తరువాతి కాలంలో తెలుగు ప్రేమ కథా నవలలన్నీ జేన్ ఆయిర్ నవలలో ఎడ్వర్డ్ పాత్రను పోలి ఉంటాయి. యద్దనపూడి రాజశేఖరం కూడా ఈ పాత్రను చాలా పోలి ఉంటాడు. ఇంగ్లీషు నవలలో ఎడ్వర్డ్ రాచెస్టర్ బాడీ లాంగ్వేజీని చార్లోటి ఎలా చూపించాలనుకున్నారో దిలీప్ అచ్చంగా అలా కనపడతారు. అందుకే సినిమాగా సంగ్‌దిల్‌ను చాలా మంది మెచ్చకపోయినా, దిలీప్ కుమార్ ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు, సాజిద్ హుసైన్ సంగీతం కోసం ఈ సినిమా చూడాలి.

ఒక స్త్రీ పట్ల అంతులేని ప్రేమ, మరో స్త్రీ పట్ల తేలిక భావం, మరో స్త్రీ తన జీవితంలో కలిగిస్తున్న అలజడి పట్ల కోపం అక్కడే బాధ్యత కూడా… ఇన్ని భావాలను కళ్ళతో, శరీరపు కదలికలతో చూపించడం అంత సులువు కాదు. దిలీప్ కుమార్ మాత్రం ఎక్కడా తగ్గకుండా చేసిన పాత్ర ఇది. సినిమా ముగింపు ఒరిజినల్ నవలలా ఉండదు. చాలా త్వరగా ముగిస్తారు సినిమాను, అందువలన నవల చదివిన వారికి ముగింపు నచ్చదు. నవలలో ప్రతి ఎమోషన్ చాలా మెల్లిగా ఎలివేట్ అవుతుంది. సినిమాలో అన్నీ త్వర త్వరగా జరిగిపోతూ కనిపిస్తాయి. అందుకే పూర్తిగా నవలను ఆస్వాదించినట్లు ఈ సినిమాను ఎంజాయి చేయలేం. కళ్ళల్లో ఆ ప్రేమ విరహ బాధను చూపడంలో దిలీప్ పర్ఫెక్షనిజం మాత్రం ఈ సినిమాలో పూర్తిగా అర్థం అవుతుంది. హీరోయిన్ కాళ్ళ దగ్గర హీరో కూర్చుని తన ప్రేమను తెలపడం అంత గ్రేస్‌ఫుల్‌గా మరొకరు చేయలేరేమో…

Exit mobile version